కథా భారతి

పనికిరాని ‘ఘటం’

-ఆర్ శర్మ దంతుర్తి

(Leo Tolstoy రచించిన ‘Alyosha the pot’ కథకు అనువాదం)

 

“హేయ్ అల్యోషా ఆగాగు,” పిలుపు విని వెనక్కి చూసాడు అల్యోషా. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిన స్కూల్లో కలిసిన తన ఈడు స్నేహితులే పిలుస్తున్నారు చెయ్యెత్తి.

వాళ్ళు తన దగ్గిరకొచ్చేదాకా ఆగి నవ్వుతూ పలకరించాడు అల్యోషా అందర్నీ.

“ఏవిరా, ఇంకా మీ అమ్మ కుండలో పాలూ, పెరుగు ఎవరికైనా ఇచ్చి రమ్మంటే వాటిని విరక్కొడుతూనే ఉన్నావా? ఇప్పటికి ఎన్ని బద్దలు కొట్టావేంటి?” అందరూ కలిసి నడుస్తూంటే ఓ కుర్రాడు అడిగాడు.

ఈ ప్రశ్న విని నవ్వుతూ చెప్పేడు అల్యోషా, “ఆ మధ్యన ఇచ్చిన కుండ ఒక్కటే కదా చేతిలోంచి జారిపోయి బద్దలైంది? ఆ తర్వాత అమ్మ నాచేతికి ఏ గిన్నే, కుండా ఇవ్వనని చెప్పేసింది.”

“అందుకేరా నువ్వు పనికిరాని ఘటానివి,” రెండో స్నేహితుడు అనేసరికి అందరూ నవ్వు కలిపేరు. తనని ఏడిపిస్తున్నారని తెలిసినా అల్యోషా కూడా నవ్వేడు అందరితో కలిసి.

మరో కుర్రాడు అల్యోషాని మరింత ఏడిపించడానికి అన్నాడు, “నీ డొప్ప చెవులని రాత్రి పడుకునేటప్పుడు తలతో పాటు తాడు కట్టి ఉంచమని చెప్పాంగా, ఇంకా చేయట్లేదా? ఆ చెవులు రోజురోజుకీ పెద్దవౌవుతున్నాయే కానీ ఏమీ తగ్గినట్టు లేదే?”

“చెవుల సంగతి అలా ఉంచరా, ముక్కు చూడు ఎలా ఉందో, కుక్క మూతి,” ఇంకో కుర్రాడు అందుకున్నాడు.

ఇదంతా వింటూ నవ్వుతూనే తన ఇల్లు దగ్గిర పడుతూంటే వడివడిగా నడుస్తూ అల్యోషా అన్నాడు, “ఇంక నేను వెళ్ళాలిరా లేకపోతే మా నాన్న వీపు చీరేస్తాడు.”

“ఘటం, ఘటం, పిరికి ఘటం, పనికిరాని ఘటం,” స్నేహితులందరూ ఒక్కసారి గొంతెత్తి అరుస్తూంటే పరుగులాంటి నడకతో ఇంట్లోకి పరుగెత్తాడు చీపురు పుల్లలా ఉండే అల్యోషా.

***

ఆరేళ్లకే గుర్రాలకి మేత వేయడం, ఆవులని చూడ్డం లాంటి చిన్నపనులతో మొదలైన అల్యోషా జీవితం రెండేళ్ళ స్కూల్ తర్వాత పూర్తిగా ఇంటి పనులకీ, వ్యవసాయపు పనులకీ అంకితం అయిందంటే దానిక్కారణం అల్యోషాకి చదువు పట్టుబడకపోవడం; బడిలో అయ్యవారు చెప్పిన అక్షరాలు రాయలేకపోవడం, చిన్న చిన్న కూడికలూ తీసివేతలూ కానీ చేయలేకపోవడం. రెండేళ్ల స్కూల్ జీవితం లోనే అల్యోషాకి ‘ఘటం’ పేరు సార్ధకం అయిపోయింది – తల్లి స్నేహితుల ఇంటికి కుండలో పోసిన పాలు ఇచ్చి రమ్మంటే నడుస్తున్నప్పుడు కిందపడి ఆ కుండ చేతిలోంచి జారిపోయి విరక్కొట్టాక. ఆ తర్వాత తల్లి చేతిలో బడితపూజ వేరే సంగతి. ఇంత తతంగం అయ్యాక మరో ఏడాది చూసి తండ్రి స్కూల్ బడి మాన్పించి పూర్తిగా ఇంటిపనుల్లో పెట్టాడు కుర్రాణ్ణి. అలా పన్నెండేళ్లకే పొద్దున్ననుంచి సాయంత్రం దాకా చెప్పిన ఒక పని తర్వాత మరోటి చేస్తూ బొంగరంలా తిరగడమే.

బయట గదిలోనే అమ్మా నాన్నా కూర్చుని ఏదో మాట్లాడుకోవడం కనిపించింది ఇంట్లోకి వెళ్లబోయే అల్యోషాకి. తానేం తప్పుచేశాడో, మళ్ళీ తండ్రి వీపు చీరుతాడేమో అనుకుంటూ లోపలకి నడుస్తూంటే తల్లి కంఠం వినిపించింది. లోపలకి వెళ్ళాక తలుపు వెనకే నిలబడి చెవులు రిక్కించాడు.

“పెద్దాడు సైమన్ ని సైన్యం లో పనిచేయడానికి రమ్మన్నారుట, ఏం చేయడం ఇప్పుడు? వాడు పై ఊళ్ళో వర్తకుడి దగ్గిర పని మానేస్తే ఆయనకి కోపం రాదూ? అయినా సైమన్ సైన్యంలో చేరితే వర్తకుడు ఇచ్చే నెల నెలా మనకొచ్చే అరవై కొపెక్కుల జీతం పోతుంది. ఏం చేద్దాం?”

“అల్యోషాని తీసుకుంటాడేమో అడుగుదాం.” తండ్రి చెప్తున్నాడు.

“వీడినా? వీడసలే కుండ లో పాలు కూడా పక్క ఇంట్లో ఇచ్చి రాలేడు, పనికిరాని ఘటం అని వాడి స్నేహితులందరూ అంటున్నదే కదా? వీడి వేషం, వాలకం వర్తకుడికి నచ్చకపోతే?”

“ఓ నెల రోజులు చూడమని అడుగుతాను. పని నచ్చితే ఉంచుకుంటాడు. లేకపోతే మనకి ఎలాగా తప్పదు; ఇక్కడే ఇంట్లో ఏదో ఒక పని చేయించుకుంటూ ఉంచుకోవడమే.”

***

“కాస్త ఒడ్డూ పొడుగూ ఉన్నవాణ్ణి తీసుకొస్తావనుకుంటే ఈ అర్భకుణ్ణా తీసుకొచ్చావు? సైమన్ ఎలా ఉండేవాడు? వాడు చేసే పనులన్నీ వీడు చేయగలడా?” వర్తకుడు చికాగ్గా అన్నాడు తండ్రితోపాటు వచ్చిన అల్యోషా చూసి.

“వీడు సన్నగానే ఉన్నాడు కానీ మా ఇంట్లో గుర్రాలనీ ఆవులనీ చూడ్డం అలవాటే. బండి తోలగలడు, ఏం పని చెప్పినా నోరెత్తకుండా చేస్తాడు.” తండ్రి బ్రతిమాల్తున్న ధోరణిలో చెప్పేడు.

“నీకు నెల నెలా నేనిచ్చే డబ్బులు పోతాయేమో అన్న యావ తప్ప నా దగ్గిర పనిచేసేవాడు ఎలా ఉండాలో తెలిసినట్టే లేదు. అసలు వీడి వంటిమీద బట్టలూ, ఆ చెవులూ, మొహం ఎలా ఉన్నాయో చూడు. బట్టలూ, వళ్ళూ కంపు కొడుతున్నాయి; అసలు స్నానం చేసాడా ఈ మధ్యన?”

“అలా తీసేయకండి. సైమన్ వేసుకున్న బూట్లూ వాడి బట్టలూ వీడు వేసుకుంటాడు వదులైనా సరే. వీడికి వేరే ఖర్చూ అదీ ఏమీ పెట్టక్కర్లేదు. నాకిది కావాలి, అది కావాలి అని నోరెత్తి అడగనే అడగడు. మీరే చూస్తారుగా?”

“సరేలే. ఓ రెండు వారాలు చూద్దాం. నచ్చకపోతే పంపించేస్తా.”

వర్తకుడి ఇంట్లో అలా మొదలైన అల్యోషా జీవితం ఓ ఆర్నెల్లు తిరిగేసరికి గాడిలో పడింది. పెద్దాయన ఏమి చెప్పినా నోరెత్తకుండా చేయాలి; ఇంట్లో ఆయన తల్లీ, భార్యా ఏది అడిగినా బజారుకెళ్ళి తెచ్చిపెట్టాలి. ముసలి తల్లిది మరీ అదోరకం గొడవ. ‘ఒరే నా మందు ఎక్కడ చచ్చింది? నేను తెచ్చిపెట్టమన్న సరుకు ఏది?’ అంటూ అరుస్తూనే ఉంటుంది. వ్యాపారంలో తండ్రికి చేదోడుగా ఉండే పెద్ద కొడుక్కూడా ఏదో ఒక పని చెప్తాడు; ఈ మధ్యనే పెద్ద చదువులు చదువుతానని వెళ్ళి వెధవ్వేషాలు వేస్తే అక్కడ నుంచి బయటకి పంపించబడిన రెండో కొడుకు ఏపనీ లేకుండా ఇంట్లోనే ఉంటాడు. ఆయనకీ కాఫీ, టీ ఏదో ఒకటి అందించాలి అడిగినప్పుడల్లా. మిగిలినది స్కూలికికెళ్ళే వర్తకుడి కూతురు. ఆవిణ్ణి స్కూల్లో దింపడం, వెనక్కి తీసుకురావడం; ఏ పెన్నో పెన్సిలో కావాలిస్తే కొనడానికి బజారుకి పరుగెట్టడం అవన్నీ చేయాలి. వంటావిడ ఈ లోపులే ఏదో పని చెప్తుంది; ఈ పేళ్ళు తీయ్, ఈ కూర తరుగు, ఆ గిన్నెలు కడుగు అంటూ.

చేసే పని విసుగూ విరామం లేకుండా చేయడం, ఎవరేమన్నా నవ్వుతూ ఉండడం, తన బట్టలూ, వేషం, మూతి, చెవులని వెక్కిరించినా ఏమీ అనుకోకపోవడం చూస్తే అందరికీ ఏదో చులకన ఆల్యోషా అంటే. ఏ పని చెప్పినా నోరు మూసుకు చేస్తాడు కనక వర్తకుడి కింద పనిచేసే వాళ్ళక్కూడా ఏదైనా కావాలిస్తే వాళ్ళు చేయాల్సిందల్లా, “ఒరేయ్ అల్యోషా” అని కేకపెట్టడమే. ఈ కేక వినగానే అల్యోషా ఏమీ భేషజం లేకుండా వెళ్ళి వాళ్లు చెప్పిన పని చేస్తాడు. అయినా సరే ప్రతీ ఒక్కరి నోట్లోంచీ ఒకటే మాట, “ఒరే, ఈ పని మర్చిపోకు, సరిగ్గా చేయాలి సుమా, అల్యోషా ఇది చాలా ముఖ్యం, ఇంతసేపట్నుండి పిలుస్తుంటే ఎక్కడ చచ్చావురా, ఈ వస్తువు పది నిముషాల్లో తేవాలి బజార్నుంచి సుమా,” వగైరా.

మొదట్లో ఇంట్లో అందరికీ అన్నింటికన్నా కష్టం ఏమంటే, అల్యోషా శుభ్రంగా లేడు. మురికి బట్టలు, బూట్లనిండా మట్టి, అప్పుడప్పుడూ వాసన దగ్గిరకొస్తే. అయితే ఎప్పుడైతే అల్యోషా తాము చెప్పినపని చేస్తున్నాడో వాళ్ళ దగ్గిరున్న పాత బట్టలిచ్చి కాస్తలో కాస్త శుభ్రంగా ఉండేలా చూసారు. అలా ఈ మురికి, వాసన పోగానే తెలిసిన విషయం అల్యోషా చీపురుపుల్లలాగా ఉన్నా సరే అన్న సైమన్ కన్నా బాగా పనిచేస్తాడు. తండ్రి చెప్ప్పిన విషయం కూడా నిజం – నాకు ఇది కాలాలనీ అది కావాలనీ ఏనాడు ఎవరినీ అడిగిన పాపాన పోలేదు. తండ్రి నెలకో సారి వచ్చి అల్యోషా చేసిన పనికి జీతం అరవై కొపెక్కులూ తీసుకెళ్తాడు, వీణ్ణో సారి పలకరించి. ఆ పలకరించడం ఏదో మొహమాటానికి తప్ప తండ్రీ కొడుకుల మధ్య అభిమానంతో మాట్లాడే మాటల్లాగా ఉండవన్నది అందరూ ఎరిగిందే. తండ్రికి కావాల్సింది ఈ వర్తకుడిచ్చే జీతం. అల్యోషాకి తండ్రి అంటే, ఏ పనైనా సరిగ్గా చేయలేదని కొడతాడేమో అని గుండెల్లో బెదురు. ఒకరి మొహం ఒకరు చూసుకున్నాక సరే అంటే సరే అనుకుని ఎవరి పనుల్లో వాళ్ళు పడడమే నెలకో సారి ఈ తండ్రీ కొడుకులు కలుసుకోవడం అంటే. అల్యోషా తల్లికి అదీ లేదు. ఆవిడ ఎప్పుడూ కొడుకుని చూడ్డానికి రాదు. ఆవిడక్కావాల్సింది అల్యోషాకి నెలకొచ్చే జీతం కానీ కొడుకెలా ఉన్నాడనేది కాదు.

***

ఆరునెలలకి వర్తకుడికి తెలిసొచ్చిన విషయం, ఒకప్పుడు సైమన్ వాడిన బూట్లు అల్యోషాకి ఇచ్చారు కదా, అవి అరిగిపోయాయి. అల్యోషా నడుస్తుంటే వాడి కాలి వేళ్లు బయటకి కనిపిస్తున్నాయి. శీతాకాలం వచ్చేలోగా కొత్త బూట్లు కొనాలి లేదా చలిలో వాడేమీ పనిచేయలేడు. ఏ రోగమో రొచ్చో వస్తే ఇంట్లో ఇంతటి పనెవరు చేస్తారు? బజారుకెళ్ళి కొత్త బూట్లు కొన్నాక అవి వేసుకున్న అల్యోషా మొహం చూడాలి, ఎంత సంతోషమో? ఇంతలోనే భయం కూడా. యజమాని అల్యోషాకి కొన్న బూట్లకి అయిన ఖర్చు నెల జీతంలోంచి తీసేసి ఇస్తాడు తండ్రికి. అది తెలిస్తే తండ్రి ఏం చేస్తాడో? తండ్రి తిట్టుకుంటూ గొణుక్కుంటూ జీతం డబ్బులు తీసుకెళ్ళేవరకూ అల్యోషా భయపడుతూనే ఉన్నాడు. ఏదో ఒకలాగ ఆ గండం గడిచిపోయింది.

ఇంట్లో పనులెలా ఉన్నా అల్యోషా సరైన సమయానికి వచ్చి తిండి తినడని వంటావిడ ఉస్తీనియా కి కోపం, జాలీ. అల్యోషా పొద్దున్నే అందరూ ఫలహారం చేసే సమయానికి ఎప్పుడైనా వస్తే గొప్పే. ఇలా తినడం మొదలుపెట్టాడో లేదో ఏదో పని ఉన్నట్టూ ఎవరో పిలుస్తారు. తిండి వదిలేసి వెళ్ళి ఆ చెప్పిన పని చేసొచ్చాక మిగిలిపోయిన చల్లారిపోయినది తినడం. భోజనం సంగతి ఇంక చెప్పేదేముంది? ఎప్పుడు తీరిక ఉంటే అప్పుడే. ఆ తీరిక అనేది ఒక్కోసారి అందరూ రాత్రి పొద్దుపోయి అందరూ పడుకున్నాక. ఉస్తీనియా కి వీడంటే జాలి. వీడు తినడానికి కొంత దాచిపెట్టి వీడు తినేటప్పుడు అక్కడే ఎదురుగా కూర్చుని చేయి చుబుకం మీద అనించుకుని చూస్తూ ఉంటుంది వీడికేసి – ‘నవ్వుతూ ఇంత పని ఎలా చేస్తాడా, ఎవరు ఏమని వెక్కిరించినా ఏమీ అనుకోకుండా’ అని ఆవిడ ఆశ్చర్యం కాబోలు.

శీతాకాలం వచ్చేసరికి అల్యోషా పొద్దున్నే లేవాలి; శెలవుల్లో అందరికీ తలో వంటకం చేసిపెట్టే వంటావిడ ఉస్తీనియా కి పనిలో సహాయం చేయడం; మామూలుగా రోజు వారీ పని ఎప్పుడూ ఉండేదే. అయితే శెలవులంటే అల్యోషాకి కాస్త సంతోషం. అందరూ ఎంతో కొంత డబ్బు ఇస్తారు తన స్వంతానికి. ఇది తండ్రికి ఇవ్వక్కర్లేదు. అలా కూడబెట్టిన డబ్బులు కొంత పోగయ్యాక వాటిని తీసుకెళ్ళి ఉస్తీనియా కి చూపించాడు. ఆవిడ చెప్పిన ప్రకారం ఒక ఎర్రటి కోటు కొనుక్కున్నాడు చలికాలానికి. అది వేసుకున్నాక వాడికెంత ఆనందమో? అసలు నోట్లో నాలికే లేదనుకునే అల్యోషా ఆ కొత్త కోటు వేసుకున్నాక అలా మాట్లాడుతూనే ఉన్నాడు ఏదో ఒకటి. పుట్టిన ఇంట్లో ఎప్పుడో వాళ్లమ్మ నేర్పిన పాటలూ, పద్యాలూ, ప్రార్ధన ఏదైనా ఉంటే అదెప్పుడో మర్చిపోయిన అల్యోషా, అసలు మాట్లాడగలడా అని అందరూ అనుకునే అల్యోషా, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడారోజు. చూసిన వర్తకుడి ఇంట్లో జనం అంతా నవ్వుకున్నారు కూడా.

ఆ శీతాకాలంలోనే అల్యోషా కి ఓ కొత్త విషయం తెలిసి వచ్చింది – ఇంతకు ముందెన్నడూ అనుభవంలోకి రానిదీ విషయం. ఇంట్లో జనం అందరూ తనకి తెల్సినవారే, తిండీ గుడ్డా పెట్టి చూసుకుంటున్నా తనకీ వాళ్ళకీ మధ్య ఉన్న సంబంధం, వాళ్లకో పనిచేసి పెట్టడం. ఏ పనీ లేకపోతే వాళ్లకీ తనకీ ఏమీ సంబంధం లేదు. అయితే వంటావిడ ఉస్తీనియా దగ్గిర విషయం వేరు. ఆవిడ తనని చూడడానికో, తనకి భోజనం పెట్టడానికో, తాను తింటుంటే అక్కడే కూర్చుని తనతో సంతోషంగా మాట్లాడడానికో తనని పిలుస్తోంది. ఇటువంటిది అల్యోషా జీవితంలో జరగడం మొదటి సారి. దీన్నేమంటారో అల్యోషాకి తెలియలేదు కానీ ఉస్తీనియా తనంటే ఇష్టపడుతోందని తెలుస్తోంది. చిన్నప్పుడే తల్లినీ తండ్రినీ పోగొట్టుకున్న ఉస్తీనియా జీవితం కూడా దాదాపు అల్యోషా జీవితం లాంటిదే; పొద్దుటనుండి సాయంత్రం వరకూ వంటగది వదలకుండా, విసుగూ విరామం లేకుండా పని చేయడం. అయినా సరే ఇంతకుముందు తానెవరో తెలియని ఉస్తీనియా, తనమీద జాలి చూపించడం ఏవిటి?

మొదట్లో ఉస్తీనియా తన గురించి ఆలోచిస్తోందనీ, తనకోసం కొన్ని వంటకాలు దాచిపెట్టి ఇస్తోందనీ, తన చిరిగిపోయిన కోటు చిరుగులు కనపడకుండా కుట్టిపెట్టిందనీ తెలిసాక, గుండెల్లో సంతోషం అల్యోషాకి. తోటిమనిషి తన కోసం సహాయంగా ఉందనే సంతోషమా అది? అయితే ఉస్తీనియాతో చనువు పెరుగుతున్నకొద్దీ భయం కూడా కలుగుతోంది అల్యోషాకి – పనిలో ఏవైనా తేడాలొస్తే ఉద్యోగం పోతుంది; తండ్రి చంపేయగలడు. కొత్తగా మనసులో ఉస్తీనియా అంటే ఏదో అభిమానం. పనిచేస్తుంటే ఎప్పుడైనా ఉస్తీనియా గుర్తుకొస్తోంది కూడా. ‘ఆహా ఎంత మంచావిడ ఈ ఉస్తీనియా?” అని మనసులో అనిపిస్తున్నా పైకేమీ చెప్పలేకపోతున్నాడు. ఎప్పుడైనా తీరిక ఉన్నప్పుడు ఆవిడే చెప్పేది తన విషయాలు. ఆవిడ తల్లీ తండ్రీ ఎలా పోయారో, మేనమామ దగ్గిర చేరడం, ఆక్కడనుంచి ఈ వర్తకుడి దగ్గిర ఉద్యోగం వగైరా. నోట్లో నాలిక లేని అల్యోషాకి ఈవిడ గడ గడా మాట్లాడుతుంటే వినడం సరదా. వర్తకుడి కొడుకు ఓ రోజు వంటింట్లోకి వచ్చి ఆవిడతో సరసాలు ఆడబోవడం, ఈవిడ చేతిలో ఉన్న గరిటతో బెదిరించడం అన్నీ చెపితే నవ్వులు. మాటల్లో ముందు ముందు జీవితం ఎలా ఉంటుందో, అల్యోషాకి తండ్రి ఎవరినైనా పెళ్ళికి కట్టబెట్టబోతున్నాడో అనేవి దొర్లేటప్పుడు ఆవిడే అడిగింది, “ఈ ఊర్లో తిరుగుతూ ఉంటావు కదా అస్తమానూ ఏదో పనిమీద, ఎవరినైనా ప్రేమించావేమిటి?”

“నాలాగే పల్లెటూళ్ళలోంచి ఇక్కడకి వచ్చినవాళ్ళు ఇక్కడే ఎవరినో చూసుకుని పెళ్ళి చేసుకుంటారని విన్నాను కానీ ఈ ఊళ్ళో ఎవరికీ నేను నచ్చను. అమ్మా నాన్నా ఎవరినైనా చూస్తుంటే నాకైతే మాత్రం తెలియదు.”

“పెళ్ళి లేకుండా ఇలాగే ఉంటావా అయితే జీవితంలో?”

“లేదు ఉస్తీనియా, నువ్వు వప్పుకుంటే నిన్నే పెళ్ళి చేసుకుంటా.”

“భలేవాడివే, నోట్లో నాలికలేని పనికిరాని ఘటం అని అందరూ అనుకుంటూంటే నిజమే అనుకున్నాను సుమా, మొత్తానికి మనసులో మాట చెప్పగలిగేవు,” చేతిలో ఉన్న తుండు గుడ్డతో అల్యోషా నడుమ్మీద ఒక్కటిచ్చి అంది ఉస్తీనియా, “నాకు మాత్రం ఎందుకు అభ్యంతరం ఉంటుందనుకున్నావు?”

పక్కగదిలోంచి ఈ సంభాషణ మరో రెండు చెవులు విన్నాయన్న సంగతి ఈ ఇద్దరికీ తెలియలేదు. మర్నాటికి ఈ వార్త వర్తకుడికి చేరిపోయింది వాళ్ళావిడ ద్వారా, “ఈ ఉస్తీనియా పెళ్ళి చేసుకుందంటే వెంఠనే ఓ పిల్లో పిల్లాడో పుడతారు. ఆ తర్వాత ఈవిడ వంటపని చేయడం అలా ఉంచి, ఈవిడకే నేను సేవలు చేయాలి. ఈవిడ మన నౌకరా, మనం ఈవిడ నౌకర్లమా? నాకిదేం నచ్చలేదు.”

***

నెలాఖరికి జీతం తీసుకోవడానికి వచ్చిన అల్యోషా తండ్రి అడిగాడు వర్తకుణ్ణి, “మా కుర్రాడు బాగానే పనిచేస్తున్నాడా? నేను చెప్పానుగా ఏ పని చెప్పినా నోరెత్తడని?”

“పని సంగతి సరే బాగానే చేస్తున్నాడు కానీ వయసు వచ్చే కొద్దీ బుర్రలో ఏదో పురుగు తొలుస్తున్నట్టుంది. మా వంటావిడ ఉస్తీనియాని పెళ్ళి చేసుకుంటాట్ట. మా ఇంట్లో పెళ్ళైన నౌకర్లని ఉంచుకోము. పిల్లా పాపా ఉంటే దానివల్ల మాకొచ్చే కష్టాలు వేరు. పెళ్ళే వాళ్ళిద్దరికీ ఇష్టమైతే ఇక్కడ ఉద్యోగాలు ఉండవు.”

“అవునా, ఆశ్చర్యంగా ఉందే, వాడో నోరులేని వెధవనుకున్నాను. నేను ఊరికి వెళ్ళిపోయే ముందు వాడితో మాట్లాడతాను. పెళ్ళీ లేదు గిళ్ళీ లేదు. మీరేం బెంగ పెట్టుకోకండి.”

జీతం డబ్బులు జేబులో పెట్టుకుని వంటగదిలోకి నడిచిన తండ్రికి అల్యోషా కనబడలేదు. బయటకి వెళ్ళాట్ట ఏదో పనిమీద; వగరుస్తూ వచ్చాడు కాసేపటికి. రాగానే తండ్రి విరుచుకు పడ్డాడు కొడుకుమీద, “నువ్వేదో బాగా పనిచేస్తావనుకుని ఇక్కడ పెట్టాను నిన్ను. ఇప్పుడేదో పెద్దవాడివైపోయినట్టూ గొప్పగా ఆలోచించి ఏవేవో ప్రణాళికలు వేసేసుకుంటున్నట్టున్నావే జీవితం కోసం?”

“పని బాగానే చేస్తున్నాను కదా? నేనా? ప్రణాళికలా? ఏమీ లేవే?”

“లేవా? వెధవా, ఏమీ లేకపోతే ఈ ఇంట్లో అందరికీ నువ్వూ ఉస్తీనియా పెళ్ళి చేసుకుంటున్నారని ఎలా తెలిసింది? ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే ఉద్యోగాలు ఊడతాయి. ఎలా బతుకుతారు? ఏదైనా చేద్దామనుకునే ముందు ఆలోచించే బుర్ర ఉండొద్దూ? రోడ్డు మీద పోయే ఎవత్తినో చేసుకుంటే ఎలా బతుకుతావ్? నీకు నిజంగా పెళ్ళి అవసరమైనపుడు నేనే ఓ అమ్మాయిని చూస్తాను కానీ ఇదా నువ్వు నడిపే వ్యవహారం ఇక్కడ? ఇప్పటివరకూ గౌరవంగా బతికాం; నమ్మకంగా ఈ వర్తకుడు నిన్ను చూసుకుంటున్నాడు. ఇప్పుడు….” తండ్రి ఆపకుండా ఓ గంట ఛడా మడా తిడుతూ అలా మాట్లాడుతూనే ఉన్నాడు. తలుపు వెనక నుంచి ఉస్తీనియా అంతా వింటోందని తెలిసినా కూడా.

ఇంక వినలేకో, భయపడో అల్యోషా అన్నాడు, “సరే నేనింక ఆ విషయం మర్చిపోతాను.”

“జాగ్రత్త, నేను వెళ్తా. వళ్ళు దగ్గిరపెట్టుకుని ఉద్యోగం చేసుకో.”

తండ్రి వెళ్ళిపోయాక వంట గదిలోకి వచ్చిన ఉస్తీనియాని చూసి చెప్పేడు అల్యోషా, “ఇంక మనం ఈ పెళ్ళి గురించి మర్చిపోవడం మంచిది. నౌకర్లం కనక మా నాన్న చెప్పినట్టూ నడుచుకోవడం మంచిది కదా?”

మర్నాడు వర్తకుడి భార్య అడిగింది, “అల్యోషా, నిన్న మీ నాన్న చెప్పినట్టూ చేస్తున్నావా లేకపోతే ఇంకా నువ్వూ, ఉస్తీనియా పెళ్ళి చేసుకుందామనే అనుకుంటున్నారా?”

“ఇంకెక్కడి పెళ్ళి లెండి. దాని సంగతి నిన్ననే మర్చిపోయాం,” నవ్వుతూ చెప్పేడు అల్యోషా. ఆవిడటు వెళ్లగానే ఎందుకో అల్యోషా కళ్లలో నీళ్ళు చిప్పిల్లాయి. అటు తిరిగి కళ్ళు తుడుచుకుంటూ చేస్తున్న పనిలో పడిపోయాడు.

***

ఆ ఏడు చలికాలంలో ఓ రోజు రాత్రి మంచు బాగా కురిసినప్పుడు ఇంటి పైకప్పుమీద పడిన మంచు ఊడ్చమని చెప్తే కప్పుమీదకి ఎక్కాడు అల్యోషా. ఓ మూల మొదలుపెట్టి మంచుని కిందకి తోస్తూంటే ఒక్కసారి మొత్తం కప్పుమీద మంచు అంతా కదిలింది. ఏమైందో తెలిసేలోపుల మంచుతో పాటు కింద ధడాల్న పడ్డాడు అల్యోషా అంత ఎత్తునుంచి. ఆ పడడం మంచుమీదే అయితే పెద్ద దెబ్బ తగిలి ఉండకపోను కానీ ఆ పక్కనే ఉన్న ఉక్కు తలుపుమీద పడ్డాడు. వంటింట్లోంచి అల్యోషా, పెద్దింట్లోంచి వర్తకుడి స్కూలుకెళ్ళే అమ్మాయీ పరుగెత్తుకుంటూ వచ్చి చూసారు.

“బాగా దెబ్బ తగిలిందా అల్యోషా?” ఉస్తీనియా అడిగింది.

“అబ్బే, అదేం లేదు,” అల్యోషా లేవబోయేడు కానీ శరీరం సహకరించలేదు. మరో ఇద్దరు వచ్చి మోసుకుంటూ లోపలకి తీసుకెళ్ళారు. డాక్టర్ కి కబురుపెట్టారు ఇంక వీడు లేవలేడని తెలిసాక.

డాక్టర్ వేసే అన్ని ప్రశ్నలకి ఒకటే సమాధానం చెప్పాడు అల్యోషా, “వళ్లంతా తెలియని చెప్పలేనంత నెప్పి, ఇంట్లో పని చేయనందుకు వర్తకుడికి కోపం వస్తుందేమో? మా నాన్నకి కూడా చెప్పండి లేకపోతే ఆయన నేను చెప్పిన పని సరిగా చేయలేదనుకుంటాడు.”

రెండు రోజులు మంచం మీదే ఉన్నాడు అల్యోషా కాలూ చేయీ కదపలేని స్థితిలో. ఉస్తీనియాయే దగ్గర ఉండి ఏదో సేవలు చేసింది కానీ ఆవిడకీ ఈ పరిస్థితి కొత్తే. ఏడుపు మొహంతో అడిగింది ఓ సారి, “నువ్వు చచ్చిపోతున్నావా అల్యోషా?”

“తప్పదుగా ఉస్తీనియా, ఎవరూ ప్రపంచంలో ఎల్లకాలం బతకరు కదా? సమయం వచ్చినప్పుడు వెళ్ళి తీరాల్సిందే. ఈ ఇంట్లో నన్ను బాగా చూసుకున్నందుకు నీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఓ సారి కాస్త ఆలోచించు. మనం పెళ్ళి చేసుకోవడానికి వీళ్లందరూ ఒప్పుకుని ఉంటే ఏమై ఉండేదో. పెళ్ళి చేసుకోకపోవడమే మంచిదైంది చూసావా?”

చావు దగ్గిరపడిన అల్యోషాని చూడ్డానికి చర్చ్ నుంచి పాస్టర్ ని పిలిపించారు. చివరి దశలో ఉన్న అల్యోషాని చూస్తూ ఆయన అన్నాడు, “అల్యోషా, భగవంతుడి దృష్టిలో మానవులైన మనం అందరం రెండు రకాలు – ఏదో ఒకదానితో నిండి ఉన్న కుండలూ, ఏమీ లేని ఖాళీ కుండలూ. అహంకారం, మలినం, కుళ్ళూ, భేషజం, మదం, మాత్సర్యం లాంటివి ఏవో ఒకదానితో నిండి ఉన్న కుండలని భగవంతుడు అంత సులభంగా బాగుచేయలేడు కానీ, అవి లేని ఖాళీ కుండలంటే భగవంతుడికెంతో ఇష్టం. ఆయన వాటిని తనకిష్టమైన వాటితో నింపగలడు. ఈ ప్రపంచంలో ఎవరికీ హాని చేయనివారికి ఇక్కడెంత సంతోషంగా ఉంటుందో భగవంతుణ్ణి చేరాక అక్కడ మరింత …. … …”

పాస్టర్ చెప్పేది వింటున్నాడో తెలియదు కానీ, అల్యోషా దాహంగా ఉందని చెప్పాక నోట్లో నీళ్ళు పోసారెవరో. అవి తాగి, తన మంచం చుట్టూ మూగి ఉన్న ఎవర్నీ గుర్తించనట్టూ, ఎవరికీ కనబడని ఏదో అద్భుతమైన విషయం చూస్తున్నట్టూ, మెరుస్తున్న కళ్లతో, మొహంమీద చిరునవ్వు కదులుతూండగా ఊపిరి అగిపోయి చచ్చిపోయాడు అల్యోషా.

ఒకప్పుడు స్నేహితులు అతన్ని ఏడిపించడానికి ఘటం గాడు అన్నా అల్యోషా అందరూ అనుకున్నంత పనికిరాని ఘటం కాదు. పాస్టర్ చెప్పినట్టూ ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్తే ఆ చెప్పిన పనులు చేయడం వచ్చిన రెండో రకమైన పూర్తి ఖాళీ ఘటం.

-000-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked