కథా భారతి

ప్రక్షాళన

-G.S.S. కళ్యాణి.

కాశీక్షేత్రంలో ఉన్న కేదారఘాట్ మెట్ల మీద కూర్చుని, గంగానదిని తదేకంగా చూస్తున్నాడు జానకీపతి. గంగ నిండుగా ప్రవహిస్తోంది. ఆ నదీతీరానికి వస్తున్న చిన్న చిన్న అలలు, జానకీపతి పాదాలకు చల్లగా తాకుతున్నాయి. మహాపుణ్యక్షేత్రంలోని పవిత్ర తరంగాలు జానకీపతి మనసుకు ప్రశాంతతను కలిగించే ప్రయత్నం చేస్తున్నా, ఏదో బాధ అదే మనసును అల్లకల్లోలం చేస్తోంది. ఒంటరిగా కూర్చుని ఉన్న జానకీపతికి తన జీవితమంతా ఒక్కసారి కళ్ళముందు గిర్రున తిరిగింది!
జానకీపతి తండ్రి రాఘవయ్య గవర్నమెంట్ పాఠశాలలో సైన్సు మాష్టారు. రాఘవయ్య అంటే వాళ్ళ ఊరిలో అందరికీ అమితమైన గౌరవం ఉండేది. అయితే, రాఘవయ్య కేవలం అధ్యాపకుడు మాత్రమే కాదు, అతడు మొక్కలపై పరిశోధనలు జరిపే ఒక శాస్త్రవేత్త కూడా అని ఆ ఊరిలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు! మొక్కలు మనుషుల మాటలకు స్పందిస్తాయనీ, అవి మనుషులకు ప్రాణస్నేహితులుగా ఉండగలవని రాఘవయ్య నమ్మేవాడు. తమ ఇంటివెనుక ఉన్న కొద్దిపాటి జాగాలో అనేక రకాల మొక్కలను ఎంతో ప్రేమతో పెంచేవాడు రాఘవయ్య.
జానకీపతికి మాత్రం మొక్కలన్నా, ప్రకృతి అన్నా అంత ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడూ ఏదైనా వ్యాపారం చేసి, దానివల్ల పేరూ, డబ్బూ సంపాదించాలన్న కోరిక ఉండేది జానకీపతికి. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను చూసినప్పుడల్లా తను కూడా వారిలా వ్యాపారం చేస్తే కోట్లల్లో డబ్బు సంపాదించొచ్చని అనుకుంటూ ఉండేవాడు జానకీపతి.
జానకీపతి చదువుకునే రోజుల్లో ఒకసారి కాలేజీనుండీ ఇంటికి వెడుతూ ఉండగా పెద్ద వర్షం మొదలైంది. అప్పుడు జానకీపతి స్నేహితుడు తలకి తొడుక్కోమని ఒక ప్లాస్టిక్ సంచిని జానకీపతికి ఇచ్చాడు. ఆ రోజు ఆ ప్లాస్టిక్ సంచి బాగా ఉపయోగపడేసరికి జానకీపతి మనసు ‘ప్లాస్టిక్’ వైపుకు మళ్లింది!
తన చదువు పూర్తి కాగానే జానకీపతి ప్లాస్టిక్ సంచుల తయారీ కంపెనీని మొదలుపెట్టాడు. ఆ వ్యాపారంలో లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి! దాంతో జానకీపతి ఉత్సాహంగా ప్లాస్టిక్ ను ఉపయోగించి గ్లాసులూ, పళ్ళాలూ, చంచాలూ, డబ్బాలూ, సీసాలూ, గృహోపకరణాలూ తయారుచేస్తూ, తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకుని చాలా డబ్బు సంపాదించాడు. తన వ్యాపారంవల్ల పలువురికి ఉద్యోగాలిచ్చి వారి కుటుంబాలకు ఆసరాను కల్పించడంతో సమాజంలో మంచి పేరునూ, పలుకుబడినీ కూడా సంపాదించుకోగలిగాడు జానకీపతి!
వ్యాపారం ఆరంభదశలో ఉండగానే జానకీపతికి సీతతో వివాహమయ్యింది. సీత పెద్దగా చదువుకోకపోయినప్పటికీ భర్తకు అన్ని విషయాలలోనూ అనుకూలవతిగా ఉండేది. జానకీపతి దంపతులకు ఒక్కడే కొడుకు మనోహర్. జానకీపతి ఎప్పుడూ వ్యాపార విషయాలలో తలమునకలై ఉండటంతో మనోహర్ ఎక్కువ సమయం తన తాత రాఘవయ్యతో గడిపేవాడు. అందువల్ల మనోహర్ కి కూడా తన తాతలాగే మొక్కలంటే అమితమైన ఇష్టం ఏర్పడింది! మనోహర్ పెద్ద చదువులకొచ్చాక వ్యాపార సంబంధమైన రంగంలో ఏదైనా పట్టా పొందితే బాగుంటుందనీ, అలాచేస్తే తన వ్యాపారం కొడుకుకి అప్పజెప్పి విశ్రాంతి పొందవచ్చనీ అనుకున్నాడు జానకీపతి. కానీ, మనోహర్ తన ఇష్టానికి తగ్గట్టు వ్యవసాయ రంగంలో పట్టా పొంది, మంచి ఉద్యోగం సంపాదించి, రాఘవయ్యలాగానే మొక్కలపై పరిశోధనలు చెయ్యడం ప్రారంభించాడు. అంతేకాకుండా తీరిక సమయాల్లో పర్యావరణ సంరక్షణలో మొక్కల ప్రాధాన్యత గురించి పలు చోట్ల ప్రసంగాలిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని చెప్తూ ఉండేవాడు మనోహర్. కొడుకు వ్యాపారంలోకి ఇక రాడని తేలిపోయాక నిరాశ చెందిన జానకీపతి, తనున్నంత కాలం తన వ్యాపారం తానే చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్ళీడుకొచ్చిన మనోహర్ కు విష్ణుప్రియతో వివాహం జరిపించాడు జానకీపతి. జానకీపతికి ఇద్దరు మనవళ్లు పుట్టారు. కొంతకాలం తర్వాత జానకీపతికి ఆరోగ్యం పాడయ్యింది. అనేక పరీక్షలు చేసిన డాక్టర్లు జానకీపతికి క్యాన్సర్ మొదటి స్టేజిలో ఉందని చెప్పడంతో ఇంటిల్లుపాదీ విపరీతమైన కంగారు పడిపోయారు!
“నలుగురికీ ఉపకారమే తప్ప ఎప్పుడూ ఎవ్వరికీ అపకారం చెయ్యని మీకు క్యాన్సర్ అంటే నేను నమ్మలేకపోతున్నాను!”, అని ఏడుస్తూ సీత తన భర్త ఆరోగ్యం కోసం దేవుళ్లందరికీ మొక్కుకుని, రకరకాల నోములు, వ్రతాలూ చేసింది. మనోహర్, తనకు తెలిసిన మంచి డాక్టర్లను సంప్రదించి ఖరీదైన వైద్యం చేయించాడు. అటు పూజలు ఇటు వైద్యం అన్నీ సత్ఫలితాలను ఇవ్వడంతో జానకీపతి కొద్దినెలలలో పూర్తిగా కోలుకున్నాడు.
ఒకరోజు సీత జానకీపతితో మాట్లాడుతూ, “మనం పెళ్లయ్యాక ఒక్క పుణ్యక్షేత్రానికి కూడా వెళ్ళలేదు! నాకు కాశీ క్షేత్రం చూడాలని ఉంది. ఒక్కసారి వెళ్ళొద్దామండీ!”, అని తన కోరిక చెప్పింది.
అందుకు వెంటనే ఒప్పుకున్నాడు జానకీపతి. జానకీపతి, సీతల కాశీ ప్రయాణానికి కావలసినవన్నీ ఏర్పాటు చేశాడు మనోహర్. అనుకున్నప్రకారం జానకీపతి సీతతో కలిసి కాశీ చేరుకున్నాడు. సీత ఆనందానికి అవధులు లేవు! జానకీపతి, సీతలు విశ్వనాథుడి దర్శనం చేసుకుని, భోజనం చేసి, తమ గదికి వెడుతూ ఉండగా ఉన్నట్టుండి సీత కళ్ళు తిరిగి పడిపోయింది! అప్పటివరకూ సీతకి ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేవు. జానకీపతి సీతని ఆటోలో కూర్చోబెట్టుకుని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి డాక్టరు సీతని పరీక్షించి నర్సును పిలిచి తనకు కావలసిన మెడికల్ రిపోర్ట్స్ వివరాలు చెప్పాడు. నర్సు హడావుడిగా సీతని లాబరేటరీలోకి తీసుకెళ్లి టెస్టులన్నీ పూర్తి చేసి రిపోర్టులు డాక్టరుకు ఇచ్చింది.
డాక్టరు రిపోర్టులను పరిశీలించి జానకీపతిని, “రిపోర్ట్స్ ప్రకారం ఆవిడ నాడీవ్యవస్థలో సమస్య ఉంది! ఇంతకు ముందెప్పుడైనా ఇటువంటి సమస్య వచ్చిందా? “, అని అడిగాడు.
“లేదు డాక్టర్! “, బదులిచ్చాడు జానకీపతి.
“ఏ కారణం లేకుండా ఇటువంటి సమస్య రాదు! ఏదేమైనా మేము ప్రాథమిక చికిత్స అందిస్తాము. మీరు మీ స్వస్థలానికెళ్ళాక మరో సారి డాక్టరును కలవండి!”, అన్నాడు డాక్టర్.
“అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది డాక్టర్?”, కాస్త అసహనంగా అడిగాడు జానకీపతి.
“సాధారణంగా కాలుష్యంవల్ల వస్తుంది! మనం పీల్చే గాలిలో, మనం తినే ఆహారంలో ఆ కాలుష్యం కలిసి, శరీరంలోకి ప్రవేశించి, క్రమంగా మన నాడీవ్యవస్థను దెబ్బ తీస్తుంది! ఇంతకూ, మీరేమి చేస్తూ ఉంటారూ?”, అడిగాడు డాక్టర్.
“నాది మా ఊళ్ళో చాలా పెద్ద వ్యాపారం! రకరకాల ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసి అమ్ముతూ ఉంటాం!”, కొంచెం గర్వంగా చెప్పాడు జానకీపతి.
“అదీ అసలు కారణం!! ప్లాస్టిక్ మనకు చేసే హాని అంతా ఇంతా కాదు! ప్లాస్టిక్ నుండీ వచ్చే వాసన మనకు మంచిది కాదు! అలాగే ఆహారపదార్ధాల కోసం ప్లాస్టిక్ వస్తువులు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తక్కువ నాణ్యతగల ప్లాస్టిక్ తో చేసిన కప్పులలో కానీ, ప్లేట్లల్లో కానీ వేడి ఆహార పదార్ధాలను పెట్టినప్పుడు, ఆ ప్లాస్టిక్ అతి సూక్ష్మరూపంలో మన ఆహారంలో కలుస్తుంది! తద్వారా అది మన రక్తంలో కలిసి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది! అప్పుడు, మీ ఆవిడకి వచ్చిన సమస్యలతోపాటూ క్యాన్సర్ వంటి భయానకమైన సమస్యలూ వచ్చే అవకాశం ఉంది!!”, అన్నాడు డాక్టర్.
డాక్టరు చెప్పిన మాటలు జానకీపతిని ఆలోచనలో పడేశాయి. తను ఇంతకాలం వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలీ, ఇంకా ఎక్కువ డబ్బులెలా సంపాదించాలీ అన్న విషయాలపై దృష్టి పెట్టాడే తప్ప, తన వ్యాపారంవల్ల ఆరోగ్యానికి కలుగుతున్న హానిని గురించి అసలు ఏనాడూ ఆలోచించలేదు!
అప్పుడే ఐ.సి.యు.లోంచి బయటకొచ్చిన నర్స్, “మేడంని ఐ.సి.యూ.లో పెట్టి మందులు ఐ.వీ. ద్వారా ఎక్కిస్తున్నాము. ఆవిడకు స్పృహ రావడానికి ఇంకా కనీసం మూడు గంటలు పట్టచ్చు. అంతలో మీరు వెళ్లి వేరే పనులుంటే చూసుకుని రండి!”, అని జానకీపతితో చెప్పింది.
సరేనన్నాడు జానకీపతి. అతడి మనసు మనసులా లేదు. ‘ప్లాస్టిక్’ వాడకంవల్ల కలిగే నష్టాల గురించి ఆలోచించిన కొద్దీ జానకీపతి మనసులో ఆవేదన పెరిగిపోతోంది. ఎటు వెళ్ళాలో అర్ధంకాని పరిస్థితుల్లో ఆసుపత్రినుండి బయలుదేరిన జానకీపతి, బాధతో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి కేదారఘాట్ లో మెట్లపై కూర్చున్నాడు. గతస్మృతులలో మునిగిపోయిన జానకీపతికి ‘ప్లాస్టిక్’ గురించి తన ఆత్మీయులు, సన్నిహితులు తనతో పలు సందర్భాలలో అన్న మాటలు క్రమంగా గుర్తుకురాసాగాయి!
‘ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందిరా! ఇంకేదన్నా వ్యాపారం చూసుకోరాదూ?!’, అని అనేకసార్లు తన తండ్రి తనకు చెప్పిన మాటలూ, ఎన్ని నోములూ, వ్రతాలూ చేసినా ఎందుకో తనకు సంతానం కలగటంలేదని తన దగ్గర పని చేసే ఒక ఉద్యోగి బాధపడ్డ సందర్భం, ఎండాకాలంలో ప్లాస్టిక్ సీసాలో నీళ్ల నుండీ వచ్చే వాసనను తను విసుక్కున్న సంగతి, ప్లాస్టిక్ లంచ్-బాక్సులోని పదార్ధాలకు ఆ వాసన పట్టేస్తోందని మనోహర్ చేసిన ఫిర్యాదులూ, తన మనవడు ప్లాస్టిక్ సంచితో ఆడుతూ దాన్ని తలకి తొడుక్కుంటే ఇంటిల్లుపాదీ పడ్డ కంగారూ, డబ్బు మోజులో పడి నాణ్యత విషయంలో తను రాజీ పడిన సంగతులూ- అన్నీ గంగానదిలో వస్తున్న అలల మాదిరిగా ఒకదానివెంట ఒకటి జానకీపతికి గుర్తుకొస్తున్నాయి.
వీటితోపాటు తమ వీధిలో ఎప్పుడూ కళకళలాడుతూ తన తువ్వాయితో కలిసి వీధంతా కలియతిరుగుతూ ఉండే గోవు ‘లక్ష్మి’ కూడా జానకీపతికి జ్ఞాపకం వచ్చింది. తమ కాశీ ప్రయాణానికి కొద్దిరోజుల ముందు అకస్మాత్తుగా ‘లక్ష్మి’ అస్వస్థతకు గురయ్యింది. కదలలేని స్థితిలో పడుకుని ఉన్న ‘లక్ష్మి’ని చూసి, మనోహర్ జాలిపడి, దాన్ని పశువుల డాక్టర్ వద్దకు తీసుకునివెడితే, ‘లక్ష్మి’ని పరీక్షించిన డాక్టర్ అది కడుపు నొప్పితో బాధపడుతోందని గ్రహించి, ఆపరేషన్ చేసి, దాని పొట్టనుండి అరకేజీ ప్లాస్టిక్ కవర్లను బయటకు తీసిన సంఘటన జానకీపతి ఇంకా మర్చిపోలేదు!
ఇన్నిరోజులూ జానకీపతికి ‘ప్లాస్టిక్’ అన్న పదం ఎంతో ఆకర్షణీయంగా తోచింది. ఇప్పుడు అదే పదం తనలో ఏదో తెలియని భయాన్నీ, అపరాధ భావనను కలిగిస్తోంది! అంతలో తన పాదాలకు తాకుతున్న అలలతోపాటూ ఎక్కడినుచో ఒక చిన్న ప్లాస్టిక్ సీసా కొట్టుకుని వచ్చి జానకీపతి కాళ్ళ దగ్గర ఆగింది. ఆ సీసా వంక యధాలాపంగా చూసిన జానకీపతికి దానిలో ఒక తాబేలు పిల్ల తల ఇరుక్కుని ఉండటం కనపడింది!! పాపం ఆ తాబేలుపిల్ల సీసాలో ఏముందో చూద్దామని అనుకుని తన బుజ్జి తలను ఆ సీసాకున్న సన్నటి మూతిలో దూర్చింది! దాని తల ఆ సీసాలో ఇరుక్కుపోవడంతో అది బయటకు రాలేక, ఊపిరాడక, గిలగిలా కొట్టుకుంటోంది!
‘అరెరే!!’ , అంటూ వెంటనే ఆ సీసాను, తాబేలుపిల్లనూ జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకుని, అతి కష్టంమీద తాబేలుపిల్ల తలను సీసా నుండీ బయటకు తీసి, ఆ తాబేలుపిల్లను తిరిగి నదిలోకి వదిలిపెట్టాడు జానకీపతి. తాబేలుపిల్ల కంగారుతోనూ, భయంతోనూ ఇటూ అటూ ఈదుతూ ఎటో వెళ్ళిపోయింది! తాబేలుపిల్ల పరిస్థితిని చూసిన జానకీపతి మనసు చలించిపోయింది!
‘మనుషులకేకాక ప్రకృతిలోని ప్రాణులకు సైతం కాలుష్యంవల్ల హాని కలుగుతోంది! ఈ అందమైన ప్రకృతిని కలుషితం చేసిన వారిలో నేను కూడా ఉన్నాను!! ఛ! నేను నా జీవితమంతా స్వార్ధంతో ప్రవర్తించాను!’, అని పశ్చాత్తాపపడ్డాడు జానకీపతి.
అంతలో ఒక స్త్రీ తన నాలుగేళ్ల కొడుకుతో అక్కడకు వచ్చి, జానకీపతికి కాస్త దూరంలో కూర్చుని, ఆ పిల్లవాడికి నదీ స్నానం చేయించి, మంచిబట్టలు వేసి, తనతో పాటూ తెచ్చిన ఫలహారం ఆ బాబుకి తినిపిస్తూ, గంగపై ఎగురుతున్న పక్షులను చూపిస్తూ, మధ్య మధ్యలో ఆ బాబుకి తాగడానికి నీళ్లు కూడా ఇచ్చింది.
ఆ బాబు ముద్దు ముద్దు మాటలతో వాళ్ళ అమ్మకు ఏవో కబుర్లు చెప్తూ, “అమ్మా..! మనం తాగే ఈ నీళ్లు ఎక్కడివీ?”, అని అడిగాడు.
దానికి ఆ స్త్రీ, “అదుగో!! ఆ గంగమ్మే ఇచ్చిందిరా! మనకు ఏది కావాలన్నా ఆ ప్రకృతిమాతే ఇస్తుంది!”, అని జవాబిచ్చింది.
అది విన్న జానకీపతి, ‘నేనెంత పాపిని?!! సృష్టిలోని సకల జీవరాశులకూ బ్రతకడానికి అవసరమైన ఆహారమూ, నీళ్లు, గాలీ వంటివి ఇచ్చి, ఈ ప్రాణికోటి అవసరాలన్నిటినీ కన్నతల్లై తీరుస్తున్న ఆ ప్రకృతిమాత పట్ల నేను చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించాను! కనీసం ఇప్పుడన్నా నా తప్పును సరిదిద్దుకోకపోతే నా జన్మకు అర్ధం ఉండదు!! నేను తక్షణమే నా వ్యాపారాన్ని నిలిపేసి, నేనింతవరకూ సంపాదించిన డబ్బుతో కాలుష్యం బారినుండీ ప్రకృతిని కాపాడి, పర్యావరణాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాను!! గంగానది మానవులు చేసే అతి భయంకరమైన పాపాలను ప్రక్షాళన చేస్తుంది. అటువంటి ఈ పవిత్ర నదిని కలుషితం చెయ్యడం ధర్మం కాదు! ఇటువంటి నదులను శుభ్రపరచడం నా తక్షణ కర్తవ్యంగా భావించి, నదుల ప్రక్షాళన కార్యక్రమం ఈరోజే మొదలుపెడతాను!’, అని గంగను తన చేతులతో స్పృశిస్తూ, ఆ పవిత్ర నదికి మనస్ఫూర్తిగా నమస్కరించి ఆసుపత్రికి బయలుదేరాడు!

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked