బాలాంత్రపు నివాళులు

మరికొన్ని నివాళులు

బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు

(ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!)

జేజి మావయ్యా తిరిగి రావూ ?

-వీర నరసింహ రాజు

జేజి మావయ్యా … నేను దిబ్బ రొట్టి అబ్బాయిని. ప్రొద్దున్నే మీరు రేడియో లో ఆరంభించిన భక్తి రంజని వింటే బోలెడు భక్తి వస్తుందని మా జేజమ్మ చెప్పేది . అందులోనూ ఆదివారం వస్తే శ్రీ సూర్య నారాయణా మేలుకో హరి సూర్యనారాయణా వింటుంటే భలే భలే ఈ రోజు ఆదివారం స్కూల్ కి సెలవు దినం అని గుర్తుకు వచ్చి ఎంచక్కా ఆడుకోవచ్చని అనిపించి సూర్యదేవుడికి మొక్కేసి మళ్ళీ జేజమ్మ వచ్చి అరిచే దాక ముసుగు కప్పేసేవాడిని
తెలుసా. ఇంతలో “రారే రారే పిల్లలారా ” అనే పాట వింటే ఉత్సాహం పొంగుకొచ్చెదనుకో . అమ్మ , జేజమ్మో మాకు తాయిలం పెడుతుంటే “తాయిలం పాట” గుర్తొస్తుంది .చిన్నపుడు జేజమ్మ వాళ్లకు కూడా తెలియని ధర్మ
సందేహాలు తీర్చేట్టు చేసావు కదా. అందులో ఇంఖో తాతయ్య ఉషశ్రీ గారి గొంతు భలే ఉండేదనుకో . అమ్మ , జేజమ్మ వాళ్ళు ఏమిటి చెవులు చాటంత చేసుకుని వింటున్నారు అని నేను వినే వాణ్ణి .
కాస్త పెద్దవగానే మూడు చక్రాల సైకిల్ మీద నీ పాటే పాడుతూ వీధంతా తిరిగే వాణ్ణి . నేస్తాలందరితో కలసి ఆడుకుంటూ వంకర టింకర శో అంటూ పాడుకునేవాళ్ళము. తోటలోకి వెడితే జామి చెట్టెక్కి “ఉడుత ఉడుతా హుచ్ పిడత కింద శనగ పప్పు పెడతా పెడతా రావే ” పాట పాడుకునే వాళ్ళం . పాలపిట్ట రావే పాట , కాకి కాకి హాష్ , కారు షికారు పాట ఇలా అన్నీ ఇష్టమే నాకు. ఆగష్టు 15 వస్తే ” మాదీ స్వతంత్య్ర దేశం, ఈనాడే పదిహేనవ తేదీ, మ్రోయించు జయభేరి , హే భారతజనని , ఉదయమ్మాయెను స్వేచ్చ్చా భారతమ్ము దయమ్మాయేనాహో వింటే ఒళ్ళు గగుర్పొడిచేదనుకో . అవి వింటుంటే బడిలో పంతులుగారు ఇచ్చే చాకోలెట్స్ కంటే అద్భుతంగా ఉండేవి తెలుసా . చిన్నపుడు ఆ లలిత గీతాలు అర్థం అయ్యేవి కావు గానీ పెద్దయ్యాక రేడియో లో అవి వస్తే భలే వినే వాళ్ళము తెలుసా .
నీ నూరేళ్ళ పుట్టిన పండగకు పిలుపు వచ్చినా , ఎన్ని సార్లు పిలుపు అందినా రాలేక పోయాను .ఇపుడు నిన్ను ఇంకెప్పుడు చూడలేను అని తలచుకుంటే బాధగా ఉన్నా నీకెక్కడ మరణం . నీ పాటల్లో, నీ రచనల్లో మా హృదయాల్లో తిష్ట వేశావు కదూ . మీ మీద అభిమానంతో మీ గొప్పదనం అందరికి చెప్పాలని ఒక పేజీ కూడా పెట్టాను తెల్సా . మళ్ళీ మా పిల్లలకు .. అందరికీ నీ జేజి మావయ్య పాటలు ఇంకా మరెన్నో అందించడానికి మళ్ళీ రావూ . ప్లీజ్ మళ్ళీ తిరిగి రావూ
ఇట్లు
మీ దిబ్బ రొట్టబ్బాయి

****************

రజనీగంధాస్వాదన

-విద్య

బాలాంత్రపు రజనీకాంతరావు గారిని కలవాలని ఎప్పట్నించో అనుకుంటున్నాను. అది ఈరోజు ఆకస్మికంగా కుదిరింది. నేను నా కొలీగ్ అన్నపూర్ణ ఈరోజు వారిని దర్శించుకోవాలని అనుకున్నాం, వారి జన్మదినం కావటం మాకు సంతోషకారణం కూడాను.ఆయనకు ఏమిస్తే బాగుంటుందీ అని ఆలోచించాను ఏమిచ్చినా నిండు చంద్రునికి నూలు పోగే. ఏమీ తేలక చివరకు పండ్లు తీసుకువెళ్ళటమే ఉత్తమం అనిపించింది.అవే తీసుకువెళ్ళాను.
ఎంతో ఆప్యాయంగా కరచాలనం చేసి ఇవి నాకే కదా అంటూ స్వీకరించారు. భేషజం లేకుండా అలా స్వీకరించటం చాలా సంతోషం కలిగించింది నాకు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపితే సంతోషంతో థాంక్యూ అంటున్నప్పుడు ఆయన కళ్ళలో మెరుపు మా కళ్ళలోకి పాకింది. పాట పాడగలరా అని మేము సందేహంగా వారి సహాయకుని అడుగుతుంటే వెంటనే గొంతు సవరించుకుని రారే రారే మధువనీ లతాంత కాంతలారా అని అందుకున్నారు. ఆ పాట నా చరవాణిలో బంధించడానికి ఉద్యుక్తురాలినవటం చూసి ఆగి రడీ అనగానే మళ్ళీ మొదలుపెట్టారు. ఎంత సునిశితంగా గమనించారో అనిపించింది.ఏమి చేస్తున్నామో కనుక్కుని చక్కని చిక్కని కాఫీ అందించారు.
ఇక కాగితం కలం అందించాము.ఏమిటి అన్నారు.మమ్మల్ని ఆశీర్వదించండీ అని అడిగాను. వెంటనే చక్కగా ఆశీర్వచనం వ్రాసి,తేదీ ఎంతా అన్నారు.29 జనవరి అన్నగానే వారికి తన పుట్టినరోజు అని ఙ్ఞాపకం
వచ్చిందనుకుటాను తన పుట్టిన తేదీతో సంతకం చేసారు. రెండో కాగితం అందించాము.అన్నపూర్ణకి ఆశీర్వచనము రాస్తూ మధ్యలో మొదటి కాగితంతో పోల్చి చూసుకున్నారు. ఒక్క అక్షరం ఎక్కువ తక్కువ లేకుండా అదే ఆశీర్వచనం. ఎవరికి ఒక్క అక్షరం ఎక్కువ వచ్చినా ఉడుక్కుంటాం అనుకున్నారేమో తల్లి మనసుతో ఆలోచించినట్టున్నారు. నిజమే రేడియో వ్యాఖ్యాతలందరికీ ఆయన తల్లి లాంటి వారే. చివరగా ఒత్తుల డబ్బా తెరిచారు. అదేనండీ అన్ని అక్షరాలకీ ఒత్తులు సరిగా ఉన్నాయాలేవా సరిచూసారు. ఈలోపు పెద్దవారు కదా చిన్న కునుకు వారి రెప్పలపై వాలింది.సహాయకులు చిన్నగా వారి భుజం నిమిరారు మేల్కొని చల్లని చిరునవ్వుతో కాగితాలు మాకు అందించారు.
ఇక సెలవంటూ లేచాము వారి తనయుడు హేమచంద్రగారు వస్తూ ఉండండీ ఆయనకు రోజంతా పాడమని అడిగినా అలుపు ఉండదు. ఏ సమయంలో అయినా నిస్సంకోచంగా రండి అని చెప్పారు. కె.డి.కె.హేమలతగారు ఆద్యంతం మాతోనే ఉండి వారి రాబోయే రచనల గురించి చెప్పారు. రజనీ గారి మాటల లాలిత్యం నా మనసులోనూ వారి అరచేతుల లాలిత్యం ఇప్పటికీ నా చేతుల్లోనూ భద్రంగా ఉన్నాయి. వారి మాటల సుగంధం మీతో పంచుకోవాలని ఎప్పుడూ ముఖపుస్తకంలో ఎక్కువ రాయని నాకు ఇదంతా మీకూ పంచాలని అనిపించింది.శతవసంతాల బాలుడికి శతసహస్ర వందనాలు తప్ప మరేమీ ఇచ్చుకోలేని — మీ విద్య

***************

వెల్ కెప్ట్

-చైతన్య పింగళి

రాజాజి గారు ఓసారి తన స్నేహితుని ఇంటికి వెళ్లారు. తన స్నేహితుడి నాన్నకి 90 ఏళ్ల పైనే. ఆయన్ని చూసి, ‘వెల్ కెప్ట్’ అన్నారు రాజాజి. ఇది నేను చదివినప్పుడు, వెల్ కెప్ట్ ఏంటి ఆయన బొంద అనుకున్నాను.
నేను విజయవాడ లో బాలాంత్రపు రజనీకాంత్ రావు గారిని చూడటానికి మృణాళిని గారు, శిలలోలితగారితో వెళ్ళాను. అప్పటికి 96 ఏళ్ల వయసు. తెలుగు సంవత్సరాల్లో అధిక మాసాలు కలుపుకుంటే 100 పైమాటే అంట. నేను, వెళ్ళాము.
ఆయనకి ఆరోగ్యం బాలేదు కానీ, నా ఆత్రం మొహం చూసి.. ‘సరే’ అన్నట్టు లేచి పాడటం మొదలు పెట్టారు. పాట మధ్య మధ్యలో గుర్తు రానప్పుడు, ఆయన కోడలు ప్రసూన గారు, ఆయన వీపుని నిమురుతూ.. ‘ఊ..’ అనగానే, ఆయన తడుముకుని మళ్ళీ పాట అందుకునేవాడు. ఆయన మర్చిపోయినప్పుడల్లా ఇదే తంతు. ఆమె ఆయన వీపు తట్టడం… ఆయన అందుకోటం! అప్పుడు గుర్తొచ్చింది రాజాజి మాట.. ‘వెల్ కెప్ట్’ అని. ఒక జాతీయ సంపదని, అలా భద్రంగా చూసుకున్న ప్రసూన గారికి సంగీత, సాహిత్య అభిమానులు అందరూ రుణపడి ఉంటారు.
తిండి పెట్టడంతో సరిపుచ్చకుండా, ఆ జీవధారని కాపాడటం ఆషామాషీ కాదు. సంగీతం మీద అభిమానం ఉండటం వేరు. పాటలు ఫోన్లో వినటమో, కచేరీలకి పోయి వినాటమో తేలిక. కానీ సంగీతం మీద ప్రసూన గారికి ఎంత అభిమానమో, రజనీ ని ఆమె కాపాడిన తీరు చూస్తే తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక untold communication ఏదో ఉంది. ఆమె కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే, పక్కన రజని కూర్చొని పాడేవారట.. అలా విజయవాడ నుండి డ్రైవ్ చేస్తూ హైద్రాబాద్ వచ్చేసేవారు మామా, కోడళ్లు అని హేమచంద్ర గారు చెప్తే.. మళ్ళీ రాజాజి మాటే గుర్తొచ్చింది. ఇన్నేసి తరాలకు ఆనందం కలిగించిన రజనీని ఇంత కాలం అంత భద్రంగా చూసుకున్న ఆ కుటుంబానికి రజని ప్రేమికురాలిగా.. కృతజ్ఞతలు.

************

వొకే వొక్క – వెలుగుల సూరీడి పూలపాట

-కుప్పిలి పద్మ

ప్రతీ ఆది వారమూ యిక్కడ వినిపించే ఆ పాట యీ ఆదివారం ఆ దేదీప్యమాన లోకంలో వినిపించాలని పయనమైన పాటకి వేలవేల రంగురంగుల పూల నమస్సులు.

శ్రీ సూర్య నారాయణా, మేలుకో హరి సూర్యనారాయణా!

పొడుస్తూ భానుడూ పొన్న పూవు ఛాయ
పొన్న పూవు మీద పొగడ పూవు ఛాయ

వుదయిస్తు భానుడూ వుల్లిపూవు ఛాయ
వుల్లి పూవూ మీద వుంగ్రపు పొడి ఛాయ

ఆకాశవాణి వైతాళిక మహనీయుడు ,సాహిత్య,సంగిత స్రష్ట బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళి గా 26 .4.2018 గురువారం కిన్నెర సంస్థ తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సంతాప సభ పలువురు సాహిత్య సంగీత ఆకాశవాణి ప్రముఖుల జ్ఞాపకాల రజనీగంధంగా గుబాళించింది. పద్మ పురస్కారం వంటిదేదీ వారికి లభించని వైనం పట్ల కొందరు ఆర్తి చెందారు. అంతా ఆ శ్రవ్య మాధ్యమ శకపురుషునికి శ్రద్ధాంజలి ఘటించారు.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked