ధారావాహికలు

రామాయణ సంగ్రహం

ఇక కిష్కింధకు రావణుణ్ణి అట్లా చంకలో ఇరికించుకొనే వచ్చిన తర్వాత వాణ్ణి కిందకి దింపి నవ్వుతూ ‘ఏమిటి సమాచారం? ఎక్కడి నుంచి వచ్చారండి!’ అని అడిగాడు వాలి.

రావణుడు బిక్కచచ్చిపోయినాడు. రావణుడి సంభ్రమాశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ‘నేను రావణుణ్ణి. లంకాధిపతిని. నాకు బాగా శాస్తి జరిగింది. నా గర్వం అణగారిపోయింది. భళిరా! ఏమి బలం! ఏమి వేగం! మనోవేగం, వాయువేగం, సుపర్ణుడి వేగం కూడా నీ వేగం ముందు తీసికట్టు. నన్ను మన్నించు. నీ స్నేహితుడిగా చేసుకో నన్ను. నీ వాణ్ణిగా చూసుకో’ అని ప్రాధేయపడ్డాడు రావణుడు, వాలిని. అప్పుడు అగ్నిసాక్షిగా వాళ్ళు మిత్రులైనారు.
వాలి రావణుణ్ణి కౌగిలించుకొని మన్నించాడు. ‘ఇవాల్టి నుంచీ మనం అన్నీ నీది, నాది అనే భేదం లేకుండా మైత్రీభావంతో చూసుకుందాం’ అని రావణుడు, వాలిని వేడుకున్నాడు. వాలి రావణుణ్ణి, సుగ్రీవుడితో సమానంగా సమాదరించాడు. ఒక నెల రోజులు రావణుడు కిష్కింధలో గడిపాడు. తన కోసం వచ్చిన మంత్రులతో కలిసి మళ్ళీ లంకకు చేరుకున్నాడు రావణుడు. ‘అటువంటి రావణుణ్ణి శలభాన్ని అగ్ని రూపడచినట్లు చేశావు నీవు’ అని శ్రీరాముణ్ణి అగస్త్యులవారు ప్రశంసించారు.
ఇదీ వాలికీ, రావణుడికీ మధ్య జరిగిన వృత్తాంతం అని అగస్త్య మహాముని ఆ కథంతా శ్రీరాముడికి వివరించాడు. ఈ కథంతా ఆశ్చర్యంతో విన్న శ్రీరాముడు ‘మహాత్మా! వాలీ, రావణుడు అసమాన బలపరాక్రమశాలురే, సందేహం లేదు. అయినా హనుమంతుడి బలపరాక్రమాల ముందు వీళ్ళిద్దరూ సాటి వస్తారా?’ అని నా సందేహం.
శ్రీరాముడు హనుమంతుణ్ణి ప్రశంసించటం
‘ధైర్యశౌర్యాలలో కానీ, బలపరాక్రమాలలో కానీ, ప్రాజ్ఞతలో కానీ, నీతినిపుణతలో కానీ హనుమంతుడి ముందు ఎవరూ సాటి రారు. సముద్రాన్ని చూసి తత్తరపాటు చెందిన వానరులకు స్థైర్యం ప్రసాదించి, నూరు యోజనాలు లంఘించిన హనుమంతుడి పరాక్రమం ఎంత శ్లాఘించినా తనివి తీరదు నాకు. ఇంకా అతడు లంకలో చేసిన ఘనకార్యాలు ఇన్నా? అన్నా? జానకిని అన్వేషించటం, లంకను దగ్ధం చేయటం, రావణుడికి హితవు బోధించటం, రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళను పరిమార్చటం పరమాద్భుత కృత్యాలు కదా! హనుమంతుడి వీరకృత్యాలలో ఏ దేవతా ఒక్కటీ చేసినట్లు కనపడదు. ఆంజనేయుడి భుజబల పరాక్రమాల చేతనే సీతను, లక్ష్మణుణ్ణి, నా రాజ్యాన్ని, బంధుమిత్రులను నేను రక్షించుకోగలిగాను; పొందగలిగాను. హనుమంతుడి సహాయం లేకపోతే నేనేమై పోయేవాన్నో! మరి ఇటువంటి పరాక్రమశాలి సుగ్రీవుడికి ఇష్ట సచివుడై ఉండగా సుగ్రీవుడు ఎందుకు వాలిని నిగ్రహించలేక పోయినాడు? అన్ని బాధలు పడుతూ కొండలను, కోనలను, అడవులను సుగ్రీవుడు ఎందుకు ఆశ్రయించవలసి వచ్చింది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked