కథా భారతి

వాటా

-ఆర్ శర్మ దంతుర్తి

సోమవారం పొద్దున్న డాకెట్ లో మొదటి కేసు. బెనర్జీ అనే ఓనర్ గారు ఏపిల్, ఆండ్రాయిడ్ ల మీద పనిచేసే ఓ ఏప్ తయారు చేస్తున్నారు. ఒక వెంచర్ కాపిటలిస్ట్ పాతిక శాతం వాటాకి పెట్టుబడి పెట్టాడు కానీ పని అవలేదు. కారణాలు అనేకం – కోడ్ రాసే కుర్రాడు పని మానేసి వెళ్ళిపోయాడు; కొన్ని కోడ్, నెట్ వర్క్ కష్టాలు, అన్నీ కలిపి కోతి పుండు బ్రహ్మరాక్షసి లాగా తయారయ్యాయి. డబ్బులు అయిపోయాయి; ఈ ఆప్ కనక మరో ఆర్నెల్లలో పూర్తవకపోతే వెంచర్ కాపిటలిస్టు గారు పీకలమీదకి వచ్చి కూర్చుంటాడు. ఉన్న ఒకే ఒక దారి – బెనర్జీగారి ప్రకారం – మరో నూట యాభైవేలు సర్దాలి. అన్నింటికన్నా ముఖ్యం ఆ ఆప్ పూర్తిచేయడానికి అమల, వెంకటేశ్వరన్ ఇద్దరూ పనిచేయాలి –ఫుల్ టైం స్థాయిలో – అంటే, ఉన్న ఉద్యోగాలు మానుకుని.

ఉన్న ఉద్యోగం మానుకుంటే ఎలా అనే ప్రశ్నకి బెనర్జీగారే చెప్పారు సరైన సమాధానం. ఏప్ అవగానే దాన్ని ఎవరో పెద్దవాళ్లకి అమ్ముతారు ఏడాదిలోగా. దానిమీద వచ్చే మిలియన్లు, లేదా షేర్ ప్రకారం సరిగ్గా ఏడాదీ రెండేళ్ళలో అమల, వెంకటేశ్వరన్ ఇద్దరూ మిలియనీర్లు అయిపోవచ్చు. ఏప్ ని ఎవరికీ అమ్మలేకపోయినా కంపెనీ షేర్ విలువ మార్కెట్లో అమాంతం పెరగ్గానే అమల, వెంకటేశ్వరన్ ఇద్దరూ వాళ్ళవాళ్ళ షేర్లు అమ్మేసుకున్నా మిలియన్లు వస్తాయి. అలా ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలు మానేసినా ఏమీ కష్టం కాదు. షేర్లు పైకి పోకపోయినా, ఏప్ ఏ గూగిల్ లాంటి వారికి అమ్మలేకపోయినా ఫర్లేదు ఎందుకంటే ఉన్న ఎక్స్ పీరియన్స్ తో, ఐఐటి బ్రాండ్ తో, గ్రీన్ కార్డ్ ఉండనే ఉంది కనక ఇద్దరూ ఉద్యోగాలు ఎలాగా సంపాదించుకోవడం కష్టం కాదు.

అలా తనతో ఐఐటిలో చదువుకున్న అమలనీ, వెంకటేశ్వరన్ నీ తన కంపెనీలోకి లాగాడు బెనర్జీ. ముందు చెప్పిన రూల్స్ ప్రకారం అమల, వెంకట్ డబ్బులు పెట్టుబడి పెట్టాలి; స్వెట్ కాపిటల్ గా పని చేయాలి ఏప్ పూర్తి చేయడానికి; కావాల్సిన నూట యాభైవేలలో వెంకట్ అరవైవేలు, అమల తొంభై సర్దగలరుట. ఇది విని బెనర్జీ చెప్పాడు. ప్రస్తుతానికి కంపెనీ దగ్గిర పైసా లేదు, వీళ్ళిద్దరూ కలిపి పెట్టబోయే నూట యాభైవేలు తప్ప. ఈ నూట యాభై ని ఈ ముగ్గురి బొటాబొటి జీతాలకీ, పనికీ, ఎక్విప్ మెంటుకీ అన్నింటికీ సరిపెట్టుకోవాలి. ఇద్దరికీ కలిపి యాభైవేల షేర్లు ఇస్తాడు బెనర్జీ. అమల, వెంకట్ వాటిని ఫిఫ్టీ, ఫిఫ్టీ గా పంచుకుంటారా, ముప్ఫై, ఇరవై పంచుకుంటారా అనేవి వీళ్ల ఇష్టం. ఐఐటి నుంచీ చాలాకాలం తెల్సినవారు కనక మాటమీద నిలబడతారు. ఉత్తరోత్తరా దెబ్బలాటలు రాకుండా ఉండడానికి కాయితం మీద రాసి ఇచ్చేదేమంటే – పెట్టుబడికీ, కోడ్ రాసే శ్రమకీ ఇద్దరికీ కలిసి యాభైవేల షేర్లు; అంతే.

సరే అంటే సరే అనుకున్నాక సరిగ్గా మూడు నెలల్లో ఆప్ పూర్తిచేసారు. పెట్టిన డబ్బుల ప్రకారం అమలకి ముప్ఫైవేల షేర్లు, వెంకట్ గారికి ఇరవై వచ్చాయి. ఏప్ సక్సెస్ అయ్యి, కంపెనీ పూర్తిగా పబ్లిక్ ఆఫరింగ్ కి వెళ్ళేసరికి అమాంతం షేర్ విలువ రెండు వందల డాలర్లకి చేరుకుంది; బెనర్జీ గారి ప్లాన్లూ, రాబోయే మరో కొన్ని ఆప్ లూ అవీ కలిపి న్యూస్ పేపర్లకి ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసరికి. షేరు విలువ ప్రకారం అమలకి వచ్చింది ఆరు మిలియన్లు. అటు వెంకట్ గారు కూడా నాలుగు మిలియన్లు సంపాదించుకున్నట్టే.

ఇక్కడే వచ్చింది తిరకాసు, వెంకట్ గారికి.

షేర్ విలువ ఇంకా పెరుగుతోంది రోజు రోజుకీ. ఇలా అయితే తనకంటే ముందు అమల పదీ పదిహేను మిలియన్లు సంపాదించేయగలదు! తామిద్దరూ పనిచేసింది ఒకేసారి, ఒకేచోట, సమానంగా. డబ్బులు ఎవరెవరు ఎలా పెట్టుబడి పెట్టినా ‘ఆడది’ , అందులోనూ ‘తెలుగు అమ్మాయి’ అయిన అమల కంటే ‘మగాడు’, ‘తమిళ హీరో’ అయిన తానే ఎక్కువ పనిచేసినట్టు లెక్క. ఆడా, మొగా అనే ఇద్దరికీ ఒకే రకం జీతాలివ్వాలనీ, మరోటనీ అంటారు సరే కానీ అవన్నీ జీవితంలో నిజంగా జరుగుతాయా, మన కాకి లెక్కలు తప్ప? అదీగాక ముప్ఫై ఇరవై లాగా స్టాకు పంచుకోమని బెనర్జీ ఎప్పుడూ చెప్పనేలేదు. కాయితం మీద రాసిందీ లేదు. అందువల్ల ఇద్దరికీ స్టాకు సమంగా రావాల్సిందే కదా?

వెంకట్ ఇదే విషయం ముందస్తుగా అమలని అడిగాడు. ఆవిడ చెప్పినదేమంటే, స్టాకు పంచుకున్నప్పుడు ఏ గొడవాలేదు, అప్పుడేమీ అనకుండా స్టాకు విలువ పెరుగుతుంటే ఇలా అనడం ఏం సబబు? వెంకట్ గారికి ఈ విషయాన్ని అలా ముగించడం నచ్చలేదు. కడుపుమంటతో ఓ లాయర్ని వెతికాడు. పక్కవాడింట్లో కుక్క మొరిగితే తనకి రాత్రి నిద్రలేదనీ, అమెరికాలో అకాల వర్షం వస్తే అది కెనడా వారి తప్పు అనీ, మంచు పడినప్పుడు కాలుజారి నడ్డి విరక్కొట్టుకుంటే మంచు క్లీన్ చేయనందుకు మునిసిపాలిటీవారి తప్పనీ, కాకి మూడు సార్లు అరిస్తే దానికి ఎదురింటి ఆర్నిథాలజిస్టు రోజూ గింజలు వేయడం వల్ల అనీ కోర్టులో కేసులు వేసి నెగ్గగల లాయర్లు ఉన్న అమెరికాలో ఓ లాయర్ దొరికేడు వెంకట్ కి ఈ కేసు వాదించడానికి. లాయర్ గారు బయటకి చెప్పని స్వంత ఘోష ఏమిటంటే, ఏ కేసు తనకెంత పేరు తెస్తుందా అని. కేసు వాదిస్తాను అని లాయర్ గారు అనగానే వెంకట్ కి, ఈ లాయర్ కి ఓ పదో పరకో ఇవ్వొచ్చనీ తనని తప్పకుండా గెలిపిస్తాడనీ నమ్మకం కుదిరిపోయింది.

అలా ఈ లాయర్ ‘ఆడది,’ ‘తెలుగు’ అనే గొడవపడే విషయాలు వదిలేసి ‘ఆడా మొగా సమాన హక్కులు’ అనే విషయం బాగా కనిపించేలాగా కేసు తయారు చేసి కోర్టుమీదకి వదిలాడు. న్యాయాన్యాయాలు చెప్పే న్యాయదేవత గుడ్డిది కనకా, తనకి తాను వాదించుకోలేదు కనకా అమల కూడా ఓ లాయర్ని కుదుర్చుకోవల్సి వచ్చింది.

కేసు విషయాలన్నీ చదివి తెలుసుకున్న, జడ్జ్ ఆర్నాల్డ్ రాబిన్సన్ గారు ముందు అడిగాడు ఇద్దరు లాయర్లనీ తన ఛాంబర్ లోకి పిలిచి – బయటే ఏదో చేసి కేసు సెటిల్ చేసుకోవచ్చుగా, ఇంత చిన్నవిషయానికి కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకూ అంటూ. అమల తరఫు డిఫెన్స్ లాయర్ ఏదో అనబోయేలోపుల ప్రాసిక్యూటర్ గారు తెగేసి చెప్పారు, “కుదరదు.” ఆయనకి తన క్లయింట్ వెంకట్ నెగ్గుతాడా అనే విషయం ఏనాడూ అవసరం లేదు; కావాల్సినది ఆయన వాదిస్తూంటే పేరు రావడం. డబ్బులు కుక్కని కొడితే రాలవూ?

“సరే అయితే,” తన మనసులో మెదిలే భావం మొహంలో కనిపించకుండా చెప్పేడు జడ్జ్ రాబిన్సన్.

కోర్టులో ఇద్దరి వాదనలూ రెండు రోజులు తీరిగ్గా విన్నాక జడ్జ్ రాబిన్సన్ అడిగాడు వెంకట్ ని, “మీరు ఏప్ కోసం కోడ్ పూర్తిగా రాసారా లేక సగం రాసారా?”

“సగం రాసాను, ఆండ్రాయిడ్ కి, కానీ చివర్లో కావాల్సిన సెక్యూరిటీ అదీ కూడా నేను చూసాను.”

ఈ సారి జడ్జ్ గారు అడిగారు, “మా అబ్బాయి ఈ కంప్యూటర్ ఫీల్డులోనే పనిచేస్తున్నాడు కనక కొన్ని విషయాలు నాకు తెలుసు. ఏప్ తయారు చేస్తున్నప్పుడు మొదటినుండి చివరి వరకూ రిక్వైర్ మెంట్స్ దగ్గిర్నుంచి, డిప్లాయ్ మెంట్ వరకూ అనేక స్టేజ్ లు ఉంటాయిట కదా అందులో ఏది బాగా ముఖ్యం? అందులో మీరు ఎన్ని చేసారు?”

“అన్ని స్టేజ్ లూ ముఖ్యమేనండి. ఒకటి లేకపోతే మరోటి లేదు. కానీ చివర్లో సెక్యూరిటీ లేకపోతే అసలు ఆప్ బయటకి రాదు కనక నేను ఆవిడకంటే ఎక్కువ పనిచేసినట్టు లెక్క.”

జడ్జ్ గారు ప్రాసిక్యూటర్ తో అన్నారు. “అదేమిటి, మీ క్లయింట్ విరుద్ధమైన సమాధానాలు చెప్తున్నారు? ముందు అన్ని స్టేజ్ లూ ముఖ్యమే అంటున్నారు తర్వాత సెక్యూరిటీ ముఖ్యం అంటున్నారు. ఇద్దరూ కలిసి పనిచేసినప్పుడు ఆవిడ పెట్టిన డబ్బులూ, స్వెట్ ఇన్వెస్టుమెంట్ ప్రకారం ఆవిడ ముప్ఫైవేల షేర్లు తీసుకున్నారు. మీరు పెట్టినదానికి మీకు ఇరవై వచ్చింది. ఇంకా ఏమిటి గొడవ?”

“సమంగా పనిచేసినందుకూ, ఈయన కొంచెం ఎక్కువ పనిచేసినందుకూ మా క్లయింట్ కి మరో అయిదు వేల షేర్లు రావాలండి. వాటి విలువ ఇప్పటి షేర్ విలువ, రెండువందల తో పోలిస్తే మిలియన్ డాలర్లు.”

జడ్జ్ ఈ సారి డిఫెన్స్ లాయర్ని అడిగాడు, “ఆయనకి అయిదువేల షేర్లు మీకు ఇవ్వడానికి అభ్యంతరం ఉందా?”

“పెట్టుబడి పెట్టినట్టూ న్యాయంగా షేర్లు ఇచ్చారు మా క్లైంటు. ఇప్పుడీ షేర్ల విలువ పెరుగే సరికి ఈవిడ తనకంటే ఇంత ఎక్కువ సంపాదించడమా అనే ఊహ వచ్చినట్టుంది వెంకట్ గారికి; సమాన హక్కులూ, సెక్యూరిటీ లో ఎక్కువ పని చేసాననీ, ఇదీ, అదీ అంటూ మామీద కేసు వేసారు. ఇందులో ఎటుతిరిగి ఎలా చూసినా మేము ఒక్క షేర్ కూడా ఎక్కువగా ఇవ్వక్కర్లేదు. న్యాయం మీకే కనిపిస్తోంది కదా” డిఫెన్స్ లాయర్ చెప్పాడు.

“సరే అయితే, నేను జడ్జ్ మెంట్ మరో గంటలో ఇస్తా. మీరు బయట సెటిల్ చేసుకోనన్నారు కనక నా జడ్జ్ మెంట్ అఫీషియల్ అవుతుంది తర్వాత,” రాబిన్సన్ తన ఛాంబర్ లోకి వెళ్తూ చెప్పేడు.

జడ్జ్ లోపలకి వెళ్ళిపోయాక వెంకట్ అడిగాడు తన లాయర్ని ఏం చేస్తే బాగుంటుందో.

వెంకట్ ఓడినా, నెగ్గినా లాయర్ ఫీజు ఆయనకి ఎలాగా వస్తుంది కనక చెప్పాడు, “మనం కేసు సెటిల్ చేసుకోనని అన్నాం, ఆవిడ షేర్లు ఇవ్వనంది కదా, జడ్జ్ గారు మహా అయితే ప్రస్తుతం ఉన్న ముప్ఫై, ఇరవై వాటా సరిగ్గానే ఉంది అనవచ్చు; అలా మీకు మరేమీ రాకపోవచ్చు. కానీ ఈయన మంచివాడైతే మీకు అయిదువేలు కాకపోయినా ఓ వెయ్యి షేర్లు ఇప్పించవచ్చు. ఈయన ప్రతీ కేసులోనూ ఊహకి అందని జడ్జ్ మెంట్లు ఇస్తాడని అంటారు. అందువల్ల ఇప్పుడే ఏదీ చెప్పలేం.”

గంట పోయాక జడ్జ్ కోర్టులోకొచ్చి చెప్పేడు తీర్పు, “కేసులో చూడబోతే అమలా, వెంకట్ ఇద్దరూ స్వెట్ కాపిటల్ సమంగా పెట్టినట్టే కనిపిస్తోంది, వెంకట్ ఏదో కొంచెం ఎక్కువ పని చేశాడని చెప్తున్నా. డబ్బులు పెట్టుబడి పెట్టిన ప్రకారం అమలకి ముప్ఫైవేల షేర్లు, వెంకట్ కి ఇరవై వేల షేర్లూ రావడం తప్పు. నా జడ్జ్ మెంట్ ప్రకారం అమలకి నలభై వేల షేర్లూ, వెంకట్ కి పదివేల షేర్లూ రావాలి. వెంకట్ తనకొచ్చిన ఇవరైవేల షేర్లలో పదివేలు అమలగారికి వెనక్కి వెంఠనే ఇచ్చేలా చూడమని రాస్తున్నాను.”

మొహం మాడిపోయి, బుర్ర తిరిగిన ప్రాసిక్యూటర్ అడిగాడు, “యువరానర్ ఇదెలా లెక్కపెట్టారు?”

“మీ క్లయింట్ ఎంత పెట్టారు పెట్టుబడి?” జడ్జ్ రాబిన్సన్ అడిగాడు చిరునవ్వు నవ్వుతూ.

“అరవై వేలు”

“కంపెనీ ఓనర్ బెనర్జీ గారు ఏం చెప్పారు ఈ పెట్టుబడికి? వెంకట్ పెట్టిన అరవైవేలూ, అమల పెట్టిన తొంభైవేలూ కలిసి నూట యాభై మాత్రమే ఉన్నాయి వాళ్ల దగ్గిర కంపెనీని గట్టెక్కించడానికి. అవునా? ఈ నూట యాభైలోనే వీళ్ల జీతాలూ, కోడ్ రాయడానికి సాఫ్ట్ వేరూ, నెట్ వర్కింగ్ కి కావాలసిన ఎక్విప్ మెంటూ అన్నీ కొనాలి అన్నారని ఒప్పుకుంటారా?”

“ఒప్పుకుంటాం.”

“అంటే ముగ్గురూ నూట యాభైని తలో యాభై చొప్పునా సమానంగా వాడుకున్నట్టేనా?”

“వాడుకున్నట్టే,” మొహం మరింత మాడ్చుకుని చెప్పేడు ప్రాసిక్యూటర్.

“అంటే మీ క్లైంట్ వెంకట్ గారు అరవైవేలు పెట్టి అందులో యాభై తానే వాడుకున్నాడు. అలా మీ క్లయింట్ కంపెనీకి పెట్టిన పెట్టుబడి పదివేలు మాత్రమే. అటు అమల కేసి చూడండి. ఆవిడ తొంభై వేలు పెట్టి యాభై వాడుకుంది అంటే, నలభై వేలు కంపెనీకి పెట్టినట్టు లెక్క కదా?”

“….”

“అందువల్లే వెంకట్ కి రావాల్సింది పదివేల షేర్లు. నేను ముందే అడిగాను సెటిల్ చేసుకుంటారా అని. వద్దని మీరే చెప్పారు. ఇదీ నేను అఫీషియల్ గా ఇచ్చిన జడ్జ్ మెంటు. వెళ్ళిరండి. “

అమల చేతిని డిఫెన్స్ లాయర్ తన చేతిలోకి తీసుకుని సంతోషంగా కుదుపుతూ షేక్ హాండ్ ఇవ్వడం కోర్టులోంచి బయటకి వస్తూ చూసాడు వెంకట్. కడుపు మండిపోయింది కానీ ఇదంతా స్వయంకృతాపరాధం. ఆవిడని మోసం చేద్దామనుకున్నది తానే.

తనకి మరో మిలియన్ డాలర్లు వస్తాయనుకుంటే, ప్రస్తుతం షేర్ విలువ ప్రకారం రెండు మిలియన్లు పోయినందుకు ఏడుస్తూ నల్లగా మాడిపోయిన మొహంతో వెంకట్ అన్నాడు తన లాయర్ తో, “ఇది పై కోర్టులో అపీల్ చేసుకోవచ్చా?”

ఈ కేసుతో పేరు వస్తుందనుకున్న లాయర్ కధ అడ్డం తిరగడంతో ఇంక తనకి ఏమీ ఉపయోగం లేదని తెల్సి చురుగ్గా చూసి ముందుకి కదుల్తూ చెప్పేడు, “నేను హై కోర్టులో ప్రాక్టీస్ చేయను. మీరు మరో లాయర్ని చూసుకోండి.”

000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked