శీర్షికలు

వృద్ధాప్యం

వృద్ధాప్యం వేదన కాదు! ముందు తరాలకు నివేదన!
(వృద్ధుల శారీరక, మానసిక ,సామాజిక పరిస్థితులపై ఒక వ్యాసం)

అమరనాథ్. జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ .
9849545257

మానవ జీవన దశల్లో బాల్యం ,యవ్వనం తర్వాతది వృద్ధాప్యం. సహజంగానే ఈ మూడవ దశలోనే అనేకానేక శారీరక, మానసిక మార్పులకు గురి అవుతుంటుంది ఈ శరీరం. పెరుగుతున్న వయసుతో పాటు తరుగుతున్న శారీరక ధారుడ్యం దానికి తోడుగా దాడికి సిద్ధంగా పొంచివున్న రకరకాల వ్యాధులు, దీంతో సహజంగానే ఏర్పడే మానసిక సమస్యలు. నిజానికి పెరిగే వయస్సు కంటే కూడా తరిగే మానసిక స్థైర్యమే మానసిక సమతూల్యతను దెబ్బతీసి శారీరక, మానసిక సమస్యల తీవ్రతను పెంచుతుంది . సమాజంలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న కొలది దీర్ఘకాలిక సమస్యలు కూడా పెరుగుతుంటాయి. వీటిని ఆత్మస్తైర్యం తో ఎదుర్కొంటూ జీవితాన్ని నిబ్బరంగా సాగించాల్సిందే తప్ప తప్పించుకొనే అవకాశమే లేదు ! దీనికి జీవనశీలి లో మార్పులు చేసుకుంటూ వీటితో కలసి ప్రయాణం చేయాల్సిందే మరి!
శారీరక,మానసిక రుగ్మతలు ముఖ్యంగా ఈ వయస్సులో మధుమేహం, బ్లడ్ ప్రెషర్, గుండెజబ్బులు , ఆస్తమా , శ్వాసకోశ వ్యాధులు కిడ్నీ జబ్బులు మరియు కాన్సర్ రోగాలు కీళ్ల జబ్బులు, నరాల జబ్బులు ఇవన్నీ దీర్ఘకాలికంగా శరీరాన్ని అంటిపెట్టుకునే జబ్బులే వీటితో పాటుగా అనేకానేక మానసిక సమస్యలు. జీవనశైలిలో మార్పు చేర్పులు చేసుకుంటే రోగ నియంత్రణలో కొంతలో కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికై ముఖ్యంగా ఆహారపు అలవాట్లు , అవకాశం మేరకు వ్యాయామం, వేళకు తీసుకోవలసిన మందులు మరియు మానసిక ఒత్తిడికి దూరంగా కొంత ధ్యానం లాటి ప్రక్రియలు అలవాటుగా మారాలి. ఇక్కడ “వ్యాధి కంటే కూడా వ్యాధి వలన కలిగే భయమే” మనిషిని క్రుంగ తీస్తుంది. దీనివలన ఇతర అనేక శారీరక, మానసిక రోగాలకు అవకాశం ఇచ్చినట్లవుతుంది.
ఎమ్టీ నెస్ట్ సిండ్రోమ్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెద్దల్లో పెరుగుతున్న ఒక మానసిక వ్యాకులత Empty Nest Symdrom. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోతే రెక్కలు అలసి సొలసి మూగగా, బేలగా, బాధగా నేటి చాలా కుటుంబాలలో వుండే పెద్దల పరిస్థితి ఇది. ఒక వైపు వయో భారం ఒక వైపు శరీరాన్నిచుట్టు ముట్టే రోగాలు, అలసి సొలసిన వృద్ధ దంపతులకు వారికి వారి మాటే తప్ప కన్న పేగుల దగ్గర లేరనే బేలతనం. మొబైల్ మాటలే తప్ప భరోసాగా తమ ప్రక్కన లేరనే ఆత్మన్యూనతా భావాలు వెరసి మానసిక రుగ్మతలకు లోను కావటం. దాదాపు ఎక్కువగా మధ్య తరగతి , ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లో నిత్యం మనం చూస్తున్న యదార్ధ సంఘటనలు ఇవి! కానీ ఆలోచిస్తే వీటన్నిటికీ ధీటైన సమాధానాలు ఉండనే వున్నాయి.
వృద్దాప్యం అంటే జీవితం అయిపోయి నట్లేనా!? వృద్ధాప్యం అనగానే జీవితం అయిపోయిందనే నిరాశకు గురి అయ్యేవారుంటారు గతంతో జీవితాన్ని పోల్చుకుంటూ నేనేమి చేయలేకపోతున్నాను, నా పెద్దరికం ఎవరికి పనికి రాకుండా పోతోంది, ఇతరులకు భారంగా నా జీవితం అనే ఆత్మన్యూనతా భావనకు కొందరు లోనయ్యేయి అవకాశముంటుంది. కానీ ఒక్క విషయం పెద్దలందరూ గుర్తుచుకోవాలి “జీవితంలో ఒక ప్రత్యక్ష అనుభవం” చదువుకున్నఎన్ని పాఠాలకు కూడా సమానం కాదు. అందుకే అనుభవాల పరిణితితో క్రొత్త జీవితం లోకి అడుగుపెడుతున్నా మనే విషయం పెద్దలు మర్చి పోకూడదు.ఇక్కడ మనం గుర్తెరగాలసింది వృద్ధాప్యం అనేది అనుభవాల పాఠశాలల గని. అంతేకాని ఎటువంటి వ్యాపకం లేకుండా అస్తమానం శరీరానికి సంబంధించిన వ్యాధుల గురించి లేదా చిన్న చిన్న వ్యాధులకే (సైకోసొమాటిక్ Disorders) బెంబేలు పడిపోయే ఆలోచనలకు అడ్డుకట్టగా, క్రొత్త క్రొత్త వ్యాపకాల పెంచుకోవటం ద్వారా జీవన విధానాన్ని మలుచుకోవాలి. అదే సందర్భంలో చిన్న చిన్న రుగ్మతలకు కూడా మందులను ఆశ్రయిస్తే శరీరం మరింత దెబ్బ తినే ప్రమాదం వుంది. అందుకే కాలానుగుణంగా వచ్చిన శారీరక మార్పులు తద్వారా పెరిగిన మానసిక పరిణితుల సమాహారమే ఈ వృద్దాప్య దశ. హుందాగా భావి తరాలకు ఆదర్శంగా, అండగా నిలబడాల్సిన పరిపక్వత కలిగిన దశే ఇది.
సర్దుబాటులోనే సామరస్యత వృద్ధాప్యంలో అతి ముఖ్యమైనది జీవిత భాగస్వాముల మధ్య చక్కటి సర్దుబాటు ధోరణి. చిన్న చిన్న కారణాల తోనే మనస్పర్థలకు తావులేనివిధంగా సంయనంతో జీవనయాత్ర, సాగాలి. సర్దుబాటు లేకపోతె కుంగుబాటే మరి ! ముఖ్యంగా వేగంగా మారుతున్న సామాజిక పరిస్థితులలో చేయవలసిన, చేయకూడని విషయాల పట్ల అవగాహనతో కూడిన విచక్షణ చాలా అవసరం. మారుతున్న విలువలకి మారని మనుషుల మధ్య అంతరాల సంఘర్షణ సహజం గానే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంయమనం పాటించటం అనేది చాలా అవసరం. పిల్లల విషయంలో కూడా అత్యంత జాగరూకత చాలా ముఖ్యం. అనవసర సలహాలు కొన్ని సందర్భాలలో ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయవచ్చు అడగని సలహాల అనర్ధాన్ని గుర్తించి మెలగాలి.
కళ్ళ ముందర జరుగుతున్నకొన్ని వాస్తవాలు ఈనాటి సామాజిక పరిస్థితులలో ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నత కూడా వృద్ధాప్యంలో ఎదుర్కోవాల్సిన సమస్యలకు ఒక సవాలు గానే వుంది! కన్నపిల్లలు కళ్ళముందర లేక విదేశాలలో లేక దూర ప్రాంతాలలో స్థిరపడటం కూడా మానసిక నిర్వేదంలో ఒక భాగమే! అందుకే మానవ విలువలే ‘మనీ’ విలువలనే రీతిగా, వృద్ధాప్యంలో మానసిక సంక్షోభాలను పెంపు చేసే రీతిగా వృద్ధాశ్రమాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. అలాగే జీవిత భాగస్వాములలో ఎవరో ఒకరు దూరం అవటం ఇలా దాదాపుగా వృద్ధాప్యం లో ఇవన్నీ ఎదుర్కొనేవే! దీనికి కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను అర్ధం చేసుకుంటూ మనోనిబ్బరం, మానసిక పరిణితులు పెంచుకోవటమే కాకుండా అవకాశం మేరకు ప్రతి రోజు మనం చేసే వ్యాపకాల్లో మార్పులు చేసుకోవటం అవసరం . దానికి ఏం చేద్దామో కూడా చూద్దాం !
అరవైల్లో కూడా ఇరవైలుగా మారాలంటే!? పెద్ద వయస్సులలో కూడా ఉత్సాహంతో ఉరకలేయాలంటే మనపై మనకు నియంత్రణ అవసరం. ముఖ్యంగా సమయానుకూలం గా తీసుకోవాల్సిన మందులు సక్రమంగా తీసుకుంటూ పోషక విలువలు కలిగిన ఆహారాలు సమతూల్యంగా తీసుకోవటం.
శరీరం సహకరించే మేరకు నడక, యోగా, గార్డెనింగ్ లాంటి వ్యాయామాలు ప్రతి రోజు తప్పనిసరి గా చేయటం.
దైనందిక వ్యాపకాలలో భాగంగా పుస్తక పఠనం, మానసిక ప్రశాంతత కలిగించే చక్కటి మ్యూజిక్ లేదా ఆధ్యాత్మిక ప్రవచనాలు వినే అలవాట్లను పెంచుకోవటం.
నేర్వటానికి వయసు అడ్డు కాదనే విధంగా మ్యూజిక్ నేర్చుకోవటం,ఇష్టత వున్నవారు ఫై చదువులకు ప్రయత్నించటం. ఈ మధ్య కాలం లో పెద్దల్లో చాలా మంది Phd లు చేసే వారిని PG లు చేసే వారిని మరియు ఎన్నో కొత్త కొత్త Courses చేసే వాళ్ళని చూస్తూనే వున్నాము.
అయిన వారితో అవకాశం మేరకు పరస్పర మాటల పంపకం అవకాశాన్ని బట్టి వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నాలు జరపటం.
ముఖ్యంగా విద్యావంతులు పెద్ద పెద్ద పదవుల నుండి రిటైర్ అయినవారు విలువలతో కూడిన తమ తమ అనుభవాలను వ్రాత రూపంలో లేదా ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా నేటి తరం కోసం అందించే ప్రయత్నాలు చేయటం.
ధార్మిక సంస్థల తో అవకాశం మేరకు సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ అవకాశం మేరకు తమ తోటి వారికి సేవలు అందించే ప్రయత్నాలు జరపటం.
సందర్భానికి తగ్గట్టుగా పిల్లలతో, మనుమలు, మనవరాళ్లకు నైతిక విలువల భోధనలు చేసే ప్రయత్నాలు సాగించటం.
వృద్ధాప్యంలో తమ తోటి వయస్కులలో అవసరమనిపించే వారికి తమ అవకాశం మేరకు సహాయ సహకారాలు అందించటం.
సామాజిక సేవకు, ఆధ్యాత్మిక సేవలకు అవసరమైన వ్యాపకాలు పెంచుకోవటం లాంటివి వృద్ధాప్య ఆలోచన లను తగ్గిస్తాయి.
ప్రసార మాధ్యమాల్లో లేదా సోషల్ మీడీయాలలో ఉద్రేకాలను,ఉద్వేగాలను మరియు భయాందోళనలకు గురి చేసే ప్రసారాలకు దూరంగా మెలగటం.
ఫై వ్యాపకాలు పెంచుకుంటే వృద్దాప్యం అనే దానికి చెక్ పెట్టినట్లే అవునా! ఆలోచించండి! ఇక చివరిగా జీవితం లో జీవించటమే ఒక కళ. సమస్యలను నేర్పుగా సంయమనంతో ఎదుర్కోవట మనే సంసిద్ధతే, జీవితాన్ని ఒడిదుడుకులు లేకుండా నడిపిస్తుంది.వృద్ధాప్యం అంటే జీవితం అయిపోవటం కాదు నిజమైన జీవితం ఇక్కడ నుండే ప్రారంభమౌతుంది. అందుకే వృద్దాప్యం అనేది ధర్మా,ధర్మ విచక్షణ, తప్పొప్పుల పరిశీలనా, నేర్చుకున్న అనుభవాల పరిణితి తో ముందు తరాల బాటను సుసంపన్నం చేయగలదనేది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. అందుకే “వృద్ధాప్యం భారం కాదు భావి తరాలకు బాసట , వృద్ధాప్యం వేదన కాదు ముందు తరాలకు నివేదన!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked