-రచన : శ్రీధరరెడ్డి బిల్లా
-తేటగీతులు-
ఉన్నదేదియో ఉన్నట్లు జూపెడితివి .
అద్దమా! నీవెరుగవు అబద్దమంటె!
రంగు లేపనములనద్ది రాసుకుంటె,
ముసిముసిగ నవ్వుకుంటివా మూగసాక్షి ?
స్కూళ్ళు, కాలేజిలకు వెళ్ళు కుర్రవాళ్ళు,
పూసుకొచ్చిన అమ్మాయి ముఖము జూచి
బుర్ర తిరిగి క్రిందపడిరి గిర్రుమంటు!
నిలువుటద్దమా! నిజమేదొ నీకు తెలుసు!
తండ్రి గళ్ళజేబుల నుంచి ధనము తీసి
సుతుడు, ఫ్రెండ్సుతోటి సినిమా జూసి వచ్చి,
పలవరించె హీరోయినందాల దలఁచి!
వెక్కిరించితివా వాని వెఱ్ఱి జూచి?
పెళ్లి కెళ్దామనుచు భర్త వేచియుండ
అద్ద మెదుట కూర్చున్నది అతని భార్య!
ఎంతసేపైన రాదయ్యె; ఏమి మాయ?
అరిచిన మొగుడు సోఫాలొ జారగిల్లె!
పెళ్లి జరుగు సమయమున కెళ్ళ లేక
పెళ్లి జూడకక్షింతలు జల్లకుండ,
“కూడు కోసమా?” యని భర్త కూత లేసె!
పగలబడి నవ్వుచుంటివా మగని జూచి !
పరమ లోభిని కూడా అపార దాత
వనుచు, పొగుడుచుందురు జనుల్, పనుల కొరకు!
దుర్గుణములు మెండుగ నున్న దుష్టుడైన,
పదవిలోన నుంటె పరమ పావనుండె!
కత్తు లెత్తుచూ కుత్తుకల్ కత్తిరించు
హంతకులకు భయపడి, “భయ్యా!” అనెదరు!
విత్తమున్నజాలు నటన వీసమెత్తు
జేయకున్న, ‘సీన్మ హిరో’ను జేయుచుంద్రు!
పదవి కొరకు, డబ్బు కొరకు ,పనుల కొరకు
ఇంద్రునితొ, చంద్రునితొ పోల్చు చుంద్రు జనులు!
“బుస్సు” మనుచు ఉబ్బింతురు బుడగ లాగ!
పొగిడినపుడు లొంగక పొంగి పోనిదెవడు?
“అద్దమా!” నీకసలు స్వార్థ బుద్ధిలేదు!
పొగుడుకుంటు ఒకని మెప్పు పొందవెపుడు!
నీ ఎదుట మానవుడొకడు నిలుచొనుంటె,
నిజముఁ వానికి తెలిపేది నీవొకతివె !
వాడు కోపముతో నిన్ను పగుల గొట్టి
ముక్క ముక్కలు జేసినా, వక్కలైన
నీ ప్రతీముక్క జెప్పేది నిజమె తప్ప
అద్దమా! అబద్ధమెపుడు ఆడబోవు!