-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు
పాదాలక్రింద మంటలు,వెన్నులోవణుకు,
గుండెలోగుబులు,మనసులోదిగులు,
ముందునుయ్యి,వెనుకగొయ్యి,
మాట్లాడితేముప్పు,మౌనంగాఉంటే తప్పు,
కన్నుమూస్తే కంగారెత్తించే కలలు,
కన్నుతెరిస్తే ఆక్రమించుకొనే ఆశలవలలు.
ఇలాంటి పరిస్థితుల్లో పలాయనం పనిచెయ్యదని,
డోలాయమానం దారిచూపదని అర్ధమౌతోంది.
వెనుకడుగు వేస్తే వెక్కిరింతలు వినిపిస్తున్నాయి,
ముందడుగు వేస్తె మోచిప్పలు పగులుతున్నాయి,
కుదురుగా నిలబడదామంటే కాళ్ళక్రింద మంటలు దహిస్తునాయి.
ప్రారబ్ధం ప్రకోపిస్తోంది,ప్రాయోపవేశాన్ని ప్రబోధిస్తోంది.
కర్మలు కర్కశంగా శపిస్తున్నాయి,
ఆలోచనలు ఉపశమనాన్ని జపిస్తునాయి,
ఆశలు ఆలంబనకోసం తపిస్తున్నాయి,
బ్రతుకును అర్ధం ప్రశ్నిస్తోంది.
కలతలు స్పర్శిస్తునాయి,నలతలు వర్షిస్తునాయి.
పరిచయస్తులు పరారయ్యారు,
ఆప్తులనుకున్నవాళ్ళు ఆదమరిచి ఉన్నారు,
అయినవాళ్ళు అయోమయంగా చూస్తున్నారు,
కానివాళ్ళు కుళ్ళబొడవడానికి సిద్ధంగాఉన్నారు.
నన్ను కన్నవాళ్ళు తెరమరుగయ్యారు,
నేను కన్నవాళ్ళు కనుమరుగయ్యారు,
అర్ధాంగి కొన్నాళ్ళు వాదించింది,వేధించింది,
మరికొన్నాళ్ళు శోధించింది,సాధించింది,
చివరివరకు అరుణించింది,చివరికి కరుణించింది,
భాధ్యతంటే బాధలే అన్నసత్యాన్నిబోధించింది,
తన బెట్టు సంధించింది,నాపై పట్టు సాధించింది.
మనవళ్లు,మనవరాళ్ళు
కొంతవరకూ నా ముద్దుముచ్చట్లను పొందారు,
ఆతరువాత వాళ్ళు రాళ్ళయ్యారు,
పచ్చదనం లోపించిన బీళ్లయ్యారు,
నీముద్దు మాకొద్దు పొమ్మన్నారు.
ఆకలెరిగి అన్నంపెట్టే అమ్మ దూరమయ్యింది,
కీలెరిగి వాతలు పెట్టే భార్యే తీరమయ్యింది,
ప్రతి చిన్నవిషయానికి కూడా తపించే ఈబ్రతుకు భారమయ్యింది,
అనుక్షణం జపించే శాంతి దూరమయ్యింది,
కన్నీళ్ళు చెరువయ్యింది,కాంతి కరువయ్యింది