–పారనంది శాంత కుమారి.
వారానికి రెండురోజులు శలవులొచ్చినా
ఐదు రోజులు పనిచేయాల్సి వస్తోందని
(బద్ధకస్త)ఉద్యోగస్తులకు అసంతృప్తి.
ప్రారంభంలో తక్కువగా ఉన్నజీతం
ఇప్పుడు ఎక్కువే అయినప్పటికీ
(పేరాశాపరులైన)సాఫ్ట్ వేర్లకు అసంతృప్తి.
ఇంటిలోఉంటూ పనుల్లో
ఇంతోఅంతో సాయంచేసే కోడలును చూసి
కొడుకుతోపాటు ఆమెకూడా సంపాదిస్తేబాగుణ్ణు కదా
అని (దురాశా పరురాలైన)ఈ అత్తగారికి అసంతృప్తి.
ఉద్యోగంచేస్తున్న కోడలోస్తే
ఇంటిపనిలో సాయంచేయటం లేదని
అన్నిపనులూ తనే చేసుకోవాల్సివస్తోందని
ఆ (నిరాశా పరురాలైన)అత్తగారికి అసంతృప్తి.
కూతుర్నిఎక్కువగా తమవద్దకు పంపటంలేదని
ఆ (అత్యాశా పరుడైన)వియ్యంకుడికి అసంతృప్తి.
కోడలు తరుచూ తనపుట్టింటికి వెళ్తోందని
ఈ (ద్వేష పూరితుడైన)మామగారికి అసంతృప్తి.
తమ కూతురుకొంగుకు అల్లుడు ముడివేయబడటం లేదని
ఆ (స్వార్ధపరురాలైన)అత్తగారికి అసంతృప్తి.
కోడలు తనకొడుకును కుక్కనుచేసి ఆడిస్తోందని
ఈ(అసుయాపరురాలైన)అత్తగారికి అసంతృప్తి.
తమ భర్తలతో తాము స్వేచ్చగా తిరుగకుండా
అడ్డుగా అత్తమామలున్నారని
(తిరుగుబోతుతనం అలవాటైన)కోడళ్ళకు అసంతృప్తి.
తమ భార్యలను సంతోషపెట్టలేక పోతున్నామని
అజ్ఞానమనేసంపదను అనంతంగా కలిగిఉన్న
ఈ(కుర్ర,వెర్రి)భర్తలకు అసంతృప్తి.
అల్లుడు తన కుటుంభసభ్యులతో కలిస్తుంటే
భరించలేక ఆ(అజ్ఞానులైన) అత్తామామలకు అసంతృప్తి.
కొడుకు తన భార్యతరఫు వారితో ఎక్కువగా కలుస్తుంటే
సహించలేక ఈ(మందజ్ఞానులైన) తల్లితండ్రులకు అసంతృప్తి.
ఎదుటివారి పిల్లలు వారిపెద్దలతో కలిసుంటే
తమపిల్లలు తమతో కలిసిఉండలేదని పక్కవారికి అసంతృప్తి.