ఆచరణలు అలవాటుగా మారితే !
బాల్యం నుండే మనం అనేక విషయాలను తెలుసుకుంటూ వుంటాము. తెలుసుకున్న చాలా విషయాలలో అనేక విషయాలను ఆచరణకు దగ్గరా తీసుకురాక పోవటం చేత జీవితంలోని చాలా సందర్భాలలో మనం ఎదగవలసిన స్థాయికి ఎదగ లేక చతిగిల పడిపోతూ ఉంటాము. దానికి ప్రధానకారణం తెలుసుకునే ఏ విషయం పై నైనా మనకు ప్రత్యేకమైన శ్రద్ధ ,ఇష్టత అనురక్తి లేకపోవటం,ఏకాగ్రత లోపించటమే ప్రధాన కారణాలు. అందుకే జీవితానికి అవసరమైన విషయాలలు సరియైన సందర్భాలలో నేర్చుకోలేక ,ఏదో నేర్చుకున్న బలంగా మనస్సులో నిక్షిప్తం కాక అవసర సమయాలలో అవకాశాలు అందుకోలేక మానసిక వేదన అనుభవిస్తుంటారు. అందుకే ఇటువంటి సందర్భాలలోనే పెద్దలంటారు మంచిని అంటించుకొని చెడును వదిలించుకోవాలని.
ముఖ్యంగా నేటి విద్యా విధానాలలో మంచి విషయాలను నేర్చుకొనే దశలో ఆచరణ అలవాటుగా మార్చుకోవటం అటుంచి అసలు నేర్చుకోవటమే ఏదో యాంత్రికంగా నాలుగు మార్కుల కోసమన్నట్లుగా నేర్చుకుంటూ పొందవలసిన సంపూర్ణ జ్ఞానాన్ని పొందలేక భవిష్యత్ లో తమ కాళ్ళ మీద తాము నిలబడాల్సిన రోజున అనేక ఇబ్బందులకు గురి అవుతుంటారు.ఇది వాస్తవం కూడా ఎందుకంటె ఈ అన్యమనస్క జ్ఞానంలో ఎదగవలసిన స్థాయిలో ఎదగలేక అందుకోవాల్సిన అవకాశాలు అందుకోలేక నేటి యువత ఉద్విగ్నభరితమైన పరిణామాలు ఎదుర్కొంటోంది! సామాజిక పరిణామాలకు తగ్గట్టుగా జీవన విధానాలలో మార్పు చేర్పులు సహజమే కానీ అవి నేర్చుకోవాల్సిన విషయాల ఆచరణలకు వాటి అమలుకు మినహాయింపులుగా ఉండరాదు. ఎందుకంటె భవిష్యత్ లో ఎన్నెన్నో విషయాలను నేర్చుకొని జీవిత లక్ష్యాలను సాధించటానికి అవి అవరోధంగా మారతాయి కనుక!
మన బాల్య దశ నుండే ఆహార,విహార విషయాలకు సంబందించిన అనేకానేక విషయాలను కుటుంబపరంగా నేర్చుకొని నిత్యజీవితంలో ఆచరణ ద్వారా అలవాటుగా మార్చుకున్నవి మన కళ్ళ ముందున్న ప్రత్యక్ష ఉదాహరణలే! అదే విధంగా పెరుగుతున్న వయస్సుకు తగ్గట్టుగా విద్యాపరమైన, వృత్తిపరమైన లేదా సామాజిక పరమైన అంశాలను క్రమశిక్షణతో నిత్యాచరణలో అలవాటుగా చేసుకొని అమలు చేయవలసిన బాధ్యత మన పైనే ఉంటుంది ! ఎందుకంటె చదువుల్లో కానీ ,ఉద్యోగ ఇంటర్వ్యూల్లో కానీ పదకొండవ గంటలో చేసే ప్రయత్నం చేదు ఫలితాలను అందిస్తుంది కనుక! అందుకే ఏ మంచినైనా ఒక ప్రణాళికా బద్ధంగా నిత్యాచరణలో అలవాటుగా మార్చగలగాలి. ఉదాహరణకు సామాజిక జ్ఞానం ఒక్క రోజులో అవపోసన పట్టలేము అందుకే ప్రతిరోజు ఖచ్చితంగా కొంత సమయాన్ని దినపత్రిక చదవటానికి అలవాటు చేసికోవటం లేదా ఏవైనా మంచి పుస్తకాలు చదవటానికి అలవాటు పడటం లాంటివి. కావచ్చు. దీనివలన భవిష్యత్లో మనం ఎదుర్కొనబోయే ఎన్నెన్నో సమస్యలకు దీటైన సమాధానాలు దొరకటమే కాదు మానసికంగా కూడా మనలో హేతుబద్దమైన ఆలోచనా విధానాలకు ఆత్మవిశ్వాసాలకు ఆలంబనగా నిలుస్తాయనటానికి ఇంతకన్నా రుజువులు ఇంకేంకావాలి! ఇవి మనం చేసే సెల్ ఫోన్ మాటల కన్నా ,చాటింగ్స్ కన్నా, పెద్దగా అవసరంలేని, అవసరంకాని సోషల్ మాధ్యమాల కన్నా కూడా ముఖ్యంముకాదా? ఇలా మంచి విషయాలను అలవర్చుకుని ఆచరణ లో నిత్య సాధన చేస్తే మన ఈనాటి యువత భవిష్య్తత్ బంగారు బాటే కాదా!
అందుకే జీవితంలో వ్యక్తుల సామర్ధ్యాలు ,నిపుణతలు ఏవైనా కూడా అచరణకే ఆలంబనగా నిలుస్తాయి. ఈ ఆచరణే తాము సాధించాల్సిన జీవనగమానానికి సంబందించిన చక్కని ప్రణాళికా బద్దమైన అలవాటుగా మారితే చేరవలసిన గమ్యాలు ,సాధించాల్సిన విజయాలు మనం ఊహించిన దానికంటే కూడా వున్నత శిఖరాలకు మనల్ని చేరుస్తాయి. అంతేకాదు తదుపరి గా చేసే ఏ పనైనా కూడా ఈ క్రమశిక్షణతో కూడిన ఆచరణే పునాదిగా నిలిచి మరెన్నో విజయాలకు తార్కాణంగా నిలుస్తుంది. ఇదే సందర్భంలో నేటి విద్యా విధానాల పరిస్థితి నానాటికి దిగజారే ధోరణులకు గురి అవుతోంది. పేరు కు ప్రోగ్రెస్ సర్టిఫికెట్ నిండా మార్కులే, వున్నత గ్రేడింగ్సే కానీ వాస్తవంలో ఉద్యోగ బరి లో ఇవన్నీ సూర్యుని ముందు దివిటీలు లాగా వెల వెల పోతూ సబ్జెక్టు జ్ఞానం ,సామాజిక జ్ఞానం లేక భీరువులుగా వెనుదిరగాల్సి పరిస్థితుల్లోకి యువత నెట్టబడుతోంది.
జీవితంలో సామర్ధ్యాలు ,నైపుణ్యాలు ఏవైనా ఒక్క రోజులో నేర్చుకునేవి కావు మనం ఏ రంగాలలో పనిచేస్తున్నా కూడా ఆయా రంగాలలో ఎప్పటికప్పుడు మన మేధస్సుకు పదును పెట్టుకోవటానికి నిత్యాచారణ అనేది మన సంకల్ప బలంగా ఉండాలి దానికై చదువుల్లో నైనా ,వృత్తుల్ల్లోనైనా లేదా ఉద్యోగ బరులలో నైనా లేదా ఏ ఇతర రంగాలలో నైనా సరే వాటికి కావాల్సిన నైపుణ్యాలకు పదును పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
⦁ ఏ ఆచరణ యైనా ప్రణాళికా బద్దంగా కొనసాగాలి కానీ మొక్కుబడి ప్రయత్నాలు గా ఉండరాదు.
⦁ ప్రతి ప్రయత్నంలో మన ఆచరణ అనేది ఏకాగ్రతతో మరియు అకుంఠిత దీక్షతో కొనసాగాలి.
⦁ ఏ ప్రయత్నఆచరణలలో నైనా అనవసర మార్పు చేర్పులు, కాలయాపనలు లేకుండా చూసుకోవాలి.
⦁ చేసే ఏపని నైనా అనవసర వాయిదాలు వేయని విధంగా కొనసాగించాలి
అందుకే ప్రధానంగా జీవితంలో ఏ విజయాన్ని సొంతం చేసుకోవాలన్నావీడని ప్రయత్నంగా,ఆచరణే ఆలంబనగా కొనసాగితే వేసే ప్రతి అడుగు విజయం దిశగా పడుతుందనటం లో సందేహం ఏముంది అవునంటారా!
అమరనాధ్ .జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9849545257