-Sahitya Academy Awardee P. Sathyavathy
ఒక లింగమార్పిడి యొక్క ఆత్మకథ – తమిళ పుస్తకాన్ని అనువదించినందుకు ఆంధ్రప్రదేశ్ పి సత్యవతి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.సత్యవతి కథల్లో అనసవరమైన పాత్రలు, సంఘటనలు, వర్ణనలు వుండవు. శైలీ వ్యామోహంగానీ, వర్ణనా చాలప్యం గానీ ఆమెకు లేవు. ఒకటి రెండు చోట్ల తళుక్కుమన్నా అది హద్దులు దాటలేదు. సత్యవతి శైలిలో భావం (సెన్స్), భావోద్రేకం (ఫీలింగ్), కంఠస్వరం (టోన్), ఉద్దేశం (ఇన్‌టెన్షన్) స్పష్టంగా వుండవలసిన మోతాదులో వుంటాయి. అందులో కవిత్వం బరువుకాని, భాష బరువుకాని, వాక్య నిర్మాణపు బరువుకాని వుండవు.
సత్యవతి కథలు ‘నిశ్చల నిశ్చితాలను’ ఆదర్శీకరించవు. కుహనా ఆదర్శాలాను ప్రతిపాదించవు. సమాజ పరిణామశీలతను తిరస్కరించవు. జీవిత సమస్యను పరిణామం నుంచి వేరు చేసి చూడవు. స్త్రీ కళ్ళలోకి చూడగల సాహసంలేక మనం తప్పించుకు తిరుగుతున్న ప్రశ్నల్ని ఈ కథలు మనం నడుస్తున్న బాటలో నాటుతాయి.