-G.S.S.కళ్యాణి.
అది భారతదేశంలో ఒక ప్రపంచ ప్రఖ్యాత బహుళజాతి సంస్థ. అక్కడ వివిధ స్థాయిల్లో ఉద్యోగులను నియమించేందుకుగానూ ముఖాముఖి సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశానికి హాజరు కావడానికి వచ్చిన అభ్యర్థులు, అక్కడ వరుసగా వేసిన కుర్చీల్లో కూర్చుని తమ వంతు కోసం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. వారిలో కొత్తగా డిగ్రీ చదువు పూర్తి చేసి, ఉద్యోగాల వేటలో ఉన్న మారుతి కూడా ఉన్నాడు. తన చదువుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను చేతిలో పట్టుకుని, అక్కడి పరిసరాలను గమనిస్తున్న మారుతికి తన భవిష్యత్తు పై ఇంతకుముందెన్నడూ కలగని ఆశలు కొన్ని కలుగుతున్నాయి!
‘నాకు ఈ సంస్థలో ఉద్యోగం వస్తే నా అంత అదృష్టవంతుడు మరొకడు ఉండడు!! నా చదువుకోసం చేసిన అప్పులన్నీ తీర్చెయ్యగలుగుతాను! నాన్న చేత కూలీపని మాన్పించేసి, అమ్మనూ, నాన్ననూ బాగా చూసుకోగలుగుతాను! డబ్బుల కోసం ఇంకెప్పుడూ ఇబ్బంది పడకుండా హాయిగా జీవితంలో స్థిరపడిపోతాను!’, అని అనుకున్నాడు మారుతి.
అంతలో మారుతికి తన పక్కనున్నవారు గుసగుసమని ఆంగ్లభాషలో చెప్పుకుంటున్న కబుర్లు వినపడ్డాయి.
‘నాది అత్యాశేమో!! ఈ సంస్థలో ఉద్యోగం సంపాదించడానికి కావలసిన విద్యార్హతలు నాకు ఉన్నప్పటికీ నేను చదువుకున్నది తెలుగు మాధ్యమంలో కావడంవల్ల నాకు ఆంగ్లభాషపై మిగతావారికున్నంత పట్టు లేదు! అసలు నేనీ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టనని అమ్మకు చెప్పాను! అందుకు అమ్మ ఒప్పుకోకుండా నేను ప్రయత్నం చేసి తీరాలంటూ నన్ను బలవంతం చేసింది!! తెలుగు భాషలో నాకున్న జ్ఞానం నాకు ఉపకారమే చేస్తుంది తప్ప అపకారం చెయ్యదని అమ్మకు గట్టి నమ్మకం! నా చిన్నప్పుడు ఒకసారి తెలుగు భాష ఎందుకూ పనికిరాదని నేను అమ్మతో అన్నందుకు అమ్మకు ఎంత కోపమొచ్చిందో నాకిప్పటికీ గుర్తే! తెలుగుభాష అత్యంత అమూల్యమైనదనీ, మాతృభాషను గౌరవించనివాళ్ళు ఎక్కడా నెగ్గలేరనీ, మన తెలుగుభాషలో ఉన్న తియ్యదనం ఇతర భాషలలో వెతికినా కనపడదనీ అమ్మ ఎప్పుడూ నాకు చెప్తూ ఉంటుందిగా! ఈ ఉద్యోగం సాధించాలంటే నాకు ఆంగ్లభాష అనర్గళంగా వచ్చి ఉండాలని నేను గత రెండు వారాలుగా పడిన తపన అంతా ఇంతా కాదు! లెక్కలేనన్ని హాలీవుడ్ సినిమాలు చూశాను! ఆంగ్లభాషలోని దినపత్రికలు ప్రతిరోజూ చదివాను! అందరితో ఆంగ్లభాషలోనే మాట్లాడుతూ తెలుగుభాష నాదికాదన్న ధోరణిని అలవాటు చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నించాను! అయినా నాకు లోలోపల భయం, బెరుకూ కలిగి నా వెన్నులో ఇలా వణుకు పుడుతోందేమిటీ?? అమ్మ చెప్పినట్లు ఇక ఆ కనకదుర్గమ్మ తల్లే నన్ను కాపాడాలి!!’, అని అనుకుంటూ మారుతి తనకు కలుగుతున్న ఒత్తిడిని అధిగమించడానికి ఒక్క క్షణం కళ్ళుమూసుకున్నాడు.
అంతలో ఆ సంస్థలో పని చేస్తున్న విజయ అనే ఒక యువతి మారుతి వద్దకు వచ్చి, “మీరు మారుతి గారు కదా?! నాతో రండి!!”, అంటూ మారుతిని వేరే గదిలోకి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టింది.
ఆ గదిలో ఇంకెవ్వరూ లేకపోవడంతో మారుతి మనసు పరిపరి విధాలా వెళ్ళింది. అతడిని సున్నితంగా ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పేందుకే అలా విడిగా కూర్చోబెట్టి ఉంటారని అనుకున్నాడు మారుతి.
కొద్దిసేపటి తర్వాత విజయ తన లాప్-టాప్ తీసుకుని మారుతి వద్దకు వచ్చి, “మీతో మా సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ సీతారాం గారు అమెరికానుండీ మాట్లాడతారట!”, అంటూ లాప్-టాప్ ను మారుతి ముందు పెట్టింది.
మారుతికి ముచ్చెమటలు పట్టాయి!
‘అంత పెద్దాయన నాతో మాట్లాడటమేమిటీ?! నేను ఎవరని అనుకుంటున్నారో ఏమో!!’, అని కంగారు పడిపోయాడు మారుతి.
అతడి గొంతు భయంతో ఎండిపోవడంతో తన పక్కనే ఉన్న నీళ్ల గ్లాసును అందుకుని కొన్ని నీళ్లు గటగటా తాగేసి, “సార్! నమస్కారమండీ!”, అని ‘అయ్యో! ఆంగ్లభాషలో గుడ్-మార్నింగ్ చెప్పాలి కదా!’, అని నాలిక్కరుచుకున్నాడు మారుతి.
మారుతి తనతో తెలుగులో మాట్లాడినందుకు సీతారాం కోపగించుకోలేదు సరికదా, “నమస్కారం మారుతీ!”, అంటూ చిరునవ్వుతో మారుతిని అచ్చమైన తెలుగుభాషలోనే పలకరించాడు.
“సార్! నన్ను క్షమించండి! ఈ ఉద్యోగానికి నేను పనికిరానని చెప్పినా మా అమ్మ దరఖాస్తు పంపమంటూ నన్ను బలవంతం చేసింది! నాకు ఆంగ్లభాష అర్ధమవుతుందిగానీ అంత బాగా మాట్లాడలేను! దయచేసి నాపై కోపగించుకోకండి సార్!”, అన్నాడు మారుతి.
అందుకు సీతారాం నవ్వి, “ఉండవయ్యా! నాకు కావలసింది నీలాంటి వాడే! తెలుగు భాషపై పట్టు ఉండి, ఆంగ్లభాషను అర్ధం చేసుకోగలిగే వాడి కోసమే నేను గత కొంత కాలంగా వెతుకుతున్నాను!”, అన్నాడు.
మారుతి అర్ధంకానట్లు ముఖం పెట్టి, “సార్! మీరు అమెరికాలోనే పుట్టి అక్కడే పెరిగారని విన్నాను! మీకు తెలుగు భాష ఇంత బాగా రావడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది!”, అన్నాడు.
“అవునయ్యా! నిజమే! నేను అమెరికాలోనే పుట్టి పెరిగాను. చాలా సంవత్సరాల క్రితం మా అమ్ముమ్మ, నాన్నమ్మల కాలంలోనే మా వాళ్ళంతా భారతదేశంనుండీ అమెరికాకు వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. అయితే మా అమ్ముమ్మ మాతృభాష తెలుగు. తెలుగుభాషలోని కమ్మదనం గుర్తించిన మా అమ్మ మా అమ్ముమ్మనుండీ ఆ భాషను నేర్చుకుని నాకు నేర్పింది! తెలుగుభాష గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఒక కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాను. అందుకు సంబంధించిన బాధ్యతలను అప్పజెప్పడానికి నీలాంటి యువకుడికోసం కొద్దిరోజులుగా చూస్తున్నాను! నీ ప్రవర్తన, తెలివితేటలూ అన్నీ నా అంచనాలకు తగ్గట్టుగా ఉన్నాయి! మరి నీకు మా సంస్థలో పనిచేయటం సమ్మతమేనా?”, అని అడిగాడు సీతారాం.
మారుతి తన చెవులను తానే నమ్మలేకపోయాడు!
“సార్! మీ సంస్థలో పనిచేయటం నా అదృష్టంగా భావిస్తాను!”,అన్నాడు మారుతి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ.
“సరే మారుతీ! ఇవాళే నువ్వు సంతకం పెట్టవలసిన పత్రాలను సిద్ధం చెయ్యమని మా వాళ్లకి చెబుతాను! జీతంవంటి ఇతర విషయాలు వాళ్ళు నీకు చెప్తారు. సంతకం పెట్టి వెంటనే ఉద్యోగంలో చేరిపో!”, అన్నాడు సీతారాం.
కొద్దిసేపట్లో ఉద్యోగానికి సంబంధించిన వివరాలున్న పత్రాలు తీసుకొచ్చి మారుతికి ఇచ్చింది విజయ.
అవి చదివిన మారుతి, ‘తెలుగుభాష తెలిసినందుకు నాకు ఇంత పెద్ద జీతం ఇస్తున్నారా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను!!’, అని అనుకుంటూ ఆ పత్రాలపై సంతకాలు పెట్టి, మిఠాయి కొనుక్కుని ఇంటికి వెళ్లి, తనకు ఉద్యోగం వచ్చేసిందన్న శుభవార్తను తన తల్లి అలివేలుకి చెప్పాడు.
అప్పుడు అలివేలు, “చూశావా నాయనా! తెలుగుభాష వ్యర్థమని అనుకున్నావు! అది మనకు అమ్మ భాషరా! నీకు అవసరమైనప్పుడు ఆ అమ్మ భాషే నిన్ను ఆదుకుంది! ఇక ఉద్యోగంలో నీ కర్తవ్యాన్ని వంచన లేకుండా చేసి, మన తెలుగుభాష ఖ్యాతిని జగమంతా చాటు!!”, అంది.
“అలాగేనమ్మా!”, అంటూ తన తల్లిని సంతోషంగా కౌగలించుకున్నాడు మారుతి!
*****