కథా భారతి

ఆనంద దీపావళి

-G.S.S.కళ్యాణి.

“ధనత్రయోదశినాడు నీకు మాహాలక్ష్మిలాంటి ఆడపిల్ల పుట్టింది!”, అంటూ మహేశ్వరి చేతిలో అప్పుడే పుట్టిన పాపాయిని పెట్టింది ఆమె తల్లి స్వరాజ్యం.

పాపాయిని మహేశ్వరి ముద్దాడుతూ ఉంటే పక్కనే నిలబడి, “అమ్మా! చెల్లి ఎంత ముద్దుగా ఉందో!”, అన్నాడు కిట్టూ.

“ఇదిగోరా కిట్టూ! నువ్వు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న నీ చెల్లి!”, అంటూ పాపాయిని కిట్టూ ఒళ్ళో పెట్టింది మహేశ్వరి.

తన చిట్టి చెల్లిని ఎత్తుకుని మురిసిపోయాడు కిట్టు.

“అమ్మా! చెల్లి పేరు చిట్టి!!”, మహేశ్వరితో అన్నాడు కిట్టు ఉత్సాహంగా.

“సరేరా! నీ చెల్లిని నీకు ఎలాకావాలంటే అలా పిలుచుకో!”, అంటూ కిట్టూని ముద్దు పెట్టుకుంది మహేశ్వరి.

అప్పటినుండీ చిట్టి కిట్టూకి ప్రాణమైపోయింది. కిట్టూ ఏ ఆట ఆడుతున్నా చిట్టిని ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు. చిట్టి ఎప్పుడైనా కిట్టు చేసిన పనిని చూసి నవ్వుతూ కేరింతలు కొడితే కిట్టూ తెగ సంతోషపడిపోయేవాడు.

కొంత కాలం గడిచింది. చిట్టికి నాలుగేళ్లు వచ్చాయి. కిట్టూ పన్నెండేళ్ల వాడయ్యాడు.

ఒక రోజు చిట్టి ఇంటి వరండాలో ఆడుకుంటూ ఉంటే ఒక పిట్ట అక్కడికి వచ్చి, ఎక్కడినుండో ముక్కుతో ఏరుకొచ్చిన పుల్లలతో ఆ వరండా పక్కనున్న చెట్టు కొమ్మల్లో గూడు కట్టడం ప్రారంభించింది. చిట్టికి ఆ పిట్ట చేస్తున్న పని ఆశ్చర్యం కలిగించింది. వెంటనే కిట్టూని పిలిచి ఆ పిట్టను చూపించింది. అప్పుడు కిట్టూ పిట్టలు అలా గూడు కట్టుకుని అందులో గుడ్లు పెడతాయని, వాటినుండీ బుల్లి బుల్లి పిట్టలు పుడతాయని చిట్టికి చెప్పాడు. వెంటనే చిట్టి ఇంట్లోకి వెళ్లి తన ఆటవస్తువులలో ఉన్న రెండు చిన్న గిన్నెలు తీసుకుని, ఒకదాంట్లో పక్షులు తినే పప్పు, ఇంకొక దాంట్లో కొద్దిగా నీళ్లు తీసుకు వచ్చి, పిట్ట గూడు కట్టుకుంటున్న చెట్టు మొదట్లో పెట్టింది. చిట్టికి పిట్టంటే ఎంత ఇష్టమో కిట్టూకి అర్ధమైపోయింది. అప్పటినుండీ చిట్టి, కిట్టూలిద్దరూ ప్రతి రోజూ ఆ పిట్టకు ఆహారం పెట్టడం అలవాటు చేసుకున్నారు. కొద్దిరోజుల్లో ఆ పిట్ట తన గూట్లో నాలుగు గుడ్లు పెట్టింది. చిట్టి ఆనందానికి అవధులు లేవు! సంతోషంతో గెంతులు వేసింది చిట్టి. చిట్టికి అంత ఆనందం కలిగిస్తున్న పిట్ట కిట్టూకి కూడా నచ్చింది. పిట్ట గుడ్లు ఎప్పుడు పిల్లలవుతాయా అని కిట్టు, చిట్టిలు వేచి చూడటం మొదలుపెట్టారు.

ఇలా ఉండగా ఆ యేటి ధనత్రయోదశి వచ్చింది. చిట్టికి బంధుమిత్రులందరూ ఫోన్లు చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కానీ చిట్టి మాత్రం ఏదో విషయంలో పేచీ పెట్టి రోజంతా ఏడుస్తూనే ఉంది. కిట్టూకి ఆ విషయం బాధ కలిగించింది.

మర్నాడు నరకచతుర్దశి. మహేశ్వరి కిట్టూకి నువ్వులనూనె పెట్టి తలంటుతూ ఉంటే, “అమ్మా! ఇప్పుడు నేను నాన్నతో బజారుకెళ్లి బోలెడన్ని టపాసులు కొనుక్కుంటా! రంగురంగుల మెరుపులొచ్చేవీ, చాలా పెద్ద శబ్దం చేసేవీ పట్టుకొచ్చి పేలుస్తా! చిట్టి కళ్ళల్లో ఆనందం చూడాలని ఉంది!”, అన్నాడు కిట్టు.

“మరీ పెద్ద చప్పుడు చేసేవి వద్దులేరా కిట్టూ! ఆ శబ్దం భరించడం కష్టం!”, అంది మహేశ్వరి.

“పెద్ద శబ్దం చేసే టపాసులు చిట్టి ఇంతవరకు ఎప్పుడూ చూసి ఉండదు. నేను చిట్టికి అవి ఎలాగైనా చూపించాలి! అవి చూసి చిట్టి నవ్వితే చూడాలని ఉందమ్మా!”, అన్నాడు కిట్టూ.

అంత చిన్న వయసులో చెల్లిని సంతోషపెట్టాలని కిట్టూ పడుతున్న తపనను చూసి మహేశ్వరి ఆశ్చర్యపోయింది.

కిట్టూ కోరికకు ఇక అడ్డు చెప్పలేక, “సరే! నీ ఇష్టం రా!”, అని టపాసులు కొనుక్కునేందుకు తన అనుమతిని ఇచ్చేసింది మహేశ్వరి.

కిట్టు తన తండ్రితో కలిసి బజారుకెళ్లి టపాసులు కొని తెచ్చుకున్నాడు.

మరుసటి రోజు దీపావళి పండుగ. ఆ రోజు సాయంత్రం మహేశ్వరి దీపాలు వెలిగించి, ఇంటి చుట్టూ ముగ్గులు వేసి, వాటిలో ఆ దీపాలను అందంగా అలంకరించి, కిట్టూని, చిట్టిని టపాసులు కాల్చమని చెప్పింది. అప్పటికి కిట్టూ దగ్గరి బంధువులంతా పండుగను అందరితో కలిసి జరుపుకోవాలని కిట్టూ వాళ్ళింటికి వచ్చి ఉన్నారు.

కిట్టూ మొదటగా తను తెచ్చిన మతాబులు, చిచ్చు బుడ్లు, భూ చక్రాలు కాల్చాడు. చిట్టి తన తల్లి ఒళ్ళో కూర్చుని అప్పుడప్పుడూ మహేశ్వరి చెయ్యి పట్టుకుని కాకరపువ్వొత్తులు కాలుస్తూ కిట్టూ వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంది.

అంతలో కిట్టూ ఒక పెద్ద టపాకాయ పట్టుకొచ్చి,” చిట్టి! ఈ టపాకాయ్ పెద్ద శబ్దం చేస్తుంది! వినడానికి నువ్వు సిద్ధమేనా?”, అని చిట్టిని అడిగాడు.

చిట్టి కొంచెం బెదురుగా చూస్తూ తన రెండు చిట్టి చేతుల్తో చెవులను గట్టిగా మూసుకుంది. కిట్టు చిట్టి వంక ముసి ముసి నవ్వులు నవ్వుతూ చూస్తూ తన చేతిలో ఉన్న టపాకాయను జాగ్రత్తగా వెలిగించాడు.

క్షణకాలంలో ఆ టపాకాయ ఇల్లు దద్దరిల్లేటంత పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. ఆ చప్పుడుకు అక్కడున్న వారంతా కళ్ళు, చెవులు గట్టిగా మూసేసుకున్నారు. ఆ టపాకాయ అంత శబ్దం చేస్తుందని కిట్టు కూడా ఊహించలేదు! కళ్ళు తెరుస్తూనే కిట్టు చిట్టి వంక చూశాడు. అప్పటివరకూ తల్లి ఒళ్ళో దూరిపోయి కూర్చున్న చిట్టి చటుక్కున కిందకు దిగి పిట్ట గూడు ఉన్న చెట్టు వద్దకు వెళ్ళింది.

“ఏమైంది చిట్టీ?”, అంటూ చిట్టి వద్దకు పరిగెత్తాడు కిట్టూ.

అక్కడ చెట్టు మొదట్లో అప్పుడే పుట్టిన రెండు బుజ్జి పిట్టలు పడి ఉన్నాయి. అది చూసిన చిట్టి గుక్క పట్టి ఏడవటం మొదలు పెట్టింది.

మహేశ్వరి పరుగున అక్కడకు వచ్చి, “అయ్యో! చూడరా కిట్టూ! పెద్ద శబ్దం చేసే టపాకాయలు అందుకే కొనద్దని చెప్పాను! పాపం! ఈ పక్షి పిల్లలు ఆ శబ్దానికి బెదిరి గూట్లోంచీ కింద పడిపోయాయి!”, అంది.

కిట్టూకి నోటా మాట రాలేదు. చిట్టి నవ్వుతుందని తను చేసిన పని, చిట్టిని మామూలు కన్నా ఎక్కువ ఏడిపించడమేకాక, ఏ పాపం ఎరుగని ఆ పిట్టను, వాటి పిల్లలను కూడా కష్టపెట్టిందే అని చాలా బాధ పడ్డాడు కిట్టూ.

“అమ్మా! పోనీ ఆ పిట్ట పిల్లల్ని జాగ్రత్తగా తిరిగి గూట్లో పెట్టనా?”, అని మహేశ్వరిని అడిగాడు కిట్టూ.

“లేదురా! ఓసారి ఆ పిట్ట పిల్లల్ని మనం ముట్టుకుంటే వాటి తల్లి వాటిని పూర్తిగా వదలి పెట్టేస్తుంది! మనం దూరంగా ఉండటమే మంచిది. ఆ పిల్లల్ని ఏ పిల్లో తినెయ్యకుండా జాగ్రత్తగా చూద్దాం!”, అంది మహేశ్వరి.

చిట్టి మరింత గట్టిగా ఏడవటం చూసి, “పిట్ట పిల్లలకు ఏమీ కాదులేమ్మా! ఊరుకో!”, అని చిట్టిని ఓదార్చింది మహేశ్వరి.

ఏంచెయ్యాలో తెలియక ఒక పక్కాగా పిట్ట పిల్లలను చూస్తూ కూర్చున్న కిట్టూకి కూడా లోపలినుండి ఏడుపు తన్నుకొచ్చేస్తోంది!

అంతలో, “కీచ్! కీచ్!”, అంటూ తల్లి పిట్ట చెట్టు కిందకు వచ్చి పిట్ట పిల్లల నోట్లో ఆహారం పెట్టింది.

అది చూసిన చిట్టి చప్పట్లు చరుస్తూ, గెంతులు వేస్తూ, కేరింతలు కొట్టింది. కిట్టు చిట్టిని ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నాడు. అంతవరకూ ఏంజరుగుతుందోనని ఆత్రంగా చూస్తున్న బంధువులంతా కిట్టూ, చిట్టీల చుట్టూ చేరి ఆనందంతో చప్పట్లు కొట్టారు.

ఆ క్షణం కిట్టుకి ఎందుకో చిట్టి బంధువులతో కలిసి కొట్టిన చప్పట్లు దీపావళి టపాసులల్లే వినపడ్డాయి. చిట్టి కళ్ళల్లోని ఆనందం కోటి దీపాల కాంతులల్లే కనపడింది. చిట్టి మోహంలో కనపడిన నవ్వు పండుగ కళను తెచ్చినట్లనిపించింది.

‘అసలైన దీపావళి ఆనందం, భరించలేని చప్పుడు చేసే టపాసులలో లేదు! మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని సాటి ప్రాణులకు కష్టాన్ని కలిగించకుండా ఉండటంలో ఉంది! ఆనంద దీపావళికి సరైన మార్గం ఇదే!’, అని అనుకుంటూ చేతులు కడుక్కుని తల్లి మహేశ్వరి ఇచ్చిన మిఠాయిని నోట్లో వేసుకున్నాడు కిట్టూ!

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked