–ఆర్. శర్మ దంతుర్తి
ఒకనొక రాజ్యంలో ధర్మరాజనే ఆయన రాజయ్యాడు కొత్తగా. ఈయన రాజయ్యేసరికి అనేక కష్టాలలో ఉంది రాజ్యం. హత్యలూ, మరణాలూ, మానభంగాలూ జరుగుతున్నా అడ్డుకునే నాధుడు లేడు. ఎవరిష్టానుసారం వాళ్ళు పనులు చేయడం జరుగుతోంది. వ్యాపారస్తులు డబ్బులు గుంజుతున్నా రోగాలు వస్తున్నా ఎవరికీ పట్టడం లేదు. ఇదంతా చూసి విసుగొచ్చిన ధర్మరాజు ఓ నిర్ణయానికొచ్చాడు; మంత్రులతో ఒక పాటు ఒక వారం కూలంకషంగా అంతా చర్చించాక. దేశంలో మళ్ళీ ధర్మం రావాలంటే చేతికి చేయి, కన్నుకి కన్నూ, లాభానికి లాభం, నష్టానికి నష్టం అనే సూత్రం అనుసరించి తీరవల్సిందే. దీనిప్రకారం ఎవరైనా కొంతమంది కల్సి ఒక మహిళని మానభంగం చేస్తే ఆ చేసినవాళ్లని నగరం నడిబొడ్డున అందరిముందూ మానభంగం చేసి తీరుతారు వాళ్ళకి రోగం వదిలేదాకా. అలాగే ఎవరైనా మోసం చేస్తే అదే మోసం తిరిగి చేయాలి వాళ్లకి. వైద్యులెవరైనా కావాలని చెత్త వైద్యం చేసి రోగి కన్ను పోగొడితే, వైద్యుడి కన్ను పొడుస్తారు.
ఇవన్నీ ఒక్కసారి అమల్లోకి వచ్చేయి. అప్పటివరకూ ఉన్న రోగాలకి హఠాత్తుగా చికిత్స మొదలైనట్టూ రోగాలన్నీ తగ్గుముఖం పట్టాయి కానీ అడపాదడపా ఇక్కడో హత్య, అక్కడో మానభంగం జరుగుతూనే ఉన్నై. అయితే అవి బయటకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. బయటకి వస్తే మాత్రం వెంఠనే శిక్షలు అమలు జరుగుతున్నాయి. ప్రజల్లో భయం, వెన్ను వణకడం మొదలైంది. వాపారస్తులు వళ్ళు దగ్గిరపెట్టుకుని అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఒక సంవత్సరం తిరిగేసరికి రాజ్యం చాలావరకూ అదుపులోకి వచ్చింది. పన్నులు సరిగ్గా వసూలౌతున్నాయి కూడా.
ఓ రోజున ఇద్దరు స్నేహితులు పేకాట ఆడుకుంటూంటే ఒకడు ఓడిపోయాడు. ఓడినవాడు ముప్ఫై వరహాల డబ్బు ఇవ్వాలి కానీ వాడి దగ్గిర లేవుట అందుకని చేతులెత్తేసరికి నెగ్గినవాడికి కోపం వచ్చింది. నెగ్గినవాడు ఓడినవాడితో దెబ్బలాట పెట్టుకున్నాడు. కయ్యం అలా పెరిగి పెరిగి జుట్టూ జుట్టూ పట్టుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు నెగ్గినవాడు ఓడినవాడిని కిందకి కూలదోసి వాడి గుండెలమీద కూర్చుని కొట్టడం మొదలుపెట్టాడు. ‘ముప్ఫై వరహాలే కదా, డబ్బులు ఎలాగో ఒకలాగ సర్దుతాను తర్వాత, ఊపిరి ఆడడం లేదు మహా ప్రభో, నా మీదనుంచి దిగు, దిగు’ అని ఎంత అరిచినా ఈయన దిగలేదు. కుస్తీలో నెగ్గాక అలా సవాల్ చేయడం ఏదో గర్వకారణం అనుకున్నాడేమో తెలియదు కానీ. ఈయన అలా గుండెలమీద కూర్చుని నొక్కినప్పుడు ఊపిరి ఆడని ఆ ఓడినవాడు అరిచిన అరుపులూ అవీ ఇదంతా చుట్టూ ఉన్న చాలామంది చూసారు. అందరూ కలిసి ఏదో చేద్దాం అనుకునేలోపే ఓడినవాడి ఊపిరి ఆగిపోయింది ఈ ఛాతీ మీద కూర్చున్న వాడి బరువు వల్లా, నొక్కడం వల్లాను. ఆయన చచ్చేపోయాడు ఆ రోజు సాయంత్రానికి.
చచ్చిపోయినవాడి తాలూకా మనుషులు ధర్మరాజుగారి దగ్గిరకొచ్చారు వాజ్యానికి. రాజుగారి కొత్త న్యాయం ప్రకారం కన్నుకి కన్నూ, కాలుకి కాలూ కదా? చచ్చిపోయినవాడు ఊపిరి అందక చచ్చిపోయేడు కనక ఈ చంపిన వాడు కూడా ఊపిరి అందక చావాలి. పేకాటలో నెగ్గిన డబ్బులు కూడా న్యాయం ప్రకారం నెగ్గినవే కదా? అందువల్ల పేకాటలో నెగ్గిన ముప్ఫై వరహాల డబ్బులు మాత్రం ఇచ్చేస్తారు నెగ్గినవాడి తాలూకా. మంత్రులతో కల్సి ఆలోచించేడు ధర్మరాజు గారు – ఏం చేయాలో. చచ్చిపోయినవాడికి ఊపిరికి ఊపిరి ఇవ్వడం ఎలాగా కుదరదు కనక నెగ్గినవాడి ఊపిరి తీసుకోవడం ఒకటే న్యాయంగా కనబడింది. దీనికి ప్రధానమంత్రి చెప్పేడు ఏం చేయాలో.
“ఉరి తీస్తే నెగ్గినవాడికి ఊపిరి అందదు. అలా వాణ్ణి నగరం ముఖ్య కూడలిలో బహిరంగంగా ఉరి తీద్దాం. తిక్క కుదురుతుంది వెధవలకి. నేనే దగ్గిర ఉండి చూస్తా ఇదంతా.”
ప్రధానమంత్రే శిక్ష చెప్పాడు కనక వెంఠనే అమలు జరిగిపోయింది. నగరం కూడలిలో ఫలానా రోజున శిక్ష వేస్తున్నారహో అని చాటింపు వేసి ఉరికి అంతా సిద్ధం చేసారు. వేలకొద్దీ జనం వచ్చారు చూడ్డానికి ఆ ఫలాన రోజున. ప్రధానమంత్రి ఉరికంబం దగ్గిరే నించుని అంతా పర్యవేక్షిస్తున్నాడు. ఉరి వేయడానికి మెడకి తాడు తగిలించి లాగారు ప్రజలందరూ చూస్తూండగా. నెగ్గినవాడి వాళ్ళావిడ ప్రధానమంత్రి కాళ్ళావేళ్ళా పడుతోంది వాణ్ణి వదిలేయమని. ప్రధానమంత్రి చెప్పేడు, “న్యాయం రాజుగారు చెప్పినది. నాచేతిలో ఏం లేదు.”
ఉరి బాగా మెడకి బిగుసుకున్నాక కాసేపు వాణ్ణి గింజుకోనిచ్చి మళ్ళీ దింపారు కిందకి. అప్పుడు అడిగాడు ప్రధానమంత్రి, “ఎలా ఉందిరా? ఉరి వేస్తుంటే?”
“ఊపిరి ఆడడం లేదు, డబ్బులు అక్కర్లేదు. దయచేసి నన్ను వదిలేయండి.”
“దరిద్రుడా, ఇప్పుడు తెలిసిందా ఊపిరి ఆడ్డం లేదని? నువ్వు ఓడినవాడి గుండెలమీద కూర్చున్నప్పుడు తెలియలేదా? నీకు ఊపిరి ఆడకుండా చెయడానికే ఈ శిక్ష. అనుభవించు. అర్ధం అయిందా?”
“తప్పయిపోయిందండి, క్షమించాలి.”
“అవునా? ఎవర్రా అక్కడ, మళ్ళీ తాడు మెడకి తగిలించి ఉరి తీయండి వీణ్ణి,” చెప్పేడు మంత్రి.
ఈ సారి పీకకి తాడు తగిలించి పూర్తిగా ఉరి తీసారు. చచ్చిపోయేవాడి వాళ్ళావిడ ఏడుస్తుంటే మరో ఇద్దరు ఆవిణ్ణి పట్టుకున్నారు. ఓ అరగంట గింజుకున్నాక నెగ్గినవాడికి ఊపిరి అందక ప్రాణం పోయింది. ప్రధానమంత్రి అక్కడే ఉండి ఇదంతా చూసాడు.
ఓడినవాడి కుటుంబం పైకి గంటు మొహాలు పెట్టినా మనసుల్లో లోపల్లోపల అమితానందం పొందుతూ వెంఠనే అక్కడికక్కడే, ప్రధాన మంత్రి చూస్తూండగా ముప్ఫై వరహాలూ నెగ్గినవాడి కుటుంబానికి చెల్లించారు. కొట్టుకున్న మనుషులిద్దరూ పోయారు కనక వడ్డీ ఇవ్వక్కర్లేదుట. డబ్బులు డబ్బులే ప్రాణం ప్రాణమే.
ఉరితీయబడినవాడి శరీరాన్ని, అక్కడే కుటుంబానికి అప్పగించారు, ముప్ఫై వరహాలతో బాటు న్యాయం ప్రకారం. ఆ డబ్బులు దహనానికి సరిపోవచ్చని చూడ్డానికొచ్చిన ప్రజలందరూ అనుకున్నారు.
అంతా అయ్యాక ప్రధానమంత్రి వెళ్ళిపొతూ ఎందుకో అక్కడే నగరకూడలిలో ఉన్న న్యాయదేవత విగ్రహం కేసి చూశాడు. ఆవిడ కళ్ల మీద కప్పిన గుడ్డలోంచి కన్నీళ్ళు కారడం ప్రధానమంత్రి ఒక్కడికే కనిపించింది. అయితే ధర్మరాజుగారి న్యాయం అక్షరాలా జరిపించినా న్యాయదేవత కన్నీరెందుకు కారుస్తోందో ఆయనకి మాత్రం అర్ధం కాలేదు.
కూడా ఉన్న రాజపురోహితుణ్ణి అడిగాడు అదే విషయం మంత్రిగారు.
పురోహితుడు చెప్పేడు, “ఊపిరికి ఊపిరీ, డబ్బుకి డబ్బూ అనే న్యాయం సంగతి బాగానే ఉంది. ఈ వరహాలూ డబ్బులూ, లోహపు కాసులూ మనం సృష్టించుకున్నవి. దేవుడిచ్చిన ప్రాణం కంటే గొప్పవి కాదు కదా. ప్రపంచంలో అతివిలువైన మానవ ప్రాణాలు రెండు పోయినందుకు అన్యాయంగా బలైపోయినందుకు న్యాయదేవత ఏడవదుటండీ?”
పురోహితుడి సమాధానం విన్నాడో, నచ్చిందో లేదో కానీ ప్రధానమంత్రి మాత్రం వడివడిగా నడుచుకుంటూ రాజుగారికీ మాట చెప్పడానికి వెళ్ళిపోయేడు.