-ఆర్. శర్మ దంతుర్తి
యుధిష్టిరుడు పంపిన ఆహ్వానం చూసి కృష్ణుడు ఉద్ధవుణ్ణి అడిగేడు, “చూసావు కదా, మొన్నటికి మొన్ననే రాజ ప్రతినిధులు వచ్చి జరాసంధుడు చెరలో పెట్టిన రాజులని విడిపించమన్నారు. ఇప్పుడే యుధిష్టిరుడి నుంచి ఈ రాజసూయానికి ఆహ్వానం. మనం ఏం చేస్తే బాగుంటుంది?”
“జరాసంధుడు మనచేతిలో చావడనేది నీకు తెల్సిందే. తనకి తగ్గ వీరుడితో ద్వంద్వ యుద్ధంలో తప్ప ఆయన చావడు. రాజసూయానికి ఎలాగా మిగతా రాజులని ధర్మజుడు జయించాలి. జరాసంధుడు బతికి ఉండగా అది అసంభవం. పాండవులలో భీముడొక్కడే జరాసంధుణ్ణి చంపగలవాడు. అలా భీముడితో జరాసంధుణ్ణి అంతం చేయించి రాజసూయం చేయించావంటే రెండు పనులూ ఒకేసారి అయిపోతాయి,” ఉద్ధవుడు చెప్పాడు.
మంచి సలహా ఇచ్చిన ఉద్ధవుడి భుజం తట్టి అక్కడే వేచి చూస్తూన్న పాండవదూతతో చెప్పాడు మురారి, “నేను బయల్దేరి వస్తున్నాననీ దగ్గిరుండి రాజసూయం చేయిస్తాననీ ధర్మజుడితో చెప్పు.”
రాజసూయానికి బయల్దేరే కృష్ణుడి దగ్గిరకొచ్చాడు నారదుడు. కుశల ప్రశ్నల అనంతరం అడిగాడు, “రాజసూయం చేస్తే అనంతమైన జనక్షయం కలుగుతుందని తెల్సి కూడా ఎందుకు ధర్మజుడి చేత ఈ యాగం చేయించడానికి పూనుకున్నావు?”
రధం ఎక్కబోయే కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు, “ఇదే ప్రశ్న మళ్ళీ నన్ను రాజసూయం అయ్యాక అడుగు సమాధానం చెప్తాను అప్పుడు.”
రధం కనుమరుగౌతూంటే నారదుడు ఉద్ధవుడి కేసి చూసాడు కృష్ణుడు చెప్పిన వివరం ఏమిటా అని. ఉద్ధవుడు ఆకాశం కేసి చూసి చేతులు ఎగరేసాడు ఆ పై వాడికే తెలుసన్నట్టూ.
తర్వాత జరిగిన విషయాలు జగద్వితం. కృష్ణుడు భీమార్జునలతో మగధ దేశానికి వెళ్ళి జరాసంధుణ్ణి మారువేషంలో కలిసాడు. జరాసంధుడు కోరుకున్న ప్రకారం భీముడితోనే యుద్ధానికి ప్రేరేపించి ఆయన్ని మగధలోనే చంపించాడు. అలా యాదవ కులానికి చాలాకాలం పక్కలో బల్లెంగా ఉన్నశతృవుని సునాయాసంగా తప్పించి యుధిష్టిరుడి రాజసూయానికి అడ్డంకులు తొలగించాడు. తర్వత రాజసూయంలో ధర్మజుడు ఎంత వారిస్తున్నా కృష్ణుణ్ణి తిట్టడం ఆపని శిశుపాలుడు ఎటువంటి చావు కొని తెచ్చుకున్నాడో? ఇంత జరుగుతున్నా కృష్ణుడి మొహంలో చిరునవ్వు ఏనాటికీ చెరగలేదు. పైకి నవ్వు మొహంతో నటిస్తూ లోపల సంతోషంగానో, కోపంతోనో ఉన్నాడా అనేదీ తెలియలేదు.
రాజసూయం అయ్యాక ధుర్యోధనుడు మయసభలో తిరగుతూ అక్కడే ఉన్న అద్భుతాలు చూడడంలో నీళ్ళు లేనిచోట ఉన్నాయనుకుని ఉత్తరీయం పైకెత్తుకోవడం, నీళ్ళు లేవనుకుని నడిస్తే అక్కడ నీళ్లలో పడి తడవడం, గోడలేదనుకుని ముందుకి వెళ్ళబోతే దాన్ని గుద్దుకుని నుదురు బొప్పి కట్టించుకోవడం జరుగుతుంటే భీమార్జునులు నవ్వడం మొదలు పెట్టారు. వీళ్లని చూసి ద్రౌపది నవ్వుతూంటే ధర్మజుడు వారించి ధుర్యోధనుణ్ణి ఏమనుకోవద్దని చెప్పి కొత్త బట్టలు ఇప్పించాడు కూడా. అయినా మరో సారీ మరో సారీ అతన్ని చూసి వీళ్ళు నవ్వుతూనే ఉన్నారు. ధర్మజుడు వారిస్తూనే ఉన్నాడు. ఇది చూసి కృష్ణుడు కూడా కావాలని పడీ పడీ నవ్వాడు ధుర్యోధనుడు పడే అవస్థ చూసి. ధర్మజుడంతటివాడే నవ్వ వద్దని వారిస్తూంటే ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’ అనేవాడు అలా చేయవచ్చా?
కృష్ణుడి అండ చూసుకుని అర్జునుడు; అర్జునుడు నవ్వుతున్నాడు కదా అని ద్రౌపదీ పై పంచలు మొహాలకి అడ్డం పెట్టుకుని మరీ నవ్వారు. అసలే రారాజు అనీ ఎంతో అభిమానం కలవాడనీ పేరున్న ధుర్యోధనుడు ఎంత క్షోభ అనుభవించాడో ఆడవారి ముందూ, తన సేవకుల ముందూను. అయినా కృష్ణుడు నవ్వడం ఆపలేదు. తమ్ముళ్ళనైతే ధర్మజుడు అదుపులో పెట్టగలడు కానీ కృష్ణుణ్ణి ఎలా వారించగలడు? ధర్మజుడు ఎవరిని ఎంతవారించినా ఉపయోగం లేకపోయింది. ఇదంతా దేనికి దారి తీస్తుందో?
కృష్ణుడికి తీరిగ్గా ఉన్నప్పుడు ఒక్కడే వెళ్ళి కలిసాడు నారదుడు రహస్య సభామందిరంలో. మొదటగా అడిగిన విషయం ముందొకసారి అడిగినదే, రాజసూయం తర్వాత జనక్షయం; రెండోది కృష్ణుడంతటి వాడు, అభిమానవంతుడైన దుర్యోధనుణ్ణి చూసి ద్రౌపదితో సహా అందర్నీ కూడగట్టుకుని సభా మర్యాద మంట కలుపుతూ బాహాటంగా నవ్వడం; అదీ ధర్మరాజు వద్దంటూ వారిస్తున్నా.
కృష్ణుడు అడిగాడు, “నారదా, నేను ఇలా కృష్ణుడిగా పుట్టడానికి కారణం ఇదీ అని గోకులం లో చెప్పుకుంటూ ఉంటారుట, అదేమైనా నీకు తెలుసా?”
“నారాయాణ, నారాయణ. తెలియకపోవడమేం? దుష్టశిక్షణ, ధర్మ రక్షణా కోసం అని కదా? భూమాత వచ్చి భూభారం తగ్గడానికేదో చేయమంటే ఇలా అవతారంగా వచ్చావని కదా గోకులం చెప్పుకునే మాట?”
“అర్ధమైంది కదా? ఇప్పుడు ఈ యుధిష్టిరుడి ఆలోచనలు పట్టుకుని ఆయన నవ్వవద్దు అంటున్నాడని నవ్వకుండా ఉంటే వీళ్ల మధ్యన స్పర్థలు ఎలా వస్తాయి, అవి రాకపోతే యుద్ధం ఎలా జరుగుతుంది? ఏ కారణం లేకుండా క్షత్రియులైన వీళ్లని, అందులోనూ కారణ జన్ములుగా పుట్టి, అరివీర భయంకరులై, శస్త్రాస్త్రకోవిదులైన వీళ్ళని కడతేర్చడం ఎలా? జనక్షయం జరిగి భూభారం తగ్గాలంటే రాజసూయం జరిగి తీరాలి. ఆ రాజసూయం అయ్యాక ఊరికే కూర్చుంటే యుద్ధాలు రావు కదా?”
“రారాజు అంతటివాడ్ని అలా అందరి ముందూ సభామండపంలో గేలి చేసి నవ్వడం తప్పు కదా?”
“భలేవాడివే నారదా, తప్పొప్పులు లెక్కపెడుతూ కూర్చుంటే ఈ భూభారం తగ్గించడానికి నేను మరో జన్మ ఎత్తవద్దూ? ఓ సారి ఆలోచించు. నా నవ్వు ధుర్యోధనుడి అభిమానం మీద దెబ్బతీయాలి; ఆయన తిరిగి వెనక్కి వెళ్ళి ఈ పాండవులని అష్ట కష్టాలు పెట్టాలి, వీళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బ తియ్యాలి. యుద్ధం కోసం రెండు వైపులా ఉవ్విళ్ళూరాలి. ఆ తర్వాత రాబోయే యుద్ధంలో ధర్మరాజంతటివాడి నోట్లోంచి కూడా అబద్ధం రావాలి. అప్పుడు తగ్గుతుంది భూభారం. ఊరికే చేతులు కట్టుకుని కూర్చుంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఇదంతా జరగడానికి సూత్రధారినైన నేను నవ్వుతూ ఇతరులని నవ్వించకపోతే ఎలా?”
“నీ నవ్వు వల్లే అతిరధమహారధులందరూ చావబోతున్నారన్నమాట త్వరలో. భీష్మ, ద్రోణులంతటి మహా వీరులు కూడా ఎవరిచేత ఎలా చంపబడతారో?” ఆశ్చర్యంగా పైకే అన్నాడు నారదుడు.
“కాలోస్మి లోకక్షయ కృత్ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృద్ధః
ఋతేపి త్వాం నభవిష్యన్తి సర్వే ఏవః స్థితా ప్రత్యనీకేషుయోధాః
ఈ ప్రపంచాన్ని నశింపచేసే బలిష్టమైన కాలస్వరూపుణ్ణి నేనే; రాబోయే యుద్ధంలో ఎవరు ఎవరినీ చంపకపోయినా, బతికి బట్టకట్టగలిగేవారు వీళ్లలో ఎవరూ లేరు,” కృష్ణుడు చెప్పాడు అదే చిరునవ్వుతో.
“నారాయణ, నీ లీలా నవరస భరితం” కధ అర్ధమైన నారదుడు మహతి మీటుతూ నిష్క్రమించాడు.