“బామ్మా బామ్మా ! ఎక్కడ ” అని అరుచుకుంటూ వచ్చింది ఆవని.
“ఏం ఆవనీ! ఏదోపని పడ్దట్టూందేనాతో! అందుకే రాగానే స్నాక్స్ కు వెళ్ళ కుండా నాకోసం వచ్చావ్?” అడిగింది బామ్మ.
“రేపు మా క్లాస్ లో అసూయను గురించీ, తెలివిని గురించీ కలిపి ఒక కధ చెప్పాలన్నారు మాతెలుగుటీచర్ గారు. బామ్మ ప్లీజ్ చెప్పవా ! ”
“అసూయా తెలివీ రెండూ కలిపి ఒకే కధా ! బావుంది స్నాక్స్ తిని, పాలు త్రాగిరాపో , ఈలోగా ఆలోచించి పెడతాను” అంటూ ఆవనిని పంపి ఆలో చించసాగింది బామ్మ.
ఆవని రానే వచ్చింది.ఎదురుగా కూర్చుని,”ఇహచెప్పుబామ్మా!”అంది.
“సరే ఆవనీ! ఒకకధ చెప్తాను. బాగా విను.”అంటూ మొదలెట్టింది బామ్మ.
‘ అక్బర్ కొలువులో ఉండే బీర్బల్ చాలా తెలివైనవాడు. చతురుడూ, చమ త్కారి కూడాను.బీర్బల్ ను అక్బర్ చాలా ఆత్మీయంగా చూట్టం, గౌరవించడం, ప్రేమించడం, కానుకలు ఇవ్వడం కొలువులోని మిగతా వారు సహించలేక పోయేవారు.సమయం కోసం కాచుకుని ఉన్నారు. బీర్బల్ మీద చక్రవర్తికి ఏదైనా చెప్పాలని వారి ఆరాటం.
ఒకనాడు బీర్బల్ సమావేశానికి ఏదో ముఖ్యమైన పని వుండి రాలేక పోయా డు. అలాంటి సమయానికై కాచుకుని ఉన్నవారంతా అక్బర్ చక్రవర్తి దగ్గర కెళ్ళారు.
“ప్రభూ! ఎప్పుడూ చూచినా బీర్బల్ మీ నీడలా ఉంటున్నాడు. మే మంతా దూరమై పోతున్నాం.అన్నింటికీ అతడే ముందుకు వస్తుంటాడు. తమరు అన్నీ అతడినే అడుగుతుంటారు.మేము అంత తెలివి లేని వారమా! మాకు శక్తి లేదా? ఇదిమాకు బాధగా ఉంటున్నాది” అన్నారు.
దానికి అక్బర్ “సరే మీకంతా ఎందుకు కష్టం కల్గించాలి?. నేను కొన్ని ప్రశ్నల డుగుతాను జవాబు చెప్పండి .మీరు నా ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తే ఇహ మీదట అన్నీ మిమ్మల్నే అడుగుతాను. బీర్బల్ ను దూరంగా ఉంచుతాను.” అన్నాడు.
దానికి అంతా సమ్మతించారు.
అక్బర్ వారిని మొదటి ప్రశ్నగా “ఏ పాలు శ్రేష్టమైనవి?” అని అడిగాడు.
దానికి ఒక్కోరూ ఒక్కోరకంగా , ఒకరు ‘ఆవు పాలు చాలా శ్రేష్టము’ అంటే , మరొకరు ‘మేకపాలు చాలా శ్రేష్టమైనవి ‘ అనీ ‘గేదెపాలు మంచివనీ’ ఇలా రక రకాలుగా చెప్పారు. కానీ అక్బర్ కు మాత్రం ఆ సమాధానా లేవీ తృప్తి కలిగించ లేదు.
అక్బర్ ” సరే! రెండవ ప్రశ్న.ఏ పూవు శ్రేష్టమైనది? “అని అడిగాడు. దానికి అంతా ఒకరు ‘గులాబి పుష్పము శ్రేష్టమైనది’, ‘మల్లె శ్రేష్టమైనది’, ‘తామర పుష్పము శ్రేష్టమైన’దనీ, మనోరంజని ,జాజి అనీ ఇలా ఒక్కొ క్కరు ఒక్కొక్క పుష్పము పేరుచెబుతూ వచ్చారు.
ఈ సమాధానాలకు కూడా అక్బరు తృప్తి పడలేదు.
“సరే మూడవ ప్రశ్న. “ ఏది అన్నింటికంటే తీపైనది.”అనడిగాడు.
దానికి అంతా చక్కెర తీపి అని కొందరు, బెల్లము తీపని కొంతమంది ,ఇలా అనేక విధాలు గా చెబుతూ వచ్చారు.
అక్బర్ వారితో “మీరంతా బాగా ఆలోచించి రేపు సమాధానాలు చెప్పండి. ” అని వారినంతా పంపేశాడు .
మరునాడు బీర్బల్ వచ్చాడు. అసంతృప్తితో ఉన్న చక్రవర్తిని చూచి ,
“ప్రభూ!! ఎందుకు మీరు అసంతృప్తిగా ఉన్నా రు “అని అడిగాడు.
“నా ప్రశ్నలకు ఎవ్వరూ సరైన సమాధానం యివ్వలేదు,దానికే నాకు విచా రంగా ఉంది.” అన్నాడు.
తరువాత అక్బర్ ఆస్థానంలో వారినంతా చూసి”ఏ ఆకు శ్రేష్ఠమైనది” అని అడిగాడు.దానికీ అంతా కొబ్బరాకు శ్రేష్టమైనదనీ, అరిటాకు శ్రేష్ఠ మైనదనీ, మామిడాకు అనీ ఇలా చెబుతూ వచ్చారు.
అక్బర్ బీర్బల్ ను చూశాడు.
బీర్బల్ “ప్రభూ! తమలపాకు చాలా శ్రేష్టమైనది. మంగళకరమైన కార్యాలు జరిగేప్పుడు ముందు ఈ ఆకులను ఇస్తున్నాము, పండుగలకూ పబ్బాలకూ , ఈ ఆకులను అందరికీ ఇస్తాము, సేవిస్తాము, పేరంటాలు, వ్రతాలూ నోము లూ, దైవానికి అర్పిచనూ వీటినే వాడుతారు. దీని కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. తమలపాకులో ఎన్నో ఆరోగ్యకరమైనవీ, మనశరీరానికి అంటే ఎముక లకు ఎంతో మేలుచేసేవీ, పదార్ధాలు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
తమలపాకు ముసలితనపు ముడతలు రాకుండా కాపడుతుంది.
పాటలు పాడేవారు, తరచూ ఉపన్యాసాలను చెప్పే వారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకొని బుగ్గనుంచుకొని చప్పరిస్తుంటే అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది.అందుకే ప్రభూ నిన్న తమలపాకు తోటకెళ్ళి,అలస్యమై తమదర్శనానికి రాలేక్పోయాను. ” అని చెప్పాడు. ఆసమాధానం అక్బర్ కు బాగనచ్చింది
మరలా అక్బర్ ” బావుంది బీర్బల్! మరి ఏ పాలు శ్రేష్టమైనవి?”అని అడగ్గా దానికి బీర్బల్,
” తల్లి పాలు శ్రేష్ఠమైనవి , బిడ్ద పుట్టగానే తల్లి పాలేత్రాగి పెరుగుతాడు, ఆ పాల లో ఆత్మీయత, ప్రేమ ఆబిడ్డను చక్కగా పెరిగేలా చేస్తాయి.ఆ పాలలో కల్తీ ఉండదు. కీడుచేయదు.మానవులకేకాదు ఏజీవికైనా తల్లి పాలే శ్రేష్టమై నవి ” అనిచెప్పాడు. ” ఏపుష్పము శ్రేష్టమైనది? ” అని అక్బర్ అడగ్గా ,
“పత్తి పుష్పము శ్రేష్టమైనది.” అన్నాడు బీర్బల్.
“ఎందువల్ల?” అని అక్బర్ అడగ్గా, “ప్రభూ! దానితో దారము తయారు చేసి బట్టలు నేసుకుంటున్నాము. మన గౌరవమును కాపాడు కోనేకాక వస్త్రం చలి నుండీ కూడా మనలను రక్షిస్తున్నది. మన శరీరాన్ని పూర్తిగా కప్పి కాపాడు తున్నది. గౌరవాన్నిస్తున్నది.” అనిచెప్పాడు.
అక్బర్ “ అన్నింటికంటే తీపి ఏది “అని అడగ్గా ,బీర్బల్ “తల్లి ప్రేమయే అన్నింటికన్నా తీపి “అన్నాడు. ఆసమాధానాలకు అక్బరు చాలా ఆనందిం చాడు.
బీర్బల్ను చూచి అసూయ పడేవారంతా తలలు వంచుకున్నారు.
“సరే మీఅందరికీ
ంకొక ప్రశ్న అడుగుతాను మీరు చెప్పండి” అన్నా డు.
“సేనాపతీ! ఎందుకు నా చేతిలో వెంట్రుకలు లేవు?” అని అడిగాడు. దానికి సేనాపతి” జన్మతోనే అలా వచ్చింది కాబట్టి వెంట్రుకలు లేవని “చెప్పాడు.
బీర్బల్ని చెప్పమన్నాడు అక్బర్ .
“ప్రభూ! మీరు నిరంతరం దానాలు చేసి చేసి మీ అరచేతిలో వెంట్రుకలు ఊడి పోయినాయి. దానశక్తి గల్గిన హస్తము కనుక వెంట్రుకలుండుటకు వీలు లేదన్నాడు. ”
దానికి అక్బర్ “నా అరచేతిలో వెంట్రుకలు లేకపోటానికి కారణం సరే గానీ ,నీ అరచేతిలో వెంట్రుకలు లేకపోవటానికి కారణం ఏమిటి!’ అనగా , బీర్బల్ ” మహాప్రభువులైన మీరు ఇస్తున్న దానాలను అందు కొని అందుకొని నా హస్తంలో కూడా వెంట్రుకలు లేకుండా పోయాయి’ అన్నాడు.
“ఐతే ఈ మిగిలిన వ్యక్తులందరి అరచేతుల్లో కూడా వెంట్రుకలు లేకుండా ఉండటానికి కారణం ఏమిటి? “అని అడిగాడు.
అప్పుడు బీర్బల్ చెప్పాడు. “ప్రభూ! నాపైన ద్వేషం చేత నన్ను ఆదరిస్తు న్నా రని మీపై కోపం చేత ఎప్పుడూ నలుపు కొని నలుపు కోని వీరందరి అర చేతుల్లో కూడా వెంట్రుకలు లేకుండా పోయాయి” అన్నా డు.
“ సరే ఇన్నిప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పావు ఎలా? నీలో ఏ శక్తి ఉన్నది?” అని అడిగాడు అక్బర్ ప్రభువు.
‘నాలో ఉన్నది దైవము’. బీర్బల్ అనగా ‘మరి నాలో ఉన్నది ఏమిటి?’ అడిగాడు అక్బర్ .
“మీలో ఉన్నది కూడా దైవమే ప్రభూ! మీరు మీ అంతః పురంలో బంగారు పళ్ళెంలో షడ్రసోపేతమైన భోజనం చేస్తుంటారు. కానీ నేను మా యింట్లో పింగాణి పాత్రలో గంజి తాగవలసి వచ్చింది. తినే పదార్ధములు వేరు వేరైనా మీకూ, నాకూ ఆకలి ఒక్కటే. అన్నగత ప్రాణాలైన ఈ దేహాలన్నింటికీ ఆకలి ఒక్కటే. కనుక ఆకలి దేహమునకే గానీ ఆత్మకు కాదు. ఆత్మకు ఏ గుణములు లేవు. ఏ ఆలోచనలూ లేవు. ఏ రూపము లేదు. అట్టి ఆత్మ సర్వులందు ఒక్కటే. అది విజ్ఞానము. విజ్ఞాన మనగా కంటికి కనిపించనిది, చెవులకు విని పించనిది మనసుకు అని పించనిది, హృదయానికి కనిపించనిది. యీ విధ మైన తత్త్వమే విజ్ఞానము. కనుక ప్రతి మానవునియందు ఉన్నది ఒకే ఆత్మ తత్త్వ ము. ప్రభూ!” అన్నాడు.
బీర్బల్ సమాధానాలకు సంతసించిన అక్బర్ అతడి కి ఎన్నో ధన రాసు ల ను కానుకగా ఇచ్చాడు. అంతా బీర్బల్ తెలివికీ విజ్ఞతకూ తల వంచక తప్ప లేదు. ‘
బావుంది బీర్బల్ మరి తనకు అక్బర్ ప్రభువుం ఇచ్చిన ధనరాసులన్నింటినీ బీర్బల్ ఇంటికిపోతూ పేదలందరికీ పంచుకుంటూ, ఉత్తచేతులతో ఇంటి కెళ్లాడు.ప్రభువు నుంచీ కొంతైనా నేర్చుకుని ఆచరించాలని బీర్బల్ భావన. –‘
కనుక అసూయ అనర్ధహేతువే కాక అవమానాన్ని కూడా తెచ్చిపెడుతుంది. మన తెలివికీ మన శక్తీకీ తగిన రీతిలో మనకు అనువైన పని చేసు కుంటూ సంతృప్తిగా జీవితాన్ని గడపడం విజ్ఞుల లక్షణం.పరుల తెలివికి ఆనందిచాలే కానీ అసూయ చెందరాదు. మనకు లభించిన సంపదను లేనివారికి పంచడం నేర్చుకుంటే దానిలో ఉన్న ఆనందం, తృప్తీ అర్ధమవుతాయి.అదే ఉత్తమ గుణం. ’
“ఓహ్ బామ్మా! చాలా బావుంది.రేపునాకే ఫస్ట్. చాలా థాంక్స్ బామ్మా! మాబామ్మ చాలామంచి” అని బామ్మ బుగ్గ ముద్దెట్టుకుని హోంవర్క్ కోసం వెళ్ళింది ఆవని.
********