కథా భారతి

దేవుని న్యాయం

– జానకి చామర్తి (మలేసియా)

(TAGS (Telugu Association of Greater Sacramento) నిర్వహించిన “శ్రీ ఊఆణ్ మూర్తి స్మారక 3వ రచనల పోటీ”లో మొదటి బహుమతి పొందిన కథ)

పార్కులో దీపాలు వెలిగాయి . శ్రీనివాసరావు కు లేచి రాబుద్ధవలేదు. చీకటి పడినా ఇంటికి చేరాలని అనిపించలేదు.   తండ్రి ని తలచుకుంటే అతనికి దడగా ఉంది. ఎందుకాయన అలా సణుగుతూ ఉంటాడు, ఏమి కావాలాయనకు . ఎనభైమూడేళ్ళ వయసు. ఆయనతో పోల్చుకుంటే తనే ఉసూరని ఉంటాడు. చెయ్యెత్తు మనిషి .  ఎముకలు ఎండిపోయి కండలు కరిగిపోయి కట్టెలాటి శరీరంతో ఎక్కడా వంగకుండా  ఇప్పటికీ అంగలు పంగలు వేసుకుంటూ నడవగలడు. ఆ నాలుక రుచులను చంపుకోలేదు , కోడలు ఉప్పెక్కువేసిందనో తక్కువేసిందనో , బూతులు తిట్టేయగల సమర్ధుడు. పద్మ అవన్నీ వినలేక తన కేసి బేలగా చూసినా తనూ ఏమీ చేయలేడు , నిస్సహాయంగా ఊరుకోవడం తప్ప. ఏమన్నా అన్నాడా తండ్రి పెంట పెట్టేస్తాడు చుట్టుపక్కల నాలుగు వీధులు వినిపించేట్టు అరుస్తూ. తన పరువు సగం గంగలో ఎప్పుడో కలిసింది. ఒంటో ఓపిక లేకపోయినా అరవడానికి మాత్రం ఒక ఆయాసం లేదు నీరసం రాదు. కన్నతండ్రి అని కాదుగాని భరించశక్యం కాకుండా పోతోంది తనకు. తనే ఇలా అనుకుంటే పద్మ ఎలా భరిస్తోందో  పాపం . పద్మ గుర్తుకు రాగానే లేచి ఇంటికి బయల్దేరాడు శ్రీనివాసరావు.

“ ఏడీ నీ మొగుడు ఇంటికి రాలేదా , ఏమి రాచకార్యాలు చక్కపెట్టడానికి పోయాడు,రిటైర్ అయ్యాక తిరుగుడు ఎక్కువయ్యింది వీడికి”

గుమ్మంలోకి తండ్రి అరుపులు వినిపిస్తుంటే గేటు తీసుకు లోపలకు వెళ్ళాడు శ్రీనివాసరావు. చప్పుడు విని పద్మ ఎదురొచ్చింది. మ్లానమైన పద్మ మొహం చూసి నిట్టూర్చాడు . కాళ్ళు కడుక్కుని తండ్రి దగ్గరకు వెళ్ళి నుంచున్నాడు.

“ ఏం కావాలి నాన్నా, ఎందుకలా అరుస్తున్నావు”

“ వచ్చావా , నేను అరవడం ఏమిటిరా ..చూడు నీ భార్య మధ్యాన్నం చేసిన చేగోడీలు పెట్టవమ్మా కాస్త చప్పరిస్తాను అంటే చేతిలో రెండైనా వేయలేదు అడుగు”

“ నాన్నా! అవి మొన్న కదా చేస్త, అయిపోయుంటాయి”

“ అప్పుడే ఎలా అయిపోతాయిరా .. తను కూచుని తినేసిందా అన్నీనూ”

శ్రీనివాసరావు ఏదో అనబోయేంతలో పద్మ లోపల నుంచి వచ్చి , “ఈ చపాతీలు తినండి మామయ్యగారూ ! ఇప్పుడే చేసాను “ అంటూ పళ్ళం అందించింది.

“ సరే, అఘోరించు” అంటూ పళ్ళం అందుకున్నాడాయన.

********

ఆరాత్రి భోజనం చేస్తూ తలొంచుకు తింటున్న పద్మ ను చూస్తూ మనసులో బాధ పడ్డాడు శ్రీనివాసరావు. బాగా చిక్కిపోయి కళ్ళకింద నలుపు తేరి, నీరసంగా కనిపించింది. ఆమె వయసు కూడా తక్కువేమీ కాదు, నిజానికి వంటింటికి శలవిచ్చి విశ్రాంతి తీసుకోవలసిన వయసు.తను రిటైర్ అయ్యాడు మరి పద్మ కు రిటైర్ ఎప్పుడో.

“ ఇవాళ బాబు ఫోను చేసాడా” లేదన్నట్టు అడ్డంగా తలూపింది పద్మ.

“ వాడికి నామీద కోపం . తాతగారిని గారాబం చేసి నెత్తికెక్కించుకుంటున్నానని. ఎప్పుడు ఫోను చేసినా వెనకనుంచి తాత కేకలే వినిపిస్తుంటాయి నీ మాటలకన్నా అని చెప్పి ఫోనులో కూడా మాటాడటమే తగ్గించేసాడు.”

“ అవును వాడికి మనం వాడి దగ్గర వచ్చి ఉండాలని కోరిక .తాతగారికి ఏదో ఏర్పాటు చేసి రావచ్చు కదా మీరిద్దరూ అంటాడు. నువు నాన్నతో చేసుకోలేక కష్టపడుతున్నానవని కాస్త రిలీఫ్గా ఉంటుంది తన దగ్గరకొస్తే బావుంటుందని వాడుఅనుకుంటాడు. నీ కొడుక్కు నిన్ను సుఖపెట్టాలని కోరిక పద్మా! నేను ఎలాగూ ఏమీ చేయలేక పోతున్నాను”

పద్మ నొచ్చుకుంది “  నా సుఖానికేమి తక్కువ చేయలేదు మీరు. పిల్లాడు అర్ధం చేసుకోవడమ లేదు, ముసలాయనని వదిలిపెట్టి ఎక్కడికి వెడతాము, ఆయనకి ఎవరితోనైనా పడుతుందీ, ఎవరు చూడగలరు ఆయనని. మనవడికి తాత పోలికే వచ్చింది వఠి మకురుతనం, అర్ధం చేసుకోడు” మంచం మీద దుప్పటి దులిపి వేసుకుంటూ అంది పద్మ నెమ్మదిగా.

“ పోనిలే ఫోను చేస్తాడులే, పని హడావిడి లో ఉండుంటాడు” అన్నాడు శ్రీనివాసరావు. అన్నాడేగాని అతనికి బాగా తెలుసు తన కొడుకు సంగతి.  పెళ్ళైయ్యాక వాడి సంసారం వాడి పిల్లలు ఈ గొడవలో తల్లితండ్రులు గుర్తుకురావడం వాడికి తక్కువే. వాడిని తప్పేం పట్టగలడు లోక సహజమని సరిపెట్టుకోవడం.

ఆరాత్రి పక్క మీద పడుకుంటే నిద్రపట్టలేదు అతనికి. పద్మ తండ్రి చెల్లెలి కూతురే. చిన్నప్పుడే తండ్రి పోయాడు. తమ పిల్లాడు పుట్టిన కొద్ది రోజులకే అత్తయ్య కూడా పోయింది. తన తల్లి ఉన్నంతకాలం పద్మ ఆమెకు కూడా అగ్గగ్గలాడుతూనే ఉంది. అయినా మొదటినుంచీ పద్మ చాలా సాత్వీకురాలు . తొందరగా ఎవరనీ పల్లెత్తుమాట అనదు. సహనవంతురాలు. అటువంటి ఆమెలోని మంచి తనాన్ని గుర్తించకపోగా , అలుసుగా తీసుకుని ధాష్టీకం చేస్తున్న తండ్రిని ఏమనగలడు తను. తనదీ బలహీనతే తండ్రికి గట్టిగా చెప్పలేని చేతకానితనం.

తండ్రి వసారాలోకి వచ్చిన అలికిడి అయింది.

ఆపాటివేళ కి తండ్రి ఒక నిద్దుర పోయి లేచి చుట్ట ముట్టించి కాల్చడం మొదలెట్టాడు. ఆ వాసనకి పొగ పడక పద్మ దగ్గడం మొదలు పెట్టింది. లేచి వెళదామనుకున్నవాడే ఆగిపోయాడు శ్రీనివాసరావు , కాని తండ్రి ఇంకో చుట్ట ముట్టించడం , పద్మకి దగ్గు ఉధృతమవడం చూసి ఆగలేక లేచివెళ్ళాడు.

“ నాన్నా! ఆ చుట్టలు కాల్చడం ఆపుతారా”

“ ఏరా నేను స్వేచ్ఛగా చుట్టలు కూడా కాల్చుకోకూడదా, ఏం నీ సుకుమారి పెళ్ళాం కు దగ్గొస్తుందనే, సరే, కాల్చనులే వెళ్ళి పడుకో”

“ ఎందుకు దానినలా ఆడిపోసుకుంటారు తిప్పలు పెడతారు , మీకు కావలసినవి అన్నీ జాగ్రత్తగా చూస్తోంది కదా నాన్నా! ఆ చుట్టలు కాలిస్తే మీ ఆరోగ్యం పాడైపోతుంది కదా, చూడండి ఇప్పటికే ఎలా పాడైపోయారో..మీ తింటున్న తిండినంతా ఈ చుట్టలే పీల్చేస్తున్నాయ్” సన్నగా ఎముకలపోగులా ఉన్న తండ్రి దేహం చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు.

“ చూడక ఏం చేస్తుందిరా ఎక్కడకు పోతుంది, వయసైపోయి కాటికి కాలు చాపుకు కూచున్న ముసలి మామగారిని కాస్త కనిపెట్టుకు చూసుకోవడం కూడా గొప్పే . మీరిద్దరు మనుషులు. నా ప్రాణం ఒక్కటే ఎక్కువై పోయిందా. సర్లే ముసలిపీనుగను , పోతానులే తొందరలోనే . నా పీడా విరగడవుతుంది తొందరలోనే అని చెప్పు నీ భార్యకి”

వెనక నుంచి భుజం మీద తడుతుంటే తల తిప్పి చూసాడు శ్రీనివాసరావు. పద్మ సంజ్ఞ చేసి పిలుస్తోంది అక్కడ నుంచి వచ్చేయమని .

“ పోన్లెండి ఆయనని అరిపించకండి. ఎన్నో ఏళ్ళ బట్టీ చూస్తున్నదే కదా ఆయన వ్యవహారం , నాకు అలవాటు అయిపోయింది. ఆయనకు లోకువగా నేనే దొరికాను పరవాలేదు లెండి,  పెద్దాయన తో ఏం దెబ్బలాట పెట్టుకుంటాం మిమ్మలనీ వదలరాయన” అంటూ నిర్లిప్తంగా నవ్వింది పద్మ.

లోపలకు వచ్చి పడుకున్నాడు శ్రీనివాసరావు , ఇలా ఎంతకాలమో ముసలాయనతో ,అమాయకురాలు మంచిదీ అయిన పద్మ కష్టం ఆ దేముడే తీర్చాలనుకుంటూ.

************

పొగాకును మడత పెడుతూ చుట్టలు చుడుతున్నాడు రామభద్రం. కొడుకు వచ్చి చుట్ట కాల్చద్దని చెప్పి వెళ్ళాక సగం కాల్చిన చుట్టని చెవి లో దోపుకుని , చిన్న చెక్కపెట్టె లోని ఆకు తీసి చుట్టడం మొదలెట్టాడు సణుక్కుంటూనే.

వాడికేం తెలుసు చుట్ట కాల్చడంలో ఉండే హుషారు అయినా తనకి ఇంకేం తోస్తుంది. ఇంకేమిటి మిగిలి ఉన్నది. ఉపయోగపడే కాలం అంతా కరిగే పోయింది. ముసలి ఎద్దులా ఎవరకీ అక్కరలేకుండా మిగిలాడు తను .

రోజూ లాగే రామభద్రం చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుంటున్నాడు. అలా గుర్తు చేసుకోవడం అతనికి సరదా , ఆ జ్ఞాపకాలే ఇంకా నిలబెట్టి ఉంచుతున్నాయి అతనిని. చిన్నతనంలోనే దత్తత కి వెళ్ళాడు అతను. దర్జాగా కాలు మీద కాలు వేసుకు తినేటంత ఆస్తి.  కష్టపడక్కరలేకుండా గడిపేసాడు రోజులు. పెంపుడు తల్లి తను దత్తుకు వెళ్ళకముందే మరణించింది . మందలించేవారు లేరు అంతా మగ సామ్రాజ్యమే. హాయిగా పొలం వెళ్ళి తిరిగి వచ్చేవాడంతే. మగతా డబ్బులు చేతిలో వచ్చిపడేవి. అరుగుల మీద చేరి తమ ముఠా అంతా జోరుగా పేకాడేది. చాపకింద నీరులా ఆస్తి ఎలా కరిగిపోయిందో తెలీనేలేదు. తనకి కాస్త తిండి యావ ఉన్నమాట నిజమే. ఏమిటి తిండి కోసమే ఎకరాలు ఎకరాలు కరిగిపోతాయా. అయినా ఆ దాయాది శివయ్య ని అనాలి. తన దత్తు చెల్లదంటూ కోర్టు లో వ్యాజ్యం వేసి తనని మూడు చెరువుల నీళ్ళు తాగించాడు. శివయ్య గుర్తుకు రాగానే రామభద్రం ఉన్న నాలుగు పళ్ళు పటపటా కొరికాడు. చివరకి ఏం జరిగింది, ఏదో నామమాత్రంగా రెండెకరాలు ఎదిగిన కొడుకు ,ఇంకా పెరిగిన తన తిండి యావ ,ఒక్క పని కూడా సరిగ్గా చేతకాకుండా తనూ మిగిలాడు. దర్జా అయిన రోజులన్నీ పోయాయి. ఏదో కొడుకు మాత్రం టీచరు గిరీ దక్కించుకున్నాడు. వాడికీ ఒకడే కొడుకు. బెంగుళూరులో ఉంటున్నాడు భార్యాపిల్లలతో.

భార్య సత్తి ఉన్నంతకాలమూ తిట్టో తిమ్మో తనకు కావలసినవి వండుతూనే రెండు విధాలా తన నోరు మూయించేది. సత్తి నోటికి జడిసి తను గమ్మునుండేవాడు. భార్య కాలం చేసాక మాత్రం విజృంభించాడు . కాని ఎలాటివాడు ఎలా అయిపోయాడు తను అని తనకి తలచుకుంటేనే ఉక్రోషమొచ్చేస్తూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళ పైన అరవాలని ఉంటుంది. తిట్టాలని ఉంటుంది. తిక్కగా ఉంటుంది. అసలు ముసలితనం పైనే కోపంగా ఉంటుంది. మూలపడిపోయాను ఇంకా నలుగురిలో తిరగాలని అనిపిస్తుంది . కొడుకు శ్రీనివాసరావు తనని ఎదిరించి పెద్దగా ఏమీ అనడు , ఆ ధైర్యముంది తనకి. కాని వాడి మీద అరవడానికి ఎక్కడో ఏదో కొంచం సంకోచం  భయం . సరే, నోరు మూసుకు పడిఉండేది కోడలే , మెతకది. అయినా పడిఉండక ఏంచేస్తుంది , తన స్వంత చెల్లెలి కూతురే కదా. భర్త పోయి నిస్సహాయంగా ఉన్న చెల్లెలి ని ఉద్ధరించి ఆమె కూతురును తన కొడుక్కు చేసుకున్నాడు. నిజానికి అప్పటికి తమ పరిస్ధితి చితికిపోయింది, టీచరుగా చేసే కొడుక్కు అంత కంటే గొప్ప సంబంధం ఏమీ రాదు. అయినా తాను ఎప్పటికప్పుడు నోరెట్టుకు గుర్తు చేస్తూనే ఉంటాడు తన గొప్పదనం. మామగారికి ఆమాత్రం కావలసినవి చేసిపెట్టి చూసుకోవలసిన బాధ్యత లేదూ , లేకపోతే తాను నానా యాగీ చేసి నలుగురితో చెప్పి గడ్డి పెట్టిస్తాడంతే, భయపడిపోవలసిందే తనకి.

కోడలని భయపెట్టి నోరెట్టి అరచి తనకి కావలసినవి చేయించుకోవడంలో తన ప్రజ్ఞ కి మురుసుకుంటూ , చెవిలోంచి చుట్టపీకని తీసి మళ్ళీ ముట్టించాడు రామభద్రం, నిద్రొచ్చేదాక కానిద్దామని.

**********

“  మీ ఇంటికి ఫోన్ చేసారా ఇవాళ?” అడిగింది నీలిమ.

“ లేదు చెయ్యాలంటే విసుగ్గా ఉంది” బాబు అన్నాడు దుప్పటి పైకి లాక్కుంటూ,

“ పిల్లలు పడుకున్నారా “ అడిగాడు.

“ వాళ్ళు పడుకున్నారు గాని, మీరు మీ అమ్మగారితో ఫోనులో మాటాడకపోవడం ఏవన్నా బావుందా, ఆవిడెంతో ఎదురు చూస్తారు కదా , ఒక పలకరింపుకు ఏం పోయింది”

“ నేను రమ్మంటే వస్తోందా అమ్మ, ఆ ముసలాయనకు సేవ చేయడంలోనే బతుకు ధన్యత చేసుకుంటుంది , తాతకు ఇదంతా పట్టదు ఆయన చుట్టలు తిండి ఇదే గొడవ , అమ్మని ఒక కోడలు అసలు మనిషి గానే గుర్తించడం మానేసాడు. ఎంత చేసినా పైగా సాధింపు లొకటి. అమ్మ కాబట్టి భరిస్తోంది. ఇంకొకళ్ళెవరైనా అయితేనా..”

“ నిజమే , అత్తయ్యగారు కాబట్టే భరిస్తున్నారు ఇంకొకరి వల్ల కానేకాదు ఆయన్ని భరించడం”

నీలిమ కి అత్తగారంటే జాలి అభిమానం. ఆవిడ సహనానికి ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటుంది.

“ అమ్మ నాన్న ఇక్కడకి వస్తే చక్కగా పిల్లలతో ఆడుకోవచ్చు , వాళ్ళిద్దరకీవిశ్రాంతిగా ఉంటుంది.అమ్మ కాస్త సుఖపడుతుంది”

“ నిజమే ! పోనీ తాతగారిని వదిలిపెట్టి వాళ్ళు రాలేరు కదా . మనమే వెళ్ళి నాలుగురోజులు  అక్కడ ఉండచ్చు కదా , మీ అమ్మగారు అస్తమానూ అడుగుతున్నారు వచ్చి ఉండమని పిల్లలతో”

“ ఏం ఉంటాము, అక్కడుంటే మన పిల్లలు కూడా ఆ ముసలాయన దగ్గర బూతులు నేర్చుకుంటారు విని”

నీలిమ ఏమీ మాటాడలేకపోయింది, భర్త మాటలకు.అయినా అత్తగారి జాలి కళ్ళు కళ్ళ ముందు కదిలి ఇంకొక్క ప్రయత్నం చేసింది.

“ ఈసారి పిల్లలతో నేను మా అమ్మవాళ్ళింటో ఉంటాను, మీరు వెళ్ళి మీ అమ్మ నాన్నగారితో నాలుగురోజులు గడిపి రండి, అత్తయ్యగారు సంతోషిస్తారు”

బాబు కి కూడా సరే అనిపించింది ఆ విషయం, “ ఈసారి శలవలకి అలా చేద్దాములే” అన్నాడు.

నీలిమ కొంచం తేలిక పడి పక్క మీద పడుకుని దుప్పటి కప్పుకుంది.

బాబు కసిగా అన్నాడు , “ అయినా ఈ ముసలాళ్ళకు తొందరగా చావురాదు కాబోలు , ఎంతసేపో మా తాత ఆ చుట్టలు కాలుస్తూ మా అమ్మని కాల్చుకు తింటూ ఈ భూమి మీద, మా అమ్మకి ఎప్పుడో ఆయననుంచి విముక్తి”

“ తప్పుతప్పు! పెద్దవాళ్ళని అలా అనకూడదు. ఆయుషు ఉన్నదాకా తప్పదు కదా, మీరేమిటి అలా ఇష్టం వచ్చినట్టు మాటాడుతున్నారు, అవునుమరి తాత పేరు కదా ఆ పోలిక కొంచమైనా రాదా, లెంపలేసుకోండి” అంది నీలిమ గట్టిగా.

మాటాడకుండా పక్కకు తిరిగి పడుకున్నాడు బాబు, ఉరఫ్ రామభద్రం.

********

ఉదయం సుమారు ఆరుగంటల వేళ ఆగకుండా మోగుతున్న ఫోను చప్పుడుకు మెలకువ వచ్చింది బాబుకు. వాట్స్ ప్ కాల్ అది. బహుశా తను ఎత్తడం లేదని ఆగిపోయింది లేచేటికే. కాని ఒక మెసేజి వచ్చి ఉంది. ఊరిలో తమ పక్కింటిలో ఉండే సుబ్బారావు బాబాయి గారిచ్చిన మెసేజి.

“Sorry to disturb . some bad news .can you please call me back?”

హడావిడిగా నీలిమను లేపాడు బాబు, మెసేజి చూపించాడు.

“ అయ్యో! బాడ్ న్యూసా, తాతగారు వెళిపోయారంటారా..అయ్యయ్యో! రాత్రంతా ఆయనని తిట్టుకున్నాము మనము. పాపం! పెద్దాయన . వయసైపోయినాయన గురించి అలా మాటాడకుండా ఉండాల్సింది. అయినా ఇదేమిటి మన మాటలేవో దేవుడు ఆలకించినట్టుగా తెల్లవారేటికి ఇలా జరుగుతోంది “ గాభరాగా మాటాడేస్తోంది నీలిమ .

బాబు కూడా చాలా సిగ్గుపడ్డాడు, తాత గురించి తను అంత కఠినంగా మాటాడకుండా ఉండాల్సింది. ఎంతైనా తన తాత , అలా అంత చెడ్డగా అనుకున్నాడు తను. పెద్దవయసు తో మరణానికి దగ్గరగా ఉన్న మనిషి చావును కోరుకున్నాడేమిటి తను కాని ఇంత త్వరగా అది నిజమైతే మాత్రం అతనికి ఏదో గిల్టీగా అనిపిస్తోంది.

“నీలిమా! బాబాయ్ కి ఫోను చేస్తున్నా స్పీకరులో పెడుతున్నా” అని పక్కింటాయనకు ఫోను చేసాడు.

అవతల నుంచి ఆయన మాటలు వినిపించాయి

“ బాబూ! ధైర్యంగా ఉండు , ఈ వార్త చెప్పడానికి నాకు చాలా బాధ గాఉంది. మీ అమ్మగారు పద్మావతి గారు ఇకలేరు. రాత్రి నిద్రలోనే అనాయాసంగా ప్రాణాలు వదిలేసారు. గుండెపోటు అనుకుంటున్నాము. నువ్వూ నీ భార్యా పిల్లలూ వెంటనే బయల్దేరి రండి”

**************

కళ్ళార్పకుండా చూస్తున్నాడు శ్రీనివాసరావు పడుకోబెట్టి ఉన్న భార్య దేహాన్ని. నిద్రపోతున్నట్టు ప్రశాంతంగా ఉంది. తనతో కాపురం చేసిన తన మనిషి తన భార్య పద్మ ఇక లేదని ఆయనకు నమ్మబుద్ధి కావడం లేదు. ఎక్కడికి వెళిపోయింది తనను వదిలేసి. అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నట్టు వెళిపోయింది. దారీ తెన్నూ తెలియని గాఢాంధకారంలో తనని వదిలేసి పోయింది.

చూస్తూ ఉండగానే కొడుకు బాబు భార్యా పిల్లలతో వచ్చేసాడు.

“ నేను వచ్చేసానమ్మా నీ దగ్గరుంటాను కళ్ళు తెరవమ్మా నన్ను చూడు నాతో మాటాడమ్మా , ఇరిగో నీ మనవలు వాళ్ళని పలకరించమ్మా! మాటాడు మాటాడు “ అంటూ తల్లి పాదాల మీద తల వాల్చి బాబు భోరు భోరుమని ఏడుస్తుంటే , అలా చూస్తూండి పోయాడు శ్రీనివాసరావు. అమ్మ మాటాడాలిట వాడితో, నిన్నటిదాకా ఎంత కలవరించింది వాడితో మాటాడాలని పద్మ, అపుడు వాడికి చిరాకు. ఇప్పుడూ.. ఏది పద్మ మాటాడుతుందా వాడితో.

ఆపక్క రామభద్రం వీరంగం ఆడేస్తున్నాడు. పొద్దున్నే మామయ్యా ! కాఫీ అంటూ అందించే కోడలు అలా హఠాత్తుగా చచ్చిపోయేటప్పటికి. నమ్మశక్యం కాని భరించలేని షాక్ ఆయనకి. అదేమిటి తను బతికి ఉన్నన్ని రోజులు తనకి సేవ చేస్తూ ఉంటుందని అనుకున్న కోడలు ఇలా అర్ధాంతరంగా పోయేప్పటికి తట్టుకోలేకపోతున్నాడు తన పరిస్ధితి ఏమిటి ఇప్పుడు? తూలుకుంటూ పద్మ శవం దగ్గరకు వెళ్ళి” లేమ్మాయ్! పద్మా లేచి నాకు కాఫీ ఇవ్వు, ఆ బద్ధకమేమిటి తెల్లారే లేవాలని తెలీదూ ఆ మొద్దు నిద్దర ఏమిటి ఏది నా కాఫీ” అంటూ కేకలు వేస్తున్నాడు.

ఆయన పరిస్ధితి చూసి పక్కింటివాళ్ళెవరో గ్లాసులో కాఫీ తెచ్చి ఇచ్చారు ముసలాయన కి నీరసం వస్తుందని. ఆకాఫీ గ్లాసు గెంటేసి తిరగబోసేసాడు ఆయన” పద్మ ఇస్తేనే తాగుతాను నేను “ అంటూ.

శ్రీనివాసరావు లేచి వెళ్ళి తండ్రి ఎదురుగా నులుచున్నాడు. కొడుకుని చూడగానే వెర్రెత్తిన వాడిలాగ “ చూడరా అబ్బాయ్! నీ భార్య , ఇంకా లేవలేదు . లేచి నాకు కాఫీ ఇమ్మని చెప్పు . నిలబడలేకపోతున్నాను నేను , ముసలివాడిని సరిగా చూసుకోవద్దూ నన్నూ” అంటూ ఊగిపోవడం మొదలెట్టాడు.

శ్రీనివాసరావు తండ్రి భుజాలమీద చేయి వేసి నుంచో పెడుతూ “ పోనీ నాన్నా! పద్మ మనకు సేవ చేయలేనంటూ వెళిపోయింది. బతికున్ననాళ్ళు పడింది. ఇప్పుడిక సుఖంగా వెళిపోనిద్దాము లే నాన్నా” అన్నాడు.

ముసలాయన ఈమాటలు వింటూ అభావంగా ఉన్న కొడుకు మొహంలోకి చూసాడు దగ్గరగా. ఒక్కసారిగా ఏదో పొరలలోంచి ఎక్కడో ఒక  కదలిక ఏర్పడినట్టు. ఎక్కడినుంచో మనసు లోతులలోంచి ఏదో భావం బయటకు దుమికింది ఆయనకు . తలతిప్పి పద్మ కేసి చూసాడు తదేకంగా. అంత మనిషీ నిలువెల్లా దుఃఖంతో వణికాడు ఒక్కసారి.

“వెళిపోయిందా వెళిపోయిందా , ఇక తిరిగిరాదా..  కన్నతల్లి ని ఎరగనురా నేను ఎప్పుడూ, తల్లిప్రేమ ఎలా ఉంటుందో తెలీదు కాని ఇవాళ చెపుతున్నాను,  నన్ను నా కోడలు  కన్నతల్లి లాగ చూసుకుంది. ఏ గొడవ చేసినా పడింది ఏమి తిట్టినా సహించింది. పద్మా! అమ్మా! నన్ను వదిలేసి వెళ్ళిపోయావా , నన్ను అనాధను చేసావు కదమ్మా” అంటూ ఏడుస్తూ పద్మ పక్కనే కూలబడ్డాడు.

ఆయనని పట్టుకు ఏడ్చాడు బాబు “ తాతా! అమ్మ ” అంటూ, “ మీ అమ్మ దేవతరా! పద్మా నువు దేవతవి” అంటున్నాడు రామభద్రం కలవరిస్తున్నవాడిలా.

వాళ్ళని ఒకసారి చూసి పద్మను చూసుకున్నాడు శ్రీనివాసరావు. సుఖస్వప్నాలు కంటున్నదానిలాగ పరమ ప్రశాంతంగా ఉంది పద్మ మొహం.

కొంచం ముందుకు వచ్చి తలెత్తి ఆకాశం కేసి చూసి ప్రశ్నించాడు శ్రీనివాసరావు మనసులోనే,

“ ఆమె సుఖపడాలని నువ్వు చేసిన న్యాయం ఇదా దేవుడూ..?” అని.

********

Leave a Reply

Your email address will not be published. Required fields are marked