-G.S.S. కళ్యాణి
“ఒరేయ్ శంకరం! నాకు ‘క్షేమంకరి’ సంస్థలో ఉద్యోగం వచ్చిందిరా! వాళ్ళు నెలనెలా నాకు బోలెడు జీతం ఇస్తారట! నిన్ను నేనిక రాజాలా చూసుకుంటానురా! నీకు కావలసినవన్నీ కొనిపెడతా! నిన్ను బాగా చదివిస్తాను కూడా!”, అంటూ తన పదేళ్ల మనవడు శంకరాన్ని ముద్దు పెట్టుకున్నాడు ధర్మయ్య.
“తాతా! మరి రేపటినుండి మన పొలంలో పనులెవరు చేస్తారూ??”, అమాయకంగా అడిగాడు శంకరం.
“నాకు ఇప్పుడు వ్యవసాయం చేసేందుకు ఓపిక సరిపోవట్లేదురా! అందుకే వ్యవసాయం వదిలి ఉద్యోగంలో చేరిపోయాను! ఆ పొలంలో కొంత భాగంలో మనం పెద్ద ఇల్లు కట్టుకుందాం. మిగతాది నువ్వు ఆడుకునేందుకు ఉయ్యాల, జారుడుబండాలాంటి ఆటవస్తువులతో నింపేద్దాం! సరేనా?”, శంకరం కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తూ అడిగాడు ధర్మయ్య.
“ఆయ్! భలే! భలే! అప్పుడు నేను రోజంతా ఎంచక్కా ఆడుకోవచ్చు!”, ఆనందంతో చప్పట్లు చరుస్తూ అన్నాడు శంకరం.
“నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలిరా!”, అంటూ శంకరాన్ని గట్టిగా కౌగలించుకున్నాడు ధర్మయ్య.
ధర్మయ్య విమలాపురం అనే గ్రామంలో ఒక రైతు. విమలాపుర గ్రామంలో నివసించే వాళ్ళందరి వృత్తి వ్యవసాయమే! ఆ ఊళ్ళో ‘క్షేమంకరి’ అనే చిన్న నది ప్రవహిస్తోంది. ఆ నది ఆ ఊరికి పొలిమేరల్లో ఉన్న పర్వతశ్రేణుల్లో పుట్టి, విమలాపురం గూండా ప్రవహిస్తూ, సముద్రాన్ని చేరుకుంటుంది. విమలాపురం ప్రజల నీటి అవసరాలన్నీ ఆ నదే తీర్చడంతో దాన్ని ముద్దుగా ‘కన్నతల్లి’ అని పిలుస్తూ ఉంటారు ఆ ఊరి ప్రజలు. ధర్మయ్య తనకున్న పొలంలో ధాన్యం పండించి జీవనం సాగించేవాడు. నాలుగేళ్ల క్రితం ధర్మయ్య భార్య జబ్బు చెయ్యడంతో కన్నుమూసింది. పిల్లలులేని ధర్మయ్య నిరాశతో కుంగిపోయాడు. అనుక్షణం వేధిస్తున్న ఒంటరితనాన్ని భరించలేక శంకరాన్ని దత్తత తీసుకుని, వాడిని తన సొంత మనవడిలా చూసుకుంటూ, ప్రాణప్రదంగా పెంచుకుంటున్నాడు ధర్మయ్య! తనకు నిలకడగా ఆదాయం వచ్చే మార్గం కోసం అన్వేషిస్తున్న ధర్మయ్యకు తమ ఊరిలో కొత్తగా పెట్టిన ‘క్షేమంకరి’ పరిశ్రమలో ఉద్యోగం దొరికింది.
ధర్మయ్య ‘క్షేమంకరి’ లో ఉద్యోగానికి వెళ్లడం మొదలుపెట్టాడు. దాదాపు రోజంతా ఉద్యోగమే సరిపోయేది ధర్మయ్యకు.
“తాతా! నువ్వెళ్ళిపోతే నాకు ఇంట్లో ఏమీ తోచట్లేదు!”, ఒకరోజు రాత్రి బిక్కమొహం పెట్టుకుని ధర్మయ్యతో అన్నాడు శంకరం.
“వచ్చే ఏడాది నిన్ను మన ఊళ్లోని బళ్ళో వేస్తాను! అప్పుడు నీకు సగం రోజు బడిలోనూ మిగతా రోజు నీ స్నేహితులతోనూ గడిచిపోతుంది! అంతవరకూ ప్రతిరోజూ నేను ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నువ్వు నాతోపాటూ వస్తే, నిన్ను క్షేమంకరి నది ఒడ్డున దిగబెడతా. అక్కడ నువ్వు ఆడుకుంటూ, నదినీ, పక్షులనూ చూస్తూ రోజంతా కాలక్షేపం చెయ్యచ్చు. పైగా ఆ ప్రదేశం మా పరిశ్రమ వెనకాలే ఉంది! నీకు నన్ను చూడాలని అనిపిస్తే అక్కడినుంచీ మా పరిశ్రమలోకి రావడానికి ఒక చిన్న తోవ కూడా ఉంది! నువ్వు ఎప్పుడుకావాలంటే అప్పుడు వచ్చి నన్ను చూసి వెళ్ళచ్చు!”, అన్నాడు ధర్మయ్య.
శంకరానికి ధర్మయ్య చెప్పినది నచ్చింది. మర్నాడు తినుబండారాలు కొన్ని తన చేతి సంచిలో సద్దుకుని ధర్మయ్యతోపాటూ బయలుదేరాడు శంకరం. ధర్మయ్య శంకరాన్ని క్షేమంకరి నది ఒడ్డున దిగబెట్టి పరిశ్రమలోకి వెళ్ళిపోయాడు. శంకరం నది ఒడ్డున ఉన్న ఇసుకలో కాసేపు ఆడుకుని ఆ తర్వాత నది వంక చూస్తూ కూర్చున్నాడు. ఆ నది నీళ్లతో నిండుగా కళకళలాడుతూ వేగంగా ప్రవహిస్తోంది. చుట్టుపక్కల వాతావరణం నిశ్శబ్దంగా ఉండటంతో ఆ నదీ ప్రవాహం చేస్తున్న ఘోష శంకరానికి లీలగా వినపడుతోంది!
అంతలో, “కడుపునిండా తినండిరా నాయనలారా! మీ కడుపు నింపాలనే నా తాపత్రయం!”, అని శంకరానికి ఎవరిదో గొంతు వినపడటంతో ఆ మాటలు వినపడిన వైపుకి తలతిప్పి చూశాడు శంకరం.
నది ఒడ్డుకి అవతలివైపు ఒక మధ్యవయస్కురాలైన మహిళ తన పిల్లలకు భోజనం పెడుతోంది. ఆ పిల్లలిద్దరూ సుమారుగా శంకరం వయసువాళ్ళే! ఆ మహిళ తన పిల్లలను గారాం చేస్తూ ఎంతో ప్రేమతో వివిధ రకాల ఆహారపదార్ధాలూ, పళ్ళూ తినిపిస్తోంది. ఆ పిల్లలకు వాళ్ళమ్మ ఆహారాన్ని ఎంత ఇష్టంగా తినిపిస్తోందో, వాళ్ళు కూడా ఆమెపట్ల అంతే ఇష్టంతోనూ, గౌరవంతోనూ వ్యవహరిస్తున్నారు. తల్లీబిడ్డల మధ్య ఉండే ప్రేమానురాగాలకు ఉదాహరణగా ఉన్న ఆ దృశ్యాన్ని చూసిన శంకరం, ‘అమ్మ ఉంటే ఇంత బాగుంటుందా? నాక్కూడా అమ్మ ఉండి ఉంటే నేనిక్కడ ఇలా ఒంటరిగా కూర్చోవాల్సిన అవసరం లేకపోయేది!’, అని అనుకున్నాడు.
ఆ మహిళ శంకరం మనసులో అనుకున్న మాటలు తనకు వినపడ్డాయా అన్నట్లు శంకరంవంక చూస్తూ ఆపాయ్యయంగా ఓదార్పుతో కూడిన చిరునవ్వు నవ్వింది. ఆశ్చర్యపోయాడు శంకరం! ఆ తర్వాత, ఆ మహిళ తను ఉంటున్న గుడిసెలోకి వెళ్లి ఒక పళ్లెం నిండా ఆకుకూరలూ, పళ్ళూ పట్టుకొచ్చి తను పెంచుకుంటున్న మేకలూ, గొర్రెలూ, ఆవులూ, కుందేళ్ళూ వంటి రకరకాల జంతువులను పిలిచి, తన కన్నబిడ్డలకు ఎటువంటి ప్రేమతో అన్నం తినిపించిందో అంతటి ప్రేమతో వాటికి కూడా ఆ ఆహారాన్ని తినిపించింది. ఆ జంతువులన్నీ ఆమె పెట్టిన ఆహారాన్ని తినగానే ఆ మహిళ తన గుడిసెలోకి వెళ్ళిపోయింది. అప్పటికి సాయంత్రం కావస్తూ ఉండటంతో ధర్మయ్య శంకరం వద్దకు వచ్చాడు.
“తాతా! అది ఎవరూ?”, ఆ మహిళ వంక వేలు చూపుతూ ధర్మయ్యను అడిగాడు శంకరం.
“అదా? అదేరా! మన ఊరివాళ్ల భాగ్యం!!”, అన్నాడు ధర్మయ్య నది వంక చూస్తూ.
‘ఓహో ! ఆవిడ పేరు భాగ్యం అన్నమాట!’, అనుకున్నాడు శంకరం మహిళ వంక చూస్తూ.
శంకరం మనసులో భాగ్యంపై ఒకలాంటి గౌరవ భావన ఏర్పడిపోయింది. అప్పటినుండీ ప్రతిరోజూ శంకరం నది ఒడ్డున కూర్చుని కాసేపు ఆడుకున్నాక భాగ్యం వంకా, ఆమె పిల్లల వంకా, ఆ చుట్టుపక్కలనున్న జంతువుల వంకా చూస్తూ భాగ్యం చూపుతున్న ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని చూసి ఆనందిస్తూ, ఆమె తన వైపు చూసినప్పుడల్లా ఆ చూపులో కనపడే పుత్రవాత్సల్యాన్ని అనుభవిస్తూ కాలం గడపసాగాడు. కొద్దిరోజులు గడిచాక ధర్మయ్య శంకరాన్ని బళ్ళో వేశాడు. శంకరం బడి అవ్వగానే నేరుగా నది ఒడ్డుకి చేరుకొని కాసేపు ఆడుకుని, ఆ నది ఘోషను ఆస్వాదిస్తూ, భాగ్యాన్నీ, పిల్లలనూ చూస్తూ కాసేపు గడిపి ఆ తర్వాత ధర్మయ్యతో కలిసి ఇంటికి వెళ్ళేవాడు.
కొన్నేళ్లు గడిచాయి. శంకరం పెద్ద తరగతులకు రావడంతో ఎక్కువ సమయం చదువు కోసం కేటాయించవలసి వచ్చింది. దాంతో నది ఒడ్డున కూర్చునే తీరిక లేకుండా పోయింది శంకరానికి. మరోపక్క క్షేమంకరి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందటంతో విమలాపురం గ్రామం కూడా రూపాంతరం చెంది పట్నంగా మారిపోయింది! ఆ ఊరి చుట్టుపక్కలనున్న పొలాలు కనుమరుగైపోయాయి! ఒకప్పుడు తన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించిన పచ్చటి పొలాలపై అమితమైన ఇష్టాన్ని పెంచుకున్న శంకరానికి వ్యవసాయం పై మక్కువ ఏర్పడింది. తన స్కూలు చదువు పూర్తికాగానే, విమలాపురానికి కొంచెం దూరంగా ఉన్న ప్రాంతంలోని ఒక ప్రముఖ కళాశాలలో వ్యవసాయానికి సంబంధించిన కోర్సులో చేరిపోయాడు శంకరం.
ఒకసారి సెలవులకని ధర్మయ్య వద్దకు వచ్చిన శంకరం, “తాతా! నువ్వు ఇక ఆ క్షేమంకరి పరిశ్రమలో ఉద్యోగం మానేసి ఇంటిపట్టునే ఉండు! నా చదువు పూర్తికావచ్చింది. ఆ తర్వాత నాకు ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడికి నిన్ను కూడా నాతో తీసుకెళ్ళిపోతా! ఊరికే కష్టపడకు!”, అన్నాడు.
అందుకు ధర్మయ్య, “ఒరేయ్ శంకరం! క్షేమంకరి పరిశ్రమ నిజంగానే మన క్షేమాన్ని చూసుకుంటున్న సంస్థరా! మనం ఇన్నాళ్లూ ఏ లోటూ లేకుండా ఉన్నామంటే అది ఆ పరిశ్రమవల్లే! నేనక్కడ ఎన్నో ఏళ్ళు నమ్మకంగా పనిచేశాను కాబట్టి నాకు ఆ సంస్థలో పేరూ, గౌరవం, పలుకుబడీ వచ్చాయి. ఆ పరిశ్రమను స్థాపించిన రాజారావుగారికి నా మాటంటే గురి! నీ చదువు పూర్తయ్యాక క్షేమంకరిలో నీకు ఉద్యోగం ఇవ్వమని ఆయనకు చెప్పాను! ఆయన ఒప్పుకున్నారు కూడా! మనం ఈ ఊరిని విడిచి ఎక్కడికీ పోనక్కర్లేదురా!”, అన్నాడు ధీమాగా!
ధర్మయ్య ఎంతో సంతోషంగా చెప్పిన ఆ విషయానికి వెంటనే ఎదురుచెప్పలేక మౌనంగా ఊరుకుండిపోయాడు శంకరం. కళాశాల పునఃప్రారంభమయ్యే రోజు దగ్గర పడింది. పట్నానికి తిరుగు ప్రయాణమయ్యేందుకు సిద్దమవుతున్న శంకరానికి ‘క్షేమంకరి’ నది ఒడ్డులో తను చిన్నప్పుడు కాలక్షేపం చేసిన ప్రదేశం గుర్తుకొచ్చింది. కాసేపు ఆ నది ఒడ్డున చిన్నప్పట్లా గడపాలని శంకరం అక్కడికి వెళ్ళాడు. ఆ ప్రదేశంలో చాలా మార్పులు గమనించాడు శంకరం. నదీతీరంలో ఉండాల్సిన మెత్తటి ఇసుక ఇప్పుడు బరకగా మారింది. నదిలో నీటి మట్టం తగ్గి ఉంది. పాతగుడ్డలూ, చిత్తుకాగితాలవంటి చెత్త ఒడ్డు మీద అక్కడక్కడా పడి ఉంది. ఉన్నంతలో కాస్త శుభ్రంగా ఉన్న చోటు చూసుకుని, అక్కడ కూర్చుని ఒడ్డుకి అవతలున్న గుడిసె వైపుకి చూశాడు శంకరం.
భాగ్యం కాస్త చిక్కి నీరసంగా కనపడింది. ఆమె పెంచుకుంటున్న జంతువులలో కొన్ని కనపడలేదు. ఆమె పిల్లలు శంకరంలాగే యుక్తవయస్కులయ్యారు. భాగ్యం తన పిల్లలకు ఆహారాన్ని పళ్లెంలో పెట్టి పట్టుకొచ్చి వారికి ఎప్పటిలాగే ప్రేమతో తినిపించింది. కానీ వారు ఆ ఆహారాన్ని కొంత రుచి చూసి మొహాలు చిట్లించి, తమ దగ్గరున్న సంచుల్లోంచీ ఏవో తినుబండారాలు తీసి, అవి తిని అక్కడినుంచీ వెళ్లిపోయారు. భాగ్యం దుఃఖంతో గుడిసెలోకి వెళ్లి పళ్లెంలో సగానికి ఆకుకూరలూ, పళ్ళూ పట్టుకొచ్చి అక్కడున్న ఆవులకూ, మేకలకూ పెట్టింది. ఆ ఆకుకూరలు మునుపటిలా నవనవలాడుతూ కాకుండా బాగా వడిలిపోయి ఉన్నాయి. పళ్ళెంలో ఉన్న పళ్లైతే రేపో మాపో కుళ్లిపోయేటట్టు ఉన్నాయి! జంతువులకు ఆహారం పెట్టిన వెంటనే భాగ్యం శంకరంవైపు చూసి బాధను అణచుకుంటూ చిరునవ్వుతో పలకరించి గుడిసెలోకి వెళ్ళిపోయింది. భాగ్యం మనసులో పడుతున్న వ్యధ ఆమె కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనపడింది శంకరానికి! అంతలో చీకటి పడుతూ ఉండటంతో భాగ్యం గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు శంకరం.
ఆ తర్వాత శంకరం పట్నం వెళ్లి చదువు పూర్తి చేసుకుని డిగ్రీ పట్టాతో విమలాపురం చేరుకున్నాడు. ఒక మంచిరోజు చూసుకుని ఉద్యోగవేట మొదలుపెడదామని శంకరం అనుకుంటూ ఉండగా, ధర్మయ్యకు తీవ్రమైన అనారోగ్యం చేసి మంచం పట్టాడు. తనను కష్టపడి పెంచి పెద్దవాడిని చేసిన ధర్మయ్య బాగోగులు దగ్గరుండి చూసుకోవడంతోపాటూ, ఉద్యోగ విషయంలో అతడి కోరికను తీర్చినట్లవుతుందన్న ఉద్దేశంతో, తన ఇష్టాలను పక్కనపెట్టి ‘క్షేమంకరి’ పరిశ్రమలో చేరిపోయాడు శంకరం.
మరికొన్ని సంవత్సరాలు గడిచాయి. విమలాపురం మరింత అభివృద్ధి చెందింది. కానీ, ‘క్షేమంకరి’ పరిశ్రమలో ఉన్నట్లుండి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో ఎన్నో ఏళ్లుగా పలు కుటుంబాలను పోషించిన ఆ సంస్థ మూతపడే స్థితికి చేరుకుంది! శంకరం ఉద్యోగ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ధర్మయ్య ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తూ ఉండటంతో వేరే ఉద్యోగం వెతుక్కుని విమలాపురం విడిచిపెట్టి వెళ్లిపోలేని పరిస్థితుల్లో చిక్కుకున్నాడు శంకరం! వివిధ రకాల ఆలోచనలతో అల్లకల్లోలంగా ఉన్న తన మనసును కుదుట పరచుకునే క్రమంలో క్షేమంకరి నది ఒడ్డు శంకరానికి జ్ఞాపకం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళాడు శంకరం.
శంకరం ఎప్పుడూ కూర్చునే చోటు ఇప్పుడు మరింత చెత్త పేరుకునిపోయి ఉంది. ఎటు చూసినా ఈగలూ, దోమలూ, అక్కడక్కడా పందులతో అపరిశుభ్రంగా ఉందా ప్రదేశం! ‘ఇలా ఉందేమిటీ?’, అని ఆశ్చర్యపోతూ ఎక్కడా కూర్చునే చోటు లేక చివరికి ఒక చోట నిలబడి భాగ్యం ఉంటున్న గుడిసెవైపు చూశాడు శంకరం. భాగ్యం గుడిసె బయట కూర్చుని ఉంది. ఆమె రూపం పూర్తిగా మారిపోయింది! బక్కపలచని శరీరంతో, నెరిసిపోయిన జుట్టుతో, చిరిగిన దుస్తులు వేసుకుని ఉంది భాగ్యం. ఆమె చుట్టూ ఈగలు ముసురుతున్నాయి. ఆమె పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళైపోయారు. వారు భాగ్యం మీద చెత్తను విసురుతూ, ఆమెను చూస్తూ, ‘అది చెత్తరా! దాని దగ్గర భరించలేని కంపురా! ఛ! ఛ! అసలు మనం దాని దగ్గరకు వెళ్ళద్దు! వెడితే మనకు కడుపులోతిప్పినట్లయ్యి వాంతొస్తుంది!!’, అని వెకిలిగా నవ్వుకుంటూ అక్కడినుంచీ వెళ్లిపోయారు.
“ఒరేయ్! నన్నిలా చేసింది మీరేరా! నన్ను మీరు సరిగ్గా చూసుకుని ఉంటే నాకు ఈ దుస్థితి వచ్చేది కాదు! నన్ను మాటలతో బాధ పెట్టకండి! ఎంతైనా నేను మీ కన్నతల్లిని రా!”, అంటూ రోదించింది భాగ్యం.
భాగ్యం పెంచుకున్న జంతువులేవీ అక్కడ లేవు. వాటిని ఒకప్పుడు కట్టి ఉంచిన తాళ్లు మాత్రం అక్కడున్న కర్రలకు వేళ్ళాడుతున్నాయి. భాగ్యం దీనాతిదీనంగా శంకరం వంక చూసింది. ఆమె కళ్ళల్లో మునుపు ఉన్న అదే ప్రేమా, వాత్సల్యాలు కనపడ్డాయి శంకరానికి. కానీ ఆమెలో ఇంతకుముందున్న కళ ఇప్పుడు లేదు!
శంకరం మనసు మరింత కలవరం చెందింది. చేసేది లేక ఇంటికి బయలుదేరాడు శంకరం. కానీ భాగ్యం రూపమే తనకు మదిలో మెదులుతోంది. అంతలో శంకరానికి తన చిన్నప్పుడు జరిగిన సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది. ఒకరోజు శంకరం నది ఒడ్డున ఆడుతూ ఉండగా కొండల్లో కురిసిన భారీవర్షపు నీళ్ళవల్ల నది పోటెత్తి శంకరం మీదికి వచ్చింది. ఉదృతంగా ఎగసి పడుతున్న నదీప్రవాహంలో కొట్టుకుపోతున్న శంకరాన్ని భాగ్యం చెయ్యి పట్టుకుని నీళ్ళనుండీ ఒడ్డుకు లాగి కాపాడింది!
ఆ తర్వాత భాగ్యం శంకరం వీపు నిమురుతూ ,”జాగ్రత్త నాయనా! నువ్వు కూడా నా కన్నబిడ్డలాగే కదా! నీ క్షేమం నాకు ముఖ్యం! జాగ్రత్త!!”, అని అంటూ మెరుపు వేగంతో నదికి అవతలున్న ఒడ్డుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది!
‘ఆనాడు తన ప్రాణం అడ్డువేసి నన్ను కాపాడిన భాగ్యమ్మత్తను కాపాడటం నా కర్తవ్యం!’, అనుకున్నాడు శంకరం. వెంటనే పరుగు పరుగున మళ్ళీ నది వద్దకు వెళ్లి గుడిసె వైపు చూశాడు. అక్కడ భాగ్యం కనపడలేదు!
నదిలో నీటిమట్టం ఎక్కువగాలేకపోవడంతో శంకరం మొట్టమొదటిసారి నదిని దాటడం ప్రారంభించాడు. ఆశ్చర్యం! శంకరం ఆ గుడిసె ను సమీపించే కొద్దీ అది అదృశ్యమైపోతోంది!! శంకరం నది దాటి అవతలి ఒడ్డుకు చేరేసరికి, అక్కడ గుడిసె కాదుకదా కనీసం దాని ఆనవాలు కూడా కనిపించలేదు శంకరానికి! అయోమయంలో పడ్డాడు శంకరం! తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు! ‘అంతా చిత్రంగా ఉందే!’, అని అనుకుంటూ ఒకింత నిరాశతో ఇంటికి చేరుకొని, ఆ రాత్రి భోజనం చేసి పడుకున్న శంకరం భాగ్యం గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. ఒక రాత్రివేళ శంకరం కలలోకి భాగ్యం వచ్చింది!
“అత్తా! నేను నీకోసం నువ్వుంటున్న గుడిసె దగ్గరకు వచ్చాను! కానీ నువ్వు కనపడలేదు! ఎక్కడికెళ్ళావత్తా?”, భాగ్యాన్ని ఆత్రంగా అడిగాడు శంకరం.
“నేనెక్కడికి వెడతాను బాబూ? పిల్లలను విడిచి కన్నతల్లి ఎక్కడికో వెళ్లిపోగలదా? వెళ్లినా సుఖంగా ఉండగలదా??”, అడిగింది భాగ్యం.
“నిజమే అత్తా! నీ పిల్లలు నీ మీద కొంచెం కూడా కనికరం లేకుండా ప్రవర్తించారు! వాళ్ళను ఏంచేసినా పాపంలేదు!! దిగులుపడకత్తా! నిన్ను చూసుకోవడానికి నేనున్నాను!”, అన్నాడు శంకరం.
“నన్ను కాపాడటం నీ ఒక్కడివల్లా కాదు శంకరం! అందుకు మీ విమలాపురం ప్రజలందరూ పూనుకోవాలి!”, అంది భాగ్యం గంభీరంగా. అర్ధంకానట్టు మొహం పెట్టాడు శంకరం.
“నీకు అంతా వివరంగా చెప్తాను విను! నేను మీ విమలాపురం భాగ్యాన్ని!”, అంది భాగ్యం.
“అవునూ! మా తాత కూడా అదే చెప్పాడు!”, అన్నాడు శంకరం.
” బాబూ శంకరం! నేను చెప్పేది ప్రశాంతంగా విను! నేను మీ ‘క్షేమంకరి’ నదిని! మీ ఊరి ప్రజలు చేజేతులా దూరం చేసుకుంటున్న భాగ్యాన్ని!”, అంది భాగ్యం.
“అ..అ..అంటే నువ్వు….?!!”, సంభ్రమాశ్చర్యాలతో నోటమాట రాలేదు శంకరానికి.
“అవును బాబూ! నేను ‘క్షేమంకరి’ నదిని! నీ ఒక్కడికీ ఇలా స్త్రీ రూపంలో కనపడుతున్నాను! నీకు కనపడిన ఆ పిల్లలు ఈ విమలాపురవాసులు! ఇక ఆ జంతువులు నాలో జీవించే జలచరాలు!”, చెప్పింది భాగ్యం.
శంకరానికి భాగ్యం చెప్తున్నది అర్ధంచేసుకునేందుకు అర నిమిషం పట్టింది. అప్పుడు తేరుకున్న శంకరం భాగ్యం కాళ్ళ మీద పడి, “అమ్మా! నిన్ను చూసిన మొదటి రోజు, నిజంగానే నువ్వు ఆ అమ్మవారిలా కళకళలాడుతూ ఉన్నావు! నీ చూపులతో నువ్వు నా మీద కురిపించిన ప్రేమ నాకు మా అమ్మను గుర్తుకుతెచ్చింది! తల్లీ!! నీకెందుకిప్పుడీ దురవస్థ? నీ నదీఘోషలో ఒకప్పుడు నాకు వినపడిన నాదం ఇప్పుడు కనుమరుగైపోవడానికి కారణం ఏమిటో చెప్పమ్మా! చెప్పు!! “, అంటూ వేడుకున్నాడు శంకరం.
“నాయనా శంకరం! నువ్వు అంటున్నది నిజమే! నాది ఇప్పుడు నదీఘోష కాదు! ఎవ్వరికీ వినపడని ‘నిశ్శబ్ద ఘోష’!! ఈ గ్రామ ప్రజలంతా నా పిల్లలని నమ్మి నేను విమలాపురాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఈ ఊరు గూండా ప్రవహిస్తున్నాను. ఒకప్పుడు నన్ను ‘కన్నతల్లి’గా ఆదరించి, నేనందించే నీటితో వ్యవసాయం చేసుకుని, కడుపు నింపుకునేవారు ఇక్కడి ప్రజలు. కానీ ఇప్పుడు?! అభివృద్ధి పేరుతో నన్ను నిర్లక్ష్యం చేశారు! సరికదా నా మీద చెత్తను విసిరేస్తూ, నాలో వ్యర్ధాలు కలిపి నా నీటిని కలుషితం చేసేశారు! ఒకప్పుడు నన్ను చూసి భక్తిగా నమస్కరించిన ప్రజలే ఇప్పుడు నన్ను చూసి చీదరించుకుంటున్నారు! అసలు నేను ఇంతకు ముందులా ప్రవహించట్లేదని మీలో ఎంతమంది గమనించారు? రోజురోజుకీ నేను క్షీణించి పూర్తిగా ఎండిపోయే స్థితికి వచ్చాను! నది లేని చోట నీళ్లు ఉండవు. నీళ్లు లేకపోతే ఈ భూమి మీద జీవరాసుల మనుగడే లేదు! ఆ ప్రకృతిమాత మానవ జాతికి అమ్మగా మారి, వారు సుఖంగా జీవించడానికి అవసరపడే వనరులను నిరంతరం సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉంటుంది. మరి ఆ తల్లి తమపై కురిపించే ప్రేమను అర్ధంచేసుకుంటూ, ఆవిడ ఇచ్చే అమూల్యమైన వనరులను కాపాడుకునే బాధ్యత ఆ మానవులదే! మానవులు స్వార్ధాన్ని విడిచి తమ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన తరుణం వచ్చింది! ఇన్నాళ్లూ మీరంతా నా బిడ్డలని భావించి మీ కడుపులు నింపి ఆకళ్ళు తీర్చాను! నేనే కనక లేకపోతే ఇక మీ ఆకలి తీర్చేదెవరు?”, దుఃఖంతో అంది భాగ్యం.
“బాధపడకమ్మా! చెప్పానుగా! నీకు నేనున్నాను! నన్ను ఏంచెయ్యమంటావో చెప్పు! నువ్వు ఏం చెప్పినా చెయ్యటానికి నేను సిద్ధంగా ఉన్నాను!”, అన్నాడు శంకరం.
“ఆలోచించు శంకరం! నా ఒడ్డు మీద ఆడుకుంటూ పెరిగిన వాడివి! నన్ను కాపాడే ఆలోచన నీకే తడుతుంది!”, అంది భాగ్యం.
“అమ్మా! నిన్ను కలుషితం చేస్తున్నదెవరో నేను తెలుసుకుంటాను! నీకు కలిగిన కష్టం తొలగించేందుకు నా వంతు కృషి నేను చేస్తాను! నీళ్లు లేక వెలవెలబోతున్న నిన్ను చూసిన ప్రతి ఒక్కరికీ నీ ‘నిశ్శబ్ద ఘోష’ వినపడేలా చేస్తాను!!”, అన్నాడు శంకరం.
“సంతోషం నాయనా! విజయోస్తు!”, అని దీవించి అంతర్ధానమైపోయింది భాగ్యం.
శంకరానికి మెలకువ వచ్చింది. కలలో భాగ్యం చెప్పిన విషయాలూ, తను భాగ్యానికి ఇచ్చిన మాటా అన్నీ నిజంగా జరిగినట్లుగా గుర్తున్నాయి శంకరానికి. శంకరం గబగబా స్నానపానాదులు ముగించి ‘క్షేమంకరి’ నదీ తీరానికి వెళ్లి నదిని పరిశీలనగా చూసాడు. నది నిజంగానే దాదాపుగా ఎండిపోయి ఉంది. అందులో ఉన్న కొద్దిపాటి నీళ్లు రంగు మారిపోయి, మురికిగా ఉన్నాయి. నదికి ఇరువైపులా గుట్టలుగుట్టలుగా చెత్త పేరుకుని పోయి దుర్గంధాన్ని వెదజల్లుతోంది. నదీతీరానికి అవతలవైపు భాగ్యం కొడుకులిద్దరూ, ‘అమ్మా! ఆకలీ! దాహం!!’, అంటూ దయనీయ స్థితిలో కిందపడి ఉన్నారు.
‘నదిని కాపాడుకోకపోతే విమలాపురం గ్రామ ప్రజల గతి కూడా అదే!’, అని అనుకుంటూ శంకరం ‘క్షేమంకరి’ పరిశ్రమకు వెళ్ళాడు. క్షేమంకరి సంస్థ వ్యవస్థాపకుడైన రాజారావుని కలిసి ఆ మాటా ఈ మాటా చెబుతూ ఆ సంస్థలో వ్యర్ధాలన్నీ ఎటు వదులుతున్నారన్నది ఆరా తీశాడు శంకరం. అతడి అనుమానం నిజమైయింది! క్షేమంకరి సంస్థ నుండీ వెలువడుతున్న రసాయనిక వ్యర్ధాలన్నీ నేరుగా క్షేమంకరి నదిలోకి వెడుతున్నాయి! వెంటనే శంకరం ఆ వ్యర్ధాలకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చెయ్యాలని రాజారావుకి చెప్పి అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ తానే స్వయంగా పూర్తి చేసి, సంబంధిత అధికారులతో చర్చలు జరిపి అనుకున్న పనిలో విజయం సాధించాడు. ఆ తర్వాత విమలాపురం గ్రామప్రజలకు నదిని కాపాడుకోవలసిన బాధ్యతను గురించి చెప్పి, వారిలో చైతన్యాన్ని కలిగించి, నదిని ఉద్ధరించే కార్యక్రమాన్ని శంకరం ఒక ఉద్యమంలాగా చేపట్టాడు. శంకరం చెబుతున్నది గ్రామప్రజలకు సమంజసంగా తోచింది. వారంతా అతడికి సహకరించడానికి ముందుకొచ్చారు. గ్రామస్థుల సహాయంతో నదిలోని చెత్తను తీసి శుభ్రంచేసి, నదికి అవతలున్న స్థలాలలో మొక్కలు నాటి, అక్కడ వ్యవసాయం ప్రారంభించాడు శంకరం.
కొద్దిసంవత్సరాలలో పచ్చని పంటపొలాలతో, వృక్షాలతో ఆ ప్రాంతమంతా అందంగా తయారయ్యింది. క్షేమంకరి నదీప్రవాహం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చి, ఆ నది నిండుగా ప్రవహించడం మొదలుపెట్టింది. క్షేమంకరి సంస్థలోని ఆర్ధిక సమస్యలు తొలగిపోయి వ్యాపారంలో నిలదొక్కుకోగలిగింది.
ఒకరోజు తెల్లవారుఝామున శంకరం నదీతీరానికి వెళ్లి నదీప్రవాహాన్ని గమనిస్తూ కూర్చున్నాడు. నది తన చిన్నప్పటిలాగా ఉప్పొంగుతూ ప్రవహిస్తోంది. ఆ నది చేస్తున్న ఘోష కూడా శంకరానికి లీలగా వినపడుతోంది! ఆ ఘోష విన్న శంకరం మనసు ఆనందంతో చిందులు వేసింది. నది వంక తృప్తిగా చూస్తూ, అక్కడ వీస్తున్న స్వచ్ఛమైన చల్లటి గాలిని ఆస్వాదిస్తూ, ఒడ్డు అవతలి వైపుకి చూశాడు శంకరం. అక్కడ శ్రీ మహాలక్ష్మిలా కళకళలాడుతూ, చేతిలో నవనవలాడుతున్న కూరలూ, పళ్ళూ పట్టుకుని, రకరకాల జంతువులకు ప్రేమతో ఆహారం తినిపిస్తూ, నవయవ్వన కాంతులు విరజిమ్ముతున్న మేనితో చిరునవ్వులు చిందిస్తోంది భాగ్యం!
*****