కథా భారతి

పత్రం..పుష్పం..

-శ్రీధర్ రెడ్డిబిల్లా

(శాక్రమెంటో తెలుగు అసోసియేషన్ కథల పోటీ -2021 లో బహుమతి పొందిన కథ)

“యాకుందేంతు తుషార హార..” అంటూ మొదలెట్టిన సర్వస్వతీ స్తోత్రం ముగియగానే పిల్లలందరి నోటా ఒకటే కేరింత. గురుకులానికి ఈసారి సంక్రాంతి పండుగకు కూడా పదిహేను రోజులు సెలవులివ్వటంతో అందరూ ఇళ్లకు వెళ్లే రోజు అది. అందరి నాన్నలు వచ్చి తమ తమ పిల్లల్ని తీసుకెళ్తున్నారు.

నాన్న ఇంకా రావట్లేదేంది అనుకుంటూ మాటిమాటికీ గుట్ట పక్కనున్న వంక దారివైపు చూస్తున్నాడు శ్రీను. ఆరెపల్లి అడ్డరోడ్డు దగ్గర బస్సు దిగి ఎడమ వైపున్న మట్టిరోడ్డు మీద ఐదు కిలోమీటర్లు వస్తే చుట్టూ గుట్టలు, చిన్నపాటి అడవి మధ్య విశాల మైదానంతో ఉంటుందా గురుకులం.

వాళ్ళ ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవుతుండటంతో శ్రీనును వాళ్ళ నాన్న ఆరవ తరగతిలోనే గురుకులంలో వేశాడు. ఇప్పుడు శ్రీను పదవ తరగతి.

గత ఐదేళ్ల నుంచి అదే గురుకులంలోనే చదువుతున్నాడు కాబట్టి శ్రీనుకు ఇంటికి పోయేటప్పుడు పిల్లలు కొట్టే కేరింత తెలుసు. మళ్ళీ వచ్చేటప్పుడు పిల్లల మొఖాల్లో ఉండే దిగులూ తెలుసు.

మూడు,నాలుగు గంటల్లోనే పిల్లలందరు ఇళ్లకు వెళ్లిపోగా ఇంకా శ్రీను ఒక్కడే మిగిలాడు. “కొంచెం ఓపిక పట్టరా! ఆత్ర పడకు! ఓ గంట అటూ ఇటూను! మీ నాన్నగారు వచ్చేస్తారు!” అని ఆచార్యులు గారు అనటంతో ఉబలాటం తగ్గినట్లు ఉండటానికి ప్రయత్నం చేస్తుండగానే, గుట్ట వంకదారిలో సైకిలు తొక్కుకుంటూ వస్తున్న వాళ్ళ నాన్నని చూశాడు !

“ఏమైంది నానా? గింత సేపా ? అందరు పోయిండ్రు. నేనొక్కణ్ణే ఉన్న! అందరు లూనా మీదనో ,రిక్షా లనో వత్తాంటే, నువ్వెమో సైకిలు తొక్కుకుంట వత్తానౌ!” కొంచెం కోపంగా అన్నాడు శ్రీను.

“బాయికాడ కొంచెం పనుండె బిడ్డా! పని జూస్కొని బస్సుపట్టుకొని అడ్డరోడ్డు కాడ దిగి సైకిలు కిరాయి తీసుకొని వచ్చేటాళ్లకు కొంచెం లేటయింది!” అన్నాడు నాన్న.

“రెడ్డిగారూ! అంతా కులాసానా? వ్యవసాయం అంతా ఎలా సాగుతోంది?” అంటూ గురువుగారు నాన్నతో కుశలప్రశ్నలు ముగించేలోపే, శ్రీను లోపలికివెళ్లి అప్పటికే సర్ది ఉంచుకొన్న బ్యాగు చేతిలో పట్టుకొని వచ్చాడు.

గురువు గారికి నమస్కరించి, “ఆచార్యా! మళ్ళీ సెలవుల తర్వాత వస్తాను. అప్పటివరకు సెలవు”

అని చెప్పి, సైకిలు వెనక ఎక్కాడు శ్రీను. ఇద్దరూ కలిసి సైకిలు పెడల్ వేసుకుంటూ అడ్డరోడ్డుకు చేరుకొని సైకిలు కిరాయి కట్టి, అక్కడి నుంచి బస్సు పట్టుకొని ఓ గంటలో ఇల్లు చేరుకున్నారు.

శ్రీనుకు ఒక తమ్ముడు, ఒక చెల్లి. వాళ్లు కూడా వేరేవేరే గురుకులాల నుంచి రెండు రోజులు ముందు గానే ఇల్లు చేరారు.

తమ్ముడు,చెల్లి పక్కనున్న ఇంటి ముందు వేరే పిల్లలతో ఆడుకుంటుండగా , వాకిట్లోనే ఎదురు చూస్తున్నది అమ్మ. శ్రీనును చూడగానే “ఏమైంది బిడ్డా? బక్కపడ్డవు! మంచిగ తింటలెవ్వా? మీ గురుకులాలల్ల ఉత్త కూరగాయల తిండేనాయె…గుడ్డు గూడ పెట్టరాయె..!” అంటూ కౌగలించుకొని ముద్దుపెట్టుకుంది.

“లేదమ్మా! మంచిగ తింటాన…సాంబారు, కూరలు మంచిగ వండుతరు… గురుకులంల తిండి మంచిగుంటదమ్మా…!” శ్రీను అంటుండగానే తమ్ముడు, చెల్లి వచ్చారు. “అన్నయ్యా! అన్నయ్యా! ఎర్రబఱ్ఱె ఈనింది.దుడ్డెను సూద్దాం.. రా!.. ” అంటూ దొడ్డిలోకి లాక్కెళ్లారు. కాసేపు దుడ్డెతో ఆడుకొని స్నానం,భోజనం కానిచ్చి అందరూ ఆరుబయట నవ్వారు మంచం మీద కూర్చొని ముచ్చట్లలో మునిగిపోయారు.

అమ్మ నెమ్మదిగా మాట మొదలెట్టింది.“బాయికాడ మైసమ్మతల్లికి మొక్కున్నది బిడ్డా!యాటపోతును కోత్తమని మొక్కి మూడేళ్లయింది.. ఒక్క ఏడు గూడ సక్కగ కాలం గాకపాయె..!”

“తల్లీ! నీ బాంచెన్! కాలంగాలె! మళ్లొచ్చే ఏడు మొక్కుదీర్తం! అనుకుంట మూడేండ్లు దాటిచ్చినం! రాన్రాను పురాగ అద్వానమైంది బిడ్డా! పంటల్ పండుతలేవ్….!”

“మీ నానకు గూడ పానం మంచిగుంటలేదు బిడ్డా! మొన్నైతె పక్కింటోళ్ల రేకులు గాడ్పు దుమారంకు కొట్టుకొచ్చి కొంచమైతే మీ నాన మీద పడు బిడ్డా…! సచ్చేపోవు… ! ”

“ఓ నెల కింద అనుకుంట బిడ్డా.. మీ నాన బాయికాడ పొలం దున్నుతాంటె ఉన్నోడున్నట్లే కింద పడిపోయిండు.. పక్కనే చిన్నబాపోళ్లు గూడ పనిజేసుకుంటార్రు కాబట్టి జూసి లేబట్టి

పట్టుకొనొచ్చిర్రు…”

“ఇగ ఓ వారం కింద నేను పొద్దుగాల్నే లేచి బైట ఉడ్తాన బిడ్డా..! ఇంక పురాగ తెల్లార్లే.. ! గట్లే మస్క మస్కగున్నది…. అగో….. గక్కన్నే బిడ్డా! కాళ్ళకింద ఏదొ మెత్తగ దాకింది… దబుక్కున పక్కగు జరిగి జూసిన… కట్ల పాం! షీపిరి మర్రేసి నాల్గు దెబ్బలేసిన…. కాటేసే ఉంటది గావొచ్చనుకున్న… ”

“నానకు జెప్పుడుతోనే మంత్రాల బాల్రాజును తీసుకొచ్చిండు…! బాల్రాజు అంత తిరిగిజూసిండు…!

మంత్రమేసి యాపాకు తినమన్నడు…! తిన్నంక ఎట్లున్నదని అడిగిండు…! చేదుగున్నదని

జెప్పుడు తోటె… విషమేం ఎక్కలేదన్నడు… కాటేసి విషమెక్కుతె మంత్రించిన యాపాకు తియ్య గుంటదట… గహచారం మంచిగుండి పాం తలకాయ మీదనే తొక్కుంటవు గావొచ్చన్నడు…”

“అన్ని గిట్లనె జరుగుతానయని కొంటెతనం బట్టే రాజంను పిలిపిచ్చి అడిగిచ్చినం.. మైసమ్మ పేరు జెప్పంగనే చాటల బియ్యం గిర్రున తిరిగినై…మైసమ్మ కొంటెతనమన్నడు..మొక్కు దీర్చ మన్నడు! యాటపోతుకు గిప్పుడు గన్ని పైసల్ లెవ్వు మన కాడ.. కనీసం రేపు బాయికాడ కోడిపుంజునన్న గోసి మొక్కుదం బిడ్డా…!”

సావధానంగా విన్న శ్రీను అన్నాడు “కొంచెం జాగర్తగ ఉండాలె గదమ్మా! చెప్పులేసుకొని జూసుకుంట రావాలె బైటికి. గంత గాడ్పుదుమారం వత్తాంటే నాన బైటెందుకున్నడు? గా ఎర్రటి ఎండల ఎందుకు నాగలి గట్టాలె నాన?… ఇంటికాడ ఉప్పలమ్మ, ఊరౌతల పోషమ్మ, బాయికాడ మైసమ్మ. దండం బెట్టాలె గని గిట్ల గిది జేత్తం..గది జేత్తం అనుకుంట మొక్కులు మొక్కుకుంట బోతే ఎట్లమ్మ? గియన్ని మీ భయాలే…..”.

అమ్మ అడ్డుపడుతూ అంది “అవ్వో! గట్లనద్దు బిడ్డో…! నిష్ఠ జూయిస్తది తల్లి! మీరు సిన్నపిలగాండ్లు ..మీకు తెల్వది గని… ఇగ పడుకోండ్రి.. రేపు పొద్దుగాల అందరం బాయికాడికి పోయి మైసమ్మ తల్లికి

కోణ్ణి గోసి మొక్కాలె…”

శ్రీను పడుకున్నాడే కానీ, ఆలోచనలు అలలై ఎగిసిపడుతున్నాయి. కాకతాళీయంగా జరిగే ఘటన లకు, దైవాగ్రహ ,అనుగ్రాహాలకు సంబంధముందా? లేదా? అనంత విశ్వ సృష్టి ఆది నుంచి ఒకానొక గ్రహమైన భూమి మీద జీవం ఆవిర్భావం వరకు ఎన్నో ఘటనలు కాకతాళీయంగా జరిగినవేనాయె!

కాకతాళీయంగా ఘటన జరగటం అనేది ఎప్పుడూ ఉంది… ఉంటుది… ఆలోచిస్తూ తర్కిస్తూ… మధ్య రాత్రి ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు శ్రీను.

“ఇల్లలికి, వాకిలూడ్చి అల్కు జల్లి ముగ్గేయాలే! లేండ్రి లేండ్రి. ఒక్కొక్కళ్ళు తానాలు జేసి రేడీ గావాలె….! ఓ పిల్లా! లేవే! నాన కట్టెలు గొట్టుకొచ్చిండు. పొయ్యి ముట్టిచ్చి నీళ్లు కాగబెట్టుపో.. కుంకుడు గాయాలతోటి తలంటు బోత్త …!” అంటున్న అమ్మ మాటలకు మెలకువ వచ్చి ముగ్గురు లేచారు.

నాన్న వేపపుల్ల నములుతూనే రెండు బిందెలను తాడుతో సైకిలు వెనకభాగాన రెండు వైపులా వేలాడేసి, బోరింగు దగ్గర నుంచి నీళ్లు తెస్తున్నాడు. “యాపాకు పుల్లలు గూట్లె బెట్టిన..సూడు బిడ్డ!”

అన్న నాన్న మాట విని శ్రీను వేపపుల్ల తీసుకొని నములుతున్నాడు. తమ్ముడు, చెల్లికి చిన్నప్పటి నుంచి పేస్టూ,బ్రష్షు అలవాటు అయింది కానీ, శ్రీను మాత్రం ఊరికొస్తే వేపపుల్లే వేస్తాడు.

శ్రీను వాళ్ళ నాన్న అమ్మతో అంటున్నాడు “మనం బయల్దేరాలె ఇగ… అక్కణ్ణే మైసమ్మకు బుదిచ్చి బొట్లు బెట్టి రెడీ జెయ్యాలె. కోళ్ళోల్ల బొందయ్యకు కోడి తెమ్మని జెప్పిన. బాయికాడికే తీసుకొత్తడట. అక్కణ్ణే మైసమ్మకు కోత్తడు . అక్కణ్ణే వండుకోవాలె కాబట్టి వంటజేసేటియన్ని గంపల సర్దిబెట్టు..!”

గంపను సైకిలు వెనక గట్టి శ్రీను వాళ్ళ నాన్న సైకిలు మీద ముందు వెళ్లగా, తక్కిన అందరు వెనక వ్యవసాయ భూమి దగ్గరికి నడుస్తున్నారు.

ఊరు దాటాక దారిలో రోడ్డుపక్కన బద్దిపోచమ్మ ఆలయంలో, నాలుక భీకరంగా చాచి,పెద్ద పెద్ద కళ్ళతో తీక్షణంగా చూస్తున్న బద్దిపోచమ్మ తల్లి విగ్రహాన్ని జూశాడు శ్రీను. తాను గురుకులంలో ఉన్నపుడు రోజూ సరస్వతీమాత విగ్రహం ముందు స్తోత్రం చదివేటప్పుడు చూసే సరస్వతీమాత విగ్రహం ఎంత ప్రసన్నంగా ఉంటుంది…పోచమ్మ తల్లి ఇంత వికృతంగా,భయానకంగా ఉందేమిటని అనుకున్నాడు.

నడుచుకుంటూ ఓ అరగంటలో అందరూ వ్యవసాయ భూమి దగ్గరకు చేరుకున్నారు. శ్రీను వాళ్ళ భూమి రోడ్డు వైపున వెడల్పు తక్కువుండి , లోపలి వైపు పొడవు చాలా దూరముండే అయిదు ఎకరాల నల్లరేగడి. రోడ్డు వైపునుంచి భూమి మొదలయ్యే దగ్గర ఒక మూలాన నాలుగు చిన్న రాళ్లు పేర్చి ఉండే మైసమ్మ గుడిని కడిగి శుభ్రం జేసి బొట్లు పెట్టడానికి శ్రీను వాళ్ళ అమ్మ సిద్ధం జేస్తోంది. రోడ్డు వైపు నుంచి మొదలుపెట్టి లోపలకు వెళ్తే వాళ్ళ భూమి చివరన నీళ్ల బావి ఉంటుంది. అక్కడి నుంచే పైపులతో నీళ్లు పొలానికి పారుతాయి. రోడ్డుదగ్గర భూమి నుంచి బావి వైపున్న లోపల చివరకు నడిచి వెళ్లాలంటే పది నిమిషాలైనా పడుతుంది.

శ్రీనుతో వాళ్ళ నాన్న “మనిద్దరం కిందికి బోయి పైపులు జాపాలే! అక్కడక్కడ వంకలున్నై! వీళ్ళు ఇక్కణ్ణే ఉండి గుడి బుదిత్తరు.. ఇంతల బొందయ్య కోణ్ణి పట్టుకొత్తడు. అప్పుడు మళ్లొద్దం..పా..!” అనగానే శ్రీను, వాళ్ళ నాన్న ఇద్దరూ బావి ఉన్నవైపుకు వెళ్లారు.

బావిలో నీళ్లు ఒక ఆరు ఫీట్లు లోతుంటాయి. బావి పక్కనే ఉన్న గడ్డ మీద తుమ్మ చెట్టుకు ఎడ్లు కట్టేసి ఉన్నాయి. “నేను పైపులు జాపుకుంట బోతుంట..నువ్వు నేను జెప్పినప్పుడు మోటరు సిచ్చెయ్యి..” అని వాళ్ళ నాన్నశ్రీనుకు చెప్పి నెమ్మదిగా పైపులు జాపుకుంటూ, సరిచేసుకుంటూ పోతున్నాడు.

అమ్మ గుడిని సిద్ధం చేసింది. ఇంతలో కోళ్ళోల్ల బొందయ్య కోడిని పట్టుకొని వచ్చాడు. అమ్మ మైసమ్మ తల్లికి మొక్కటం మొదలెట్టింది. “తల్లీ! నీ బాంచెన్! కాలంగాక, పైసల్లేక యాటపోతును ఈ యేడు గొయ్యలేక పోతానం..మా మీద కోపం జేయకు తల్లీ! మళ్లొచ్చే యేడు తప్పకుండ నీకు మంచిగ జేత్తం..ఈ తాప జర దయదల్చు తల్లీ…..!”

శ్రీను వాళ్ళ తమ్ముడు శ్రీనును, నాన్నని పిలవటానికి బావి ఉన్న కింది వైపుకు నడుచుకుంటూ వస్తున్నాడు. శ్రీను ఇంకా బావిగడ్డ మీదనే ఉన్నాడు.. వాళ్ళ నాన్న పైపులు జాపుతున్నాడు..

“నాన్న ఏంటో ఎడ్లను మరీ బాయికి దగ్గర కట్టేసిండు? బావిలో పడ్తే ఎట్లా?” అని శ్రీను అనుకుంటూ నెమ్మదిగా ఎడ్ల దగ్గరకి వెళ్ళాడు. శ్రీనును చూసి ఎద్దు మరింతగా వెనక్కి జరుగుతోంది.. బావిలో పడుతుందేమో అని, శ్రీను తాడును పట్టుకున్నాడు. ఎద్దు బావిలోకి జారి పడిపోతోంది. లాగటానికి తాడు పట్టుకున్న శ్రీను ఎద్దుతో పాటు బావిలో పడిపోయే క్షణంలోనే ఎద్దును లాగంటం తన వల్ల కాదని స్పురణకు వచ్చిందేమో..వదిలేసాడు. ఒక్క క్షణం ఆలస్యమైనా తానూ బావిలో ఎద్దుతో పాటు పడిపోయేవాడే!

విస్మయం చెంది, గుండె దడదడ కొట్టుకుంటుండగా, నాన్న దగ్గరికి పరుగెడుతూ “నానా..ఎద్దు బాయిల పడ్డది.. “ అని అరుస్తున్నాడు. నాన్న పరుగున బావి దగ్గరికి పరుగెత్తుకొస్తున్నాడు..

శ్రీను అరుపులు విన్న తమ్ముడు, వెనక్కి మరలి అమ్మ దగ్గరికి పరుగెత్తాడు. అమ్మ ఇంకా మైసమ్మకు మొక్కుతూనే ఉంది.. విషయం తెలుసుకొని అమ్మ నిశ్చేష్టురాలయింది. ముఖం పాలిపోయి కొంత సేపు అలాగే చూస్తూ ఉండిపోయింది. తర్వాత తేరుకొని అందరూ బావి దగ్గరకు బయలుదేరారు.

విషయం తెలిసిన చుట్టుపక్కల రైతులు, పనిచేస్తున్నవాళ్ళు బావి దగ్గరకు చేరుకున్నారు. ఎద్దు ప్రాణంతోనే ఉంది. “ఎద్దుకు తాళ్లు గట్టి ట్రాక్టరుతోని గుంజుతె పైకొత్తది!” ఒకడన్నాడు. “అవును! మంచుపాయం..!” మరొకరన్నారు.

పక్కన పొలం దున్నుతున్న ట్రాక్టరును తెచ్చారు. ఓ నలుగురు బావిలోకి దిగి ఎద్దుకు తాళ్లు కట్టి వచ్చారు. ఆ తాళ్లను ట్రాక్టరుకు కట్టి స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చారు. దాదాపు మధ్య వరకు పైకి వచ్చి తాడు తెగి ఎద్దు మళ్ళీ బావిలో పడిపోయింది. శ్రీను వాళ్ళ నాన్న మొహం కొయ్యబారింది. రెండు సార్లు ఇలాగే లాగినా కొంతవరకు పైకి వచ్చి బావిలో పడిపోయి ఎద్దు ప్రాణం విడిచింది.

“మూడేళ్ల నుంచి మైసమ్మతల్లికి యాటపోతు మొక్కున్నదట..! యాటపోతును గొయ్యకుండ కోణ్ణి గోత్తాండ్రంట..! ఇప్పుడు జూడు ఎద్దునే బలి దీసుకున్నది మైసమ్మ తల్లి!” అని ఒకామె అన్నది.

“ఇంక నయం కొంచెమయితే పిలగాడు గూడ బాయిల పడెటోడు..! ” ఇంకొకామె అన్నది.

“ఆడ మొక్కుతనే ఉండె..ఈడ బలి దీస్కున్నది.. మైసమ్మ తల్లి నిష్ఠ జూయించింది..! యాట పోతును మొక్కినపుడు యాటపోతునిచ్చి ఎట్లైన దీర్చాలె..! ” అని ఇంకొకామె అంది.

తలపట్టుకొని కూర్చున్న నాన్నతో శ్రీను అన్నాడు. “బాయి పక్కణ్ణే ఎద్దును గట్టెత్తరా ఎక్కణ్ణణ్ణ?”.

“రోజూ గక్కణ్ణే కట్టేత్తాన… గియ్యాల కొత్తనా? తల్లి దయజూళ్లే.. నిష్కారణంగ ఎద్దును మింగింది!” అంటూ నాన్న బదులిస్తున్నపుడు నాన్న కళ్ళల్లో నీళ్ల సుడులు చూస్తున్నాడు శ్రీను.

“శీనుగాణ్ణి కొత్తగ జూసింది గద ఎద్దు .. కొంచెం బెదిరి ఎన్కకెన్కకు జరిగుంటది .. బాయిల పడ్డది ..గంతే…గట్లాంటి అనుమానాలు పెట్టుకోవద్దు..!” పట్నంలో చదువుతున్న కుర్రాడొకడు అన్నాడు.

కొంతసేపటి తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్లిపోగా, శ్రీనువాళ్ళ కుటుంబం అందరూ మౌనంగా నడుచుకుంటూ ఇంటికి బయలుదేరారు. బయటకు అందరూ మౌనంగానే నడుస్తున్నా, మనసు అంతరాళాల్లో ఆలోచనలు చేసే భీకర సుడిగాలి శబ్దాల అవశేషాలు అందరి ముఖాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉన్నాయి!

దారిలో బద్దిపోచమ్మ ఆలయం వైపు చూశాడు శ్రీను. పోచమ్మతల్లి విగ్రహం మరింత వికృతంగా, మహాభయంకరంగా చూస్తోంది…చూస్తున్నట్లు అనిపిస్తోంది!

మౌనంగా ఆలోచూస్తూ నడుస్తున్నాడు శ్రీను “తాను సృష్టించిన మానవుని నుంచి దైవం, తానే సృష్టించిన ఓ జంతువును బలి కోరుతుందా? మనిషి ఆ బలిని ఇవ్వలేకపోతే ఆగ్రహిస్తుందా? లేక తనలోని భయానికి ఒక వికృత రూపమివ్వడానికి రాతిని అతి భయంకరంగా చెక్కి దేవున్ని చేసి, ఆ దేవునికి బలి ఇవ్వకపోతే కోపిస్తుందని మనిషి తానే భయపడుతున్నాడా? బలికోరేది భయమా? దైవమా? సర్వ సృష్టికర్త భగవంతుడే అయితే మనకు అన్నీ ఇచ్చేది భగవంతుడే అయితే, వట్టి మానవమాత్రులమైన మనం, అందునా కుటుంబాన్ని పోషించటమే మహాకష్టంగా ఉన్న ఒక సామాన్య రైతు భగవంతునికి ఇవ్వగలిగేది ఏముంటుంది? కేవలం భక్తితో దండంపెట్టుకోటం తప్ప!” అనుకుంటూ తర్కిస్తున్నాడు.

గురుకులంలో పొద్దున్నే నాలుగుగంటలకు పెద్దగా మైకులో ఘంటశాల గింతులో పలికే, శ్రీకృష్ణ పరమాత్ముని భగవద్గీతలోని శ్లోకమొకటి చెవుల్లో మౌనంగా మార్మోగుతోంది. “పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి. తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః – ఎవడు భక్తితో నాకు ఫలమైననూ, పుష్పమైననూ, పత్రమైననూ, ఉదకమైననూ ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను….”.

“ఈ శ్లోకమే నిజమై ఉంటే, దేవత కోపంతో ఎద్దును బలితీసుకుంది అని మనం అనుకోవటం తప్పు అవుతుంది. ఊరంతా అనుకుంటున్నట్టు ఒకవేళ నిజంగానే మైసమ్మ దేవత కోపంతో ఎద్దును బలి తీసుకుంటే ఈ శ్లోకమే తప్పు అవుతుంది! ఈ రెండిటిలో ఏది కరెక్టు? ఏది తప్పు? ఏమో? లేక మనలోని కోపం, మనలోని ప్రేమ, ఈ రెంటికీ వివిధ సందర్భాలలో దైవత్వానికి ఆపాదించారేమో?”. సంస్కృతం ఆచార్యులు ఎప్పుడూ అంటుండే ‘యద్భావం తద్భవతి’ గుర్తుకు వచ్చింది.

“మనిషిలోని తర్కం! మనిషిలోని భయం! మనిషిలోనే అనాదిగా అంతర్లీనమై తిష్టవేసిన ఈ రెండు పార్శ్వాలూ ఒకదానికొకటి ఎప్పుడూ పోటీపడుతూనే ఉంటాయేమో! ఒక్కో సమయంలో ఒక్కోదానిది పైచేయి అవుతుందేమో..!” తన ఆలోచనల తరంగాలు తత్త్వంవైపు మళ్ళిపోవడంతో మనసులోని అలజడి క్రమక్రమంగా తగ్గిపోగా అందరితో పాటు ఇల్లు చేరాడు శ్రీను !

-సమాప్తం –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked