-కృష్ణ అక్కులు
రాహుల్ గురించి ఆలోచిస్తూ చాలా ఆలస్యంగా నిద్రపోయాడు సుధాకర్ రావు. అందుకే ఉదయం పది గంటలైనా మెళుకువ రాలేదు. లేచిన వెంటనే ఆతురతగా వాట్సప్ చూశాడు. రాహుల్ మేసెజ్ చూశాడు కాని బదులివ్వలేదు. రిటైర్ కావడం, భార్య చనిపోవడంతో ఒక్కసారిగా ఎక్కడలేని ఒంటరితనం కమ్మేసినట్లయింది సుధాకర్ రావుకి.
ఒక లెక్చరర్‌గా కన్నా ఒక విద్యార్థి సలహాదారుడిగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకొన్నాడు సుధాకర్ రావు. అతడి మనోవికాస క్లాసుల ద్వారా ఉత్తేజితులై ఎంతోమంది ఐయెస్లు, ఐపియస్‌లు, ఐఐటిలు సాధించారు.
రాహుల్ కూడా విద్యార్థులకు తండ్రి చేప్పె క్లాసులలో కూర్చొని శ్రద్ధగా వినేవాడు.
దాని ఫలితంగానే ఐఐటిలో మంచి ర్యాంక్ తెచ్చుకొని, ఐఐటి ముంబాయిలో కంప్యూటర్ కోర్సు చేసి, అమజాన్ మూడు సంవత్సారాలు చక్కగా ఉద్యోగం చేశాడు.
అ తరువాత ఎమైందో తెలియదు. ఉద్యోగం మానేశాడు. గత రెండేళ్ళుగా ఇంట్లోనె వుంటున్నాడు. ఎప్పుడు చూసినా లాపుటాప్లో లేదా ఫోనులో వుంటాడు. టైంకి తినడు, నిద్రపోడు.
తండ్రితో మాట్లాడడం కూడా మానేశాడు రాహుల్.
సుధాకర్ రావుకు కొడుకు పరిస్థితి అర్థంకావడం లేదు. చాల ఆందోళన కలుగుతుంది.
అందువల్ల రాహుల్‌తో మాట్లాడాలని వాట్సప్‌లో మేసెజ్ పెట్టాడు. కాని బదులు రాలేదు.
ఒకే ఇంట్లో వుంటూ, కొడుకుతో మాట్లాడడానికి అఫాయింట్మెంట్ తీసుకొనె పరిస్థితిని తలచుకొని, సుధాకర్ రావు లోలోపల కుమిలి పోతున్నాడు.
రాహుల్ హాల్లో సోఫాలో కూర్చుని లాపుటాప్లో చాలా బిజీగా వున్నాడు. సుధాకార్రావు దగ్గరగా వచ్చి కూర్చొని మెల్లగా దగ్గాడు. రాహుల్ ఏమి మాట్లాడలేదు.
దాంతో సుధాకార్రావే రాహుల్ “నీతో మాట్లాడాలని మేసెజ్ పెట్టాను కదా!” అన్నాడు.
దానికి రాహుల్ “ఏ మాట్లాడుతావు, నీ తోటి వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకోన్నారు, పిల్లల్ని కన్నారు, అని సుత్తి కొట్టడమే కదా నువ్వు చెప్పేది” యని వెటకారంగా అన్నాడు.
నాబాధ నీకు సుత్తిలాగుందా రా. నేను చస్తే నా పెన్షను కూడా ఆగిపోతుంది.ఎలా బతుకు తావురా? అన్నాడు సుధాకార్రావు.
“డొంటు వరీ డాడ్ ఎలాగోలా బ్రతికేస్తాను” అని సమాధానమిచ్చాడు రాహుల్.
“ఎందుకురా!! దేవుడు పగ బట్టి నీలాంటి వాణ్ణి నాకు కొడుకుగా ఇచ్చాడు. నా పెంపకంలో ఏ లోపంవుందిరా ఇలా తయారయ్యావు. నీలాంటి వాడు నా కడుపున చెడపుట్టినాడురా. సమాజానికి ఒక మంచి కొడుకు ఇవ్వడంలో నేను పూర్తిగా విఫలమైనానురా అని గట్టిగా ఎడ్చాడు” సుధాకర్‌రావు.
రాహుల్ లేచి నాన్నను గట్టిగా కౌగిలించుకొని, “అలా అనకు నాన్న. నీ కొడుకు చెడ్డవాడు కాదు నాన్న. నీ పెంపకంలో ఎటువంటి తప్పులేదు. నిన్ను బాధపెట్టినందుకు క్షమించు నాన్న యంటూ” ఏడ్చాడు.
“నాన్న మీరు చేసిన ఏ మేలు నేను మరవలేదు. ఇంగ్లీషు స్కూలో నేను చదవాలని, ఆ ఫీజులు కట్టాడానికి మీరు రాజీపడిన ప్రతి విషయం నాకు తెలుసు. మీకష్టం తెలిసి పెరిగినవాడిని నాన్న. కావున జూలాయికాను”.
“నాన్న నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పండి” యని అన్నాడు.
రాహుల్: తాతాగారు ఏమి పని చేసెవారు?
సుధాకర్ రావు: పల్లెలో స్కూల్ టీచర్.
నాన్నా “తాతాగారికి మనసుకు ఇష్టమైన పని ఏది?”
సుధాకర్ రావు, “తాతకు రన్నింగ్ రేస్ అంటే చాలా ఇష్టం, జిల్లా చాంపియన్ అయ్యాడు. తరువాత స్థోమత లేక రాష్ట్రస్థాయికి వెళ్ళలేకపోయాడు.”
నాన్నా, మీరు కూడా ఒక లెక్చరర్‌గా పనిచేశారు. కాని మీ మనసుకు చాలా ఇష్టమైన ఆట క్రికెట్, మీరు చాలా కప్పులు కూడ గెలిచారు కూడా.
కాని క్రికెట్ వలన మీ చదువు ఎక్కడ పాడవుతుందొయని, తాతగారు మిమ్మలిని అటువైపు వెళ్ళకుండా చేశారు.
“తాతగారు గాని, మీరు గాని కుటుంబంకోసం, బ్రతుకు తెరువు కోసం, మీకిష్టమైన పనులను వదులుకొన్నారు. అది చాల గొప్ప త్యాగం నాన్న”, అన్నాడు రాహుల్.
అయితే నాన్న నామీద ఎటువంటి ఒత్తిడి లేక పోవడంవల్ల,
నేను ఒక కంపెనీ పెట్టి నలుగురికి జీవనోపాధి కల్పించాలనివుంది. అదే నా సంకల్పం. ఇదంతా మీరు విద్యార్థులకు చెప్పిన మనోవికాస క్లాసులు విని నాలో కలిగిన ఆలోచనలే.
అయితే ప్రస్తుతం కంపెనీ ఎలా మొదలేట్టలా యని రీసెర్చు చేస్తూన్నాను. ఈ విషయం చెబితే మీరు ఎక్కడ కంగారు పడతారోయని దాచాను నాన్నా.
“ఎందుకంటే సోనుసూద్ చేసిన సేవను అందరు హార్షించేవారే. అయితే అదే సోనుసూద్ మన ఇంటివాడయితే ప్రోత్సాహించేవారెందరు” చెప్పండి.
నాన్న, “నేను మిమ్మలిని కోరేది ఒకటే. మనకిష్టమైన దానికొరకు ప్రయత్నించి ఓడిపోతే పర్వాలేదు, కాని ప్రయత్నించకుండానే ఓడిపోతే జీవితాంతం అది ఒక వెలితిగా మిగిలిపోతుంది”.
“కావున నాకు రెండు సంవత్సారాలు వ్యవధి ఇవ్వండి నాన్న. ఈ సమయంలో మీరు సంపాధించిన కొంచెం డబ్బు పోయిన, నేను ఫెయిలైన కంగారు పడకండి. ఎందుకంటె మీరు సంపాదించినది నా కోసమే కదా, ఆ డబ్బు నా ఆశయం కొరకు ఉపయోగిస్తే మంచిదే కాదా!”
“ఒక వేళ రెండేళ్ళ తరువాత కూడా నా ప్రయత్నంలో నేను
విఫలమైయితే, ఆపైన ఈ పని మానేసి జాబులో చేరతాను, పెళ్ళిచేసుకొంటాను. మరియు కసిగా డబ్బులు సంపాదిస్తాను.
కావున నా సంకల్పం మంచిదయితే నన్ను ఆశీర్వదించండి”,అన్నాడు.
సుధాకర్ రావు, “కన్నా, బిడ్డలు ఏ మంచి పనిచేసిన తల్లిదండ్రులకు సంతోషమే. అయితే మేము కంగారు పడకుండా వుండేలా మీ ప్రయత్నాలు మాకు చెబితే మేము అర్థంచేసుకొంటాం.
అయితే ముఖ్యంగా ఒక విషయంలో నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు నేను మనోవికాస క్లాసులలో విద్యార్థులను ఉత్తేజపరిస్థే చాలని భావించాను. కాని తల్లిదండ్రులు కూడా పిల్లల కలలు తమవిగా భావించి ప్రోత్సాహిస్తే, ఆ పిల్లలు అతిసులువుగా విజయాలు సాధిస్తారని తెలిపావు. అందుకు నా అభినందనలు” యని అన్నాడు.
రాహుల్, “అర్థమైంది నాన్నా. ఇక మీదట మన మధ్య ఏ గ్యాప్ లేకుండా రోజు ప్రతి విషయం మీతో పంచుకొంటాను. అలాగే మీతో కలిసి భోజనం చేస్తాను” అన్నాడు.
సుధాకర్ రావు, “రాహుల్, నా కొడుకంటే ఎమిటో నా కర్థమైందిరా. కావున ప్రతి విషయం నాతో చెప్ప వలసిన అవసరం లేదు”.
అయితే “మేము క్షేమంగా వున్నామంటూ పిల్లలు, రోజు పది నిమిషాలు మా ముసలి వాళ్ళతో మాట్లాడితే, ఏ రోగం లేకుండా ఇంకో పదేళ్ళు ఎక్కువ బ్రతికేస్తామురా” అన్నాడు సుధాకర్ రావు.
***