నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్
ఈ క్రింది “ప్రశ్న“కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసం ప్రశ్న:
నిర్ధిష్టాక్షరి మరియు వర్ణన: “హే”, “వి”, :”ళం(లం)”, “బి” అనే అక్షరాలతో ఒకొక్క పాదము ప్రారంభిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో వసంత ఋతువర్ణన చేయాలి
గతమాసం ప్రశ్న:
సమస్య: రామా యన బూతుమాట రమణీ వినుమా!
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
సహస్రకవిరత్న,సహస్రకవిభూషణ శ్రీమతి.జి. సందిత.బెంగుళూరు.
కామాతురుల విరామా
రామపు”మారామ”నంగఁ”రామ” పదమునన్
కామంబుండు కతన “మా
రామా” యన బూతుమాట రమణీ వినుమా!
పోచిరాజు కామేశ్వర రావు, రాయిపూర్
లేమా! యరసున్న నిడగ
లేమా? మరచినఁ గలుగునులే వగ పయ్యో
రామా! మారదె యర్థము
రామా యన బూతుమాట రమణీ వినుమా!
(“రామా యనఁ బూతుమాట రమణీ వినుమా” లో అర్థానుస్వారము మరచిన “పూతు మాట” (పవిత్రుని మాట) కాస్తా “బూతు మాట” అయ్యిందని భావము.)
డా. చింతలపాటి మురళీకృష్ణ , మచిలీపట్నం
ప్రేమగ హైందవశబ్దము
లేమాత్రము పలుకునెడల నింతయు పాపం
బయ్యెను నేడిల కనుమా
రామా యన బూతుమాట రమణీ వినుమా !
డా|| I.S.ప్రసాద్, సేంట్ లూయిస్, మిస్సోరి
“రామా! తేరా” యనినచొ
“రామా! నీ” యని తెలియుము రాదో? వచ్చో?
గ్రామరు, హిందీలో “తే
రా, మా!” యన బూతు మాట రమణీ, వినుమా!
రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ
ఏమని జెప్పుదు వింతలు
రామా యన బూతుమాట రమణీ వినుమా
ప్రేమల మైకము నందున
నీమము లనువీడి జనులు నీతిని మరువన్
వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం
రాముని నమ్మిన చాలును
రాముడె కష్టములు దీర్చి రాతను మార్చున్
దేముని నమ్మని నాడౌ
రామా యన బూతు మాట రమణీ వినుమా
గండికోట విశ్వనాధం, హైదరాబాదు
ప్రేమా, గాడిద గుడ్డా!
ఏ మాటన్నను పెడర్ధమే తోచు గదా!
సామంబన్నది శూ న్యము
రామా యన బూతుమాట రమణీ, వినుమా!
చావలి శివప్రసాద్, సిడ్నీ, ఆస్ట్రేలియా
లేమా! నిరసన తెలుపగ
లేమా? వెండితెర పాటలే కడు హేయం
బౌ మాటలై వినబడన్
రామా! యన, బూతు మాట రమణీ వినుమా
పుల్లెల శ్యామసుందర్, సాన్ హోసే, కాలిఫోర్నియా
ప్రేమను గల దినములలో
నీమముఁ మీరుచుఁ బలికిన నేరంబవదా
ప్రేమయె విరసంబైనచొ
రామా యన బూతుమాట రమణీ వినుమా!