నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్
ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
అనివార్య కారణముల వలన గత కొన్ని మాసములుగా ఈ శీర్షికను ప్రచురించ వీలుపడలేదు. అందుకు క్షంతవ్యుడను. ఇకపై నిర్విరామముగా నిర్వహించడానికి ప్రయత్నిస్తాము. నెలెనెలా పూరణలతో మీ ప్రోత్సాహమును కొనసాగిస్తారని ఆశిస్తూ..
2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేస్తూ పద్యములను పంపండి.
ఈ మాసం ప్రశ్న:
చుట్టములను కలసినంత సుఖములు తగ్గున్
గతమాసం ప్రశ్న:
నాస్తికులకు దైవమన్న నయమున్ భయమున్
(శ్రీ దువ్వూరి వి.ఎన్. సుబ్బారావు గారు పంపిన సమస్య)
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
దువ్వూరి వి యన్ సుబ్బారావు, కొంతమూరు, రాజమహేంద్రవరం.
నాస్తి యనుచుంద్రు పై, లో
నాస్తికు డేమో యటంచు నదురౌ, నెపుడో
శాస్తి నొనరించు నత డని
నాస్తికులకు దేవుడన్న నయమున్ భయమున్.
గాదిరాజు మధుసూదన రాజు, అనంతపురం
ప్రస్తుతముదూరదర్శని
యాస్తికతత్త్వంబుబెంచెనవలోకింపన్
వాస్తవమెఱుకై కలుగును
నాస్తికులకు దైవమన్న నయమున్ భయమున్
నేదునూరి . రాజేశ్వరి, న్యూజెర్సీ
ఆస్తులు మెండుగ కలవని
నేస్తములకు విందు జేసి నిపుణత జూపన్
వాస్తవమున పదు గురిలో
నాస్తికులకు దైవమన్న నయమున్ భయమున్
సూర్యకుమారి వారణాశి, నార్త్ కరోలినా
ఆస్తికుల మంచు కొందరు
జాస్తిగ తమ దొంగ భక్తి చాటుచు నుండన్
వాస్తవ ముగ నుండునె యా
నాస్తికులకు దైవమన్న నయమున్ భయమున్
శ్రీనివాసరావు అయినాపురపు.
జాస్తిగ మనమున గొలిచెడి
ఆస్తికులకు దైవమన్న ఆదరణెపుడున్
నాస్తి యనుచు కూడ వెరచు
నాస్తికులకు దైవమన్న నయమున్ భయమున్!
ఎం.వి.యస్. రంగనాధం, హైదరాబాదు
(1)
జాస్తి నిరీశ్వర వాదము
నాస్తికులకు; దైవమన్న నయమున్, భయమున్,
‘అస్తి’ యనెడు విశ్వాసము,
ఆస్తికులకు; కలవటంచు యందురు జగతిన్.
(2)
అస్తిత్వము, యాస్తికులకు
నాస్తికులకు, దైవమన్న నయమున్, భయమున్,
‘అస్తి’య, ‘నాస్తి’య, యను య
ప్రస్తుత సంవాదమేను, యపరిష్కృతమై.
కొందరు హాస్యమాడ కడుకూరిమి తోడుతఁ బిల్తురాతనిన్
పందని, కారణంబడుగ పంట దివాకరు నామధేయమే
సుందరి పెండ్లిచేసుకుని శోభనమందున ప్రేమమీర యా
పందిని కౌగలించుకొని పంకజలోచన సంతసించెరో శంకరి పిల్లలకై కొనె
వంకాయల వంటి రూపు గలిగిన బుగ్గల్
చంకన యుండిన పాపడి
‘వంకాయన’ చెఱుకు రసము వడివడి యుబికెన్పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా
నానా భాషల కథలను
చైనాలో ప్రజలు కూడ చదివవి మెచ్చన్
తానొక అనువాదకుడై
చైనాలో తెలుగు నేర్చి చక్కగ బ్రదికెన్మాతామహి బయలుదేర మనుమడు ప్రీతిన్
చేతులనూపుచు ముద్దుగ
తాతా యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్
****