పద్యం-హృద్యం

పద్యం – హృద్యం

-నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
వాక్సీనులు వాడకున్న వైరస్ దొలగున్
ఇంతకు ముందు యిచ్చిన ప్రశ్న:
గెల్వగఁ నేడ్చెనొక్కడును గెల్వక నోడినవాడు నవ్వగన్

ఈ ప్రశ్నకు పూరణలు మాకు అందిన క్రమములో యిలా వున్నాయి.

పోచిరాజు కామేశ్వర రావు, రాయపూర్ , ఛత్తీస్ఘఢ్ , ఇండియా.

ఉ.
వల్వల యంద మారసి యపారపుఁ బ్రేమ జనించ తూర్ణముం
గల్వలఁ బోలు కన్నులని కన్యను గోరఁగ నిద్ద ఱొక్కతెం
జెల్వము లేని మోముఁ గని చెంద నిరాశ నెడంద నంతటన్
గెల్వఁగ నేడ్చె నొక్కఁడును గెల్వక యోడిన వాఁడు నవ్వఁగన్
ఎం.వి.యస్.రంగనాథం, హైదరాబాద్
(1) ఉ.
సుల్వుగ తన్ను గెల్చు గతిఁ జూపగ ప్రేమన తాత, తా మదిన్
నిల్వక పొంగు దుఃఖమును నెగ్గుచు క్రీడి శిఖండి మాటునన్
తెల్విగ నిల్చి బాణముల దేహముఁ గప్పుచు భీష్ముఁ గూల్చినన్
గెల్వగఁ నేడ్చెనొక్కడును గెల్వక నోడినవాడు నవ్వగన్
(2) ఉ.
సుల్వుగ అర్జునిన్ దునమ సుక్రతువిచ్చిన శక్తి యస్త్రమున్
పల్వురు జెప్పగా విసరి స్వర్గము జేర్చి ఘటోత్కచున్ యనిన్
వెల్వలబాఱు కర్ణుగని వెన్నుడు జెప్పెను ధర్మసూనకున్
గెల్వగఁ నేడ్చెనొక్కడును గెల్వక నోడినవాడు నవ్వగన్
ఇట్టవేని రాకేశ్, సిద్ధిపేట.
ఉ.
పల్వురు బాలబాలికలు పందెము పెట్టిరి ఏడ్పు పేరుతో
అల్వలు పట్టణంబున, గజాస్యుడు, శ్రీహరి మిత్రు లిద్దరున్
వల్వల కోసమొచ్చి, అట పందెము నందున చేర, వారిలో
గెల్వగ నేడ్చె నొక్కడును, గెల్వక నోడిన వాడు నవ్వగన్.
పుల్లెల శ్యామసుందర రావు, శాన్ హోసే, కాలిఫోర్నియా
ఉ.
నిల్వడి యెన్నికందు తను నెగ్గుటయే యొక ధ్యేయమవ్వగన్
పల్వురఁ జేర్చి యార్భటిన బాగుగ ద్రవ్యము ధారబోయుచున్
కొల్వును పొందనేమి మరి కూర్చిన సంపద పోయనంచు తాఁ
గెల్వగఁ నేడ్చెనొక్కడును గెల్వక నోడినవాడు నవ్వగన్
అవధాని శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారి పూరణ:
ఉ.
కల్వల మిత్రునిన్ దలను కమ్రముగా ధరియించు వానికిన్
చెల్వము వామమందునను నిల్వగ కాముడు భీతిజెందె హా
గెల్వగ నేడ్చె నొక్కడును గెల్వక నోడినవాడు నవ్వగన్
పల్వలమందు చందురుడు బాడబరాట్టుగ పొంగినట్లుగన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked