-నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్
ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసం ప్రశ్న:
సమస్య – రైలింజెను రోడ్డుమీద రయమున దిరిగెన్
ఇంతకు ముందు యిచ్చిన ప్రశ్న:
‘శివరాత్రి’ అనే నాలుగు అక్షరములు నాలుగు పాదములలో మొదటి అక్షరముగా వచ్చునటుల మీకు నచ్చిన ఛందస్సులో శివుని స్తుతిస్తూ పద్యము వ్రాయవలెను.
ఈ ప్రశ్నకు పూరణలు మాకు అందిన క్రమములో యిలా వున్నాయి.
చిరువోలు సత్య ప్రసూన, న్యూ ఢిల్లీ
తే// గీ// శివుడొకడె మహాదేవుడౌ క్షేమకరుడు
వరమొసగు భక్త సులభుడ సురులకెపుడు
రామ సంపూజ్యుడౌ త్రిపురహర ! ప్రోవు
త్రినయన ! త్రిగుణరహితాత్మ ! త్రిదశ వంద్య !
కం// శిరమున మోయును గంగను
వరముల నిడునా భవుండు పరమేశ్వరుడే
రా రమ్మని స్మరియింపఁగ
త్రిరాత్రి వ్రతుల కిడు ముక్తి త్రిపురారి ,కృపన్
చిరువోలు విజయ నరసింహా రావు, రాజమహేంద్రవరము
ఆ.వె.
శివభవా యటన్న- శివమును జేకూర్చి
వరములొసగి భక్తు కరుణగాచు
రాతిలింగమునవి- రాజమానుడగుచు
త్రిపురసుందరి గను – రిపుహరుండు
తే .గీ.
శివుడు, భవుడు హరుడు భక్తి చిత్తులలర
వరముగా ముక్తి నొసగుచు వరలు నతడు
రాత్రి లింగోద్భవుడయి, య- రాతి ఖలుల
త్రిగుణ రహితుండు దునుమాడి తేజరిల్లు
రుద్రరాజు శ్యామల, హైదరాబాద్.
శివ శివ యని పలుక మోడు చిగురు తొడుగు
వదలడెన్నడును తనను పట్టు చేయి
రాదు రానీయడే బాధ లింగ మూర్తి
త్రికరణంబు లొక్కటిగ నర్చింతు నేను.
తిరివీధి శ్రీమన్నారాయణ, కర్నూలు
1. తే.గీ.
శివుడు నిత్యంబు భక్తుల చింత దీర్చు
వరము లిచ్చు శీఘ్రముగను భక్త వశుడు
రాగ భయముల హరియించు రక్ష కుండు
త్రికరణముల సేవించుమ త్రిపుర హరుని
2. తే.గీ
శివ శివ యనుచు నియతిగ జిత్త మందు
వరదుడైయొప్పు శంకరు భక్తి నిలిపి
రాత్రి జాగారమున శివ రాత్రి వేళ
త్రిపురహరుని నుతించెద దీక్ష తోడ
ఎం.వి.యస్. రంగనాధం, హైదరాబాద్
1. తే.గీ.
శివుడొక సగముగ శివాని శేషముగను
వరలుట, విడదీయగ రాని బంధ మనగ,
రాగ రంజితమగు వారి సంగమమున,
త్రిగుణ తత్త్వమయంబగు, జగతి వెలయు.
2. తే.గీ.
శిఖరిని సురాసురులు ఖజ జేసి, క్షీర
వనధి చిలుకగా, తొల్లి సంజనితమై క
రాళ నృత్యము జేయు గరళము బట్టె,
త్రినయనుడు గళమున, జగతికి సుధ నిడ.
వారణాసి .సూర్యకుమారి, మచిలీపట్నం
తే.గీ.
శివుని మనసార వేడెద శిరము వంచి
వరద !నీలకంఠ! పరమేశ్వర శివశివ
రావ !ఫణి భూష !గంగాధర మము గావ
త్రినయనా !శంకరా !యుమాదేవి గూడి
మద్దాలి స్వాతి, రెడ్వుడ్ సిటీ, కాలిఫోర్నియా
తే.గీ.
శిష్ట కార్యము సాధింప, కష్ట మోర్చ
వలెను ఫలము కొరకు, క్షీరజలధి చిలుక
రాదె విషము తొలుత, త్రిపురారి మ్రింగె,
త్రిభువనమ్ములు త్యాగమూర్తియని పొగడ.