నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్
ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసం ప్రశ్న:
రెండవ భార్యనేలుకొనరే పతులందరు తల్లిమెచ్చగన్
ఇంతకు ముందు యిచ్చిన ప్రశ్న:
పంచెఁ గట్టు టిపుడు ఫ్యాషనాయె
ఈ ప్రశ్నకు పూరణలు మాకు అందిన క్రమములో యిలా వున్నాయి.
నాగిని, హైదరాబాద్
ఆ.వె.
చీర కట్టు నచ్చె చిన్నదానికిపుడు
గాశి పోసి సతము గట్టుచుండె!
పాత కాలమిపుడు పదిలమాయె గనుక
పంచె గట్టుటిపుడు ఫ్యాషనాయె
చిరువోలు సత్య ప్రసూన, న్యూ ఢిల్లీ
(1)ఆ.వె.
వలువఁగట్టుటన్న పరువు నిలుపఁ గాదె
వికృతమనగ దాని విధమె మేలు
వెఱ్ఱి తలలు వేయ పిదప కాలంబున
పంచెఁ గట్టు టిపుడు ఫ్యాషనాయె!
(2)ఆ.వె.
పాంటుఁ బోలు పంచె ప్రాచుర్యమై నేడు
పంచె బదులు పాంటు భవ్య మనరె
పంచె కట్టరాక పలువురు నవ్వినన్
పంచెఁ గట్టు టిపుడు ఫ్యాషనాయె!
(3)ఆ.వె.
పంచె గట్టెననుచు బావను మరదళ్ళు
గేలి సేయువారు కేళి యనుచు
పాంటు వంటి పంచె పాటి ధరింపగా
పంచెఁ గట్టు టిపుడు ఫ్యాషనాయె!
చిరువోలు విజయ నరసింహా రావు, రాజమహేంద్రవరము
(1)ఆ.వె.
చీర కట్టె నాడు స్త్రీలెల్ల ముదమున
మిడ్డి, చెడ్డి, నేడు మెచ్చు వారు
వరుడు కట్టె పంచె పరిణయ సమయాన
పంచెఁ గట్టు టిపిడు ఫ్యాషనాయె
(2)ఆ.వె.
ఆంగ్ల భాషణంబు నరకార వస్త్రంబు
ప్యాంటు, బూటు, సూటు నీటు దలచు
చీర కట్టుమాని స్త్రీలు గౌనుని మెచ్చ
పంచెఁ గట్టు టిపిడు ఫ్యాషనాయె
(3)ఆ.వె.
పంచెఁ గట్టినంత పండితుండగునొక్కొ?
కవితలందు ఘనత కలుగ వలయు
పంచె చేసిరిపుడు మంచి ప్యాంటులవలె
పంచెఁ గట్టుటిపుడు ఫ్యాషనాయె
(4)ఆ.వె.
పాతఁగిల్లె, నాటి పంచె ధారణ మెద్ది?
నేటి తరము ప్యాంటు మేటి యనరె?
పాఁత కొత్త యగుట పరిపాటిగారాగ
పంచెఁ గట్టుటిపుడు ఫ్యాషనాయె
ఎం.వి.యస్. రంగనాధం, హైదరాబాద్
(1)ఆ.వె.
దైవకార్యములను, దారకర్మము లందు,
తళుకు లీను వస్త్ర తతుల జూప,
స్త్రీలు కట్ట పట్టుచీర, పురుషులేమొ
పంచెఁ గట్టు టిపుడు ఫ్యాషనాయె.
(2)ఆ.వె.
సాంప్రదాయకమగు సకల పురుషులకు
పంచెఁ గట్టు, టిపుడు ఫ్యాషనాయె,
ప్యాంటు, షర్టు, టైలు, పాశ్చాత్య దొర వోలె
వేసి, విర్రవీగ వీటిపట్ల.
వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం
ఆ.వె.
క్రొత్త సంగతులను కోరి నేర్చుకొనుచు
మంచినెంచు కొనఁగ మనసు పెట్టి
పాత క్రొత్త మేలు పద్ధతుల్ తెలియంగ
పంచె కట్టుడిపుడు ఫ్యాషనాయె
మద్దాలి స్వాతి, ఫ్రీమాంట్, కాలిఫోర్నియా
ఆ.వె.
తెలుగుతనము నెల్ల దీపింప జేసిన
పంచెఁ గట్టు టిపుడు ఫ్యాషనాయె
ఫ్యాన్సి డ్రెస్సు వోలె పార్టీల, రెడిమేడు
పంచె లందుకు సులభముగ దొరుక.
పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా
ఆ.వె.
తమకు నచ్చు హీరొ తైతెక్కలాడగా
పంచెఁ గట్టి సినిమ పాటలందు
గొఱ్ఱె మంద వంటి వెఱ్ఱి యువతకంత
పంచెఁ గట్టుటిపుడు ఫ్యాషనాయె