నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్
ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
పాఠకులందరకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
వారణాసి సూర్యకుమారి
కం.
నూతన సంవత్సర మున
మీ తపనలు తీరి కలుగు మెండు శుభమ్ముల్
పూతావి వోలె కీర్తియు
యేతావున పరిమళించి మిమ్మలరించున్
కం.
పిల్లా పాపల గూడియు
చల్లగ కాపురము సాగి చక్కగ శుభముల్
వెల్లివిరియు సుఖశాంతులు
కొల్లగ సంపదలు కలిగి కోర్కెలు తీరున్
సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ విద్వాన్ శ్రీమతి జి. సందిత, బెంగుళూరు
కవిరాజవిరాజితవృత్తం:
జనహృదయస్థవిషణ్ణవిదారకసత్ప్రభలిచ్చుశశాంకమనన్
ధనకనకాదిసదాశయసిధ్ధులుదాత్తతనిచ్చెడుదాతయనన్
జనవరిమాసలసద్రవిబింబముసాక్షిగనిమ్ముప్రశాంతత ప
ద్దెనిమిది!ఆ తొలిదీపముతోడఁప్రతిజ్జలజేసిప్రతిష్టఁగనన్
తే గీ.
క్రొత్త సంవత్సరమ్ము అత్యుత్తమమ్ము
రెండువేల పద్దెన్మిది నిండు కుండ
విశ్వమర్త్యైకమత్యంబు విస్తరించు
సంఖ్య యష్టాదశంబద్ది సౌఖ్య దాత
చావలి విజయ
సీ.
ఉత్సాహ మొలికించు,వూరట కలిగించు
శుభములే తోచును సొబగు చూప
చిగురాశ మురిపించు చిరునవ్వు కనిపించు
సంతసమూహింప శాంతి తోడ
మధు ర స్మృతుల చెంత మమతల చిగురింప
మది వూయలూగునే మంచి కూడి
కొత్త వత్సరములు కోర్కెను రగిలింప
భావి బంగారమై బాగు తోచు
తే.
వత్సరాది శుభమ్ములే వచ్చు నంచు
సంబరమున జరుపుదురే స్వాగతమని
భావముల మాల రంగుల పరిచి కూర్చి
పంచుదురభినందనలను పలు విధముల.
సీ.
తెలిసిన వారికి తెలియాలననుకునే
వారికి తప్పక వరుస గాను
కొత్తవి రంగుల కుదు రైన మాటల
పొందు పరుచుదురే ముచ్చటగను
ఆంగ్ల వత్సరమన్న అందరకు నదియే
ఆచారమై శుభాకాంక్షలు కార్డు తో
చిరునవ్వు మోమున చేరు గ్రహీతకు
సుమధుర భావన శుభమస్తు చెప్పు చెవిన.
ఆ.
మదిని దాగు మంచి మన సైన మనుషుల
మమత తీపి గుర్తు మధు ర దినము
కొత్త వత్సరాన కోరుదురందరు
మనసు పెట్టి తెల్పు మాట తోడ
గండికోట విశ్వనాధం, (తాత్కాలికంగా) సేన్ జోస్, కాలిఫోర్నియా
శ్రీకరమై మహోజ్వల విశేష విశిష్ట ప్రసిద్ధ బద్ధ శో
భాకరమై మహోన్నత ప్రభావ ప్రపూర్ణ ప్రజా ప్రమోదమై
ప్రాకట శాంతి సౌఖ్యముల భావ సముద్భవ సార లక్ష్యమే
నీకిక రెండు వేల పదు నెన్మిది వర్షమ, హర్ష వర్షమై
ఏ దేశంబు నివాసమైన యెచటన్ యేవంక దుర్మార్గతన్
ఏదో దాడితొ కూల్చి పేల్చి బహుధా హింసించి పేట్రేగుచున్
మోదంబంది చరించు దుష్టులను నిర్మూలించి నూత్నబ్ది, తా
నేదో రీతిని శాంతిఘాతకుల నాక్షేపించి శిక్షించెడిన్
కూడున్ గుడ్డయు లేక కోట్ల జనముల్ క్షోభింప రాకెట్టులన్
దాడుల్ చేయగ సృష్టి చేసి వదలన్ తధ్ధాటికిన్ బూడిధై
ఏడం జూచిన భస్మ రాసులతొ ఏయే భూము లల్లాడునో?
పాడిందప్పక నూత్న వత్సరము సద్భావంబు సంధించెడిన్
శ్రీమంతంబగు సర్వ దేశ ప్రజకున్ క్షేమార్ధ సంవర్ధమై
మీ మీ వంశ పరంపరాభి తతులున్ మేల్గాంచు సౌభాగ్యమై
ప్రేమన్ సౌఖ్య ప్రదాతగా వరలి సంప్రీతో ద్యమాకారమౌ
భూమిన్ భావితరంబు లభ్యుదయ సద్భోగార్ధి నూత్నాబ్ధియై
దేశముల నవ్య దివ్య సందేశ మగుచు
దేశ నేతలకు విధి ఆదేశ మగుచు
రెండు వేల పధ్ధెనిమి దఖండ దీప్తి
వెలయ వీక్షించ కాంక్షితు విశ్వ శాంతి.
నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ
నూతన వత్సర మందున
చేతనముగ కవులంత క్షేమం కరమౌ
జాతికి నుపయుక్తం బగు
ఖ్యాతగు రచనలను పంచి ఘన పాఠి యనన్
తటవర్తి శ్రీకళ్యాణ్ చక్రవర్తి
ఎదురుగ రెండువేలపదిహేడవవత్సరమంతమౌచు నూ
త్న దిశ వరించుసమ్మదనిధానవికాసవిభాతభాసమై
కదురెడి కొత్తవత్సరము కన్నులపండువ చేయు వేళ శ్రీ
పదములు సర్వహృత్పథ నివాసము సేయుట నిచ్ఛగించెదన్
చావలి శివప్రసాద్, సిడ్నీ
ఆ. వె.
సంతసమున నూత్న సంవత్సరారంభ
మున జయంబు ధ్యేయముగ తలచిన
అనుదినమును సాగు నాహ్లాదకరముగన్!
విజయములకు విఱ్ఱవీగక పలు
ఒడుదుడుకులను కడునోర్పుతో నలవున
విభవ గతుల నొసగు విలువగు పడి
కట్లుగ మలచు కొనగ నెలకొనును గృహ
ము సుఖసంతసముల భూమముగను
డా. బులుసు వి. ఎస్. మూర్తి, రాజమహేంద్రవరం.
పంట లక్ష్మిగ ధరణి మువ్వన్నెలీన
ఉత్తరాయణ పథము లందుఁజ్వలముగ
కర్షకాళి కలలు పండి హర్షమొదవ
కనకకాంతుల వచ్చె సంక్రాంతిలక్ష్మి
సరస సుందరతర సౌఖ్య శృంగారముల్
చిలికి సంకురాత్రి చెలువునింప
వడిగ వఛ్చి నిలిచె పడతులెల్లరు గూడి
రంగవల్లికలను రచన సేయ
“కొక్కొరొకో”యనన్ నిగిడి కూసెను పందెపుకోడి యింటి, యింతి తా
స్రుక్కుచు సిగ్గు మొగ్గలిడ చూచుచునుండెను పుట్టినింటిలో
చెక్కిలి కెంపు మక్కువను చెప్పగ నాధుని రాకకోసమై
దిక్కుల మంచు మూసె, పువు తీవలు పూచి తలూచె వింతగా
ఎండ వాననక పొలమె యిల్లు కాగ
కష్టపడినట్టి కాపుకు గాది నిండె
పిల్లపాపల సంతోష మెల్లలెగసె
భోగిమంటగ సంక్రాంతి పుణ్యతిథిని
దువ్వూరి వి యన్ సుబ్బారావు, రాజమహేంద్రవరం.
పదునారు చేదు స్మృతులను
పదునేడు శమింప జేయ పాటు బడిన దో
పదునెనిమిది! నీ వే మిడ
పదపడుదువొ ముదమొ వ్యథనొ పదుగుర కిలలో.
తీవ్రవాదమ్ముతో తీయుచు నుసురుల
…..పీడించు దైత్యుల కీడు బోయి
అణ్వాయుధమ్ముల హంగామ జూపించి
…..బెదరించు నేతల పీడ బోయి
తెంపరితనముతో దేశాల నేలెడి
…..మొరకుల దూకుడు మొక్క వోయి
భూతాపమును బెంచు భూజ నాశకులకు
…..క్షితి పైన నూకలు చెల్లిపోయి
శాంతిసహనాల సఖ్యత సందడించి
జాలికరుణల బంధమ్ము చౌకలించి
నరుడు ప్రకృతియు నొకరి కొకరుగ నడచు
వరములన్ పదునెన్మిదీ! కురియ వమ్మ.
భవదీయుడు
ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై
ఆ శ్రీహరి ఆరోగ్యము
నా శ్రీదేవియు నొసగు మనకు సిరులెల్లన్!
ఓ శ్రీకారంబగునే
ఆ శ్రీహరి దయ శుభములమరనీ ఈడున్!
ఈ మాసం ప్రశ్న:
చిట్టెలుకకు బెదిరి పిల్లి ఛెంగున దాగెన్
గతమాసం ప్రశ్న:
సమస్య: బాంబుల వలనే దేశము బాగుపడును
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ
తే.గీ||
ప్రాణ నష్టము గలిగిన భయము లేదు
కఠిన చర్యలు కల్పించ కలత పడరు
నయము భయమున బెదిరించ నాటు దేలె
బాంబుల వలనే దేశము బాగు పడును
సహస్రకవిరత్న సహస్రకవిభూషణ విద్వాన్ శ్రీమతి జి సందిత బెంగుళూరు
తే.గీ:
నాశమయ్యె హిరోషిమ నాగసాకి
మానవ వినాశనంబయ్యె మనసు చెదరె
బాంబులవలనే! దేశముబాగుపడును
మరువ నణ్వస్త్రనిర్మితిన్ మనుజ లెల్ల
సూర్యకుమారి వారణాసి (రాంచి)
తే.గీ.
దేశ ప్రగతికై తపనయే దేశ భక్తి
పాలకుల్ సలుపు న్యాయపాలనమున
సంఘ సంస్కరణను జేయు చట్టములను
బాంబులవలననే దేశము బాగుపడును
శివప్రసాద్ చావలి, సిడ్నీ
(1)
మండుటెండన పొదలన మంట లెగసి
చెంత నిండ్లకు చేరిన చేయు హాని
ఆర్పగ హెలికాఫ్టర్లతో జార్చు నీటి
బాంబుల వలనే దేశము బాగుపడును
(2)
హద్దు మీరు పటాసులు హాని చేయు
స్వస్థతకు! దీపావళి సంబరాన
ఉత్త కాకరవత్తులు ఉల్లిగడ్డ
బాంబుల వలనే దేశము బాగుపడును
మాతామహి బయలుదేర మనుమడు ప్రీతిన్
చేతులనూపుచు ముద్దుగ
తాతా యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్