-ఆర్ శర్మ దంతుర్తి
పదహరేళ్ళ అమెరికన్ అమ్మాయి వెండీ కార్సన్ టేన్నిస్ కోర్టులోకొచ్చేసరికి చప్పట్లు వినిపించాయి. కొత్తగా అప్పుడే టెన్నిస్ ప్రొఫెషనల్ గా మారిన వెండీకి వింబుల్డన్ లో ఎదురే లేదు ఫైనల్ కి రావడానికి. దాదాపు అరడుగులు ఉన్న వెండీ చేసే పవర్ సర్వీస్ తోనూ, కొట్టే గ్రౌండ్ స్ట్రోక్ లతోనూ చూసేవాళ్లకి ఔరా అనిపించే ఆట; అసలు మొదటిసారి ఫైనల్స్ కి వచ్చినప్పుడు కొత్త ఆటగాళ్ళు పడే స్ట్రెస్ గానీ ఉన్నట్టే లేదు మొహంలో. ఎప్పుడో బోరిస్ బెకర్ కి ‘బూమ్ బూమ్ బెకర్’ అని పేరు తగిలించినట్టూ ఇప్పుడు ‘బూమ్ బూమ్ వెండీ’ అనడం మానలేదు చూసేవాళ్ళు. అటువైపు వెండీతో ఆడబోయేది క్రితం ఏడాది వింబుల్డన్ నెగ్గిన కామినిస్కోవా అనే రష్యన్ భామ. ఇప్పటివరకూ ఒక్క సెట్ కూడా పోగొట్టుకోకుండా ఫైనల్ కి వచ్చినావిడ. బెట్టింగ్ రాయుళ్ళ ప్రకారం కామినిస్కోవా ఈ ఫైనల్స్ గెలిచి తీరుతుంది, కానీ వెండీ నెగ్గడానికి పది శాతం ఇచ్చారు ఛాన్సు; ఆటలో ఎటుతిరిగి ఎటొస్తుందో చెప్పలేం కనక.
జూన్ నెలలో శనివారం సాయంత్రం; వర్షం లేని మంచి వాతావరణం – ఎవరూ ఊహించనట్టూ ఆట మొదలైన సరిగ్గా నలభై నిముషాల్లో ముగిసింది. వెండీ, రెండే రెండు వరస సెట్లతో కామినిస్కోవా మీద గెల్చి కొత్త ఛాంపియన్ గా అవతరించింది. కామెంటేటర్లు చెప్పడం ప్రకారం ఈ వెండీ ఆట గత పదేళ్లలో ఎక్కడా విన్నదీ కన్నదీ కాదు; రాబోయే పదేళ్లలో – ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకుంటే, ఆటల్లో నిరంతరం తగిలే దెబ్బలబారిన పడకుండా ఉంటే, వెండీ విరక్కొట్టని రికార్డులు ఉండబోవు. అన్నింటికీ మించి వెండీకి ఉన్న ఆయుధం వయస్సు. ప్రస్తుతం పదహారేళ్ళే కనక వచ్చే ఇరవై సంవత్సరాలు ఖచ్చితంగా టెన్నిస్ ఆడగలదు.
తనకి వచ్చిన ఛాంపియన్ కప్పూ, డబ్బూ పట్టుకుని వెండీ వెనక్కి వచ్చింది సాల్ట్ లేక్ సిటీకి. ఊర్లో బోల్డంత మంది సంతోషించారు స్వాగతం చెప్పి. అక్కడ్నుంచి మొదలైంది వచ్చే పోయే స్పాన్సర్ల తాకిడి. సోడా కంపెనీలు, బట్టలమ్మేవి, నైకీ, న్యూ బేలన్స్ అంటూ రకరకాల బూట్ల కంపెనీలు. ఇవి చాలవన్నట్టూ స్కూల్ డిస్ట్రిక్ట్ వారి టివి కబుర్లు, న్యూసులో ప్రతీరోజూ వెండీ గురించే కబుర్లు. ఒక్కసారి వెలుగులోకి రాగానే మిగతా విషయాలు పేపర్లూ, టివి ఛానెళ్ళూ వెలికి తీసి ప్రపంచానికి ఉచితంగా అందించారు. దాని ప్రకారం వెండీ నాన్నగారు తాగుబోతు. పిల్ల పుట్టగానే విడాకులకోసం ప్రయత్నించారు. ఈయన తాగుడితో పిల్లని చూసుకోలేరనీ, ఇన్నాళ్ళు తనని ఇంట్లో అన్ని రకాల కష్టాలు పెట్టారనీ, కొడుతూ ఉండేవారనీ అమ్మగారు కోర్టులో చెప్పేసరికి విడాకులు ఇచ్చి, పిల్లని అమ్మతో ఉండేటట్టూ ఏర్పాటు చేసారుట. ఆ తర్వాత పిల్ల పుట్టినరోజుకి కూడా ఏనాడూ ఈ తండ్రిగారు రాలేదు చూడ్డానికి.
వెండీ అమ్మగారు మాత్రం స్కూల్లో టీచర్ పనిచేస్తూ పిల్లతో అష్టకష్టాలు పడి నెట్టుకొచ్చారు. పాప పెద్దదౌతూ ఉంటే టెన్నిస్ లో కోచింగ్ కీ, బట్టలకీ, బూట్లకీ డబ్బులకోసం పాపం ఆవిడ పడని కష్టం లేదు. అప్పో సొప్పోచేసి ఇల్లు తాకట్టు పెట్టారు కూడా. అయితేనేం? వెండీ ఒక్కసారి వింబుల్డన్ నెగ్గేసరికి అన్ని కష్టాలూ తీరలేదా? పేరు వచ్చింది, డబ్బులు వచ్చాయి, అన్నింటికన్నా ముఖ్యంగా అమ్మాయి టెన్నిస్ ప్రపంచంలో మేటి అని నిరూపించుకుంది. కొంచెం కష్టపడి ఇదే లెవెల్లో ఆడితే వెనక్కి చూసుకునే పనే లేదు.
వెండీ నాన్నకి కూతురు చేసిన ఘనకార్యం తెల్సింది తొందర్లోనే. వెండీ నెగ్గేసరికి ఈయన ఎప్పుడో చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవించి జైల్లోంచి బయటకి వచ్చి ఉన్నాడు. ఉద్యోగం సద్యోగం లేదు. తిండికి ఏ సూప్ కిచెన్ లోనో సర్దుకుంటున్నాడు. నాలికమీద చుక్క పడకపోతే గుండె గుబగుబలాడుతోంది. ఆ రుచే వేరు కదా?
ఓ రోజు కూతురు టెన్నిస్ ఆడే కోర్టు దగ్గిర ఆగి పలకరించాడు, కారు ఎక్కబోతున్నప్పుడు, పార్కింగ్ లాట్ లో. ఆగస్ట్, సెప్టెంబర్లలో రాబోయే యు ఎస్ ఓపెన్ కి ప్రాక్టీస్ చేసుకోవడానికి కోర్టుకి వచ్చింది వెండీ. మొదట కొంచెం కంగారు పడినా బొటాబొటిగా పలకరించి వెళ్ళిపోతూంటే తండ్రి చెప్పాడు – తన దగ్గిర డబ్బులు లేని సంగతీ, సూప్ కిచెన్ మీద పడి తింటున్న సంగతీ అవీను. ఏ కళ నుందో జేబులో ఉన్న వంద డాలర్లు అతని చేతిలో పెట్టి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది వెండీ. ఈ సంగతి తల్లితో ఏమీ చెప్పలేదు – అసలే వీళ్ళిద్దరికీ పడదు. ఇలా డబ్బులిచ్చానని చెప్తే తల్లి ఏమని తిడుతుందో తెలియదు కదా?
ఆ రోజు రాత్రి, మర్నాడు రాత్రీ ఆ వంద డాలర్లూ మందుమీద పూర్తిగా తగలేసాక మరోసారి వెండీని కలిసాడు తండ్రి ఈసారి కూడా పార్కింగ్ లాట్ లోనే. అయితే ఈ సారి తాను కూతురు ఇచ్చిన డబ్బులతో కాస్త బాగా ఉన్నట్టు చూపించడానికి గుడ్ విల్ అనే షాపులో కొన్న పాత బట్టలలో కాస్త మంచివి వేసుకునే బయల్దేరాడు. మరో సారి వంద డాలర్లు ఇవ్వబోతే అవి తీసుకుని జేబులో పెట్టుకున్నాక తండ్రి చెప్పేడు, “ఓ వంద డాలర్లు నేను బతకడానికి ఏమూలకి పనికొస్తాయి? నీకు ఎంతోమంది తెలుసున్న వారు ఉంటారు వాళ్ల దగ్గిర ఏదో ఒక ఉద్యోగం ఇప్పించు, బతికిపోతాను.”
“నాకెవరూ అంత పెద్దవాళ్ళు తెలియదు, నేనేదో, నా టెన్నిస్ ఏదో ఆడుకోవడం తప్ప. అసలు నీకు నేను డబ్బులు కూడా ఇవ్వనవసరం లేదు. నువ్వు నాకు ఏనాడు తండ్రిలా ప్రవర్తించలేదు. అమ్మ తప్ప నాకెవరూ లేరు. మరోసారి నన్ను డబ్బులు అడగవద్దు.” కరుగ్గా చెప్పి వెళ్ళిపోయింది వెండీ.
ఈ సారి ఇంటికెళ్ళగానే తల్లితో చెప్పింది జరిగిన సంగతి. తల్లికి ఏం చెప్పాలో తెలియలేదు కానీ చివరకి అంది – “ఆయనతో మరోసారి పెట్టుకోకు. నువ్విచ్చిన వంద డాలర్లు ఈ పాటికి మందు మీద తగలేసి ఉంటాడు. నీకు డబ్బులొచ్చాయని విని నీతో మాట్లాడాడు కానీ లేకపోతే ఎప్పుడైనా పలకరించాడా? అసలు ఈయనని పోలీసులకి అప్పగించాల్సింది, అలా పార్కింగ్ లాట్ లో బిచ్చం ఎత్తుతున్నందుకు.”
“పోనీలే అమ్మా, మరోసారి నన్ను పలకరించవద్దని చెప్పానుగా?”
ఎప్పుడైతే కూతురు తనని మరోసారి పలకరించవద్దని చెప్పిందో అప్పుడు తండ్రికి కోపం వచ్చింది. తాను లేకపోతే అసలు ఈ కూతురు పుట్టి ఉండేది కాదు కదా? తనకో ఉద్యోగం చూపించమన్నందుకే ఇంత కోపమా? ఏదో తాను తాగుడికి ఒకట్రెండు సార్లు అలవాటు పడ్డాడు కానీ మానేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కదా? అయినా ఈ కూతుర్ని అని ఏం ప్రయోజనం. దీన్ని ఇలా పెంచిన అమ్మని అనాలి. ఇంకా పద్దెనిమిది ఏళ్లు రాని ఈ కూతురి డబ్బు విషయాలు తాను ఆవిడకన్నా బాగా చూడగలడు. ఈ తల్లి డబ్బంతా ఏం చూసుకోగలదు? దానికేమైనా చేతనైందా? ఇలాంటి పెడసరపు ఆలోచనల్తో తిన్నగా ఊర్లో కొచ్చాడు. ఎదురుగా ఏదో కాఫీ షాపు ఉంది. లోపలకెళ్ళి కాఫీ తాగుతూంటే పక్కన ఎవరో ఫోనులో మాట్లాడుతున్నది వినిపించింది. ఎవడో లాయర్ కాబోలు; కేసు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడ్డం అయ్యాక వెళ్ళి పలకరించాడు.
అమెరికాలో ప్రతీ వెయ్యిమందికీ ముగ్గురు డాక్టర్లు ఉంటే ముప్ఫై మంది లాయర్లున్నారు ఓ కధనం ప్రకారం. న్యూయార్క్, వాషింగ్టన్ డిసి లలో అయితే ఈ లాయర్ల లెక్క వందల మీద ఉంది. పక్క ఇంట్లోవాడి కుక్క రాత్రి తాను పడుకున్నప్పుడు అరుస్తున్నందుకూ, వాడి చెట్టు ఆకులు తన ఇంట్లో పడుతున్నందుకూ కోర్టుకి లాగవచ్చు. అంతెందుకు రోడ్డుమీద గతుకుల వల్ల బండి ఏక్సిడెంట్ అయితే పన్నులు కట్టించుకుంటూ రోడ్లు బాగుచేయని మునిసిపాలిటీనీ, సిటీనీ కూడా కోర్టుకి ఈడవ్వొచ్చు. అలా ఈ లాయర్లు ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటారు, ఎందుకంటే మీ నోటితో చెప్పలేని, చెప్పకూడని అబద్ధాలన్నీ ఈ లాయర్ల నోటితో చెప్పించవచ్చు.
ఓ పావుగంట మాట్లాడాక లాయర్ వెండీ తండ్రీ ఒకరినొకరు షేక్ హేండ్లు ఇచ్చుకుని ఒప్పందంతో బయటకి వచ్చారు. ఆ ఒప్పందం ప్రకారం వెండీ ఇంకా మైనర్ కనక ఆవిడ డబ్బుల బిజినెస్ వ్యవహారాలు చూడ్డానికి – అదీ వింబుల్డన్ అంత పెద్ద టోర్నమెంట్ నెగ్గాగ – ఈ స్కూల్ టీచర్ తల్లికి దక్షత లేదు గాక లేదు. తండ్రిగా తనకి ఉంది, తాను ఒకప్పుడు తాగిన మాట నిజమే కానీ ఇప్పుడు మానడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వెండీ ఎక్కడికైనా వెళ్ళవల్సి వస్తే మైనర్ కనక తాను తోడు ఉండగలడు. ఇటువంటి చెత్త వగైరా వగైరాలు కలిపి ఎవరైనా ఈ కేసు చదివితే నిజమే కదా అనిపించేలా తయారయ్యాయి కాయితాలు. ఆఫ్ కోర్స్, లాయర్ గారు కేసు నెగ్గే వరకూ ఫీజులు తీసుకోరు. నెగ్గాక ఇష్టం వచ్చినంత – అంటే నెగ్గిన దాంట్లో తొంభై శాతం వరకూ తీసుకుంటారనేది జగమెరిగిన సత్యం.
ఆ పై వారంలో వెండీ ఇంటికి వచ్చాడు లాయరు, కేసు వేసే ముందు కోర్టు బయట ఏదైనా సర్దుకోవడం కుదురుతుందేమో కనుక్కోవడానికి. కోర్టుకెళ్తే ఖర్చు ఎక్కువ కదా? కధంతా విన్న వెండీ, అమ్మా అవాక్కయ్యారు. ఎప్పుడో విడాకులు ఇచ్చినప్పుడు కోర్ట్ వారు తల్లికి వెండీ సంరక్షణ అప్పగించిన కాయితం, అప్పటి నుండి తండ్రి అనే పదమే తెలియకుండా వెండీ పెరగడం అన్నీ చెప్పి తల్లి అంది, “మీ ఇష్టం వచ్చిన కోర్టుకి వెళ్లవచ్చు. ఆయనని మేము మరోసారి మా వ్యవహారాల్లో కల్పించుకోనివ్వం. గెట్ ఔట్!”
లాయర్ కి ఇవేం కొత్త కాదు కనక చెప్పాడు, “మీ ఇష్టం, ఓ సారి కోర్టులో కేసు పడితే అమ్మాయి దృష్టి ఆటమీదనుంచి మరల్తుంది. ఓడిపోవచ్చు; అదే అమ్మాయి మేజర్ అయ్యేదాకా అంటే జస్ట్ రెండేళ్ళు, పద్దెనిమిదేళ్ళు వచ్చేదాకా తండ్రిని కూడా ఉండనివ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం. కోర్టులో కేసు పడితే మీకే అనవసరపు పబ్లిసిటీ.”
వెండీ తల్లి అప్పటికే లేచి తలుపు తీసి చెప్పింది, “ఇప్పుడు మీరు వెళ్లకపోతే పోలీసులని పిలవాల్సి వస్తుంది.”
లాయర్ మరో మాట లేకుండా బయటకి నడిచాడు.
కేసు పడనే పడింది. విడాకుల కేసు పడ్డది ఎన్నో ఏళ్ల క్రితం ఏదో కోర్టులో. ఇప్పుడు జడ్జ్ గారు వినేది మరో కధ, మరో కోర్టు కనక అంతా మళ్ళీ మొదటనుంచీ వింటారు. ఇదెలాగా తప్పదు కనక వెండీ ఓ లాయర్ ని కుదుర్చుకోవాల్సిన పరిస్థితి. ఈ డిఫెన్స్ లాయర్ గారి ప్రకారం అసలు వెండీకి తండ్రి అనేవాడే లేడు. మనిషి ఉన్నాడు సరే కానీ ఆయనెప్పుడూ తండ్రిగా ఏదీ చూసినవాడు కాదు. ఈ రోజు వెండీ నెగ్గిన డబ్బుల గురించి తెలిసే సరికి ఇప్పుడు బయల్దేరాడు – ఏవైనా కాసులు వళ్ళు వంచకుండా దొరుకుతాయేమో చూడ్డానికి. ఈ నక్క మోసాలకి నేనున్నానంటూ ఓ లాయర్ కూడా తయరయ్యాడు. ఏదైనా ఈ కేసు వీగిపోవడానికి పది రోజులు చాలు.
కేసు పడీ పడడంతోనే న్యూసు పేపర్లూ, టివి వారు వెండీ ఇంటిముందు పడిగాపులు కాయడం మొదలైంది. వెండీ మొహంలో కదిలే భావాలనుంచి, ఆవిడ జుట్టు ఎటువేపు వేసుకుందీ, ఆ వేసుకోవడం తండ్రి మూలానా, తల్లి అలవాటా అంటూ ‘ప్రత్యేకమైన విశ్లేషణ’తో రోజూ కధనాలు మొదలయ్యాయి.
మొదట్లో ఏం పట్టించుకోకపోయినా రోజురోజుకీ పెరిగే కధనాల వల్ల వెండీకి టెన్నిస్ మీద ధ్యాస తగ్గుతోంది. దానికితోడు, ఓ రోజు ప్రాక్టీస్ చేసే ట్రైనర్ అడిగింది కూడా – ఈ కేసు సంగతి. ఆవిడ చెప్పడం ప్రకారం వెండీ కేస్ సంగతి కామెంటేటర్లూ, మిగతా టెన్నిస్ ప్లేయర్లూ మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి గుండె గుభేల్ మంది వెండీకి. ఇప్పటివరకూ తనకి ఏనాడూ మచ్చ అనేది లేదు. తానూ తన టెన్నిస్ తప్ప మరో విషయమే ఆలోచించలేదు. ఇప్పుడీ దౌర్భాగ్యపు తండ్రి దొరికాడు మళ్ళీ. ఎందుకంటే తన మూలానే, తాను వింబుల్డన్ నెగ్గడం వల్లే. నెగ్గకపోయి ఉంటే ఏ గొడవా ఉండి ఉండేది కాదేమో? ఈ ఆలోచనల్తో బుర్ర పాడౌతూ ఉంటే ఆట మీద ధ్యాస తగ్గడం గమనించిన ట్రైనర్ చెప్పింది – “ఇలా ఆడితే మొదటి రౌండ్లోనే ఓడిపోతావు సుమా. ఆట మీద తప్ప మరో చోట ధ్యాస వద్దు.”
చెప్పడం ఎంత సులభం? కేసు ఇలా జరుగుతుంటే అప్పుడప్పుడూ వెండీకి తండ్రి కనిపిస్తూనే ఉన్నాడు పార్కింగ్ లాట్ లో. దూరంనుంచి చూస్తున్న ట్రైనర్ మిగతా ఆటగాళ్ళు లోలోపల నవ్వుకుంటూనే ఉన్నారు వెండీని చూస్తూ. వెండీ నెగ్గినందుకు వాళ్లక్కూడా లోపల ఉన్న ఏదో కుళ్ళు, అసూయా అలా బయటకి వస్తూనే ఉంది.
ఎవరైనా పైకి వస్తూంటే అప్పటివరకూ పట్టించుకోని వారికీ ముక్కూ మొహం ఏనాడూ చూడనివారిక్కూడా అసూయ రావడం మామూలే కదా? ఆ తర్వాత పైకొచ్చే పెద్దమనిషి ఎంత త్వరగా కింద పడితే అంత సంతోషిస్తుంది ఈ ప్రపంచం. అయితే ఈ అసూయాద్వేషాల వల్ల అవతలవాళ్ళ మీద పదే మానసిక ప్రభావం ఈ ప్రపంచం ఏ నాటికీ గ్రహించదు. ఇది ఆటల్లోనే కాదు ప్రతీ విషయంలోనూ చూస్తున్నదే.
ఆగస్ట్ లో మొదలెట్టిన యు ఎస్ ఓపెన్ మొదటి రౌండ్ లో వెండీ ఐదు సెట్లు ఆడాల్సి వచ్చింది నెగ్గడానికి. అప్పుడు కామెంటేటర్ల ప్రకారం ఈ వెండీ ఎవరో, మొన్నటికి మొన్న వింబుల్డన్ గెల్సిన వెండి మరొకరెవరో. అసలు పోలికే లేదు; వింబుల్డన్ నెగ్గాక ఆ పేరూ డబ్బు బుర్రలోకి ఎక్కి వెండీ ఇలా తయారైందా? అయితే వచ్చే ఏటికి ప్రపంచంలో ఎవరికీ వెండీ అంటేనే తెలియదు. వాట్ ఎ ట్రాజెడీ! వింబుల్డన్ ఫైనల్ లో వరస సెట్లతో కామినిస్కోవాని మట్టి కరిపించినది ఈ వెండీ అంటే నమ్మడం ఎలా? అసలు ఈవిడ సర్వీస్, గ్రౌండ్ స్ట్రోక్స్ ఏమయ్యాయి?
ఆ రోజు రాత్రి తల్లితో మాట్లాడింది వెండీ ఫోను మీద న్యూ యార్క్ నుంచి. తాను ఆటలోంచి తప్పుకోవాలనుకుంటున్నాననీ, ఇలా ఆడటం కన్నా ఇంట్లో కూర్చోవడం మంచిదనీ ఏవో బాగా నెగటివ్ కబుర్లు, ఏడుపు, నీరసించిన కంఠం, అసలు మానసికంగా కుంగిపోయినట్టు, ఆత్మవిశ్వాసం పూర్తిగా పోయినట్టూ వగైరా.
తల్లి అన్నీ మాట్లాడి చెప్పింది, “ఈ ప్రపంచంలో నీకు అన్నింటికన్నా ఇష్టమైనది టెన్నిస్. ఈ తండ్రి మీద కేసు సంగతి నాకు వదిలేయి. నేను చూసుకుంటా. ఏమీ జరగదు. నీ ఆట నువ్వు ఆడుకో. ఏమీ కంగారు లేదు.”
అలా తల్లి ఇచ్చిన ధైర్యంతో వెండీ రెండో రౌండ్లోకి పుంజుకుని వరస సెట్లతో నెగ్గి మూడో రౌండ్లోకి వచ్చింది. వెండీ ఆట చూసి మూడో రౌండ్లో ఆడబోయే ఎవరో పేరులేని రష్యన్ భామ కంగుతింది. వెండీ అలా ఆడితే తాను మూడో రౌండ్లో చతికిలపడాల్సిందే. కనీసం మూడో రౌండ్లో అయినా నెగ్గితే కాసిని డబ్బులొస్తాయి. ఏం చేయాలో తెలియక తన కోచ్ ని సంప్రదించింది. ఆయన సలహా ఇచ్చాడు ఏం చేయాలో వంకర నవ్వు నవ్వుతూ.
ఆ సలహా ప్రకారం మూడో రౌండ్ ఆట మొదలయ్యే ముందు ఆటగాళ్ళిద్దరూ నెట్ దగ్గిర చేతులు కలిపేచోట రష్యన్ భామ టివిల కోసం నవ్వుతూనే ఉన్నా వెండీతో అంది, “నువ్వూ, నిన్నొదిలేసిన నాన్నా, నీ కోర్టు కేసూను, ఎంత అప్రదిష్ట! నువ్వు ఇక్కడ ఏం నెగ్గినా ఆ డబ్బులన్నీ లాయర్లకే పోతాయి కదా? ఏం బతుకు నీది?”
వెండీ ఏదో అనబోయే లోపలే రష్యన్ దూరంగా వెళ్ళిపోయింది. వెండీకి ఒక్కసారి షాక్ లాగా తగిలింది దెబ్బ ఈ మాటల వల్ల. మూడు రోజుల క్రితం అమ్మ ఇచ్చిన ధైర్యం అన్నీ నీరుకారిపోయేయి. ఇదన్న మాట తన తోటి ప్లేయర్స్ తన గురించి మాట్లాడుకుంటున్నది. ఆవిడ చెప్పినది నిజమే కదా, ఛీ, ఏం బతుకు నాది? ధ్యాస ఆటమీద నుంచి తప్పి పార్కింగ్ లాట్ లో కనిపించే తండ్రి మొహం, తండ్రి అంటే తల్లి మొహంలో కనిపించే అసహ్యం ఇవే కనిపిస్తున్నాయి. మరో ఇరవై నిముషాలకి తెల్సిన విషయం – వెండీ మొదటి సెట్ లో ఓడింది.
మరో గంట తర్వాత న్యూస్ పేపర్లలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది – వెండీ యు ఎస్ ఓపెన్ లోనుంచి నిష్క్రమించింది – అదీ పేరులేని ఎవరో రష్యన్ భామ చేతిలో. దానికి న్యూస్ వారు అతికించిన చివరి “మసాలా తురుపు ముక్క” – ఇదంతా వెండీ తల్లీ తండ్రీ కోర్టులో కొట్టుకుంటున్నందువలనేనా?
ఆ రోజు రాత్రి వెండీ తల్లి ఈ న్యూస్ చూసి ఫోన్ చేసింది కూతురికి. ఎవరూ ఎత్తడం లేదు. సరే ఓ గంట ఆగి చూద్దాం అసలే ఓడిపోయిన దుఃఖంలో ఉంది కదా అని ఊరుకుంది. రాత్రి పది నుంచి పొద్దున్న ఆరు దాకా దాదాపు నలభై సార్లు ఫోన్ చేసాక సమాధానం రాకపోయేసరికి హోటల్ వారిని సంప్రదించింది వెండీ తల్లి.
వాళ్ళు చెప్పారు, “రాత్రి స్టేడియం నుంచి రావడం చూసాం, రూములోనే ఉండి ఉండవచ్చు. మేము కూడా ఫోన్ చేసాం. మాకూ సమాధానం లేదు. మీరు సరే అంటే లోపలకి వెళ్ళి చూస్తాం.”
“పొద్దున్నే వద్దు కానీ, మధ్యాహ్నానికి చూద్దాం. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను.”
మధ్యాహ్యం మూడింటిదాకా చూసి సమాధానం రాకపోయేసరికి మళ్ళీ హొటల్ కి ఫోను. వాళ్ళు తలుపు తీసి చూడ్డానికి సెటిల్ అయింది. ఓ అరగంట ఆగాక అప్పుడొచ్చింది వెండీ తల్లికి హొటల్ నుంచి ఫోన్.
లోపల గదిలో వెండీ ఉరివేసుకుని చనిపోయి ఉంది. బల్లమీద ఓ నోట్. “నేను జీవితంలో టెన్నిస్, మా అమ్మా చాలు అనుకుంటూ పెరిగాను కానీ ఈ వింబుల్డన్ నెగ్గడం వల్ల నా బతుకు ఇంత ఛండాలంగా తయారౌతుందనీ, నాకిన్ని మానసిక ఏడుపులు తగుల్తాయనీ తెలియలేదు. నేను ఇవన్నీ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను పుట్టాక ఎలా పెరిగానో కూడ పట్టించుకోని నాన్నకి నా మీద ఒక్కసారి ప్రేమ అంకురించింది, నేను గెల్చిన డబ్బు వల్ల. ఆయన లాయర్ తో మా మీదకి కేసులంటూ వచ్చాడు; దానిక్కారణం నేను మైనర్ ని ట, నా సంగతి నేను మా అమ్మా చూసుకోలేమనిట. ఈ పదహారేళ్ళూ మేము ఉన్నామో లేమో పట్టించుకోని ఈ తండ్రికి అర్జెంట్ గా నేను కావాల్సి వచ్చాను – కేవలం వింబుల్డన్ నెగ్గడం వల్ల. నాకు ఇంత చేసిన అమ్మకి నేను ఏనాడూ రుణం తీర్చుకోలేను. అమ్మా, నేను ఇలా, నీతో చెప్పకుండా పోతున్నందుకు క్షమాపణలు. నాతో మూడో రౌండ్లో ఆడిన రష్యన్ భామకి – మీరు చెప్పినది నిజమే, నా జీవితమే ఒక అప్రదిష్టపు ముచ్చట.”
తర్వాత పోలీసులొచ్చి ఏదో ఇంక్వైరీ చేసారు. మూడో రౌండ్ లో వెండీ మీద నెగ్గిన రష్యన్ భామ తో ఏదో మాట్లాడారుట కూడా. కానీ వెండీ రాసిన కాయితం లో చెప్పినట్టూ ఎవరూ బాధ్యులు కారు వెండీ చావుకి. ఆ రష్యన్ భామ చెప్పడం ప్రకారం – ఆట ముందు తాను వెండీకి, ‘హల్లో వింబుల్డన్ ఛాంపియన్, ఆల్ ద బెస్ట్’ అని మాత్రమే చెప్పింది. అందులో ఏముంది తప్పు?
ఇంత జరిగాక వెండీ తండ్రి వేసిన కేసు జడ్జ్ గారు అవతలకి విసిరారు. వెండీ తండ్రి ఎప్పటిలాగానే సూప్ కిచెన్ లో పడి దొరికినది తింటూ, డౌ టౌన్ లో చేతులు చాపి అడుక్కుంటూ ఏ రోజైనా డబ్బులొస్తే వాటిని తాగుడుమీద తగలేస్తూనే ఉన్నాడు. తాను కుదుర్చుకున్న లాయర్ కనిపించి కూతురు చచ్చిపోయినట్టూ చెప్పి కేసు వీగిపోయిందని చెప్పాక ఆయన భుజాలు ఎగరేసి ఊరుకున్నాడు. ఆయన దృష్టిలో ఎప్పుడూ కూతురూ, పెళ్ళాం పట్టలేదు ఆయనకి. పిల్ల ఎప్పుడైతే డబ్బులు సంపాదించిడం మొదలు పెట్టిందో అప్పుడు డబ్బులకోసం కేస్ వేశాడు కానీ కూతురు ఉంటే ఎంత పోతే ఎంత?
వెండీ తల్లి మాత్రం రెండు మూడేళ్లు బాధపడింది అతి పిన్న వయసులో కూతురికి ఇలా అయినందుకు. ఆ తర్వాత ఆవిడ మరొకరిని ఎవర్నో డేట్ చేసి ఆయనతో జీవితం సర్దుకుంటూనే ఉంది.
నెగ్గినప్పుడు వెండీని ఆకాశానికి ఎత్తేసిన కామెంటేటర్లూ, ఓడినప్పుడు పాతాళానికి తొక్కేసిన విమర్శకులూ మంచి టాలెంట్ అర్ధాంతరంగా ముగిసిపోయినందుకు కొన్ని వ్యాసాలు రాసుకుని తమ పేరు అచ్చులో చూసుకుని ఉద్యోగాలలో నిలదొక్కుకుంటూనే ఉన్నారు. వెండీ నెగ్గినప్పుడు కుళ్ళుకున్న మిగతా ఆటగాళ్లకో ఆనందం – రాబోయే రోజుల్లో ఓ ఛాంపియన్ ని ఎదుర్కోనక్కర్లేదు! వెండీ తో ప్రాక్టీస్ చేస్తూ తామెన్నడూ ఏమీ నెగ్గలేని మిగతా చిల్లర ఆటగాళ్లకీ మరో ఆనందం – వారి ఆసూయ ప్రకారం వెండీ రాలిపోయినందుకు.
అయితే పదహారేళ్ల వయసులో ప్రపంచపటం మీద నిల్చిన వెండీ పడిన మానసిక వ్యధా, నెగ్గిన వాళ్ళు నెగ్గినప్పుడు పొందే నిజమైన మెటాఫిజికల్ శూన్యం, ఓడినప్పుడు పాతాళంలో పడే ఒంటరితనం ఎవరికీ పట్టలేదు. తాగు బోతు తండ్రీ, వెండీ గురించి ఏదైనా మాట్లాడే హక్కు తమకి ఉందనుకునే ఓ ఒక్క కామెంటేటరూ, న్యూస్ రిపోర్టరూ కూడా వెండీకి కలిగిన మానసిక ఘర్షణ, దాని వల్ల వెండీకి ఆత్మహత్య చేసుకునే అవసరం తామే కల్పించామని అర్ధం చేసుకోలేకపోయేరు. అలా ఈ పాడు ప్రపంచం అప్పుడే పైకొచ్చే టెన్నిస్ తారని నిర్ధాక్షిణ్యంగా పీక నులిమి చంపి అవతల పారేసింది. అయినా సరే ఈ మర్డర్ ని ఎంత పేరున్న లాయరూ ఏ కోర్టులోనూ ఛాలెంజ్ చేయడానికి సాహసించలేదు.