కథా భారతి

మౌనమేలనోయి

-రచన: కోసూరి ఉమాభారతి

పొద్దుటే యోగాభ్యాసన ముగించి… గ్రీన్-టీ సేవిస్తూ ఇంటిముందున్న గార్డెన్ లోకి నడిచాను. సూర్యకిరణాలు నా పై పడేలా కుర్చీ లాక్కొని కూర్చున్నాను. ఈ మధ్యనే సంజీవరెడ్డి నగర్ లోని మా కొత్త ఇంట్లోకి వచ్చాక.. ప్రాణం హాయిగా ఉంది. బోలెడంత స్థలం. నా మ్యూజిక్ ప్రాక్టీసుకి ప్రత్యేకంగా పై అంతస్తులో స్టూడియో కూడా.
టీ కప్పు తీసుకుని ఇంట్లోకి వెళ్లబోతుంటే, పట్టాభి పరుగున వచ్చి రింగవుతున్న నా ఫోన్ అందించాడు. చూస్తే ఊర్మిళమ్మ నుండి..
‘అమ్మో, ఈమె నాకు ఫోన్ చేసిందేమిటి?’ అనుకుంటూ, “హలో నమస్తే అత్తయ్య, ఎలా ఉన్నారు? చెప్పండీ” అన్నాను తిరిగి కుర్చీలో కూర్చుంటూ.
“నిన్న నీ మ్యూజిక్ ప్రోగ్రాంకి వస్తిమి శ్యామా. మీ మామయ్యకి సిటీలో జరిగే కార్యక్రమాలకి ఆహ్వానాలు వస్తుంటాయి కదా! ‘సరిగమప’ వాళ్ళ కార్యక్రమంలో నీవు పాడుతున్నావని చూసి.. ప్రోగ్రాంకి వద్దామనుకుంటిమి. ఆఖరి నిముషంలో మీ మామయ్య క్యాంప్ కి వెళ్ళాల్సి రావడంతో.. నిన్న సాయంత్రం నన్ను మా మురళీబాబే తీసుకొచ్చాడు” అంది.
“అవునా అత్తయ్యా?’ అన్నాను. మురళీ కూడా ప్రోగ్రాంకి వచ్చాడనగానే ఆశ్చర్యపోయాను. ప్రోగ్రాంకి వచ్చి మరీ మురళీబావ నా పాట విన్నాడంటే నమ్మలేక పోతున్నాను. నా గుండె వేగంగా పరుగులు పెట్టింది..
“అవునమ్మా, ఓ పది నిముషాలు ఆలస్యంగా వచ్చుంటుమి. నీ లలిత సంగీతం కూడా అయ్యాక వెళ్ళిపోతిమి. మురళీబాబే … ఫోన్ చేసి నీకు అభినందనలు చెప్పమన్నాడు. చాలా బాగా పాడావు శ్యామా .. నీ క్లాసికల్ పాట బాగా నచ్చింది. బాబు కూడా అనేసినాడు…. సినిమా పాటలు, డ్యూయెట్స్ కన్నా కర్నాటక సంగీతంకి నీ కంఠం అదేమది … కోకిల కంఠం మాదిరి బాగుంది అని. నీవు ఇంకా వృద్దిలోకి రావాలి శ్యామా… ఉంటానమ్మా” అని ఫోన్ పెట్టేసింది ఊర్మిళమ్మ. ‘ధన్యవాదాలు’ చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు.
‘ఏమిటబ్బా ఈ అకస్మాత్తు ఫోన్? అదీ నా పాట గురించే సాగిన ఆవిడ సంభాషణ, అందునా బావ ప్రస్తావన? నా మీద, నా పాట మీద వీరికి ఇంత ఆసక్తి ఏమిటాని’ ఆలోచనలో పడ్డాను.
ముందుగా నిన్న జరిగిన ప్రోగ్రాం గురించి ఆలోచిస్తే… సగ భాగం .. మా గురువు..వాణి మేడమ్ అధ్వర్యంలో నేను, కళ్యాణి కర్నాటక సంగీత కచేరి చేసాము. మిగతా భాగం మ్యూజిక్ డైరెక్టర్ గంగాధర్ గారి అధ్వర్యంలో నా కూడా కళ్యాణి, రమేష్ లు పాత-కొత్త సినీ గీతాలు పాడారు. మరి…నా సినీ గీతాలు మురళీబావకి అంతగా రుచించక పోవడమేమిటి?… లేక నేను రమేష్ తో కలిసి ప్రేమగీతాలు పాడడం నచ్చలేదా? అన్న ఆలోచనతో నాలో వింత సడి మొదలయింది. వరసకి మరదలనని ఏదో ఫీలింగా? నేనంటే మురళీకి ఇష్టమా? ఇంతకీ అత్తయ్య ఆలోచనేమిటో .. నా ఊహకి సరిగా అందడం లేదు.
ఎప్పుడైనా ఫంక్షన్స్ లో ఎదురుపడినప్పుడు మా నాగేంద్ర మామయ్యా, అతని భార్య ఊర్మిళమ్మ…. నాతో ఆప్యాయంగానే మాట్లాడుతారు. వాళ్ళబ్బాయి మురళీ మాత్రం.. తారసపడితే.. నా పక్కనున్న చెల్లి చంద్రికనో, పిన్ని కూతురు పద్మనో పలకరిస్తాడు. నన్ను ఉద్దేశిస్తూ ఏదో వ్యాఖ్యానించి ఓ చిరునవ్వు నా దిశగా విసిరి వెళ్ళిపోతుంటాడు. అలా నన్ను కవ్వించి వెళ్ళిపోతున్న అతగాడిని చెవి పట్టి నా వైపుకి తిప్పుకుని, నేరుగానే కబుర్లాడమని చెప్పాలనిపిస్తుంది. బావ కదా! ఎవరికీ అభ్యంతారాలుండవు. కానీ అంత తెగుంపు ఆచరణలో లేదాయే.
నాగేంద్ర మామయ్య మా అమ్మకి అన్న వరస అవుతాడు. అమ్మకి పెదనాన్నగారబ్బాయి. మామయ్యావాళ్ళ కుటుంబం ఎవరితోనూ చనువుగా మెలగరన్నది అందరికీ తెలిసినదే. ఆయన ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగి అవడం వల్ల కొంత, ఆయన భార్య ఊర్మిళమ్మ..కన్నడ దేశస్తురాలు అవడం వల్ల మరికొంత..కారణాలుగా బందువర్ఘంలో చెప్పుకుంటారు.
కానైతే, వాళ్ళు ఒక్క మాతో మాత్రమే ఎప్పుడైనా, అప్పుడప్పుడైనా స్నేహంగా మసులుకుంటారన్నది కూడా అందరికీ విశిదమే. మాకు మాత్రమే అందుతున్న ఆ ప్రత్యేకత నాకిష్టం. అలాగే మురళీ అంటే కూడా.. ఎస్.ఎస్.సి లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. హుందాగా అందంగా ఉంటాడు. పేరుప్రతిష్టలున్న కుటుంబంలో పెద్దకొడుకు. అరుదుగానే అయినా తారసపడ్డప్పుడు కల్పించుకుని మరీ నన్ను గుర్తించినట్టు ఓ చిరునవ్వు చిందించి, కళ్ళతోనే ఇష్టంగా పలకరిస్తాడు. జవాబుగా నేనూ అదే చేస్తాను. మురళీబావ ఎదురుపడ్డ ఆ కొద్దిక్షణాలు ఏదో మంత్రం వేసినట్టుగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోతాను. ఆ సమయం ఎంతో అపురూపంగా అనిపిస్తుంది.
ప్రస్తుతం అతగాడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. నేను బి.ఎ. మొదటి సంవత్సరం. నాకంటే నాలుగేళ్ళు పెద్దవాడు. విచిత్రంగా మా ఇద్దరి పుట్టినరోజు ఒకే రోజు..జనవరి పదిహేనున. అది కూడా నాకిష్టం.
“శ్యామా, ఎక్కడ నువ్వు? వచ్చి టిఫిన్ తిను” అన్న అమ్మ పిలుపుతో నా ఆలోచనల నుండి బయట పడ్డాను. అమ్మ వేసిన దోసెలు తింటూ.. ఊర్మిళమ్మ ఫోన్ చేసి ప్రోగ్రాం కి వచ్చామని చెప్పిందని, బాగా పాడానని కూడా చెప్పిందని .. అమ్మతో అన్నాను.

***

స్నానం, పూజ అయ్యాక అమ్మకి వంటింట్లో సాయం చేసి, నాన్న పిలిస్తే ముందు గదిలోకి వెళ్లి కూర్చున్నాను.
”ఇదుగోమ్మా, చాలా విషయాలు చెప్పాలి నీకు. మన కార్యక్రమాలన్నీ చక్కగా రూపు దిద్దుకుంటున్నాయి. మొదటిది… ’త్యాగరాయ గానసభ’ వాళ్ళ వరస కచేరీలు. చెన్నై, పాండుచేరి, బెంగుళూరు, మైసూరు. ఈ నాలుగు పట్టాణాలలో నీ కర్ణాటక సంగీత కచేరీలు ఏర్పాటు చేస్తారట. చెన్నై, బెంగుళూరులో నీకు సన్మానం చేస్తారట. తేదీలు, వివరాలు పంపారు. నువ్వు, అమ్మ చూసి ఖరారు చేయండి. ఇకపోతే డైరెక్టర్ అప్పారావుగారి కొత్త సినిమాలో ఒక సోలో, ఒక డ్యూయెట్ పాడే అవకాశం ఉందని మన మ్యూజిక్ డైరెక్టర్ గంగాధర్ అన్నాడు. ప్రోగ్రాంకి వచ్చిన అప్పారావు కూడా అదే మాట చెప్పాడు” అంటూ గర్వంగా నా వంక చూసారు నాన్న.
“సంతోషంగా ఉంది నాన్న” అన్నాను …
“మీ వాణి మేడమ్ వచ్చాక మన విదేశీ కార్యక్రమాల గురించి కూడా మాట్లాడుదాము. మలేషియా-సింగపూర్ పర్యటనకి ఆవిడ మనతో రాలేకపోతే, కనీసం వాద్యబృందాన్ని సమకూర్చాలి. కళ్యాణి మనతో రెండవ గాయనిగా రావడానికి ఒప్పుకుంది కనుక … అది ఓకే. పర్యటన మొత్తం ‘శ్యామా రామచందర్ గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్’ గానే ప్రచారం అవుతుంది. సాంస్కృతిక సంఘం వారు వచ్చే నెల ప్రెస్-మీట్ లో ఈ పర్యటన గురించి ప్రకటన చేయనున్నారు. పర్యటనకి ముందే నీవు సినీరంగంలోనూ గాయనిగా వెలుగులోకి వస్తావని నా అంచనా. కార్యక్రమాలకి కొన్ని పాపులర్ సినిమా పాటలు కూడా ప్రాక్టీసులో ఉంచుకో” అన్నారు వివరంగా నాన్న.
ఎంతో ఉత్సాహంగా అనిపించింది. “పర్యటనలకైనా ఆరు నెలల సమయం ఉంది కదా నాన్న” అంటూ అక్కడి నుండి లేచాను.
“అది సరే..వచ్చే శుక్రవారం మీ పెద్దమ్మ కొడుకు నరేన్ పెళ్ళిలో పాడతానన్నవుగా! పెళ్ళికూతురు మన ఊర్మిళమ్మ చుట్టం అంట కదా. వారికోసం కన్నడ పాటలంటూ ప్రాక్టీసులకి అదనపు సమయం వెచ్చిస్తున్నావు. ఇకనుండి ఇటువంటివి పెట్టుకోకు తల్లీ.. నీ భవిష్యత్తు కార్యక్రమాల పైనే దృష్టి పెట్టు శ్యామా” అన్నారు సీరియస్ గా నాన్న.
ఆయన హెచ్చరిక విని, “అలాగే నాన్నా” అంటూ నా గదిలోకి నడిచాను.

***

దేశాంతర మ్యూజిక్ కార్యక్రమాల దృష్ట్యా కొత్తగా హిందుస్తానీ సంగీత శిక్షణతో పాటు, స్టూడియో రికార్డింగ్స్ తోడయి క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. గురువారం మ్యూజిక్ ప్రాక్టీస్ అయ్యాక, అదే పనిగా మోగుతున్న ఫోన్ చేతిలోకి తీసుకున్నాను. కొత్త పెళ్ళికొడుకు మా నరేన్ అన్నయ్య నుండి. “హలో అన్నయ్య” అన్నాను.
“శ్యామా, చాలాసేపటి నుండి ఫోన్ చేస్తున్నాను. నిన్న, ఇవాళ నీవు బిజీ అంట కదా. రేపు పెళ్ళికి,
రిసెప్షన్ కి మాత్రమే రాగలవని పిన్ని చెప్పిందిలే. నీ పాటల కోసం మేమంతా ఎదురు చూస్తున్నామురా. నీ పాటకి మన వాళ్ళంతా ఫిదా అయిపోవాలి శ్యామా” అన్నాడు ఉత్సాహంగా.
“తప్పకుండా అన్నయ్యా! అందరి చేత ‘అదుర్స్’ అనిపిస్తానుగా! అందరికీ నచ్చే ఎవర్-గ్రీన్ పాటలనే కదా మీరు ఏరి కోరి నాకు పంపారు. పొద్దున్నే వచ్చేస్తాములే” అన్నాను.

***

వివాహానికి విచ్చేసే ముఖ్య అతిధుల బాధ్యతని … నాతో పాటు పద్మ, చంద్రికలకి వప్పజెప్పారు పెద్దమ్మా వాళ్ళు. పెళ్ళికూతురు.. ఊర్మిళమ్మకి చుట్టం అవడంతో ఊహించినట్టుగానే నాగేంద్ర మామయ్యా, అత్తయ్యలతో పాటు మురళీబావ కూడా కాస్త పెందరాళే వేంచేసేడు. కారు దిగి హుందాగా నడిచి వస్తున్న అతగాడిని చూడగానే నా గుండె వేగంగా కొట్టుకోసాగింది.
“ఓహ్, రాకుమారుడిలా వస్తున్నాడు నీ స్వీట్-హార్ట్ మురళీబావ. చూపు మాత్రం నీ పైనే ఉంది. ఎంత బావున్నాడో. చూస్తున్నావా శ్యామా? ఇక పందిట్లో ఉన్న ఆడపిల్లలంతా ఏదో ఒక సాకుతో అతగాడి చుట్టూతే ఉంటారు చూడు” అంటూ నా చెవిలో గుసగుసలాడింది పద్మ.
మా ఎదుటకి వచ్చేసిన మామయ్యావాళ్లకి నమస్కరించి “రండి మామయ్యా, అత్తయ్యా” అంటూ వారికి ఆహ్వానం పలికి మండపం దిశగా నడిచాను. సోఫాల్లో కూర్చున్నాక నిముషం సేపు మాతో మాట్లాడారు అత్తయ్య. పద్మ పానీయాలు అందించి “మురళీబావ, హౌ ఆర్ యు?” అని అతణ్ణి పలకరించింది.

***

పెళ్లి తరువాత భోజన సమయంలో… యువతకి కేటాయించిన టేబుల్స్ వద్ద ఎక్కువమంది ఊర్మిళమ్మ చూట్టాలేనని, బెంగుళూరు వాస్తవ్యులని అర్ధమయింది. పరిచయాలయ్యాక, సాయంత్రం రిసెప్షన్ లో నేను పాడబోతున్నానని… పద్మ వారికి చెప్పడంతో.. వారిలో ఆసక్తి పెరిగి యక్షప్రశ్నలు వేస్తూ.. నా కాంటాక్ట్, ఈ-మెయిల్, నా వెబ్సైట్ వివరాలు అడిగారు.
నేను జవాబు చెప్పేలోగానే, నా వెనుక నుండి… “తను ఓ ప్రఖ్యాత యువ గాయని. మీరు ‘శ్యామా రామచందర్’ హైదరాబాద్’ అని గూగుల్ చేస్తే చాలు. మీకు కొంత సమాచారం వస్తుంది. హైదరాబాద్ న్యూస్ లో తరచుగా తన మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఫోటోస్ పబ్లిష్ అవుతాయి. వాళ్ళ డాడీ అనుమతిస్తేనే తనతో మాట్లాడవచ్చు” అంటూ నవ్వేసిన వ్యక్తి మురళీబావే. వెనుతిరిగితే..నవ్వుతూ సూటిగా నా వంకే చూస్తున్నాడు.
“మీ శ్యామా గురించి నేను అన్నదంతా నిజమా కాదా పద్మ” అనేసి, పక్కనే ఉన్న బేరర్ చేతుల్లోని ట్రే నుండి అందరికీ ఐస్-క్రీం కప్స్ తానే అందించాడు.
“వామ్మో! మురళీకి నేననుకున్న దానికంటే ఎక్కువే గురి తల్లీ నీ మీద” అంటూ నా చేతి మీద గిచ్చింది పద్మ. చంద్రిక కూడా ఔనన్నట్టు నవ్వుతూ తలాడించింది.
‘నా గురించి నువ్వు ఇలా అలోచిస్తున్నావా బావా? అంటే మరి నేనంటే ఇష్టమే కదూ! లేక చాలా ఇష్టమా? నువ్వు నాపై చూపుతున్న శ్రద్దకి నేను ఫిదా!’ అని ఎలుగెత్తి అతగాడికి చెప్పాలనిపించింది.

***

సాయంత్రం రిసెప్షన్ లో బఫే దగ్గర మళ్ళీ మాకు ఎదురుపడ్డాడు మురళీ.
“మీ ఇద్దరూ ఒకరినొకరు విడవకుండా ఉంటారు. అందరిమీదా జోక్ చేస్తూ నవ్వుతుంటారు?” అడిగాడు.
“అంటే, మీరు నిత్యం మమ్మల్నే గమనిస్తున్నారా మురళీబావా?” అనేసింది పద్మ గడుసుగా.
“ట్రెడిషనల్ గా, గ్రాండ్ గా, అందంగా తయారయి ఫంక్షన్స్ కి వచ్చేది మీరే కాబట్టి చూస్తాము మరి” నవ్వుతూ నా చేతిలోని డిన్నర్ ప్లేట్లో చనువుగా మరి కాస్త వడ్డించి, రసమలై కప్స్ అందుకని మా ప్లేట్లల్లో ఉంచాడు.
“అదేమిటి మురళీబాబు, తను పాడాలి కదా! పాడే ముందు శ్యామ స్వీట్ తినదు తెలుసా?” అంటూ నా ప్లేట్ నుండి రసమలై తీయబోయిన పద్మని వారించాను.
“అవునా? మంచి సాంగ్స్ పాడాలి. వాయిస్ కి తగ్గట్టుగా సున్నితమైన మెలోడీస్ పాడితే బాగుంటుంది” అనేసి కదిలాడు మురళీ.
“పెళ్ళికూతురు రిక్వెస్ట్ చేసినవే శ్యామ పాడేది.. నీవు కూడా రిక్వెస్ట్ పంపించు” మురళీకి వినబడేలా అన్నది పద్మ. వెనుతిరిగి ఓ చిరునవ్వు మా వైపు విసిరి సాగిపోయాడు నా స్వీట్-హార్ట్.
వచ్చి మా టేబిల్ వద్ద కూర్చుని రసమలై మాత్రమే తింటున్నానని గమనించిన పద్మ ఊరుకోదుగా!
“అయితే తీయనైన పాటలు మురళీబావ కోసమే పాడుతావా? బాగుంది మీ రొమాన్స్. మీ మధ్య మాటలు ఉండవు. నీవైతే తలవొంచుకునే ఉంటావు. ఇదేదో మాటలకందని రహస్య ప్రేమా?” అంటూ నవ్వసాగింది.
“ష్..ఊరుకోవే పద్దూ” అంటూ ఎవరన్నా వింటున్నారేమోనని చుట్టూ చూసాను.
“నీకు.. మురళీబావంటే ఇష్టమని నాకు తెలుసు. వాళ్ళు కూడా నీతోను, మీ అమ్మావాళ్ళతోనూ తప్ప మా ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడరనీ తెలుసు. ఇటువంటి ఫంక్షన్స్ లో .. అతగాడేమో కల్పించుకుని మరీ నీ పట్ల ఆసక్తి కనబరచి తప్పుకుంటాడు. కాబట్టి అవకాశం అంటూ ఉంటే..ఆ అందగాడు నీకే సొంతమవ్వాలి” అంటూ మళ్ళీ పెద్దగా నవ్వింది.
“అతగాడంటే ఇష్టం అని నేను నీతో అన్నానా? అంతా నీ ఊహ. బిగ్గరగా మాట్లాడకే” అని పద్మని బతిమాలాను. ‘ఇంకా నయం.. మురళీ పట్ల నాకున్నది ఉత్తుత్తి ఇష్టం కాదని, గాఢమైన ప్రేమాభిమానాలని…పద్మ వద్ద బయట పడలేదు. ఈ పాటికే దండోరా వేసేసేది’ మనసులోనే అనుకున్నాను.
“అయినా ఎందుకే జాప్యం? నువ్వే లవ్ ప్రొపోజ్ చేయి శ్యామా. అతగాడు అంత ఆసక్తి చూపిస్తున్నాడుగా.
నీవేమంటావో అని చూస్తున్నాడులా ఉంది. నీవు సింగర్ కదా! అందుకే బావ సంశయిస్తున్నాడులా ఉంది” అంది మెల్లగా పద్మ. విని..నవ్వి ఊరుకున్నాను.
‘అదీ నిజమే, గాయనిగా నాకున్న పేరు, పాపులారిటీ వల్లే దగ్గరవడానికి సంశయిస్తున్నాడేమో బావ. లేదంటే చనువుగా మాట్లాడి మక్కువగా దగ్గరయ్యేవాడేమో. కల్పించుకుని చనువు తీసుకునే యత్నం నేనూ చేయలేను. గాయనిగా ఎదగాలన్న నా కల, నన్నో ప్రఖ్యాత గాయినిగా చూడాలన్న అమ్మానాన్నల ఆశయాలు నెరవేరేవరకు …ప్రేమ, పెళ్లి ఆలోచనలకి దూరం కాబట్టే …. బావ పట్ల నా ప్రేమని గోప్యంగా ఉంచి మౌనం పాటించాల్సిందే మరి..’ అనుకుంటుండగా నాకోసం మైక్ లో పిలుపు వినిపించింది.
నన్ను వేదిక పైకి ఆహ్వానిస్తూ భాస్కరన్నయ్య కంఠం … “ ప్రఖ్యాత యువ గాయని ‘శ్యామా రామచందర్’ మా పిన్ని కూతురు అని గర్వంగా చెప్పుకుంటాము. కర్ణాటక సంగీతంలో ఇప్పటికే ‘అఖిల భారత యువ గాయని’ అవార్డు అందుకుని, సంగీత రంగంలో కృషి చేస్తూ వందలాది ప్రోగ్రాములు చేసింది. బి.ఎ మొదటి సంవత్సరం చదువుతూ గాయనిగా దూసుకుపోతుంది. మనకోసం ఇక్కడ పాడడానికి ఒప్పుకున్నందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము” అంటుండగా.. వేదిక పైకి వెళ్ళిన నాచేతికి పూల గుచ్చం అందించాడు….
ఆర్కెస్ట్రాతో శృతి కలుపుకుని గొంతు సవరించి మైక్ చేతిలోకి తీసుకున్నాను. గళం విప్పి ముందుగా ప్రార్ధనా గీతం పాడుతున్న నాకు ఎదురుగా మురళీబావ కుటుంబమే కనబడింది..
‘పెళ్లివారు కోరిన పాటలు’ అని అనౌన్సు చేసి ఓ ముప్పై నిముషాల పాటు జనరంజకమైన కొత్త-పాత పాటలు పాడి..సెలవు తీసుకున్నాను. కరతాళధ్వనులు మిన్నంటాయి. గర్వంగా బావ ముందు నుండే నడిచి వెళ్లి అమ్మా వాళ్ళ దగ్గర కూర్చుని తత్తిమా ప్రోగ్రాం తిలకించసాగాను.

***

పొద్దున్నే ఆలశ్యంగా నిదుర లేచి హాల్లోకి వస్తుంటే అమ్మా, నాన్న సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. దూరంగా కూర్చుని వినసాగాను. అర్ధమయిందేమంటే ఊర్మిళమ్మ ఫోన్ చేసి నాకో బెంగుళూరు సంబంధం ఉందని చెప్పిందట. ఆమె అన్నగారి కొడుకట. కోటీశ్వరుడట. ఒక్కడే వారసుడట. అమ్మ ఓపిగ్గా విన్నదట..
“అంతా విని మరి నీవేమన్నావు?” అడిగారు నాన్న.
“ఏముంది? వివరంగానే చెప్పాను. శ్యామాకి పందొమ్మిదేళ్ళు మొన్ననే నిండాయి. అదీ కాక తనో మంచి గాయని అవ్వాలని ఆశ పడుతుంది.. మరో మూడేళ్ళ వరకు చాలా కార్యక్రమాలు, విదేశీ పర్యటనలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే పెళ్లి చూపులు, పెళ్లి ఏమీ అనుకోవడం లేదు వదినా” అని నిఖచ్చిగా చెప్పేసాను” అంది అమ్మ.
వింటున్న నాకు తల తిరిగిపోయింది.. నీరసం ఆవహించింది. మనసు రగిలిపోయింది. ఇదంతా కోపమో, తాపమో, విరక్తో తెలీదు కాని ఈ క్షణం నుండి మాత్రం మురళీబావ గురించిన తలంపే రానివ్వను అనుకుని లేచి లోనికి వెళ్ళిపోయాను.

***

ఊర్మిళత్తయ్య, ఆవిడ కొడుకు మురళీ, ఆవిడ నా కోసం తెచ్చిన పెళ్లి సంబంధం.. గురించి ఊసెత్తక… గడిచిన రెండున్నర సంవత్సరాల్లో … నేను గాయనిగా ఎంతో ఎత్తుకి ఎదిగాననే అనుకుంటాను. సంగీత జగత్తులో సాధించిన విజయాలు, అందుకున్న అవార్డ్లు ఎన్నెన్నో. తెలుగు, కన్నడ సినిమాలకి పాడిన ముప్పై పాటలతో… లక్షలాది మంది సినీ ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాను. గత యేడు నా పాటకి ‘ఫిలిం కౌన్సిల్ అవార్డు’ కూడా అందుకున్నాను. సౌత్ఆఫ్రికా, మలేషియా, మారిషస్, అమెరికా పర్యటనలు చేసి వేలాదిమంది సంగీతప్రియుల ఆదరాభిమానాలు పొందగలిగాను.
నా పుట్టినరోజు నాడే బావ పుట్టినరోజు కూడా అవడంతో… ఆ రోజు మాత్రం బావ నన్ను తలుస్తున్నాడో లేదోనన్న ఉదాసీనత నన్నావహిస్తుంది.

***

రెండునెలలపాటు ప్రోగ్రాములు, రికార్డింగులు లేకుండా షెడ్యూల్ బ్లాక్ చేసారు నాన్న. ఆ తరువాత మాత్రం ఆస్ట్రేలియా పర్యటనకి ఒప్పుకున్నాము. నాకు పెళ్లి చేయాలని ప్రయత్నాలు మొదలెట్టారు అమ్మావాళ్ళు. చంద్రిక చదువు కూడా పూర్తవడంతో… కలిసొస్తే తనకి కూడా పెళ్లి చేసేయాలనే వాళ్ళ ఉద్దేశం.

***

కావాల్సినవన్నీతింటూ, షాపింగ్ చేస్తూ, సినిమాలు చూస్తూ బద్దకంగా గడిపేస్తున్నాము చెల్లీ, నేను.
ఆదివారం మధ్యాహ్నం నాలుగయ్యింది. అందరం హాల్లో టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాము.
“మన రెండు నెలల విశ్రాంతి సమయంలో ఓ నెల అయ్యేపోయింది. ఓ మారు తిరుపతి వెళ్లాలని, మొక్కు చెల్లించుకుని, అలాగే నా కూతుళ్ళ వివాహాలు త్వరలో జరిపించమని స్వామివారిని వేడుకుంటాను” అన్నారు నాన్న.
“ఔనండీ! అనుకున్న వెంటనే స్వామివారిని దర్శించుకోడం మంచిది. ఆ ఏర్పాట్లు చేయండి” అంది అమ్మ.
ఇంతలో ఫోన్ మోగింది. నాన్నే తీసారు. “నమస్తే బావగారు, సార్ బాగున్నారా? ఆ..ఆ.. మేము క్షేమం. శ్యామ కూడా బ్రహ్మాండంగా ఉంది. బిజీనే సార్. వెంటనే అయితే… ఒక్క ఆస్ట్రేలియా టూర్ ఉంది.. ఆ..ఆ.. అలాగే, తప్పకుండా నేను, సరస్వతి వచ్చి కలుస్తాము. ఉంటాను” అని ఫోన్ పెట్టేసారు.
“ఏమిటోయ్? ఇలా మనం పెళ్లి విషయాలు అనుకోడం, మీ నాగేంద్రన్నయ్య ఫోన్ చేయడం విచిత్రమే కదూ. మనల్ని ఈ రోజు సాయంత్రం ఇంటికి రమ్మంటున్నారు. మళ్ళీ ఏదన్నా సంబంధం అంటుందేమో మీ వదిన” అన్నారు నాన్న అమ్మని ఉద్దేశించి.

***

మురళీకి నాతో పెళ్లి చేయాలన్నది మామయ్యావాళ్ళ తలంపట. కాకపోతే వివాహం తరువాత.. గాయనిగా నేను తీరిక లేకుండా కొనసాగడం గురించి కొంత అభ్యంతరం తెలిపారట. మురళీ కూడా వచ్చి కలిసాడట. పర్యటనలు, స్టేజ్ ప్రోగ్రాములు, సినిమాపాటలు లేకుండా.. నేను కర్ణాటక సంగీత కచేరీలు మాత్రం కొనసాగించవచ్చని తన అభిప్రాయంగా తెలిపాడట. ఆస్ట్రేలియా పర్యటన మాత్రం ఓకే అట. వీలైతే తానూ వస్తాడట.
అమ్మావాళ్ళు అన్నింటికీ ఒప్పుకున్నారట కూడా. వివాహానంతరం గాయనిగా నా పురోగతికి సహకరించవలసింది ముఖ్యంగా భర్త, అతని పరివారమే కాబట్టి … మామయ్యావాళ్ళు వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఏకీభవించామన్నారు. అతిత్వరలో నిశ్చితార్ధం ఏర్పాట్లు చేసుకోమని, మంచి రోజు చూసి తామే తెలియజేస్తామని కూడా మామయ్యావాళ్ళు చెప్పారట. నిశ్చితార్ధం వీలయినంత త్వరలో పెట్టుకుని, పెళ్ళి మాత్రం ఆస్ట్రేలియా పర్యటన తరువాతనే అని అందరూ ఒప్పందానికి వచ్చారట.
అమ్మావాళ్ళు చెప్పిందంతా విన్నాను. నన్ను సంప్రదించకుండానే, ఓ మారు మురళీతో నేను మాట్లాడే అవకాశం కల్పించకుండానే నా పెళ్లి గురించి ఇన్ని మాటలు ఎలా జరిగాయోనని కాస్త అయోమయంగా తోచింది.
“ఆలోచిస్తే, రెండేళ్ళ క్రితం ఏదో సంబంధం అంటూ ఊర్మిళమ్మ ఫోన్ చేయడమన్నది… కేవలం శ్యామా పెళ్లి విషయంగా మన అభిప్రాయం కనుక్కోడానికే అయిఉంటుంది. శ్యామాని తన కొడుక్కి చేసుకోవాలనే ఆమె అసలు ఉద్దేశం అనిపిస్తుంది” అన్నారు నాన్న.
“అదీకాక శ్యామా గురించి, దాని కార్యక్రమాల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మా సుగుణక్కయ్య నుండి రాబడుతుంది మా ఊర్మిళ వదిన” నవ్వేస్తూ అమ్మ.

***

బావ పై ఆశలు వదిలేసుకుని కూడా కొంత కాలమయింది. ఉన్నట్టుండి అతగాడితోనే పెళ్లి అంటూ పుట్టుకొచ్చిన ఈ సంబంధం సంగతి నన్ను కలవరపెట్టింది. రెండేళ్ళగా ఆ కుటుంబం దృష్టిలో పడకూడదని …దగ్గర బంధువుల పెళ్ళిళ్ళకి, పేరంటాలకి దూరంగా ఉండిపోయాను. అటువంటిది ఉన్నట్టుండి బావే నా జీవితభాగస్వామి అవబోతాడంటే మనసు తుళ్ళిపడింది. నాకోసం వాళ్ళు రెండున్నర యేళ్ళు ఆగారంటే ఆశ్చర్యమనిపించింది. అంటే మురళీబావ నన్ను మనసారా ప్రేమించాడన్నమాటా?.. మరి నేనేమో అతని పట్ల గుండెల నిండా అసహనం, విరక్తి నింపుకున్నాను. సరదాగా మౌనగీతంలా సాగిన మా ప్రణయం … ఈ నాటికి వివాహబంధంతో ముడిపడబోతున్నందుకు నా మనసులో అతగాడి గురించిన ఊసుల సందడి మళ్ళీ మొదలయింది.
…ఓ కలగా మారిన బావ సాంగత్యాన్ని నిజంగా పొందబోతున్నానా? అతని ప్రేమలోని మాధుర్యాన్ని నిజంగానే చవిచూడబోతున్నానా? ఆశించినదే అయినా నమ్మలేకపోతున్నా.. ఎంతైనా బావ…నా కలల నెలరేడు కదా!

***

నిశ్చితార్దానికి .. ముందుగా ఇంటిని ముస్తాబు చెయ్యాలి, రంగులు వేయించాలి, బంధువులని ఆహ్వానించాలి, భోజనాలు బ్రహ్మాండంగా ఉండాలి..నిత్యం ఇంట ఇవే మాటలు సాగుతున్నాయి….
అమ్మావాళ్ళు సంబంధం మాట్లాడి వచ్చిన నాలుగో రోజు .. పొద్దుటే అలవాటుగా యోగాభ్యాసన అయ్యాక టీ కప్పుతో గార్డెన్ లోకి నడుస్తుండగా గేటు ముందు స్కూటర్ ఆగింది. తల వంచి చూసి… తడబడిపోయాను. వచ్చింది ఎవరో కాదు.. స్వయాన..మురళీ బావ. ఎదురు వెళ్లి లోనికి ఆహ్వానించడానికి… నేను జిడ్దోడుతూ యోగా పాంట్స్ లో ఉన్నాను. ఏంచేయలేక అక్కడే మొక్కలకి నీళ్ళు పెడుతున్న పట్టాభిని పిలిచి, మురళీ బాబుని లోపల లివింగ్ రూములో కూర్చోబెట్టమని అటుగా పంపించి.. నేను లోనికి పరిగెత్తాను. అమ్మని, నాన్నని తొందర పెట్టి లివింగ్ రూములోకి పంపాను. చాటుగా నిలబడి వారి మాటలు వినసాగాను.
“నమస్తే మామయ్యా. పంతులుగారు నిశ్చితార్థ ముహూర్తానికి రెండు తేదీలు ఖరారు చేసి ఇచ్చారు. శ్యామాతో కూడా సంప్రదించి తనకి ఇష్టమైన తేదీ చెబితే అమ్మ వచ్చి మాట్లాడుతానంది అత్తయ్యా” అంటూ చేతిలోని పసుపు రాసిన కాగితం అందించాడు మురళీ .
అందులోని విషయం చదివి, “పదిహేను రోజుల్లోనే అన్న మాట…”, “అలాగే మురళీబాబు, తప్పకుండా శ్యామతో మాట్లాడి వెంటనే అమ్మతో మాట్లాడుతాను’’ అంది అమ్మ.
“సరస్వతీ, మురళీకి కాఫీ, టిఫిన్ ఏర్పాటు చూడు” అన్నారు నాన్న అమ్మతో.
“వద్దు మామయ్యా. నేను ఆఫీసుకి వెళ్ళాలి కూడా” అంటూ బయలుదేరిపోయాడు మురళీ.
నన్ను పిలిచి విషయం చెప్పారు. అత్తయ్య పంపిన రెండు ముహూర్తాల్లో అక్కడికక్కడే ఒకటి నిశ్చయించి అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పారు..
ఇక ఇంట్లో హడావిడి మరింత ఎక్కువయింది.. ఆస్ట్రేలియా పర్యటనకి ప్రాక్టీసులు కూడా మొదలయ్యాయి.

***

“పది రోజుల్లో నిశ్చితార్ధం. వదినతో మాట్లాడాలి, వెళ్లి కలవాలి” అనుకుంటూ అమ్మ ఫోన్ చేసింది. వాళ్ళ అన్నగారే ఫోన్ తీసారు. ఇటునుండి అమ్మ “ఓ అలాగా? సరే వెళ్లి రండి అన్నయ్యా.. ఎల్లుండి సాయంత్రం వచ్చి కలుస్తాము. మనకి సమయం కూడా తక్కువే. వీళ్ళ బట్టలకి, ఉంగరాలకి షాపింగ్ చెయ్యాలి. అవతలెల్లుండి మంచి రోజు కూడా. మనం షాపింగ్ చేయవచ్చు. మేము రెడీగా ఉంటాము” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.

***

అంతటా పెళ్ళికళ సంతరించుకుంది. “అమ్మాయికి పెళ్ళికళ వచ్చేసింది… ఇంత సొగసరి భార్య దొరకడం .. మురళీబాబు చేసుకున్న అదృష్టం” అని నన్ను చూసిన వాళ్ళు అనడం, మా మేనత్త రోజుకి నాలుగు సార్లైనా దిష్టి తిప్పడం పరిపాటయ్యింది.

***

ఒక్కో రోజు గడుస్తుంది. మురళీ వాళ్ళనుండి కబురే లేదు. అనుకున్న షాపింగ్ అవ్వనేలేదు. వారం దాటింది. అంటే మురళీ స్వయంగా వచ్చి స్థిరపరచిన మా పెళ్లి నిశ్చితార్ధం తేదీ కూడా దాటింది. నా పాదాల కింద భూమి కుంగిపోతున్నట్టు, నా గుండెని ఎవరో పిండేస్తున్నట్టు… అసహనంగా, అవమానంగా అనిపించసాగింది.
అయినా సరే, నా ప్రేమపై నమ్మకం ఉంచి ‘కబురైనా పంపవచ్చుగా బావా …ఏమైందోనని’ …అనుకుంటూ ప్రతిక్షణం నిరీక్షణలో గడపసాగాను.
మరి కొద్దిరోజులు ఆగి, అమ్మావాళ్ళు ఏమయిందోనని కనుక్కుంటే, బెంగుళూరు వెళ్ళిన మామయ్యకి గుండెపోటు వచ్చిందన్నారు. ఇప్పుడు బాగానే ఉన్నారు.. కాస్త సర్దుకున్నాక కబురుపెడతామన్నారు. అది విన్న నాకు వాళ్ళ వైఖరి అస్సలు నచ్చలేదు. ఆ విషయం అప్పుడే చెప్పచ్చు కదా! అనిపించింది. వారి మౌనాన్ని .. తీవ్రమైన అవమానంగా, తిరస్కారంగా భావించాను. దుఖ్ఖం ఆగలేదు.
అందని చందమామలా నాలో నిరాశ నింపాడా బావ? మాట తప్పి నా దృష్టిలో ఆకాశం నుండి అధోపాతాళానికి జారాడా? ప్రేమ పరాభవాల మధ్య నా జీవితం ఊయలలూగుతుందనిపించి.. నిరాశ నిస్పృహలు నన్నావహించాయి.. అతనితో నా జీవితం ముడిపడదు అని నేనైతే నిర్ధారణకి వచ్చేశా. ఇక చేసేదిలేక సంగీత ప్రపంచంలో సుదీర్ఘ ప్రయాణం చేసేందుకు తయారయిపోయాను. రాత్రింబవళ్ళు సంగీతోపాసనలో గడపసాగాను.

***

ఆస్ట్రేలియా పర్యటన విజయవంతంగా ముగించుకుని ఇల్లు చేరి వారం దాటినా అలసటగా ఉంది.. రాత్రిళ్ళు తల నొప్పితో నిద్ర పట్టదు. తెల్లారినా అలాగే పడక మీద ఉండిపోతున్నాను.
ఈ రోజు పొద్దున్నే అమ్మచేతి కాఫీ తాగుదామని లేచి బయటికి వచ్చిన నాకు నాన్న ఎదురు వచ్చారు. ఆయన చెప్పిన విషయం విని కొంచెం విసుగనిపించింది. ఆస్ట్రేలియా నుండి సుదర్శన్ అయ్యర్ గారు వాళ్ళ అమ్మానాన్నలతో హైదరాబాదు వచ్చారట. మా ఇంటికి వస్తామన్నారట.
“సుదర్శన్ అయ్యర్ అంటే ‘పెర్త్’ సిటీ మేయర్ కదా! పెర్త్ లో ప్రోగ్రాం చేసినప్పుడు .. కలిసాము. అయనకి భారతీయ కళల పట్ల, సంగీతం పట్ల చాలా ఆసక్తి ఉందని, ఆయన కూడా హిందీ పాటలు పాడుతారని చెప్పారు.. వేదిక మీద నన్ను, నా పాటని చాలా మెచ్చుకుని వాళ్ళ అమ్మగారి చేతుల మీదగా ముత్యాల హారం బహుమానంగా ఇప్పించారు కదూ” అన్నాను… నాన్న తలాడించారు.
“అవును. గుర్తొచ్చారు.. వాళ్ళు మనింటికి రావడం ఏమిటి నాన్నా? అని అడిగాను.
“తప్పించుకోలేము కదా! మేయర్ అంతటి వాడు.. ఏదో అభిమానంతో సంగీతం అంటే ఇష్టంతో ఇంటికి వస్తామంటున్నారు. మర్యాదకి రేపు భోజనానికి రామ్మంటానమ్మా.. చూద్దాం ఏమంటారో.. కాసేపు కూర్చుని వెళ్ళిపోతారు” అన్నారాయన.

***

భారీ ఎత్తున కానుకలు తీసుకుని తల్లితండ్రులతో వచ్చారు సుదర్శన్ గారు.. తెలుగు భాషని పట్టి పట్టి పలుకుతూ భలే గమ్మత్తుగా మాట్లాడుతాడు ఆయన. ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగాడట. తను బాగా పాడుతానని, పాడి మాకు వినిపిస్తానని కూడా ‘పెర్త్’లోనే చెప్పాడు.
నమస్కారాలు, పలకరింపులు అయ్యాక, “ఈ కానుకలు, పట్టు చీరలు, జువలరీ మీ కోసమే శ్యామా గారు.. మీ సంగీతం మాకు ఎంత నచ్చిందో చెప్పడానికి మాటలు లేవు. మీకు నేను పాట పాడి వినిపిస్తాను అని చెప్పాను. గుర్తుందా? బాగా ప్రాక్టీస్ చేసాను. మరి మీ అనుమతితో” అన్నాడాయన నన్ను ఉద్దేశించి.
‘ఇదెక్కడి ఖర్మరా బాబు! అనుకున్నాను. భాషే బాగోదు… ఇక పాట కూడానా! అనుకున్నాను. నోరు విప్పక తప్పలేదు. “ముందుగా మీకు, మీ పెద్దవారికి కృతజ్ఞతలు. గుర్తు పెట్టుకుని మా యింటిక వచ్చినందుకు. మీరు తెచ్చిన కానుకలు ఖరీదైనవి. మీ అభిమానానికి ధన్యవాదాలు. కానుకలు తీసుకోలేను. క్షమించండి. ఇకపోతే మీ పాట తప్పకుండా వింటాము. ముందు కాఫీ తీసుకోండి” అన్నాను మర్యాదగా.
“లేదమ్మా, కాఫీ టిఫిన్ అన్నీ చేసే వచ్చాము. ఎంతో ప్రేమగా కానుకలు తెస్తిమి. కాదనకు శ్యామా తల్లీ” అన్నది సుదర్శన్ గారి తల్లి.
“ఎస్,ఎస్, నిజంగా…రాంచందర్ సాబ్, మీరు, ఆంటీ, మీ అమ్మాయిలు అంతా అలా కూర్చోండి అని విన్నవించుకున్నారు సుదర్శన్ గారు.
చంద్రిక వచ్చి నా పక్కనే చేరింది. “అక్కా, మనిషి చూస్తే స్టైల్ గా అనిల్ కపూర్ లా ఉన్నాడు… .. కాని ఆ భాష, పాట ఎలా ఉంటాయో” అంది నా చెవిలో.
సుదర్శన్ గారు గొంతు సవరించి ||బహారో ఫూల్ బర్సావో, మేరా మహబూబ్ ఆయా హై మేరా మెహబూబ్ ఆయాహై…|| హిందీలో శ్రావ్యంగా తడుముకోకుండా పాడారు. ఆశ్చర్యపోయాను. నేను కూడా మైమరచి విన్నాను. నాన్న ఆనందానికి అంతే లేదు. మా నాన్నకి ఎంతో ఇష్టమైన పాట. ఆగని కరతాళధ్వనులు, మెప్పులు…
ఇంకేముంది? అలా అలా పట్టాభి, పనిమనిషి, డ్రైవర్ కూడా వచ్చి హాల్లో చేరారు. సుదర్శన్ గారిని అడిగి మరీ మరో ఐదారు పాటలు పాడించుకున్నారు. ఎదుటి మనిషిని తక్కువ అంచనా వేయకూడదన్నది సుదర్శన్ గారి విషయంలో నిజమయింది.
పాటల సందడి తగ్గాక, కాసేపు కబుర్లు, ఫలారాలు. నేను కూడా అతిధులతో సరదాగా కలిసిపోయాను. చీకటి పడడంతో, ఇక సెలవు తీసుకుంటారనుకుంటుండగా .. సుదర్శన్ గారు లేచి నా ఎదుటకి వచ్చి “ప్లీజ్” అంటూ నా చేయి అందుకున్నారు.. షాక్ అయ్యాను. లేచి నిలబడ్డాను.
“నిజానికి మీరు నాకు చాలా నచ్చారు. నాకు నచ్చిన అమ్మాయి ఇప్పటివరకు తారసపడలేదు. నేను బాగా చదువుకున్నాను. వ్యసనాలు లేవు. నా వయసు ముప్పయినాలుగు సంవత్సరాలు. మా తలితంద్రులకి నేను ఒక్కడినే సంతానం. యోగాభ్యాసన, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలు..ఇవే నా జీవితం. మిమ్మల్ని, మీ గానాన్ని నేను ఆరాధిస్తాను. మ్యూజిక్ రంగంలో మీకోసం ఏది కావాలన్నా చేయగలను. స్టూడియో, ప్రొడక్షన్ హౌస్. ఏదైనా. ఆలోచించుకుని నన్ను వివాహమాడేందుకు ఒప్పుకుంటే సంతోషంగా రుణపడి ఉంటాను” అంటూ నా ఎదుట మోకరిల్లాడాయన…
అందరం అవక్కయ్యాము. నేనే తేరుకుని ” ప్లీజ్ సర్” అని అతని చేయందుకుని .. “దయచేసి కూర్చోండి” అన్నాను. వాళ్ళ అమ్మానాన్నలు కూడా అదే విషయం వారి మాటల్లో వివరించారు. అంటే కేవలం నాకు ప్రొపోజ్ చేయడానికే వారు ఆస్ట్రేలియా నుండి వచ్చారని అర్ధమయింది.
నాన్న తేరుకుని, సౌమ్యంగా వారితో మాట్లాడారు. ఇలా వారి పెళ్లి సంబంధం ఊహించలేదని, సమయం తీసుకుని, ఆలోచించి చెబుతామని వారిని మర్యాద పూర్వకంగా సాగనంపారు.

***

ఆలోచనా సంద్రంలో మునిగి ఉన్న నాకు రెండు రోజులు గడిచాయని కూడా తెలియలేదు. మురళీబావ విషయం బేరీజు వేసుకున్నాను.. అతగాడి నుండి ఇప్పటికీ కబురు లేదు. తనంతట తాను వచ్చి నిశ్చితార్ధానికి ముహూర్తం పెట్టించి, మూడు నెలలు దాటినా… కారణం చెప్పకుండా కనుమరుగైతే .. వంచించినట్టు కాదా? పోనీ తండ్రి అనారోగ్య కారణంగానే ఈ జాప్యం అనైనా తెలియజేయాలిగా! అత్తయ్యామామయ్యల మీద కన్నా మురళీ మీద నాకు చాలా కోపంగా ఉంది.
ఏమైనా ఇంతటి నిర్లక్ష్యానికి, నిరాశకి నన్ను గురిచేసినందుకు మురళీకి గుణపాఠం నేర్పాలంటే కూడా సుదర్శన్ గారి సంబంధాన్ని వదులుకోకూడదని నిశ్చయించుకున్నాను. సుదర్శన్ గారిలో నాకు నిజాయితీ కనబడుతుంది.. నాకన్నా వయసులో పెద్దవాడే.. ఐనా నన్ను, నా గానాన్ని ఆరాధిస్తున్నాడు. అతణ్ణి ఏ విషయంలోనూ తక్కువ చేయడానికి లేదు. పైగా మురళీలా కాకుండా సుదర్శన్ గారికి నేను గాయనిగా కొనసాగేందుకు అభ్యంతరం లేదు. కాబట్టి, నేనింకా మురళీ కోసం ఎదురు చూడడంలో అర్ధం లేదనిపించింది. అందుకే మేము కూడా ఎటువంటి మాట పలుకు లేకుండా ఆ కుటుంబానికి గుణపాఠం చెప్పాలంటే .. సుదర్శన్ గారితో నా వివాహం జరగాలి అన్న నా నిర్ణయం అమ్మావాళ్ళకి చెప్పేస్తాను. అంతే’ అనుకుని ప్రశాంతంగా నిద్రపోయాను.

***

నా నిర్ణయం అమ్మావాళ్ళని కూడా ఆశ్చర్యపరిచింది. అమ్మ నన్ను వారించింది. మా చుట్టాలెందరో నాకు ఈ సంబంధం వద్దని ఎన్నెన్నో కారణాలు చెప్పారు. ఎన్నడూ లేని నా మొండిపట్టుకి నాన్న కూడా తలొగ్గక తప్పలేదు.
తరువాత వారం రోజులకి మా వివాహం తిరుపతిలోనే జరిగింది.. తరువాత నెలకి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. ఇక నా జీవితాన మురళీబావకి తావు లేదు!

***

ఆస్ట్రేలియాలో జీవితం హాయిగానే సాగిపోతుంది. సంగీతాభ్యాసనే కాదు, మావారి ప్రేమలో, బాబు పెంపకంలో మునిగి తేలుతున్నాను. ఓ ‘స్త్రీగా’, ఓ గాయనిగా నా ఎదుగదలకి, పురోగతికి అన్నివిధాలా సహకారాన్ని అందిస్తారు మా వారు. తాను కూడా కర్ణాటక సంగీతం నేర్చుకుని, అప్పుడప్పుడు కచేరీలలో సరదాగా పాల్గొంటారు కూడా.

***

రెండేళ్ళ తరువాత బాబుని తీసుకని ఒక్కత్తినే హైదారాబాద్ వెళ్ళినప్పుడు తెలిసింది. నేను పెళ్ళై ఆస్ట్రేలియా
వెళ్ళిపోయాకే, మురళీబావ వివాహం జరిగిందని, ఆ తరువాత వాళ్ళింట జరిగిన సత్యనారయణ వ్రతానికి అమ్మని, చెల్లిని ఆహ్వానించి గౌరవంగా చీరసారే పెట్టారట కూడా.

***

మరునాడు మళ్ళీ మురళీ విషయం ఎత్తింది అమ్మ. బాబుకి అన్నం పెడుతూ వింటున్నాను. అమ్మ వద్ద తన బాధ వెలిబుచ్చిందట ఊర్మిళమ్మ. మురళీ పూర్తిగా మారిపోయాడని, ఎన్నడూ లేనిది తాగుడు అలవాటు చేసుకుని రాత్రిళ్ళు క్లబ్ నుండి ఆలశ్యంగా వస్తాడని, మురళీ భార్య ఇంటి ముందు ఆవరణలో, అతని కోసం పడిగాపులు పడుతుందని వాపోయిందట ఆమె. కోడల్ని చూస్తే బాధగా ఉందని బాధపడిందట.
విన్న నేను నిర్ఘాంతపోయాను. అంటే మురళీ నన్ను మరిచిపోలేక పోతున్నాడా? అందుకే అలా తయారయ్యాడా? మరి నిశితార్ధం వరకు వచ్చిన మా సంబంధం అర్ధంతరంగా ఆగిపోవడానికి కారకులు ఎవరు? మురళీ ఇంతలా బాధపడుతున్నాడంటే .. అతని తప్పే లేకపోయుంటే .. నాలాగానే మురళీ ఎంతగా కలత చెంది ఉంటాడో అన్న వ్యధ నాలో మొదలయ్యింది.

***

ఊరు నుండి నన్ను చూడ్డానికి వచ్చిన మా పెద్దమ్మ కూడా మురళీ విషయం ఎత్తింది… కేవలం నా మొండితనం, ప్రోద్బలంతోనే… సుదర్శన్ గారితో నా వివాహం జరిగిందని తెలుసుకున్న ఊర్మిళమ్మ చాలా నొచ్చుకుందిట.
“శ్యామ ఎంత పిచ్చి పని చేసింది. మా వారి ఆరోగ్యం బాగోక మేము బెంగుళూరులో ఉండిపోతిమి. నిజమే కబురు పెట్టకపోతిమి… సొంత వాళ్ళే ఇలా పొరబాటుగా అనుకుంటే ఎలా? చిన్నపిల్ల ..శ్యామాకి నచ్చజెప్పలేకపోయారా?” అని వాపోయిందట.

***

మళ్ళీ మనసున మురళీ గురించిన ఆలోచన మొదలయింది. అతనిపట్ల పెంచుకున్న విరక్తి, అసహనాల స్థానంలో జాలి, బాధ నిండాయి. విఫలమైన మా ప్రేమ కధలో నేనే అపరాధినా? అన్న భావనతో గుండె రగిలిపోయింది. పశ్చాత్యాపంతో అల్లాడిపోయాను. నా జీవితం నుండి, నా ఆలోచనల నుండి తరిమేయాలనుకున్నానే గాని .. నిజానికి మురళీ పట్ల నా మనసు పొరల్లోని ఆరాధనాభావం చెక్కుచెదరలేదని, నా కోపతాపలతో కేవలం నివురుగప్పి పోయిందని తెలుసుకున్నాను. ముఖ్యంగా మురళీ చిరునవ్వు నా జ్ఞాపకాల్లో ఇప్పటికీ చెదిరిపోలేదు..
మురళీ నన్ను మరిచిపోలేక పోతున్నాడన్న విషయానికి సంతోషించాలో .. బాధపడాలో తెలీడం లేదు. ఎవరి జీవితాలు వారివైపోయినప్పుడు తలచి తలచి నిట్టూర్చడం మినహా ఏమి చేయగలను?

***

మరో నాలుగేళ్ళు గడిచాక .. ఊర్మిళమ్మ ఢిల్లీలో ఉన్నారని తెలిసి, కాంటాక్ట్ చేసి.. మాట్లాడాను. ఆవిడ చాలా సంతోషించింది. మొదటి సంభాషణలోనే “నువ్వంటే చాలా ఇష్టం తల్లీ.. కేవలం మీ మామయ్య వల్లే సంబంధం అలా అయింది.. ఒక కళాకారిణిగా ఎదిగిన నీవు..కోడలిగా, భార్యగా మనగలుగుతావో లేదో అన్న తలంపుతో ఉండిపోయారు మీ మామయ్య. దాంతో అలా అలా జాప్యం అయింది. మా మీద కోపం పెట్టుకోవద్దమ్మా శ్యామా” అని పదే పదే చెప్పింది..
“ఇక ఆ విషయం మరచిపోండి అత్తయ్య. అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను” అన్నాను. ఆమె చెప్పిన మాటలు విన్నాక, ‘అదే నిజమైతే, మురళీ బావ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడా? నిశ్చితార్ధం వరకు తెచ్చిన మామయ్యే మా వివాహానికి అడ్డుగోడయ్యాడా? అసలు ఏది నిజం? అపరాధులు ఎవరు? అన్న ప్రశ్నలు నాలో మిగిలిపోయాయి.

********** ********** ********** ********

Leave a Reply

Your email address will not be published. Required fields are marked