ధారావాహికలు

శ్రీ రామ సంగ్రహం

లంకానగరం

-అక్కిరాజు రామాపతి రావు

అప్పుడు విశ్రవసుడు “నాయనా! దక్షిణ సముద్రతీరంలో ‘త్రికూటం’ అనే పర్వతముంది. దాని శిఖరంపై విశ్వకర్మ రాక్షసుల కోసం చాలా గొప్ప నగరం నిర్మించాడు. దాని సంపద, సొగసు వర్ణించలేము. ఒకప్పడు రాక్షసులా నగరంలో నివసించే వాళ్ళు. అయితే దేవాసుర యుద్ధం జరిగినప్పుడు మహావిష్ణువుకు భయపడి ఆ రాక్షసులంతా ఆ మహ పట్టణం విడిచిపెట్టి పాతాళలోకంలోకి వెళ్ళి దాక్కున్నారు. అదిప్పుడు నిర్జనంగా ఉంది. కాబట్టి నీవక్కడ నివసించు” అని తండ్రి చెప్పటంతో వైశ్రవణుడు అక్కడకు వెళ్ళి రాక్షసులను కూడా తనతో ఉండవలసిందిగా చెప్పి ఆ నగరాన్ని ఇంద్రుడి రాజధాని అయిన అమరావతిలాగా కళకళలాడేట్లు చేసి అక్కడ నివసించాడు. అక్కడ ధనపతి వైశ్రవణుడు మహా వైభవంతో లంకలో ఉంటూ వచ్చాడు’ అని అగస్త్యుడు చెపుతుండగా శ్రీరాముడికి మరింత ఉత్సుకత కలిగింది. రావణుడికంటే పూర్వమే లంకలో రాక్షసులు ఉండేవారని తెలిసి “ఆ రాక్షసులు రావణ, కుంభకర్ణులకన్నా బలవంతులేమిటి? వాళ్ళ వృత్తాంతం ఏమిటో వినగోరుతున్నాను” అని అడిగాడు. అప్పుడు అగస్త్యుడికి శ్రీరాముడిట్లా అడగటం వింత అనిపించింది. అన్నీ తెలిసి, పరాత్పరుడై ఉండీ తననిట్లా అడగటం వినోదంగా తోచి, ‘అయితే ఆ పూర్వవృత్తాంతం చెపుతాను’ అని చెప్పటం సాగించాడు.
‘బ్రహ్మదేవుడు సృష్ట్యాదిని ప్రప్రథమంగా జలాలను సృష్టించాడు. ఈ నీటిని కాపాడటానికి ప్రాణులను సృష్టించాడు. అప్పుడా ప్రాణులకు ఆకలిదప్పులు కలిగాయి. ఇప్పుడు మా కర్తవ్యమ్ ఏమిటి? అని ఆ జీవరాసులు బ్రహ్మదేవుణ్ణి అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు ‘ఈ నీటిని మీరు సర్వవిధాల సంరక్షించుకోండి’ అని ఆదేశించాడు. అప్పుడు వాళ్ళు కొందరు ‘మేము ఈ జలాలను పట్టుదలతో రక్షించుకొంటాము, ‘వయం రక్షామ’ అని చెప్పారు. మరికొందరు రక్షించుకోవటమే కాదు, పూజాపర్వతంతో సేవించుకొంటాము ‘వయం జక్షామ’ అని విజ్ఞాపన చేసుకున్నారు.
రక్షామ అని చెప్పిన వీళ్ళు రాక్షసులు, జక్షామ అని పలికిన వాళ్ళు యక్షులు అయినారు.

ఈ వర్గాలవారిలో హేతి, ప్రహేతి అనే ప్రముఖులు ప్రధాన నాయకులైనారు. వీళ్ళు మధు, కైటభులంత పరాక్రమశాలులు. వీళ్ళలో ప్రహేతి సత్త్వసంపన్నుడు. తపస్సు వాంఛించి తపోవనాలకు వెళ్ళిపోయాడు. హేతి గృహస్థాశ్రమం కోరుకొని తనకు తగిన భార్య కోసం చాలా ప్రయత్నం చేశాడు. ఆయనకెక్కడా వధువు లభించలేదు. అప్పుడు యముడి దగ్గరకు వెళ్ళి ఆయన సోదరి ‘భయ’ను తన కివ్వవలసిందిగా కోరాడు. యముడు అంగీకరించి హేతికి తన చెల్లెల్ని ఇచ్చాడు.

అట్లా వాళ్ళు భార్యాభర్తలైన కొంతకాలానికి వాళ్ళకు ఒక కొడుకు పోట్టాడు. వాళ్ళు తమ కొడుక్కు విద్యుత్కేశుడని పేరు పెట్టుకున్నారు. ఆ శిశువు చక్కగా పెరిగాడు. తేజస్సంపన్నుడైనాడు. యుక్తవయస్సు రాగానే తండ్రి తన కుమారుడికి పెళ్ళి చేయాలని తగిన సంబంధం కోసం అన్వేషించాడు. సంధ్యాపుత్రిక తల్లిలాగా తేజస్విని. ఆ పిల్ల పేరు ‘సాలకటంకట”. తనతో వియ్యమంద వలసిందిగా హేతి, సంధ్యను అర్థించాడు. ఇంటికి వచ్చి అర్థిస్తున్నాడని సంధ్య ఈ సంబంధానికి అంగీకరించింది. సాలకటంకట, విద్యుత్కేషుడితో ఎంతో సుఖంతో వైవాహిక ఆనందం అనుభవించింది. కొంత కాలానికి ఆమె గర్భవతి అయింది. నిజానికి ఆమెకు అప్పుడే సంతాం కలగాలన్న వాంఛ లేదు. అయినా గర్భవతి అయింది. కాబట్టి ప్రసవించింది. ప్రసవసమయం ఆసన్నం కాగానే మందరపర్వత పాదభూమికి వెళ్ళి అక్కడ శిశువును ప్రసవించి ఆ శిశువునక్కడే వదిలి మళ్ళీ పతిసౌఖ్యం కోసం అతన్ని చేరింది.
ఆ శిశువు ఆకలితో పెద్దపెట్టున ఏడవటం సాగించాడు. వాడి పుణ్యమేమో ఆ సమయంలో పార్వతీపరమేశ్వరులు విలాస విహారయాత్ర చేస్తూ నంది వాహనులై ఆకాశంలో వెళుతున్నారు. శిశువు రోదన విని శివుడు కరుణతో అక్కడ దిగి ఆ బిడ్డను ఎత్తుకున్నాడు. పార్వతికి చూపి వీణ్ణి నీ కుమారుడిగా చూసుకోవలసిందని చెప్పాడు. పరమశివుడు అనుగ్రహించి ఆ శిశువుకు సద్యోయౌవనం అనుగ్రహించాడు. ఆ పిల్లవాడికి వాళ్ళు సుకేశుడు అని నామకరణం చేశారు. ఆ పిల్లవాణ్ణి సంరక్షించిన ప్రేమతో అతడికి కామగమనం గల ఒక విమానం కూడా శివుడు అనుగ్రహించాడు. స్వేచ్చగా విహరించాల్సిందని ఆ సుకేశుణ్ణి కరుణించాడు కూడానూ. వాడికి దేవత్వమిచ్చాడు. ఆ సుకేశుడికి ఇంద్రపదవి అబ్బినంత ప్రభావం కలిగింది. దేవతలు కూడా అతణ్ణి అభిమానించసాగారు. సంతోషంతో యథేచ్చగా సంచారం చేస్తూ సుకేశుడు అప్పుడప్పుడు శివుణ్ణి దర్శిస్తూ ఆ మహాదేవుడికి ప్రీతిపాత్రుడైనాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked