-ఆదూరి.హైమావతి.
“తాతగారండీ! చూడాండి నా గ్రేడ్ కార్డ్! అన్నిట్లోనూ ఏ + లే. ఇదో ఇంగ్లీష్ ఏ +, మాత్స్ ఏ + , సైన్స్ ఏ + , సోషల్ ఏ + , ఇంకా “అనిచెప్తున్న అన్న ఆనంద్ దగ్గరకొచ్చి అడిగించి చెల్లెలు.
“ఏంట్రా అన్నాయ్! నీకు అన్నిట్లూ ఏ + లేనా!! ” అంటూ వచ్చిన చెల్లెలు చామంతిని,
“పోవే చామంటీ !పూబంతీ! నీతో మాట్లాడితేనేసిగ్గు. అన్నిట్లో బీ లే.షేం షేం.” అని విదుల్చు కున్నాడు చెల్లెలు చేతిని .
“ఏ + అంటే ఏంటండీ బాబుగారూ !”అంటూ ఇద్దరికీ పాలగ్లాసులుపట్టుకొచ్చిన పనిమనిషి పార్వతి అడిగింది.”
“పోపో నీకే తెల్సు? పొట్టపొడిస్తే అక్షరం రాని ఇల్లిట రేట్ వి? నీకు గ్రేడంటే తెలుసా అసలు?పేద్ద అడగొ చ్చింది!”అని పార్వతమ్మ మీద విరుచుకు పడ్దాడు ఆనంద్.
“పార్వతమ్మగారూ ! గ్రేడంటే 90నుంచీ 95 వరకూ మార్కులొస్తే’ ఏ గ్రేడ్’ అంటారు. 95 నుంచీ వందవరకూ వచ్చినవారిని’ ఏ+ ‘గ్రేడ్ అంటారు. నాకు ఎప్పుడూ అన్నిట్లో’బి’ గ్రేడే వస్తుంది. అంటే 80 వరకే వస్తాయి. అందుకే మా అన్న నన్ను సిగ్గు అంటున్నడు.” అని వివరంగా చెప్పింది.
“అదా !చిన్నమ్మగారూ !నాకు బాగా అర్ధమయ్యేలా చెప్పారు. ఈ సదువ్విసయాలు నాకేటి తెలుత్తాయ్ సెప్పండీ!” అంది గ్లాసులు తీసుకెళూతూ పార్వతమ్మ.
“కాదు పార్వతమ్మాగారూ! అన్నీ తెలుస్కోవాలి.”అంది సాక్స్ విప్పి పక్కన పెడుతూచామంతి.
అవి అందుకోబోయిన పార్వతమ్మ తో ” ఒద్దు పార్వతమ్మ గారూ ! నాసాక్స్ నేనే తీసుకెళ్ళి వాష్ రూంలో వేస్తాను.” అంది చామంతి.
“ఏయ్ ! నిన్నే నా సాక్సు తీసుకెళ్ళు ,దాని దంతా పనిమనిషి బుధ్ధిలే ” అంటూ సాక్సు తీసి పార్వతమ్మమీదకు విసిరేశాడు ఆనంద్.
“ఆనంద్ ! ఈపనిబాగుందిరా ! చదువులో నీకు అన్నీ ట్లో ఏ+ రావడం సంతోషం.అసలు చదువెందుకు ? అంటే విద్య అదే ఎడ్యుకేషన్ మనం ఎందుకు నేర్చు కుంటాం? ” అడిగారుతాతగారు.
“అదేంటి తాత గారూ ! ఎడ్యుకేషన్ లేకపోతే జీవితమే లేదు. మంచి మార్కులతో పాసై అన్నీ ఏ+గ్రేడ్స్ తెచ్చు కుంటే మంచికాలేజ్ లో సీట్ వస్తుంది.చక్కగా ఇంజనీరింగ్ చేసి అమేరికా వెళ్తే కావసినన్ని డాలర్లు, మంచి జీవితం. గౌరవం, కావల్సినవన్నీ కోనుక్కో వచ్చు. “గర్వంగా చెప్పాడు ఆనంద్.
“బావుందిరా! తల్లీ చామంతీ! నీవుచెప్పమ్మా ! చదువుకోడం ఎందుకూ!”
“తాతగారూ !చదువు సంస్కారాన్ని నేర్పుతుంది. అది నేర్పని చదువు వృధా. మన చదువు వల్ల మనం సమాజం లో అందరికీ మేలు చేయగలగాలి. మానవతా విలువలను పాటించాలి. ఆందరినీ గౌరవించాలి. అందరితో ప్రేమగా మాట్లాడాలి.చదువు కేవలం ధన సంపాదనకోసమే కాదని నా అభిప్రాయం. మానవులంగా జీవించే అర్హత నేర్పేదే చదువు.” అంది చేమంతి.
“ఏడ్చావ్ ! సంపాదనకు పనికిరాని చదువెందుకు ? టంగ్ క్లీనర్లా నాలుగ్గీక్కోనా! పిచ్చి మాటలు. చదువు వల్ల మన స్థాయి పెరగాలి, కావల్సినంత డబ్బు ధారా ళంగా సంపాదించాలి. హాయిగా ఉండాలి. లేకపోతే ఇంత కష్టపడి చదవడ మెందుకూ?” అన్నాడు ఆనంద్.
” ఒరే ! ఆనంద్ లోపలికిరా! వచ్చి టిఫిన్ తిను.” పిలిచింది తల్లి తాయారు.
“ఏం మమ్మీ నాకు ఇక్కడికే తెచ్చిపెట్టలేవా!ఎంత కష్ట పడి స్కూల్ కెళ్ళి చదువుకుని అన్నిట్లో ‘ఏ+ ‘ తెచ్చు కుని వచ్చాను? నీవెప్పుడూ ఇంతే ..ఇక్కడికే తీసుకురా!”అంటూ కేకేశాడు.
“ఏరా అన్నయ్యా! అమ్మ ఉదయం నుంచీ ఎంత కష్టపడి మనందరికీ అన్నీ చేసి సమయానికి అందిస్తు న్నదిరా! లోపలికెళ్ళీ ,కాళ్ళూచేతులూ కడుక్కుని తింటే ఏరా! అలాకేకలేయక పోతే!”అంది చేమంతి.
“పోవే నీలాంటి మొద్దులకు అవన్నీ, నాలాంటి ‘ఏ + ‘గ్రడ్సు కు కాదు. పో పోయి నాకూపట్రపో.” అన్నాడు .
చేమంతి లోనికెళ్ళి అన్నకు టిఫిన్ ప్లేట్ తెచ్చి ఇచ్చింది.
“ఎవరికోసం చదువుతున్నావురా! నీకోసమేకదా! అలా మాట్లాడవచ్చా?”అన్నారు తాతగారు.
“ఏం తాతా! పిల్లలకు అమ్మ చేస్తుంది ప్రేమగా! ఏంటీ మీరిలా అంటున్నారు. అమ్మ ఉన్నది అందుకేగా!”
” కానీ అమ్మ పిల్లలకు చేసినా అమ్మకష్టమూ గమనిం చాలికదా!ఎంతని ఎందరికి చేస్తుందిరా!”అని తాతగారు అంటూండగానే వాళ్ళనాన్నగారు నాగేశ్వర్రావు వచ్చారు.
” రండి నాన్నగారూ !”అంటూ చేమంతి వెళ్ళి ఆయన చేతుల్లోని ఆఫీస్ బ్యాగ్ అందుకుని , “నాన్నగారూ ! మీకూ ఇక్కడికే టిఫిన్ తేనా!” అంది.
“పిచ్చితల్లీ ! నీకు నేనంటే ఏంతప్రేమ! వద్దులేమ్మా! నే వెళ్ళి కాళ్ళు కడుక్కుని లోపలే తింటాను. అమ్మ ఉదయం నుంచీ అందరికీ అన్నీ వేళకు అందిస్తు న్నది. ఇంకా మనం కూర్చునున్న దగ్గరికే తెమ్మనడం భావ్యంకాదు.అమ్మకష్టమూ చూడాలి.”అంటూ లోపలి కెళ్ళారాయన.
“పెదబాబు గారండీ ! నమస్కారమండీ!” అంటూ వచ్చి తాతగారి పాదాలకు నమస్కరించాడు పార్వతమ్మ కొడుకు కుమార్.
” ఏరా ! బావున్నావా! నీకెన్నిమార్కులొచ్చాయిరా !ఈ ఫైనల్ పరీక్షల్లో ! ఇహ పదో తరగతి పబ్లిక్ చాలా రోజు లు లేదు. బాగా చదువుతున్నావా!”అడిగారు తాతగారు.
“కొంచెం తక్కువే వచ్చాయండీ!”అంటూ తలవంచు కున్నాడు కుమార్.
“ఎన్నివచ్చాయేంట్రా!” అడిగారు తాతగారు.
“వాడి మొహం వాడికెన్ని వచ్చుంటాయ్! ‘డీ మైనస్’ వచ్చుంటుంది.వాళ్ళమ్మ అనవసరంగా బళ్ళో వేసింది. హాయిగా తోడు తెచ్చుకుని పనిచేయించుకోక ” అంటూ నవ్వాడు ఆనంద్.
” ఉండరా!పాపం వాడిని చెప్పనీ.చెప్పుకుమార్! ” అన్నారు తాతగారు.
కుమార్ తన చేతులోని ‘ర్యాంకార్డ్ ‘తాతగారికిచ్చి తల వంచుకుని నిల్చున్నాడు.
తాతగారు కార్డ్ చూసి వాడికేసి తిరిగి ” ఏరా!కుమార్ ! ఆంగ్లంలో వందకువంద, గణితంలో వందకువంద, సైన్స్ ,సోషల్ , అన్నిట్లో వందకువంద.తెలుగులో 98 ! ఏరా “అన్నారు తాతగారు.
“అదేనండీ మాతృభాషలో నాకు మార్కులుతగ్గాయి. అందుకే సిగ్గుపడుతున్నాను. మీరే మన్నా కాస్త చెప్తారే మోని అడగాలని వచ్చాను.దయచేసి చెప్పండి పెద బాబు గారూ !” అంటూతాతగారి పాదాలు పట్టుకున్నా డు కుమార్.
తాతగారు లేచి వాడిని లేపి హృదయనికి హత్తుకుని “మాణిక్యంలాంటివాడివిరా కుమార్! మీ అమ్మకష్టం తెల్సుకుని ఇంత బాగా మార్కులు సంపాదించడమే కాక, ఎంత వినయం ,భక్తీ, పెద్దల పట్ల గౌరవం నేర్చు కున్నావురా! ఒరే కుమార్ ! కావలసింది మార్కులు మాత్రమే కాదురా! రిమార్కులు లేని ప్రవర్తన. ఎవ్వరినీ అగౌరవ పరచక, తల్లిదండ్రుల కష్టం తెల్సుకుని ,పెద్ద లందరినీ మన్నిస్తూ మానవతా విలువలతో ప్రవర్తించ నేరా చదువు. ‘ఐ అం సో ప్రౌడ్ ఆఫ్ యూ ” అంటూ వాడితల నిమిరారు. ఆనంద్ సిగ్గుతో తల వాల్చుకు న్నాడు.అతనికి తనతప్పు తెలిసొచ్చింది.అప్పటినుంచీ మారి,అలవాట్లు మార్చుకుని మంచి వాడిగా పేరు తెచ్చుకుని, స్కూల్ పాఠాల్లోనేకాక జీవిత పాఠాల్లోనూ ‘ఏ+ ‘గ్రేడ్ తెచ్చుకున్నాడు .
*****