వీక్షణం

వీక్షణం 56వ సమావేశం

-సుభాష్ పెద్దు


వీక్షణం 56వ సమావేశం ఏప్రిల్ 9, 2017 నాడు మిల్పిటాసు లోని అనిల్ రాయల్ గారి ఇంటిలో జరిగగింది. ఈ సమావేశానికి శ్రీ పెద్దింటి తిరుములాచార్యులు గారు అధ్యక్షత వహించారు.

అధ్యక్షుల వారు ముఖ్య అతిథిగా ప్రముఖ కథా, నవలా రచయిత్రి, టీ.వీ సీరియల్ రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారిని సభకు ఆహ్వానించి ప్రసంగించవలసినదిగా కోరారు.

బలభద్రపాత్రుని రమణి గారి ప్రసంగ విశేషాలు – "నేను 7, 8వ తరగతులలో ఉన్నప్పుడు కథలు వ్రాయటం మొదలుపెట్టాను. ఒకసారి ఒక పత్రికకు కథ పంపిస్తుంటే మా అన్నయ్య బల్ల కొట్టి మరీ చెప్పాడు, ఈ కథను ప్రచురించరు అని. ఆ కథ ప్రచురించబడటమే కాకుండా పలు ప్రశంసలకు కూడా పొందింది. అద్రక్-కె-పంజే వంటి నాటికలు, చలం గారి రచనలు, ముఖ్యముగా "దైవమిచ్చిన భార్య" మొదలైనవి నన్ను ప్రభావితం చేశాయి. నన్ను ప్రోత్సహించిన వారు ఎందరో. వారిలో ముఖ్యులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు. "లీడర్, మజిలీలు" వారి ప్రోత్సాహంతో ఎమెస్కో వారు ప్రచురించారు.

నా నవలను మొదటి సారిగా సినిమాకోసం అడిగినప్పుడు నేను పారితోషకం అడగలేదు. నవలను స్క్రీన్‌ప్లేగా మార్చి చిత్రీకరించటంలో అనుభవం కావాలి అని అన్నాను. సత్యనారాయణ గారు, గుమ్మడి గారు వంటి మహా నటులతో సెట్స్ మీద పనిచేయటం ఒక గొప్ప అనుభవం. ఆ రకంగా, సినిమా స్క్రీన్‌ప్లే రచయితగానూ, ఆ తరువాత టీ.వీ సీరియల్స్ కి కథ, స్క్రీన్‌ప్లే రచయితగా స్థిరపడ్డాను.

కథ వ్రాయటం చాలా కష్టం. ఇప్పుడు నేను రోజూ వ్రాసేది టీ.వీ సీరియల్స్. ఒకేసారి 300, 400 పేజీలు వ్రాస్తాను. సెట్స్ దగ్గర కూర్చుని స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, కథ మార్పులు చేర్పులు చేయటం జరుగుతుంది

“ఒక శ్రోత వ్యాఖ్య "టీ.వీ సీరియల్స్‌కి అసలు కథ వుంటుందా!!!”

బలభద్రపాత్రుని రమణి గారి జవాబు "కథ ముఖ్యంగా మార్కెటింగ్ వారి నిర్దేశంలో ఉంటుంది. టిఆర్‌పి రేటింగ్స్ ఏమాత్రం తగ్గినా మార్కెటింగ్ శాఖ వాళ్లు కథని మార్చమంటారు. టిఆర్‌పి బాక్సులు ఎక్కువగా దిగువ తరగతి వాళ్ల ఇళ్లలోనే ఉంటాయి. ఎప్పుడూ టిఆర్‌పి రేటింగ్స్ ఉండేవి అత్తా కోడళ్ల కథలు, వాళ్ల ఇబ్బందులూ, మూఢ నమ్మకాలు మొదలైనవి. ఈ కథలు మార్చాలంటే ముఖ్యమైన సాధనం టివి రిమోట్. అది మీ చేతిలో వుంది, మీరు ఈ కథలు చూడకుండా వుంటే టిఆర్‌పి రేటింగ్స్ తగ్గుతాయి, అప్పుడు మార్కెటింగ్ వాళ్లు మాకు వేరే కథలు వ్రాయటానికి అవకాశం ఇస్తారు”

శ్రీమతి రమణిగారిని అధ్యక్షులు ఆచార్యులుగారు, కిరణ్ ప్రభ గారు, గీత గారు మొదలైనవారు శాలువా కప్పి సత్కరించారు.

సమీక్షకుడి వ్యాఖ్య – టిఆర్‌పి రేటింగ్స్ బాక్సులు దిగువ తరగతి వారి ఇళ్లలోనే పెడతారని రమణి గారు అన్నారు. ఇది పాశ్చాత్య దేశాల మార్కెటింగ్ విధానానికి విరుద్ధం. “పర్చేసింగ్ పవర్” అనగా ఎవరు ఎక్కువ ఖర్చుదారులు అనే సమూహానికి రేటింగ్స్ విలువ ఎక్కువ. ఉదాహరణకి మధ్య, ఎగువ తరగతి వారిలో 13 నుండి 30 వయసు మధ్యనున్నవారికి అడ్వర్టయిజర్స్ ఇచ్చే విలువ ఎక్కువ. ఎందుకంటే నిజ జీవితంలో వారే ఎక్కువ ఖర్చుపెడతారు కాబట్టి. మరి భారత దేశంలో అడ్వర్టయిజర్స్ యీ విషయం పట్టిచుకోవటంలేదా? పలు తెలుగు ఛానల్స్ పాశ్చాత్య దేశాలలో ప్రసారమవుతాయి. మరి భారత దేశంలో వుండే
దిగువతరగతి వారి అభిరుచులు, పాశ్చాత్య దేశాలలో ఉండే తెలుగు వారి అభిరుచులకూ సంభంధమేమిటి? పాశ్చాత్య దేశాలలో వుండే తెలుగు పిల్లలు టీ.వీ సీరియల్స్ చూసి మూడ నమ్మకాలు, స్త్రీ హింసను చూసి ప్రభావితం కాకుండా వుండగలరా? ఆమాట కొస్తే, కేవలం టిఆర్‌పి రేటింగ్స్ కోసం భారత దేశంలో మూడ నమ్మకాలను, స్త్రీ హింసను ఎదిరించకపోగా వ్యాప్తి చేసే సాధనముగా టివీ సీరియల్స్ ఉండటం ఒక దుర్దశ. టీ.వీ చానల్స్ వారు ఈ దుర్దశకు కారణం “మీ చేతిలోని రిమోట్” అని, సామాన్య ప్రజ “టీ.వీ వాళ్లు అదే చూపిస్తున్నారు కాబట్టి చూస్తున్నాము” అని ఒక విషవలయము ఏర్పాటు చేసుకుని, ఆ విషవలయం లోనుంచి అథః పాతాళానికి సొరంగం తవ్వుకుని, ఒక జారుడు బల్ల ఏర్పాటు చేయటము. “సొంత లాభము కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడవోయి” అనేదీ టిఆర్‌పి రేటింగ్స్ మాయలో మరుగున పడిపోయింది.

నాడు సమాజంలో మూఢ నమ్మకాలు ప్రబలి ఉండకపోతే ఒక రాజా రామ్మోహన రాయ్ ఉండేవాడు కాదు. మళ్లీ మనం ఆ అవసరం తెచ్చుకొనే స్థితి రాగూడదు. 80వ దశకంలో మషాలా ఫార్ములాలతో సినిమాలు వచ్చే రోజులలో "నాట్య మయూరి" ఒక స్ఫూర్తి. నేటి టిఆర్‌పి రేటింగ్స్ ప్రకారం, ఆ సినిమా తీయగూడదు. కానీ వ్యాపారాత్మకంగా కూడా విజయం సాధించింది. అలాగే "శంకరాభరణం" సెలయేటి తరంగాలపై తేలియాడుతూ, యేటి ఒడ్డున ఉన్న మల్లె తోటలపైనుండి ప్రసరించిన ఒక యేటి గాలి. అదే శంకరాభరణం విడుదల కాగానే విజయం సాధించలేదు. నేటి టిఆర్‌పి లకు భయపడి శంకరాభరణం కథ వంకరలు తిరగటం ఊహకందని విషయం. టీ.వీ ఛానెల్ అధినేతకు విలువలతో కూడిన కథలను ప్రయోగాత్మకముగా తీసే స్తోమత వుంది.మరి ఆ ఆలోచనలు ఎందుకు రావటములేదో. ఒక పేరున్న రచయిత్రిగా, "వేప చెట్టు" వంటి మంచి కథలను అందించిన రచయిత్రిగా, కథా'బల'ము, 'భద్ర'మైన 'పాత్ర'లతో, 'రమణీ"యముగా టివీ సీరియల్స్ గమనాన్ని మార్చగలరని నా ఆశావాదం.

ఆ తరువాతి కార్యక్రమం అనిల్ రాయల్ గారి కథా పఠనం. వారు రచయించిన "రాక్షస గీతం" అనే కథ. "సత్యమనేది ఒక స్థిర భ్రాంతి" అనే ఐనిస్టీన్ ఉల్లేఖనం స్ఫూర్తితో వ్రాసిన కథ. ఒక మనిషి తనకు ఒక ప్రత్యేక శక్తి ఉంది అని నమ్మి, తనది ప్రత్యేక శక్తి కాదు, అది ఒక భ్రాంతి అని తెలిపే కథ. అలాగే, ప్రతి మనిషి తను నమ్మినది సత్యమో, భ్రాంతియో, లేక ఒక ఉన్మాదమో అని ఆలోచింపచేసే కథ.

తరువాత కార్యక్రమం తెలుగు రచయిత కొత్త వెబ్ సైటు ఆవిష్కరణ. అంతర్జాలలంలో తెలుగు రచయితల వివరాలను వివరముగా, అందంగా పొందుపరచబడిన పొదరిల్లు "తెలుగు రచయిత". ఈ ప్రక్రియ క్రితం సంవత్సరము ఉగాది నాడు ప్రారంభింపబడినది. ఆ వార్షికోత్సవము సందర్భముగా డా. కె. గీత గారు గత సంవత్సరంగా సాధించిన విజయాలను గురించి వివరించారు. అధ్యక్షులవారు "తెలుగు రచయిత ఒక బిందువులో సింధువు. ఒక పేజీలోనుండి తెలుగు సాహిత్యాన్ని వృద్ధి చేసిన ప్రముఖులు, వారి రచనల గురించి ఎన్నో వివరాలు తెలుసుకోవచ్చు" అని కొనియాడారు.

తరువాత అందరూ ఎదురు చూసే కార్యక్రమం కిరణ్ ప్రభ గారి క్విజ్. ఎప్పటి వలనే సభికులందరూ నవ్వుతూ, ఆడుతూ పాల్గొని, బోలెడు ప్రశ్నలుకు సమాధానములు సరి జవాబు చెప్పలేక పోయారు. ఉదాహరణ ప్రశ్న. దిష్టాంతము అనగా ఏమిటి? అ) పడమటి దిక్కు ఆ) పొద్దు గ్రుంకు వేళ పొడిచే నక్షత్రం ఇ) చావు ఈ) చెఱువు గట్టు మీది కొంగ

ఇక్బాల్ గారి ఆధ్వర్యంలో కవి సమ్మేళనంలోని కవితలు:

1. తల్లాప్రగడ రావు గారు – "వేయి పేర్లున్నగాని అసలు పేరు ఏది". లలిత సహస్రనామంలో "అమ్మ" అనే పదం లేక పోవటం గురించి వ్రాసిన కవిత.

2. వేదానంద్ గారి (రేపల్లె) గారి కవిత "ప్రభాతమా .., ఆమని అరుణోదయ రాగమా .."

3. డా. కె. గీత గారు "కంప్యూటర్ కాపురం"

4. మేకా రామస్వామి గారు "మనిషి నడుస్తున్నాడు", "ముందు స్వార్థం, వెనుక స్వార్థం".

5. వేణు ఆసూరిగారు ""కలలు కను కలలు కను, కనులు తెరిచి కలలు కను …." కలల సిరులతో, ఆ"సూరి" మృదు మధుర "వేణు" గానముతో సభ స్వస్తి పలికింది.

ఈ సభలో శ్రీ త్రిపురనేని గోపిచంద్ గారి కుమార్తె శ్రీమతి రజని, వారి మనుమడు శ్రీ శిల్పి, శ్రీమతి క్రాంతి, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి శారద, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి లక్ష్మి, శ్రీ లెనిన్, శ్రీ గాంధీ ప్రసాద్, శ్రీ శ్రీచరణ్, శ్రీ వేమూరి, శ్రీమతి ఉమా వేమూరి మొ.న ప్రముఖులు పాల్గొన్నారు.

————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked