కథా భారతి

వీసా

-ఆర్. శర్మ దంతుర్తి

“ఈ సారైనా ఎలాగోలా వీసా సంపాదించవల్సిందే“

“అదంత సులభం అయితే ఇంకేం? వీసా ఆఫీసర్ మూడ్ బట్టి మన అదృష్టం బట్టీను. పోనీ, అది ఎలాగా మన చేతిలో లేదు కానీ, అమ్మని అడుగు ఏం చేయాలో. మనం కాయితాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుందాం. అమ్మ ఏదైనా దేవుడికి మొక్కమంటుందేమో చూడు.”

“అమ్మా నువ్వేమంటావ్?”
“వస్తున్నా, కాస్త చేయి ఊరుకోలేదిప్పుడు. కాసేపాగు.”
“…”
“ఇప్పుడు చెప్పు ఏంటి కధ?”

“వీసా కి నాలుగోసారి వెళ్తున్నా. మూడు సార్లూ ఏదో వంక పెట్టి వెనక్కి పంపించేసాడు. ఈ సారైనా ఎలాగోలా సంపాదించాలి. ఏం చేద్దాం?”
“క్రితం సారి నేను చెప్పినట్టు చేయమంటే పోజు కొట్టారు కదా తండ్రీ కొడుకులు? ఇప్పుడు నా దగ్గిరకొచ్చారా?”

“ఏదో తప్పు అయిపోయింది అప్పుడు. ఇప్పుడు ఎలాగైనా వీసా రావాలి. ఏం చేయమంటావ్?”
“హైద్రాబాద్ లోనే కదా వీసా ఇచ్చేది?”
“ఔను. నువ్వూ వస్తావా వెళ్ళడానికి?”
“కాదు కానీ, హైద్రాబాద్ లో వీసా గుడికెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే వీసా గారంటీ అని ఈ మధ్యనే అమెరికా వెళ్ళిన సుబ్బమ్మ గారి మనవడు ఫోన్ చేసి చెప్పేడుట.”
“వీసా గుడి ఏమిటి?”

“చిలుకూరులో బాలాజీ ఆలయం ఉంది. అక్కడ ప్రదక్షిణాలు చేస్తే వీసా గారంటీ!”
“ఎప్పుడు చేయాలి? ఎన్ని సార్లు?” గుడి బాగా పెద్దదైతే ఎంత టైమ్ పడుతుందో?”
“వీసా కావాల్నా వద్దా? ఆ మాత్రం కష్టపడకుండా బాలాజీ వీసా ఎందుకివ్వాలి నీకు?”
“సరే, సరే, తప్పు, అపచారం. క్షమించు.” “నూట ఎనిమిది సార్లు చేయాలి. చేసేటప్పుడు విసనా జపించాలి. అలాగని ఆవిడ చెప్పారు”

“ఏవిటి? వాల్మీకి మొదట్లో నోరు తిరగక మ. రా, మ. రా అంటూ రాముణ్ణి తల్చుకున్నట్టూ వి. స. నా; విసనా అనుకుంటూ ఉంటే అదే “నావీసా” అవుతుందా?” “ఆవిడ చెప్పింది నేను నీకు చెప్పా. సుబ్బమ్మ గారు ఊర్లో లేరిప్పుడు కనుక్కోవడానికి. వచ్చాక ఆవిణ్ణి అడుగుదాం కావాలిస్తే. మరి అదేంటో ఆవిడ వచ్చాక తెలుస్తుంది కదా?”

“సరే ఏ రోజు మంచిది చేయడానికి? ముహుర్తం పెట్టుకోవాలా? లేకపోతే ఆధార్ కార్డు ప్రతీ దానితో సంధానం అంటున్నారు కనక అది కూడా చూపించాలా? పెద్ద క్యూ అదీ ఉంటే, ముందే బుక్ చేసుకోవాలేమో?”
“అవన్నీ మీరూ మీరూ చూసుకోవాల్సిందే, నాకేం తెలియవు. శనివారం చేస్తే మంచిది.” “మేం వెళ్ళాల్సింది రేపే.” “హార్నీ, ఇప్పుడేం చేద్దాం? విసనా అనుకుంటూ ప్రదక్షిణం చేసేయ్ అయితే”

“అమ్మా, నాకు వీసా వచ్చిందే!” “నే చెప్పలేదా? ఇంతకీ గుళ్ళో ప్రదక్షిణం చేసావా?” “ఆ ఓ రోజు ముందు చేసా. కాళ్ళూ పీకేసాయి. వందలమంది ఉన్నారు అక్కడ. గుంపులో గోవిందా అనుకుంటూ 108 సార్లు చేసా.” “విసనా అనీ మంత్రం చెప్పావా?” “ఆ చెప్పాను. రేపు బయల్దేరి వచ్చేస్తున్నా. వీసా అయిదేళ్లకి ఇచ్చారు. వచ్చాక అన్నీ మాట్లాడుకోవచ్చు.”

“మా అబ్బాయికి వీసా వచ్చిందండి సుబ్బమ్మ గారు. మీరు చెప్పినట్టే చిలుకూరు బాలాజీ గుళ్ళో ప్రదక్షిణం చేసాడు విసానా అనుకుంటూ.” “మంచిదండి. ఇప్పట్నుంచీ విసనా మర్చిపోకుండా రోజూ చేస్తూ ఉండమనండి.” “ఇంకా ఎందుకండీ నా వీసా నా వీసా, విసనా విసనా అనుకోవడం? వీసా వచ్చేసింది కదా?”

“ఏవిటీ? మీవాడు ‘విసనా’ అనే మూడక్షరాలు జపం చేసాడా? ఖర్మ! విసనా అంటే నేను చెప్పినది విష్ణు సహస్ర నామం అని.”

—అయిపోయింది—-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked