సేకరణ: డా.కోదాటి సాంబయ్య
(రెండవ భాగం)
ద్వాదశ స్వర స్తానములు :- రెండు శ్రుతులకు లేక రెండు స్వరములకు గల వ్యత్యాసమును ‘ అంతరం ‘ ( difference ) అంటారు. సంగీతములో ద్వాదశ స్వరాంతర్గత
స్థానములను చెప్తారు. సప్త స్వరముల లోని షడ్జ, పంచమ ములకు వికృతి భేదములు లేవు. రిషభ, గాంధార, మధ్యమ, దైవత, నిషాధ ములకు ప్రక్రుతి, వికృతి బేదములు రెండూ కలవు. అందువల్ల షడ్జ , పంచమ ములను ప్రక్రుతి స్వరములని, రిషభ , గాంధార, మధ్యమ, దైవత, నిషాధ స్వరములను వికృతి స్వరములు అని పేరు.
ఈ విధమైన తేడాలు హిందుస్తానీ, పాశ్చాత్య సంగీతం లో కూడా కలవు.
మూర్చన :- ఏదైనా ఒక రాగం లో రాగల స్వరముల ఆరోహణ, అవరోహణ లను కలిపి మూర్చన అంటారు. మానవ దేహమునకు ఆస్థి పంజరము ఎలా ఆధారభూతమో
ఒక రాగానికి కూడా మూర్చన అలా అధారమవుతుంది. ఆస్థి పంజరానికి పైన మాంసము తదితర అంగములు సమకూరి మానవ శరీర మవుతుంది అలాగే వాగ్గేయకారులు ఒక రాగ మూర్చనకు రాగ ప్రయోగాలు, రంజక ప్రయోగాలు, విశేష ప్రయోగాలు, గమకములు మరియు సాహిత్యాన్ని సమకూర్చి .. ఆ రాగానికి ఒక రూపం తీసుకొస్తారు. ఉదా: త్యాగయ్య కంటే ముందు ఖరహరప్రియ కేవలం 22 వ మేళకర్తగా అనామకంగా ఉండేది. త్యాగయ్య గారు ఈ రాగం లో మరియు ఈ రాగ జన్య రాగాలలో ( శ్రీ రంజని త్యాగయ్య గారి సృష్టి ) అనేక కృతులను రచించి…ఖరహర ప్రియ రాగానికి ప్రాణ ప్రతిష్ట చేసి ఒక రూపాన్ని తెసుకొచ్చి విశేష ప్రచారం చేశారు.
స్థాయి :- షడ్జమం నుండి నిషాధం వరకు స్థాయి అంటారు. ఇంగ్లిష్ లో octave అంటారు. ఈ స్థాయిలు మూడు రకములు.
1. మంద్ర స్థాయి, 2. మధ్య స్థాయి, 3. తారా స్థాయి. ఈ మూడు స్థాయిలను కలిపి త్రిస్తాయి అంటరు. మధ్య స్థాయి స్వరముల కన్నా తారా స్థాయి స్వరములు రెట్టింపు తారతమ్యము కలిగి ఉండును. దీనినే ద్విగుణత్వం అంటారు. అలాగే మధ్య స్థాయి స్వరముల కన్నా మంద్ర స్థాయి స్వరములు సగం తారతమ్యం కలిగి ఉంటాయి.
గాత్రములో పై మూడు స్థాయిలలో మాత్రమె పాడుటకు మన స్వర పేటిక సహకరిస్తుంది. కానీ జంత్ర వాద్యమములలో మంద్ర స్థాయి స్వరములకన్నా సగం తగ్గింపు స్వరములను పలికించవచ్చు, దీనిని అతి మంద్ర స్థాయి అంటారు. తారా స్థాయి కంటే రెట్టింపు స్వరములను కూడా పలికించ వచ్చు. దీనిని అతి తారా స్థాయి అంటారు.
పై పంచ స్థాయిలను ఒక భవనముతో పోల్చితే ఈ విధంగా ఉంటుంది.
1. సెల్లార్……అతి మంద్ర స్థాయి ….
2. గ్రౌండ్ ఫ్లోర్ ….మంద్ర స్థాయి…
3. ఫస్ట్ ఫ్లోర్ ….మధ్య స్థాయి …
4. సెకండ్ ఫ్లోర్ ….తారా స్తాయి….
5. థర్డ్ ఫ్లోర్ …..అతి తారా స్థాయి.
తాళము, తాళాంగములు : శివుడు చేసే నాట్యాన్ని ‘ తాండవం ‘ అంటారు. పార్వతీదేవి చేసే నాట్యాన్ని ‘ లాస్యం ‘ అంటారు. తాండవం లోని తా.. లాస్యం లోని లా
తీసుకుని తాలము అన్నారు. అదే క్రమంగా తాళం అయ్యింది. ఒక స్కూటర్ ఎంత వేగంగా పోతున్నదో దాని స్పీడో మీటర్ చూస్తే తెలుస్తుంది. అలాగే సంగీతం లో
పాట వేగాన్ని కొలవటానికి తాళము ఉపయోగ పడుతుంది. స్కూటర్ వేగాన్ని మనం కిలోమీటర్లలో ఎలా కోలుస్తామో పాట వేగాన్ని కొలవడానికి అంగములు అనే
సంజ్ఞలు తాళమున కు ఉపయోగ పడతాయి. ఇట్టి అంగములు ప్రధానంగా ఆరు ఉన్నాయి. వీటినే షడంగములు అంటారు.
ఈ షడంగములను తెలుపడానికి కొన్ని క్రియలు ఉపయోగపడతాయి. కుడి చేతిని కుడి తోడ మీద వేయడం ఒక క్రియ. దీనిని దెబ్బ లేక ఘాత అంటారు. అర చేతిని పైకి
చూపిస్తూ తొడమీద వేయటాన్ని ఉసి అంటారు. వేళ్ళను లెక్కించడం కూడా క్రియనే. చిటికెన వేలుతో మొదలు పెట్టి క్రమంగా ఉంగరం వేలు, మధ్య వేలు, అనామిక, బొటన వేలు తొడమీద వేయాలి . ఈ విధంగా కొన్ని క్రియలు కలిసి ఒక అంగం, కొన్ని అంగములు కలిసి తాళం ఏర్పడుతుంది.
షడంగములు :-
1. అనుద్రుతము..దీనిని ఒక ఘాతతో తెలుపుతారు. దీనికి ఒక అక్షర కాలము అవుతుంది. దీని గుర్తు ‘ U ‘
2. ద్రుతము…ఇది ఒక ఘాత మరియు ఒక ఉసి తో తెలుపుతారు. దీనికి రెండక్షరాల కాలం పడుతుంది. దీని గుర్తు ‘ O ‘
3. లఘువు…దీనిని ఒక ఘాత మరియు వేళ్ళను లెక్కించడం ద్వారా తెలుపుతారు. దీనికి పట్టే అక్షరాల సంఖ్య మరియు వేళ్ళ సంఖ్య..జాతిని పట్టి తెలుపుతారు .
దీని గుర్తు….. ‘ I ‘
4. గురువు…లఘువునకు రెట్టింపు. దీని గుర్తు .. ‘ S ‘…ఉదా: లఘువుకు 4 అక్షరములు అయినచో గురువుకు 8 అక్షరములు అవుతుంది.
5. ఫ్లుతము…మూడు లఘువుల కాలం కలది. దీని గుర్తు …’ S1 ‘ ఉదా: లఘువుకు 4 అక్షరములు అయినచో ఫ్లుతమునకు 12 అక్షరములు అవుతుంది.
6. కాకపాదము…ఇది 4 లఘువుల కాలం కలది. గురువుకు రెట్టింపు కాలం కలది. దీని గుర్తు ..’ + ‘ ఉదా: లఘువుకు 4 అక్షరములు అయితే కాకపాదమునకు 16 అక్షరములు.
పై షడంగములలో ప్రస్తుతము అనుద్రుత, ధృత, లఘువులు మాత్రమె వాడబడుచున్నవి.
తాళము – తాళాంగములు : సంగీత ప్రపంచం లో రాగాలకు సప్త స్వరములు ఎలా పునాదో, తాళములకు సప్త తాళములు అలాగే పునాది వంటివి.
శ్లో|| ధ్రువో మఠ్యో రూపకశ్చ ఝంపా త్రిపుట మేవచ
ఆట తాళైక తాళశ్చ సప్త తాళ ప్రకీర్తతః ||
1. ధృవ తాళము ; ఒక లఘువు ఒక ద్రుతము, రెండు లఘువులు …దీని గుర్తు I O II
2. మఠ్య తాళము : ఒక లఘువు ఒక ద్రుతము ఒక లఘువు….దీని గుర్తు I O I
3. రూపక తాళము : ఒక ద్రుతము ఒక లఘువు ….దీని గుర్తు O I
4. త్రిపుట తాళము : ఒక లఘువు రెండు ద్రుతములు …దీని గుర్తు I OO
5. ఝంప తాళము : ఒక లఘువు ఒక అనుద్రుతము ఒక ద్రుతము దీని గుర్తు I U O
6. ఆట తాళము : రెండు లఘువులు రెండు ద్రుతములు దీని గుర్తు IIOO
7. ఏక తాళము : ఒక లఘువు మాత్రమె దీని గుర్తు I
జాతి :- లఘువు అంటే ఒక దెబ్బ వేళ్ళను లెక్కించడం. అయితే ఎన్ని వేళ్ళను లేక్కించాలో ఆయా లఘువు జాతిని బట్టి మారుతుంటాయి. లఘువు యొక్క అక్షర
బేధములను తెలుపుట ను జాతి అంటారు. శాస్త్రీయ సంగీతము అభివృద్ధి చెందనప్పుడు పల్లె ప్రజలు పాటలను ఈ జాతి లఘువులతో పాడేవారు. నేడుకూడా లలిత
సంగీతం లో ఈ జాతి లఘువులను ఉపయోగిస్తున్నారు.
సాధారణంగా త్రిపుట తాళం లఘువు త్రిశ్ర జాతిలో …I 3 , ధ్రువ, మఠ్య , రూపక, ఏక తాళ లఘువు చతురశ్ర జాతి I 4 , ఆట తాళ లఘువు ఖండ జాతి లో I 5
ఝుంప తాళ లఘువు లో మిశ్ర జాతి I 7 లో ఉండును.
పంచ జాతులు :
1. త్రిశ్ర జాతి : 3 అక్షరముల విలువ కలిగిన లఘువు. అనగా ఒక దెబ్బ రెండు వేళ్ళను లెక్కించాలి ..చిటికెన వేలు , చూపుడు వేలు ..దీని గుర్తు I 3 ….తకిట
2. చతురశ్ర జాతి : 4 అక్షరముల కాలము కలిగిన లఘువు…అనగా ఒక ఘాత , మూడు వేళ్ళను లెక్కించుట…చిటికెన వేలు, ఉంగరం వేలు, మధ్యవేలు ..తకధిమి
3. ఖండ జాతి : 5 అక్షరముల విలువ కలిగిన లఘువు, అనగా ఒక ఘాత 4 వేళ్ళను లెక్కించుట, చిటికెన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు, చూపుడు వేలు..తకతకిట
4. మిశ్ర జాతి : 7 అక్షరాల విలువ కలిగిన లఘువు. అనగా ఒక ఘాత, 6 వేళ్ళను లెక్కించడం..చిటికెన వేలు, ఉంగరం వేలు, మధ్యవేలు, చూపుడు వేలు, బొటన వేలు మళ్ళీ చిటికెన
వేలు …. తకధిమి తకిట .
5. సంకీర్ణ జాతి : 9 అక్షరముల విలువకల లఘువు. అనగా ఒక ఘాత, 8 వేళ్ళను లెక్కించడం. తకధిమి తక తకిట .
అక్షర కాలము : ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క స్వరమును పాడడం, తాళము యొక్క లఘువును వేళ్ళతో లెక్కించడం, ధృత, అనుద్రుతములను వేయుట.
తౌర్యత్రికము : గీతము, వాద్యము, నృత్యముల చేరికను తౌర్యత్రికము అంటారు.
ఆవర్తము : ఏదైనా ఒక తాళము లోని అంగము లన్నింటిని వేసి చూపించడాన్ని ఒక ఆవర్తము అందురు. ప్రతి అంగము తర్వాత ఒక గీత, మొత్తం ఆవర్తం అయిన తర్వాత
రెండు గీతలు వేయాలి . ఉదా: 1. ఆది తాళము …ఒక లఘువు 2 ద్రుతములు . లఘువు చతురశ్ర జాతి అయితే ఈ కింది విధముగా రాయాలి .
I 4 O O
స రి గ మ | ప ద | ని స ||
2. ఝంప తాళము : ఒక లఘువు, ఒక అనుద్రుతము, ఒక ద్రతము. లఘువు మిశ్రజాతి లఘువు అయితే ఈ కింది విధంగా రాయాలి.
I 7 U O
స రి గ స రి స రి | గ | మా ||
3. ఆట తాళము : రెండు లఘువులు , రెండు ద్రుతాలు , ఈ లఘువు ఖండ జాతి లఘువు అయితే , ఈ కింది విధముగా రాయాలి.
I 5 I 5 O O
స రీ గా | స రీ గా | మా | మా ||
**( సశేషం )**