సంగీత రంజని

సంగీత పాఠాలు

సేకరణ: డా.కోదాటి సాంబయ్య

(మూడవ భాగం)

ధాతువు : ఒక సంగీత రచన లోని స్వర భాగమును ధాతువు అంటారు. సంగీతం లో కొంత స్థాయికి చేరిన వారు ఈ ధాతువు సహాయంతో కొత్త రచనలను నేర్చుకోవచ్చు . దీనినే ఇంగ్లిషు లో నోటేషణ్ అంటారు.
ఉదా : వరవీణా – రూపక తాళం గీతం లోని ధాతువు. గ గ | పా పా || ద ప | సా సా ||
మాతువు : ఒక సంగీత రచన లోని సాహిత్య భాగమును మాతువు అంటారు .
ఉదా : వరవీణా రూపక తాళ గీతము లో మాతువు …..వ ర | వీ ణా || మృ దు | పా ణీ ||
ఇప్పుడు దాతు , మాతు లను కలిపి రాస్తే ఇలా ఉంటుంది.
గ గ | పా పా || ద ప | సా సా ||
వ ర | వీ ణా || మృ దు| పా ణీ ||
కాలము : 1. ప్రధమ కాలము : ఒక క్రియకు ఒక అక్షరం చొప్పున పాడడాన్ని ప్రధమ కాలము అంటారు ..ఉదా: స రి గ మ | ప ద | ని స || స ని ద ప | మ గ | రి స ||
2. ద్వితీయ కాలము : ఒక క్రియకు రెండు అక్షరములు చొప్పున పాడితే..ద్వితీయ కాలము ..ఉదా: స రి గ మ ప ద ని స | స ని ద ప | మ గ రి స ||
3. తృతీయ కాలము : ఒక క్రియకు నాలుగు అక్షరముల చొప్పున పాడితే. తృతీయ కాలము .

ఉదా : స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స | స రి గ మ ప ద ని స | స ని ద ప మ గ రి స ||
సంగీత రచన లలో ప్రధమ కాలము స్వరాలు మామూలుగా రాసి, రెండవ కాలమునకు స్వరాల మీద ఒక అడ్డుగీత, తృతీయ కాలమునకు స్వరాల మీద రెండు అడ్డు గీతలు పెడతారు.

ఆధార షడ్జం స ( నెమలి ) , దాని మీద పంచమ స్వరం పంచమం ప ( కోకిల ) , తారా షడ్జం నుండి కిందికి పంచమ స్వరం మధ్యమం మ (క్రౌంచ పక్షి )
ఈ మూడింటి సంకేత శబ్దాలు పక్షుల కూతలు…మిగిలిన స్వర సంకేతాలన్నీ జంతువుల అరుపులు.
అనంతమైన రాగ సంపదలో ఏ రాగం లోనైనా మధ్యమం గానీ పంచమం గానీ లేకుండా ఏ రాగం లేదు. ( హరికేసనల్లూర్ ముత్తయ్య భాగవతార్ మ ప లు లేకుండా నిరోష్ఠ అనే రాగం సృష్టించారు గానీ అది పెద్దగా ప్రచారం పొందలేదు.)
మధ్యమం అటు పూర్వంగ మైన స రి గ మ లకూ, ఇటు ఉత్తరాంగ మైన ప ద ని లకూ…ఇరుసు ( folcrum ) లాంటిది. అందుకే కర్నాటక సంగీతం లో మధ్యమం చాలా ముఖ్యమైన స్వరం. కేవలం ఈ ఒక్క స్వర బేధం చేత ( శుద్ధ లేక ప్రతి ) 36 రాగాలు 72 రాగాలుగా మారాయి , అంటే ద్విగుణీకృతము అయ్యాయి.

కర్నాటక సంగీతం : సంగీతమును ఒక సుందరమైన భవనము తో పోల్చితే రెండు ముఖ్యమైన భాగాలుగా చేయవచ్చు.
1. కల్పిత సంగీతం
2. మనోధర్మ సంగీతం

ఒక భవంతికి పునాది , పిల్లర్లు , గోడలు, ఎలాగో సంగీతానికి కల్పిత సంగీతం అలాంటిది. పునాదులు, పిల్లర్లు , గోడలు దాదాపు అన్ని భవనాలకూ ఒక్కలాగే ఉంటుంది. అంతర్గతంగా భవంతికి స్థిరత్వాన్ని ఇస్తుంది. కల్పిత సంగీతాన్ని సాహిత్యం లోని పద్యాలు, కవిత్వము, గణ , యతి ప్రాసలతో పోల్చవచ్చు. ఇందులో పంచ కావ్యాలు,
రామాయణ, భారత, పురాణాలు ఇతిహాసాలు ముఖ్యమైనవి. కొత్తగా కవి లేదా రచయిత కావాలనుకున్నవారు పై వాటిని క్షుణ్ణంగా నేర్చుకుని, తనదైనా బాణీలో కొత్త రచనలను చేస్తాడు. అలాగే సంగీతం లో కూడా పూర్వపు వాగ్గేయకారులు అనేక రచనలు చేశారు. సంగీతం నేర్చుకోవాలనుకునేవారు పై రచనలను నేర్చుకుని, బాగా సాధన చేస్తేనే తరువాత భాగమైన మనోధర్మ సంగీతం చేయగలరు.
ఒక భవనం కట్టిన తర్వాత దానికి వేయాల్సిన రంగులు, తలుపుల డిజైన్లు, లే అవుట్ డిజైన్ ఒక్కొక్కరు వారి వారి అబిరుచులను బట్టి తీర్చి దిద్దుకుంటారు. సాహిత్యం లో కూడా ఆశుకవిత్వం ఉంది. కవి అప్పటికప్పుడు యతి, ప్రాసలతో , చమత్కారముతో పద్యం అల్లుతాడు. అలాగే సంగీతం కూడా మనోధర్మ సంగీతం లో గాయకుడు కృతి అంతమందు గానీ మధ్యలో గానీ స్వర కల్పన అప్పటికప్పుడు తయారు చేసుకుని ఆయా రాగాలలో వచ్చే స్వరాలను త్రిశ్ర, చతురశ్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ సమూహాలతో తాలాను గుణంగా పాడతాడు. మనోధర్మ సంగీతం పాడాలంటే గాయకునికి రాగ లక్షణం, లయ జ్ఞానం సంపూర్ణంగా ఉండాలి. ఇది నిరంతర కఠోర సాధన వల్ల అలవడుతుంది.

కల్పిత సంగీతాన్ని మళ్ళీ రెండు ముఖ్యమైన భాగాలుగా విభజించారు. 1. అభ్యాస గానం ( టెక్నికల్ ఫా మ్స్ ) 2. ప్రదర్శనా గానం ( కచ్చేరి లో పాడదగినవి )
1. అభ్యాస గానం : 1. సరళీ, జంట, దాటు, మంద్ర, తారా స్థాయి వరసలు. 2. అలంకారములు సప్త తాళములలో 3. గీతములు 4. స్వరపల్లవి \ జతిస్వరము 5. వర్ణములు ఆది\ఆట.
2. ప్రదర్శనా గానం : 1. కీర్తనలు, కృతులు 2. పదములు 3. జావళీలు 4. తిల్లానాలు 5. అష్టపదులు 6. తరంగములు 7. రాగం-తానం-పల్లవి .
గీతము :- గాన కళాభ్యాసకులు సరళీ, జంట వరసలు, అలంకారములు నేర్చుకునేసరికి స్వరస్తానములు చక్కగా నిలిపి పాడడం మరియు తాళ జ్ఞానం వస్తుంది.
ఇప్పటి వరకు స్వరములు తప్ప సాహిత్యంతో పరిచయం ఉండదు. కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందర దాసు గారు ఎంతో ముందు చూపుతో సరళీ, జంట


వరసలు అలంకారములు , 15 వ మేళకర్త రాగమైన మాయా మాళవ గౌళ లో రచించారు.
మాయా మాళవ గౌళ రాగ విశిష్టత :
1. ఈ రాగములో మధ్యమ బెధములలో శ్రేష్టమైన శుద్ధ మధ్యమం ఉన్నది.
2. ప్రాచీన విద్వాంసులు నాశనము లేని శుద్ధ, వికృత స్వరములు గల రాగము మంగళకరం అయినది అని చెప్పారు. రామామాత్యుడు ( 1550 ) తన “స్వర మేళ కళానిధి ”
లో ప్రారంభ విద్యార్థులకు మాయా మాళవ గౌళ కు మించిన రాగం లేదు అని రాశాడు.
3. ఇందులో రిషభ, ధైవతములు తక్కువ ధ్వని గల శుద్ధ స్వరములు గానూ, గాంధార, నిశాధములు హెచ్చు ధ్వని గల వికృత స్వరములు గానూ ఉన్నాయి. అందువల్ల అభ్యాసకులకు రెండు రకముల స్వరముల పరిచయం కలుగుతుంది.
4. ద్వాదశ స్వర స్థానముల క్రమం ప్రకారం ఈ రాగములో షడ్జమం పక్కనే శుద్ధ రిశభము .. స రి ….అంతర గాంధారము పక్కనే శుద్ధ మధ్యమము …గ మ
పంచమము పక్కనే శుద్ధ దైవతము .. ప ధ …..కాకలి నిషాదము పక్కనే తారా షడ్జమము …ని స ….ఉండడం వల్ల ప్రారంభకులకు సులువుగా ఉంటుంది.
భవనం ఎక్కేప్పుడు ప్రతి పది మెట్లకు ఒకసారి నడవడానికి కొద్దిగా చప్టా వేస్తారు . దీనివల్ల ఎన్ని మెట్లెక్కినా సులభంగా అనాయాసంగా ఎక్కే వీలుంటుంది .
సరళీ, జంట, దాటు , అలంకారములు మాయామాళవ గౌళ రాగము లో రాసి తరువాత క్రమమైన గీతాలు మా. మా. గౌళ రాగ జన్యమైన మలహరి, సావేరి రాగాలలో శ్రీ పురందర దాసు గారు రచించి సంగీత ప్రపంచానికి ఎనలేని సేవ చేశారు.

మలహరి స్వరస్తానములు.

స . శు.రి ……..శు. మ …ప ….శు.ధై ……స ——-స ……. శు .ధై …ప ……శు.మ …..అం. గా ….శు.రి స
అరోహణం లో అన్నీ శుద్ధ ప్రక్రుతి స్వరములు..అవరోహణం లో మాత్రం ఒక్క వికృతి స్వరం అంతర గాంధారం ఉంటుంది. మెట్లు ఎక్కడం ( ఆరోహణం ) కొద్దిగా కష్టం,
మెట్లు దిగడం ( అవరోహణం ) తక్కువ కష్టం. అలాగే మలహరి ఆరోహణం లో చకచకా ఎక్కిపోవచ్చు, ఎందుకంటే రిషభ మధ్యమానికీ, మధ్యమం , ధైవతానికి , ధైవతానికీ తారా షడ్జమానికీ మధ్య కావలిసినంత విరామం ఉంది. ప్రారంభకులు తేలిగ్గా నేర్చుకోవడానికీ, పాడుకోవదానికీ సౌకర్యంగా ఉంటుంది. అలాగే మలహరి అవరోహణం లో ( మెట్లు దిగడం ) సహజంగానే తక్కువ కష్టం కాబట్టి మధ్యమం, రిషభం మధ్యలో అంతర గాంధారాన్ని తేలిగ్గా అధిగమించి పాడుకోవచ్చు. ఇలాగ నాలుగు గీతాలు మలహరి లో నేర్చుకుని, సావేరి గీతం వచ్చేవరకు ఆరోహణం లో మలహరి స్వరాలే ఉండి, అవరోహణం లో మాత్రం కాకలి నిషాధం అలవాటు అయ్యేట్టు గా రచించారు.

సావేరి రాగ స్వర స్థానములు:

స …శు.రి ……..శు. మ……ప…….శు.ధై ……స.———–స. కా.ని…….శు.ధై…ప….శు.మ …..అం.గా ….శు.రి…..స.
మాయా మాళవ గౌళ నుండి మలహరి, మలహరి నుండి సావేరి క్రమంగా నేర్చుకోవడం వల్ల వివిధ స్వర స్థానాలు వాటికి స్వరాక్షరములు నేర్చుకోవడం  సులభమవుతుంది. ఇలాంటి ఏర్పాటు, సాధన ప్రపంచం లొని ఏ సంగీత పద్ధతుల్లోనూ…చివరికి హిందుస్తానీ సంగీతం లో కూడా లేదు. ఇదే కర్నాటక సంగీతం యొక్క ఒక విశిష్టత .
సావేరి తర్వాత క్రమంగా మోహన, శంకరాభరణం, భైరవి , కల్యాణి, మొ.లైన గీతాలు నేర్చుకోవడం వల్ల దాదాపు అన్ని స్వర స్థానాలూ పరిచయం కలిగి విద్యార్థికి సంగీత పరిచయం కలుగుతుంది.

( సశేషం )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked