అప్పటి నిజాము రాష్త్రములో సగం ప్రాతం 8 తెలుగు జిల్లాలతో విస్తరించి వుండేది. అయిననూ, తెలుగు సాహిత్యానికి తగు ప్రాధాన్యమిచ్చే తెలుగు పత్రికలు లేకుండెను. బ్రిటిష్ ఇండియాలో ఇంగ్లీషు కల్తీలాగా, నిజాం రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వారి వాచకంలో కూడా ఉర్దూ సమ్మేళనం బాగా వినిపించేది. భాషయే గాక వేషధారణ యందు కూడా కల్తీ కనపడుచుండెను. సరైన ఆదరణ లేక ఆంధ్ర గ్రంథాలయములు మూసివేయబడుచుండెను. తెలుగు రైతుల పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుగా లేకుండేను. ఇలాంటి హేయమైన జీవనస్థితిని చూసి సురవరం ప్రతాపరెడ్డి గారి మనస్సు చలించిపోయేది.
పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ఉద్యమకారుడిగా ప్రజలలో రాజకీయ, సాంఘిక చైతన్యం తీసుకు రావటానికి నిరంతరం కృషి చేసారు సురవరం. హైద్రాబాదులోని రెడ్డి హాస్టలును తీర్చిదిద్దాడు. గోలకొండ పత్రికను స్థాపించి సంపాదకీయాల ద్వారా నిజాం రాజు నిరంకుశత్వాన్ని ప్రశ్నించాడు. తెలంగాణలో కవులే లేరన్న అవహేళనకు ధీటుగా జవాబు ఇస్తూ 354 మంది కవుల కవిత్వంతో గోలకొండ కవుల సంచికను తీసుకు వచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు.
అంటటి మహనీయుని, తెలంగాణా వైతాళికుని 124 వ జన్మదిన సందర్భంగా 124 మంది కవులతో ‘సురవరం మొగ్గలు ‘ అనే కవితా సంకలనాన్ని తయారుచేసారు డా. భీంపల్లి శ్రీకాంత్ గారు. మహబూబు నగర్ పాలమూరు సాహితి సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
ఈ పుస్తకంలోని కవితలు సురవరం చేసిన కృషిని, సాధించిన విజయాలను, అతని జీవనరేఖలోని ముఖ్యమైన మలుపులను గుర్తుచేసుకొంటూ శ్లాఘించారు. ప్రతి కవితా పుష్పం సురవరం జన్మదిన కానుకగా సమర్పించారు.
పుస్తకం పొందటానికి సంప్రదించ వలసిన ఈ-మెయిల్: srikanth.bheempally@gmail.com
*********