కథా భారతి

సురాపానం

-ఆర్. శర్మ దంతుర్తి

ఉపన్యాసం ముగించిన ఉరువేల కాశ్యపుడికి తన శిష్యులైన అయిదువందలమంది జటిలుల మొహాలలో ప్రతిబింబించే అసంతృప్తి కనబడుతూనే ఉంది. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. తనకీ తన తమ్ముడికీ ఉన్న శక్తుల గురించి ఈ శిష్యులకి తెలిసినా, తెరలు తెరలుగా వచ్చే బుద్ధుడి గురించి వినే వార్తలతో వీళ్ళకి తన మీద గౌరవం తగ్గుతున్నట్టే తెలుస్తోంది. తాను కొలిచేది అగ్నిదేవుణ్ణనీ, దానివల్లే కాలనాగుని లొంగదీసుకుని అగ్నిగృహంలో ఉంచగలిగాడనీ తెలిసినా మునుపు ఉన్న గౌరవం ఇప్పుడు లేనట్టుందే?
ఆలోచనల్లో ఉన్న కాశ్యపుడిని శిష్యుడు సాగత స్థవిరుడు అడుగుతున్నాడు, “తధాగతుడు ఇటువైపు వస్తున్నాడని వినిపించింది కదా ఎప్పుడండీ ఆయన వచ్చేది?”
ఉరువేల కాశ్యపుడికి లోపలనుంచి మాత్సర్యం తన్నుకువచ్చింది. ఇన్నేళ్లనుండీ తన దగ్గిరున్న ఈ శిష్యులకి తానంటే నమ్మకం పోతోంది అప్పుడే. ఒక్కసారి బుద్ధుడి గురించి విన్నారు ఎక్కడో, అప్పట్నుండీ, తధాగతుడు రావడం గురించి ఎదురుచూస్తున్నారు. ఎంత విచిత్రం? “ఆ వస్తాడులే, వచ్చాక మన అగ్ని గృహంలో ఉండే కాలనాగు కాటు తిని బతికి బట్ట కడితే అప్పుడు చూద్దాం.”
పై వారానికి తెలియనే తెలిసింది కాశ్యపుడికి. బుద్ధుడు తన వద్దకే వస్తున్నాడు మర్నాడే. కూడా వందలమంది శిష్యులని తీసుకొస్తాడు కాబోలు. వీళ్ళందరికీ భోజనం, వసతీ అవీ ఎవరు చూస్తారు? అయినా తాను పిలిచాడా ఏవిటి, వీళ్లకి చాకిరీ చేయడానికి? తనకేం పట్టనట్టూ ఊరుకున్నాడు కాశ్యపుడు. మర్నాడు సాయంత్రం అవుతుంటే బుద్ధుడు కాశ్యపుడి దగ్గిరకొచ్చాడు. ఒక్కడే; కూడా శిష్యులూ లేరు, మందీ మార్బలం ఏమీ లేదు. ఉపోద్ఘాతంగా నేను ఫలానా అని చెప్పుకోవడమూ లేదు. రాత్రికి ఇక్కడ ఆశ్రయం కుదురుతుందా అని మాత్రమే బుద్ధుడు అడిగినది.
బుద్ధుణ్ణి చూసిన ఉరవేల కాశ్యపుడుకి కలిగిన ఆశ్చర్యం ఇంతా అంతా కాదు. వచ్చిన మనిషి అతి మామూలుగా ఉన్నాడు. తనమీద ఏదో అధికారం చలాయిస్తాడేమో అనుకున్న కాశ్యపుడికి అటువంటిదేమీ కనిపించలేదు సరికదా బుద్ధుడి మాట అతి సౌమ్యంగా ఉంది. బిక్ష ఎత్తుతున్నట్టూ అడుగుతున్నాడు, రాత్రి పడుకోవడం కుదురుతుందేమో కనుక్కోవడానికి. బెట్టు చేయకుండా సమాధానం చెప్తే లోకువ అయిపోతాడు కనక నిర్లక్ష్యంగా చెప్పేడు, “ఆ కురుతుందిలే, భోజనం అదీ కుదరదు కానీ కాలనాగు ఉన్న అగ్ని గృహంలో తప్ప ఇంకెక్కడా ఖాళీ లేదు. నీ వంటి అర్భకుడు అక్కడకి వెళ్తే ఆ నాగు కాటుకి నిలువునా దహించుకుపోతాడు.”
“మీ కాలనాగు అందరినీ అలా కాటు వేస్తుంటే మీరు దాన్ని అదుపులో పెట్టలేదా?”
“నాకు నా తమ్ముడికీ తప్ప అది ఎవరికీ లొంగదు. మామాట విని నా శిష్యులు దానికేసి వెళ్లరు. అందువల్ల మేము తప్ప ఎవరు వెళ్ళినా చావడం తధ్యం.”
“నేను ఈ రోజు రాత్రి అక్కడ పడుకోవడానికి అనుమతి ఇస్తారా?”
“చావాలని ఉందా ఏవిటి? ఎందుకు ఏరికోరి ప్రాణం మీదకి తెచ్చుకుంటావు? మరో చోట చూసుకోరాదూ? మాకైతే ఆ నాగుని అదుపులో పెట్టే తపశ్శక్తులున్నాయి, నీలాంటి అర్భకుడు ఏం చేయగలడు?”
“నన్ను ఈ రాత్రి ఆ అగ్ని గృహంలోనే పడుకోనివ్వండి. రేపు మరోసారి మాట్లాడదాం.”
“నీ ఇష్టం, చెప్పాల్సింది చెప్పాను, చావాలని ఉంటే నీకు అడ్డం పడేది ఎవరు?” మనసులో లోపల ఒకింత సంతోషం కాశ్యపుడికి బుద్ధుడి పీడ తనకి వదుల్తుంది ఒక్క రాత్రితో.
***
మర్నాడు పొద్దున్నే ఆతృతంగా లేచి బుద్ధుడి చావు విందామనుకున్న కాశ్యపుడికి కనిపించిన దృశ్యం – బుద్ధుడు చేసే ప్రసంగం; అక్కడ దాన్ని అతి శ్రద్ధగా వింటున్న తన, తన తమ్ముడి మొత్తం వేయి మంది శిష్యులు. మతి పోయినట్టైన కాశ్యపుడు తన తమ్ముడి తో సహా వెళ్ళి బుద్ధుడి ప్రసంగం వినడం మొదలుపెట్టాడు. తనలో కలిగే మార్పు ఇప్పుడిద్దరికీ స్పష్టంగా తెలుస్తోంది. ఇందుకేనా ఎవరు బుద్ధుడి ప్రసంగం విన్నా వెంఠనే ఆయన శిష్యులయ్యేది?
మధ్యాన్నానికి కాబోలు వీలు దొరికాక బుద్ధుడి దగ్గిరకి వెళ్ళి అడిగాడు రాత్రి ఏమైందో అగ్ని గృహంలో కాలనాగు విషయం. అప్పుడు తెల్సిన విషయాల ప్రకారం, రాత్రి బుద్ధుడు అగ్ని గృహంలో ప్రవేశించగానే కాలనాగు బుస్సుమంటూ లేచించి కాటు వేయడానికి. దాన్ని కాసేపు అలా ఎగరనిచ్చి, బుద్ధుడు దాని కోరల్లో విషం తీసి తన భిక్షాపాత్రలోకి పిండుకున్నాడు. ఈ విషయం చెప్పి బుద్ధుడన్నాడు, “ఆ కాలనాగు ఇంక ఎవరినీ ఏమీ చేయదు. దాన్ని విడిచిపెట్టవచ్చు.” ఆ రోజు తర్వాత మరో మూడు రోజులు బుద్ధుడు ఉరువేల కాశ్యపుడి ఆశ్రమంలో ప్రసంగించాడు. నాలుగో రోజుకి కాశ్యపుడు, అతని తమ్ముడితో సహా వాళ్ళకున్న తలో ఐదు వందలమంది శిష్యులూ బుద్ధుడి శిష్యులైపోవడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.
ఈ వార్తలన్నీ వింటున్న పక్క రాజ్యంలో రాజు తథాగతుణ్ణి పిలవడానికి సేవకులని పంపాడు. ఉరువేల కాశ్యపుడికి ఉన్న పేరు బట్టి ఆయన మహా శక్తిమంతుడు. ఆయనని పిలవకుండా ఆయన దగ్గిర అతిధిగా ఉన్న బుద్ధుణ్ణి పిలుస్తే ఆయనకి కోపం రావచ్చు. రాజు మాత్రం బుద్ధుణ్ణి పిలవమన్నాడు కానీ కాశ్యపుణ్ణి కాదు. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక రాజుగారి సేవకులు బుర్రలు బద్దలుకొట్టుకుంటూ ఆశ్రమంలోకి వచ్చేసరికి గుమ్మంలోనే కనిపించాడు ఉరువేల కాశ్యపుడు. ఉన్న మాట దాచకుండా ఆయనతో చెప్పారు, బుద్ధుణ్ణి పిలవడానికి వచ్చామనీ, కోపం తెచ్చుకోకుండా ఆయనా, బుద్ధుడూ కూడా వస్తే మంచిదనీను.
ఏమీ సంకోచించకుండా కాశ్యపుడు చెప్పాడు, “బుద్ధుడు సూర్యుడైతే నేను మిణుగురు పురుగువంటివాడిని. ఆయనని తప్పకుండా తీసుకెళ్లండి, నేను కూడా వస్తాను కానీ వచ్చేది బుద్ధుడి అనుచరుడిగా మాత్రమే.”
అక్కడే ఉండి ఇదంతా విన్న సాగత స్థవిరుడు నవ్వుకున్నాడు తన గురువులో వారం రోజుల్లో కలిగిన మార్పుకి. వారం క్రితం తనకి ఈ కాశ్యపుడు గురువు. బుద్ధుడంటే మాత్సర్యం. ఇప్పుడో? అగ్ని గృహంలో నాగుని లొంగదీసి దాని కోరలు పీకి విషం పిండగానే ఈయన బుద్ధుడి కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధం! తాను కూడా ఈ నాగుల విషం పిండడం అనేటువంటి విద్యలు నేర్చుకుంటే బుద్ధుడిలాగా అవ్వొచ్చు. అప్పుడీ కాశ్యపుడే బుద్ధుణ్ణి వదిలేసి తన కాళ్లబేరానికి వస్తాడు.
***
మరునాడు బుద్ధుడు తనకూడా వచ్చే ఆశేష శిష్యులతో రాజు దగ్గిరకి వెళ్ళి ప్రసంగించాక సాగత స్థవిరుడి మనసు గ్రహించినవాడిలా అతన్ని దగ్గిరకి పిలిచి చెప్పాడు, “ధర్మం తెలుసుకునే మార్గంలో అష్ట అణిమా సిద్ధులు తగులుకుంటాయి. అలాగే తాను వదిలేసాను, పూర్తిగా విసర్జించాను అనుకున్న కోరికలు అనుకోని విపరీతమైన రీతుల్లో తారసపడతాయి. వాటిని వదులుకోలేనంతవరకూ ధర్మం తెలుసుకోవడం అసాధ్యం. అసలు ధర్మం తెలుసుకోవాలనుకునే వారికి ఈ క్షుద్రవిద్యలమీదా, అష్ట అణిమాసిద్ధులమీదా ఎటువంటి కోరికా, మనసూ ఉండకూడదు.”
బుద్ధుడు చెప్పినదంతా విన్నట్టు నటించిన సాగత స్థవిరుడు మనసులో నిర్ణయించుకున్నాడు, తాను తప్పకుండా ఈ సిద్ధులన్నీ సంపాదించవల్సినదే. స్థవిరుడు ఇలా మనసులో నిర్ణయించుకోవడం బుద్ధుడికి తెలియకపోతే కదా? ఓ సారి జాలిగా స్థవిరుడికేసి చూసి నిట్టూర్చాడు. పోనీ ఇదీ ఒకందుకు మంచిదే, ఓ సారి అటువంటి సిద్ధులు వశంలోకి వచ్చాక వాటిని ప్రయోగించి చూస్తాడు స్థవిరుడు. చేతులు కాలాక తన తప్పు తెల్సి వస్తుంది. అప్పటివరకూ తానేం చేయలేడు. ధర్మం తెలుసుకోవడంలో ఎవరి దారి వారిదే కదా?
***
పదహారేళ్ళు గడిచాయి. రోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఎదుగుతున్న సాగత స్థవిరుడి గురించి ఎప్పటికప్పుడు బుద్ధుడికి తెలుస్తూనే ఉంది. సిధ్ధులు ఒక్కొక్కటి సాధకుడికి ప్రకటనమయ్యేసరికి ఆ సిద్ధులని వాడుకోమంటూ కలిగే వ్యామోహం, కోరికలూ; వాటిని వాడుకున్నాక కలిగే పతనం మామూలే. వాటిని స్థవిరుడు అధిగమించగలడా అనేదే చూడాల్సిన విషయం. బుద్ధుడీ ఆలోచనల్లో ఉండగానే కబురొచ్చింది పక్క ఊరినుంచి. ఊరిలో ఉన్న ఆశ్రమంలో ఉన్న ఒకే ఒక మునిని ఓ కాలనాగు కరిచింది. ఆయన పోయాక ఈ ఆశ్రమంలో ఉన్న కుటీరాన్ని ఆక్రమించిన ఆ నాగు నోట్లోంచి అగ్ని జ్వాలలు వెదజల్లుతూ జనాలని భయభ్రాంతులని చేస్తోంది. ఒకప్పుడు ఇటువంటి నాగుకి కోరలు పిండి విషాన్ని భిక్షాపాత్రలోకి పిండుకున్న బుద్ధుడే ఈ నాగుని కూడా అదుపులో పెట్టగలడేమో? కాస్త వచ్చి సహాయం చేస్తారా అని అడగబోయేరు.
గ్రామస్తులు ఈ విషయం అంతా చెప్తున్నప్పుడు అక్కడే ఉన్న సాగత స్థవిరుడు బుద్ధుడు నోరు విప్పేలోపునే చెప్పేడు, “నేను వెళ్ళి ఆ నాగుని అదుపులో పెట్టగలను భగవాన్, నన్ను పంపించండి.”
భగవానుడు తనలో నవ్వుకుని చెప్పాడు, “తప్పకుండా వెళ్ళు. అయితే ఈ ప్రయత్నం ప్రజాసంక్షేమం కోసం అని మర్చిపోవద్దు. ఆ నాగు నిన్నేమీ చేయలేకపోవచ్చు కానీ, నీ కోరికలూ, మనసులో కలిగే గర్వం అనే లక్షణాలే నిన్ను ధర్మ మార్గం లోంచి కిందకి తోయడానికి ప్రయత్నం చేస్తాయి. కాలనాగుని జయించడం కన్నా నీ మనసు జయించడం అత్యంత కష్టం అనేది మర్చిపోవద్దు సుమా?”
మర్నాడే గ్రామస్తులతో స్థవిరుడు బయల్దేరాడు. మనసులో ఆలోచన ఏమిటంటే, తనకి సిద్ధించిన శక్తులతో ఈ నాగు తనని ఏమీ చేయలేదు. ఈ విషపు నాగు కోరలని తీసి దాన్ని వానపాముగా మార్చకపోతే తనపేరు స్థవిరుడే కాదు. గ్రామం చేరిన స్థవిరుడు నేరుగా కాలనాగు ఉన్న ఆశ్రమంలో కుటీరానికి చేరాడు.
బుస్సుమంటూ మీదకొచ్చిన నాగుని అంతదూరంలోనే ఉంచ గలిగే సరికి అది నోరు విప్పి అగ్ని జ్వాలలు వెదజల్లడం మొదలుపెట్టింది. ఆ మాత్రం తాను చేయలేడా? స్థవిరుడు కూడా నోట్లోంచి అగ్ని జ్వాలలు కురిపించాక కాసేపు అటూ ఇటూ తనదే పై చేయి అవడం కోసం వింత వింత మాయలు. పావుగంట గడిచాక స్థవిరుడు లేచి కాలనాగుని కాలితో అదిమిపెట్టి కోరల్లో విషాన్ని పిండి వదిలిపెట్టాడు. ఇప్పుడీ నాగు వానపాము, ఎవరినీ ఏమీ చేయదు.
బయటకి వచ్చి గ్రామస్థులతో చెప్పాడు తాను చేసిన పని. వాళ్ల సంతోషానికి అంతు లేదు. ఆ రోజు రాత్రికి స్థవిరుడికీ అతని కూడా వచ్చిన మిగతా బుద్ధుడి శిష్యులకీ విందు ఏర్పాటు చేయబడింది.
గ్రామస్థులు అడిగారు, “మీరు చేసిన సహాయం మరువలేనిది. మీరెప్పుడూ జనపదాల్లో ఉండకుండా వేరేగా ఉంటూ సాధన చేస్తూ ఉంటారు కనక మీకు కావాల్సినవి దొరకక పోవచ్చు. విందులో తినడానికీ తాగడానికీ ఏవైనా కావాలిస్తే చెప్పండి. తప్పకుండా మీకు అందిస్తాం. మా ఊర్లో తయారుచేసే ద్రాక్షసారా కూడా చాలా రుచికరమైనది. ఎంతకావాలిస్తే అంత మీకు ఇవ్వగలం.”
స్థివిరుడు ఏమీ మాట్లాడకపోవడం చూసి పక్కనున్న బుద్దుడి మరో శిష్యుడు చెప్పాడు, “మీ ఇష్టం వచ్చినది ఇవ్వండి కానీ ఏదీ అతిగా ఉండడం మంచిది కాదని తథాగతుల మాట. అందువల్ల అతిగా ఏదీ చేయవద్దు.”
“రోజూ తాగడం మంచిది కాదు కానీ, ఈ ఒక్కసారి మా అతిధ్యంలో సారా వద్దనకండి. అసలే ఇది మా ఊరి ప్రత్యేక విందు మీకు. మీరు రోజూ తాగరు కదా? ఒక్కసారి తాగితే ఏమీ కాదు.”
కాలనాగు విషయంలో దాని కోరలు తీసి తాను ఒకప్పుడు బుద్ధుడు చేసినట్టే చేయగలిగాడు. అందువల్ల తాను బుద్దుడి లాంటివాడే కదా? ఈ విషయం మనసులో అనిపించగానే స్థవిరుడు తన మనసులో అంతర్గతంగా కలిగే ఆలోచనలు పట్టించుకోకుండా చెప్పేడు, “అలాగే, మీ ద్రాక్షసారాయి రుచి చూస్తాం. కాలనాగు విషం అంతటిదే నన్నేం చేయలేకపోయింది, ఈ సారా ఏం చేయగలదు?”
రాత్రి పొద్దుపోయేదాకా గ్రామస్థులు పెట్టినది తింటూ, ద్రాక్షసారా తాగుతూనే ఉన్నాడు స్థవిరుడు. పదేసి నిముషాలకోసారి ఎవరో రావడం, నాగు విషం తీసినందుకు అభినందించడం జరుగుతూ ఉంటే మనసులో తానెంత గొప్పవాడో అనిపించడం, గర్వం తలెత్తుతూండడం కళ్ళు నెత్తిమీదకి రావడం, దానితో మరింత సారా తాగడం తెలియకుండా జరుగుతున్నాయి స్థవిరుడికి. దాదాపు అర్ధరాత్రి కావొస్తుంటే కాబోలు, వంటిమీద స్పృహ తప్పింది స్థవిరుడికి.
విందు చాలించి అందరూ వెనక్కి వెళ్తుంటే వీధిలో వళ్ళు తెలియకుండా పడి ఉన్న సాగత స్థవిరుణ్ణి మోసుకుంటూ మిగతా శిష్యులు బుద్ధుడి దగ్గిరకి బయల్దేరారు. తాను నడవలేకపోయినా, మైకంలో ఉన్న తనని మోసుకెళ్తున్నందుకు స్థవిరుడి ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. ఇలా వీళ్ళు తనని మోయడానిక్కారణం, తాను బుద్ధుడి అంతటి గొప్పవాడు. కాలనాగు విషం తీసి పిండి దాన్ని వానపాముగా మార్చాడు. తాను నడవగలడు కానీ తన గొప్పదనం వల్ల వీళ్ళు తనని మోస్తున్నారు. మైకం ఉన్నది తనకి కాదు.
రాత్రి అయినా ఇంకా మేలుకుని శిష్యులు రావడం కోసమే చూస్తున్నట్టున్నాడు బుద్ధుడు. శిష్యులు స్థవిరుణ్ణి దింపి నించోపెడదామనుకునే లోపులే మైకంలో ఉన్న స్థవిరుడు నించోలేక నేలమీద పడ్డాడు. నోట్లోంచి ఏదో నురగలాంటిది వస్తున్నట్టుంది; దాని వాసనా, ద్రాక్షసారాయి వాసనలతో స్థవిరుడి సంగతి ఏమైందో అందరికీ చెప్పకుండానే అర్ధమౌతోంది. కింద పడిన స్థవిరుణ్ణి లేపి, అతని తల ఆసనం మీద కూర్చున్న బుద్ధుడి వైపు ఉండేటట్టూ పడుకోబెట్టారు శిష్యులు. ఒక్కసారి స్థవిరుడు కళ్ళు విప్పి, చుట్టూరా నేలమీద దొర్లుతూ కాళ్ళు బుద్ధుడి వైపు ఉండేలాగ తిరిగాడు. తాను నిలకడగా నేలమీద నించోలేడు కానీ తన కాళ్ళు తల ఎటు ఉండాలో నిర్ణయించుకోగలగుతున్నాడు. బుద్ధుడు ఏ అణిమా సిద్ధులైతే వద్దని చెప్పాడో వాటిని సాధించాక తాను బుద్ధుడంత గొప్పవాడని అనుకుంటున్నాడు కాబోలు, కాళ్ళు బుద్ధుడికేసి పెట్టి తన గర్వం చూపించబోతున్నాడు. మరోసారి శిష్యులు స్థవిరుణ్ణి లేపి అతని తల బుద్ధుడికేసి ఉండేలాగ పడుకోబెట్టబోతూంటే తథాగతుడు వారించాడు.
కిందన పడి ఉన్న స్థవిరుణ్ణి చూసి మిగిలిన సాధకులతో అన్నాడు బుద్ధుడు, “కాలనాగు కోరల్లోంచి విషం తీసి దాన్ని వానపాముగా మార్చిన వారెవరు?”
“సాగత స్థవిరుడు.”
“ఈ స్థవిరుడు ఇప్పుడు మరో నాగు వస్తే దాని విషం తీయగలడా?”
“తన కాళ్లమీద నించోలోని స్థవిరుడు వానపాముని కూడా ఏమీ చేయలేడు.”
“దీనికి కారణం ఏమిటో అర్థమైందా?”
“తాను చేసిన పని వల్ల గర్వం, ద్రాక్ష సారా, దానివల్ల వచ్చే మదం, అహంకారం.”
“చూసారు కదా? కాలు నాగుని జయించడం అనేది అతి చిన్న విషయం. తన మనసులో ఉన్న చెడు లక్షణాలు అధిగమించి ధర్మాన్ని చేరుకోవడం అతి కష్టమైనది. అతి జాగ్రత్తగా మన మనసుని ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ ఉండకపోతే ఎన్నటికీ ధర్మాన్ని చేరుకోలేము. మనం కిందకి పతనమయ్యే పరిస్థితులకి ఆజ్యం పోసేవి సారా, సురాపానం అనే విషయాలు. ఇప్పుడు స్థవిరుడు ప్రాణం ఉండీ నేలమీద జీవఛ్ఛవంలా పడి ఉండడానిక్కారణం సురాపానం, దానివల్ల మనసులో జనించే వ్యర్ధమైన గర్వమూను. ఇదే తెలుసుకోవల్సిన విషయం. సురాపానం, మత్తు పదార్ధాలు త్యజించండి. కోరికలు విడనాడండి. ధర్మం ఒక్కటే జీవితంలో తెలుసుకోతగ్గది. దాన్ని తెలుసుకునే దారిలో మన కూడా వెంబడించే అష్ట అణిమా సిద్ధులు క్షుద్ర విద్యలకంటే నీచమైనవి. ఈ రోజునుండీ బౌద్ధ భిక్షువులందరూ సురాపానం నిషేధించండి. ఏనాటికీ స్థవిరుడి పరిస్థితులల్లో పడవద్దు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked