వీక్షణం

వీక్షణం – సాహితీ గవాక్షం – బే ఏరియా వీక్షణం సాహితీ సమావేశం- 54

నాగరాజు రామస్వామి


వీక్షణం 54వ సమావేశం ఫిబ్రవరి 12, 2017 నాడు శ్రీ చుక్కా శ్రీనివాస్ గారి స్వగృహమున జరిగింది. ఈ సమావేశమునకు శ్రీ పిల్లలమఱ్ఱి శ్రీ కృష్ణ కుమార్ గారు అధ్యక్షత వహించారు.

మొదటి వక్త శ్రీ ఉప్పలూరి విజయ కుమార్ గారు. వారు గత 40 సంవత్సరాలుగా పలు కథలు, నవలలు వ్రాసానని తెలిపి, 30 సంవత్సరాల క్రితం పల్లకీ పత్రికలో ప్రచురితమైన తమ కథ “లోపలి మనిషి” అనే కథను చదివారు. అంటరానితనమును ప్రశ్నిస్తూఒక వ్యక్తి తనలో అంతర్గతంగా ఉన్న అంటరానితనాన్ని ప్రశ్నించుకునే ఈ కథ అందరినీ ఆకట్టుకుంది.

తరువాతి కార్యక్రమం శ్రీ నాగరాజు రామస్వామి గారి రవీంద్రుడి గీతాంజలికి తెలుగు అనువాదం “గీతాంజలి” పుస్తకావిష్కరణ.

మొదటి సమీక్షకులు శ్రీ వేణు ఆసూరి గారు. వారి ప్రసంగ విశేషములు “ఈ గీతాంజలి చదువుతున్నప్పుడు నేను మూలాన్ని కాని, మరో అనువాదాన్ని కాని ప్రక్కన పెట్టుకుని పోల్చి చూడలేదు. నాగస్వామిగారి రచనను ఒక సరికొత్త రచనగానే చదివి ఆనందించడం జరిగింది. వారి గీతాంజలిని చదువుతున్నప్పుడు నన్ను ఎంతో ఆకట్టుకున్న కొన్ని విషయాలు:

– వారి రచన ఒక ప్రవాహంలా, అందమైన నడకతో సాగుతుంది.

– గీతాంజలి వంటి రచన ఎంతో లోతైన తాత్విక దృష్టితో పాటు, స్వచ్ఛమైన ఆత్మ సౌందర్యాన్ని మనస్సులో దర్శించి, ఆరాధించి, అనుభవించిన వారికే సాధ్యం. ఇక్కడ లోతైన తాత్విక దృష్టి అంటే విషయాన్ని మరింత జటిలంగా చూపడం కాదు – మనస్సుకుండే పొరలను దూదిపింజల్లాగా విడగొట్టి నిజమైన ఆత్మ సౌందర్యాన్ని, పరమాత్మ స్వరూపాన్ని అవగాహన చేసుకోవడం. ఠాగోర్ నిజానికి ఒక మహర్షి – కనుక దర్శించగలిగాడు, ఒక మహాకవి – కనుక అంత అందంగా మనకందించగలిగాడు.

సృష్టికర్తను అల్లుకున్న అపురూప ప్రేమ, అనంత సౌందర్య పిపాస, అతిలోక భావుకత, ఉపనిషద్ స్పర్శ, భారతీయ మూల సంస్కృతి, విశ్వజనీన ప్రేమ, శాంతికొరకు పరితపించే మానసిక ప్రవృత్తి, మానవత్వంపై వల్లమాలిన నమ్మకం – అంటారు ముందుమాటలో లంకా శివప్రసాద్ గారు.

నాగరాజు రామస్వామి గారి గీతాంజలిని చదువుతున్నప్పుడు, ఒక అనువాద రచనను చదువుతున్నామన్న ఆలోచన ఉండదు – కారణం, నాగరాజుగారు రవీంద్రుడి గీతాంజలిని ప్రేమించి, అనుభవించి, మైమరచి రాసారు కనుక. వారి రచనలలో మనకు కనిపించే సహజ గుణం అది. ఉదాహరణకు వారు కీట్సు కవితలను వ్రాసిన (ఈ పుడమి కవిత్వం ఆగదు) కారణం అదే. కీట్సైనా, ఠాగోర్ అయినా, వారి రచనలతో ప్రేమలో పడి, ఆనందంలో ఓలలాడి, మైమరచి, ఆ తరువాత సొంత గొంతుతో (సొంత భాషలో) ఆలపిస్తారు. మచ్చుకి పుస్తకంలోని కొన్ని కవితలని వినిపిస్తాను. కవిత వింటున్నప్పుడు, మీకు ఆహా అనిపిస్తే ఆ మెచ్చుకోలునంతా నాగరాజుగారి ఖాతా లోనే వెయ్యండి. ఒక అందమైన పోతన భాగవత పద్యం విన్నప్పుడు మనం ఆహా పోతన పద్యం అనుకుంటామే గాని, ప్రతిసారీ వ్యాసుడికి అందులో భాగం పంచడం జరుగదు. అంటే మూలం వ్యాసుడు రాసాడని మనకు తెలియక కాదు, అంత లోతు భావాన్ని అంత అందంగా చెప్పిన పోతన కవిత్వానికి మనం పరవిశిస్తాం. భావాన్ని తెలుసుకుని, మళ్లీ మళ్లీ ఆ భావాన్ని అంత అందంగ ఆవిష్కరించిన పద్యాలని చదువుకుని ఆనందిస్తాం.

పోతన పద్యాలని మెచ్చుకున్నప్పుడల్లా, పరోక్షంగా వ్యాసుడికి మన అభివాదాలు అందజేసినట్లే! ఎందుకంటే ఆ క్షణంలో పోతన, వ్యాసుడు ఒక్కరే! అలాగే ఈ కవితలను మనం ఆస్వాదించి ఆనందిస్తున్న క్షణాలలో, నాగరాజు రామస్వామి గారే రవీంద్రనాథ్ టాగోర్. అలా అనుకోకపోతే రసాస్వాదనకు భంగం కలుగుతుంది కూడా.

నిజానికి, ఈ పుస్తకానికి పూర్తి న్యాయం చెయ్యాలంటే నేను మరింత సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది. మొదట నాగరాజు రామస్వామి నన్ను ఈ పరిచయ వాక్యాలు చెప్పమన్నప్పుడు నేను కొంత వెనుకాడాను, ప్రస్తుతం నాకున్న పనుల మధ్య చెయ్యగలనో లేదో అని. నేను పుస్తకానికి న్యాయం చెయ్యలేక పోయినా, పుస్తకం సమీక్షించడం వల్ల నాకు మళ్లీ గీతాంజలి వైపు మనసు మళ్లింది. నన్ను నేను సంస్కరించుకోవడానికి మరో అవకాశం దొరికింది. దానికి నాగరాజు రామస్వామికి గారికి నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు. ఇంత మంచి పుస్తకం పాఠకులకి అందించినందుకు మన:పూర్వక అభినందనలు, ధన్యవాదాలు.”

ఆ తరువాతి సమీక్షకులు శ్రీ కిరణ్ ప్రభ గారు. వారి ప్రసంగ విశేషములు – “అనువాదం చాలా కష్టం, కవి వ్రాసినది అన్వయించుకునే విధానం అనువాదం. రామస్వామి గారి గీతంజలి అనువాదం మాత్రం ఒక రంగు రంగుల పూలతోట, రంగుల సముద్రం. ఎక్కడా కష్ట పడినట్టు కనిపించదు. అలవోకగా వ్రాసినట్లుంటుంది. నాగరాజు గారు చేసిన చక్కని అనువాదానికి ఉదాహరణలు “స్వాభిమానం సగర్వంగా ఎక్కడ తలెత్తుకు తిరుగుతుందో” “ఏకాంత నిర్జన నది ఏటవాలు తీరాన నా వంటి ఇంటి చీకటి” మొదలైనవి. చలం చేసిన అనువాదానికి నాగరాజు గారి అనువాదానికి ఎక్కడా పోలిక లేదు. రవీంద్రుని గీతాంజలి ఒక ప్రేమ కావ్యం. అందులో ప్రభూ అనే పదాన్ని తీసివేసి, ప్రియ అనే పదం వాడితే ప్రేమ కావ్యం అవుతుంది. ఒక ఉదాహరణ, చాలా కాలం క్రితం ఈ విషయం ఒక కాష్మీరీ కుర్రవాడికి చెపితే నా దగ్గర ఉన్న గీతాంజలిని బదులు తీసుకు వెళ్లాడు. ఆరు నెల్లల తరువాత సంతోషంగా తిరిగి ఇచ్చేశాడు. కారణం అడిగితే, మీరు చెప్పినట్టే గీతాంజలిలో ఒకొక్క గీతానికి ప్రభూ బదులు ప్రియా అని మార్చి ఒక అమ్మాయికి పంపించాను, ఆ అమ్మాయి ఇప్పుడు నన్ను పెళ్లి చేసు కుంటానంటున్నది, ఇక పుస్తకం అవసరం లేదు అని చెప్పాడు. అంత అందమైనది గీతాంజలి. అంతే అందమైనది నాగరాజుగారి అనువాదం: ఆ తరువాత శ్రీ నాగరాజు రామస్వామి గారు తన పుస్తకం గురించి ప్రసంగిస్తూ తెలిపిన విషయాలు: ” గీతాంజలి అనువాదానికి నన్ను ప్రత్యేకంగా పురికొల్పిన వ్యక్తులంటూ ఎవరూ లేరు. వందకు పైగా అనువాదాలు వచ్చాయని విన్నానే కాని ఏదీ చదువలేదు. ఆ రోజుల్లో పాతికేళ్ళ పాటు ప్రవాస జీవితం గడిపాను కనుక అవి నా కంట పడలేదు. ఏళ్ల క్రితం నేను చదివిన రవీంద్రుని విశ్వజనీన సాహిత్యం, నేను శాంతినికేతన్ లో గడిపిన స్వల్పకాలిక స్మృతులు గీతాంజలి అనువాదానికి నన్ను ఉత్తేజ పరిచాయనవచ్చు. నా చిన్ననాట చదివిన కొంగర జగ్గయ్య గారి గీతాంజలి ఙ్ఞాపకాలు, రవీంద్రున్ని తలపించే కృష్ణశాస్త్రి కవిత్వం, నాకు నచ్చిన రవీంద్ర సంగీత్ గురుదేవునికి నేను ఇవ్వాల్సిన నివాళిని గుర్తు చేశాయి. మిత్రులు వద్దన్నా వినలేదు నా ఎద లోపలి ఎడద. తేటగీతి పద్యం పాటకు చేరువలోఉంటుందని కొన్నిరవీంద్ర గీతాలను తేటగీతులలో గతంలోఅనువదించినా, ప్రస్తుత సంకలనానికి నాకు ఇష్టమైన వచన కవితా ప్రక్రియనే ఎన్నుకున్నాను; ఇప్పుడు వీస్తున్నగాలి వచన కవిత్వం మరి. రవీంద్రుని ఆంగ్ల రచన గీతాంజలి పాటలా సాగిన కవితాత్మక వచనం. అది ఆతని అంతస్సుల నుండి నిసర్గ సుందరంగా, కవన మధురంగా పెల్లుబికిన ఆత్మనివేదన. నివేదనను వెన్నంటి అంతర్లీనంగా ప్రవహించింది పాట. అపూర్వ రసానుభవం ఆతని అలతి అలతి వాక్యాలలో అనుభూతి కవిత్వమై జాలువారింది. అందుకే ఇన్ని అనువాదాలు. నా అనువదించిన కవితలన్నీ నాకు అత్యంత ప్రియమైనవే. నా అనువాదం అలవోకగానే సాగిందనాలి. ‘where the mind is without fear’ అనేక కవులు అనువదించిన కవిత కనుక, అనేకసార్లు సవరించాను. నిజానికి అది నేరుగా సాగిన దేశభక్తి గీతం. తాత్విక క్లిష్టత లేని సరళ గీతం. అందరికీ తెలిసిన కవిత కనుక ఖండన మండనాలకు ఆస్కారం ఎక్కువ. అందుకే అత్యంత జాగరూకతతో తెనుగించాను. నా దృష్టిలో విశిష్ట మైన ఒక గీతాన్ని తీసుకుని, అది ఎందుకు నాకు ప్రియమైనదో తెలుప మన్నారు మిత్రులు వికాస్. అందుకు నేను ఎంచుకున్న కవిత 53 – “ఎంత అందంగా ఉంది / రవ్వలతో, రంగురంగుల రత్నాలతో/ నైపుణ్య యుక్తియుక్తంగా చెక్కబడిన నీ నక్షత్ర కర కంకణం!”. ఈ కవితలోని విశిష్టత, నా దృష్టిలో, మిగతా కవితలకు భిన్నమైన నిగూఢ తాత్వికత. పరమాత్మున్ని ఒక గంభీర సుర సుందర మూర్తిగా అలంకరించుకొని, నేరుగా స్తుతించకుండా, ఆతని నక్షత్ర ఖచిత కరకంకణాన్ని, ఆతని వజ్రాయుధాన్ని వర్ణించాడు రవీంద్రుడు. వర్ణనలో నక్షత్ర మండలాలు జ్వలించాయి, మహోగ్ర పర్జన్య గర్జనలు వినిపించాయి. పైగా పసిడి కంకణం కన్నా నిశిత ఖడ్గమే ఉత్కృష్ట మైనదని తేల్చాడు. కంకణం వైభవానికి, కటారు మృత్యువుకు ప్రతీకలు. రవీంద్రునికి మృత్యువుపై ఆరాధనా భావం ఉంది. ఆతని అనేక రచనలలో ఆ భావం అంతర్లీనంగా ప్రవహిస్తుంటుంది. ఆ కవితలో అంతటి తాత్వికలోతులు ఉన్నాయని నేను భావించి నందునే నా అనువాదంలో కొంత శబ్ద గాంభీర్యం చోటు చేసుకుంది. నా ఈ పుస్తకాన్ని దయతో ఆవిష్కరించిన కవి పండితులు శ్రీచరణ్ గారికి, ఆప్త వాక్యాలతో అలరించిన ఆత్మీయులు కిరణ్ ప్రభ గారికి, అద్భుతంగా విశ్లేషించి కీలకోపన్యాసం చేసిన వేణు ఆసూరి గారికి, సహృదయ సంధాన కర్త గీతామాధవి గారికి, శ్రేయోభిలాషి గంగిశెట్టి గారికి, తొలినాళ్ళ నుండి నన్ను నన్ను గుండెలకు హత్తుకుంటూ వసున్న’ వీక్షణానికి’, మిత్రులందరికీ ఇవే నా ధన్య వాదాలు.”

ఆ తరువాతి కార్యక్రమం కిరణ్ ప్రభ గారి క్విజ్. ఆయన శ్రోతలకు తెలియకుండానే పాఠాలు చెపుతారు. క్విజ్ కార్యక్రమం వీక్షణం సభ్యులకు తెలియకుండానే పెట్టే పరీక్ష. సభ్యులు ఉత్సాహంగా పరీక్ష కోసం ఎదురుచూచి, పరీక్ష తప్పుతామని తెలిసికూడా పాల్గొనే కార్యక్రమం ఈ క్విజ్. ఒక ఉదాహరణ ప్రశ్న “మాయా రంభ నలకూబర సంవాదం, ఏ పుస్తకంలోనిది”. ఈ సమీక్ష మీరు పొరపాటున చదివితే, ఈ ప్రశ్నకు సమాధానం మీకు ఉచితం. “కళాపూర్ణోదయం”.

తరువాతి కార్యక్రమం కవి సమ్మేళనం. చదివిన కవితలు:

1. గీతా మాధవి – జానపద గీతం, వారి స్వరచన, వారి స్వర రచన, వారి స్వరములోనే అందముగా వినిపించారు. “తూరుపొంక గోడవంక”

2. శ్రీ చరణ్ గారు – రథ సప్తమి సందర్భంగా సూర్య భగవనుడి మీద వ్రాసిన పద్యం “ఎందుకింత మండి పోతున్నాడు”

3. విద్యార్థి – అమెరికా వచ్చి, అమెరికాకు పిల్లలని పంపుతూ, అమెరికాను తూలనాడే తెలుగు పెద్దలని నిలదీస్తూ “ఏమేరకు”

4. ఉదయ లక్ష్మి గారు – “తెలుగింటి తియ్యదనాల పిలుపులు”

5. సాయి బాబా గారి సతీమణి శ్రీమతి లక్ష్మి – “నరుడా, నీవే శివుడవు”

6. సాయి బాబా గారు – “మా సవతి తల్లికి మల్లె పూదండ, మము పెంచు తల్లికి ఫ్లవర్ బుకేలు”.

తరువాత శ్రీ లెనిన్ కవిత్వంలో ఆత్మ పరిశీలనను గురించి సూక్షంగా ప్రసంగించగా, శ్రీ చుక్కా శ్రీనివాస్ ఆశు కవిత లా “ఆశు కథ” ప్రయోగం ఎందుకు చేయకూడదు? అంటూ తన మనసులో అప్పటికప్పుడు రూపుదిద్దుకున్న కథ కొంత భాగాన్ని వినిపించారు.
చివరగా ఆసక్తికరమైన చర్చలతో సభ విజయవంతంగా ముగిసింది.
——

Leave a Reply

Your email address will not be published. Required fields are marked