పద్యం-హృద్యం

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:

సమస్య: బాంబుల వలనే దేశము బాగుపడును

గతమాసం ప్రశ్న:
దత్తపది: వంగ, దోస, కాకర, కంద పదములను అన్యార్ధములతో వాడుతూ భారతదేశ స్వాతంత్ర్య సమరానికి సంభందించిన విషయముపై స్వేచ్ఛా ఛందస్సులో పద్యము వ్రాయాలి

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ
తే.గీ||
ఊహ కందని రీతిగ సాహ సించి
దోస మెరుగక గాంధీజి రోస మనక
గొడ్డు కాకర వంటిఈ చెడ్డ దొరల
చెఱను విడిపించి గెలువంగ వరమ టంచు
పోచిరాజు కామేశ్వర రావు, రాయిపూర్
కం||
దోసపుఁ బరిపాలనఁ గన
వేసరి కావంగ జనుల వేగము దేశా
వాసుల కాకర మొదవఁగఁ
జేసిరి మన కంద ఫలము స్థిరమతిఁ గృషియే
[దేశ+ఆవాసులకు+ఆకరము+ఒదవఁగ; ఆకరము = కోపము]
సహస్రకవిరత్న సహస్రకవిభూషణ విద్వాన్ శ్రీమతి జి సందిత  బెంగుళూరు
సీ౹౹
కురువంగ తూటాలు మరతుపాకులనుండి, ఝళిపించె మనకత్తి ఝాన్సిలక్ష్మి
దోసపుశాసనాల్ దూసేటి సభ పైన, బాంబులగురిపించె భగదజాదు
లెక్కకందక తా ‌నిలిపె పెను సైన్యాన్ని, జడవన్ పరుల్ సుభాష్చంద్రబోసు
కాక రగిల్చి నిగ్రహముల ద్రుల్చుచు, ధైర్యబలంబుల తరుగ జేసి
ఆ.వె౹|
తల్లడిల్లజేసె  తెల్లదొరలనట్లు
భరతపౌరుషాలు పట్టు బట్టి !!
సమరమట్లు జరిగె  స్వాతంత్ర్య సిద్ధికై
చరితయందు నిలిచె శాశ్వతముగ!!
సూర్యకుమారి వారణాశి, మచిలీపట్నం
సీ||
ఆంగ్లేయ  పాలనకాకర మగునెడ, ప్రతిఘటించ ప్రజలు   ప్రతిన బూనె
అంగవంగ మఖిల దేశమ్మునా, స్వాతంత్ర్య సమరమ్ము  సాగెనపుడు
సత్యాగ్రహమ్మ హింసా మార్గమును గాంథి, దో సము  కాదంచు దోహద మిడె
వారికందరికిని భారతమాతయే, విజయలబ్ధి ని డ దీ వించె నంత
ఆ.వె||
ఆంగ్ల పాలనమ్ము నణ గ  ద్రొక్కంగ ను
భారతావని కది భారమైన
సాధనమున పొంద స్వాతంత్ర్య దేశమ్ము
భారతీయ ప్రతిభ కారణమ్ము !
అయినాపురపు శ్రీనివాసరావు, సెయింట్ లూయిస్, మిస్సోరి.
ఆ.వె||
వంగ రాష్ట్రమందు వరమై జాతికి గీతం
హింస దోస మనెను హితుడు గాంధి
రుధిర బాట కాక రణము సాగెను నాడు
వచ్చెనీ శకం దవదవానలమ్ముగ!
భైరవభట్ల శివరాం, కొక్కిరాపల్లి , విశాఖ
తే.గీ||
గట్టి పడుచు గాంధీరవం గణుతికెక్క
దండు నెంతమందో సమిధలగు చుండ
రండనే బోస్ పిలుపు కాక రణము పెంచ
తలపు పండగ నవశకం దనరు  చుండె
విజయాదిత్య, విజయనగరం
తే.గీ||
పరపరిష్వంగదుఃఖిత భరతభూమి
పిలిచి నట్లెదో సడి వినిపించగా ‘ప
దండి దండి’ కని  మయికందళములెత్త
శాంతి సైనికాకరములు  శరధులయ్యె
పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా
కం||
మాటలు కాక రణమ్నున
తూటాలేసెఁ గెలువంగ దోసపు దొరలన్
మాటుండి వారి కందక
ఆటల నాడించెఁ మన అల్లూరి, భళా!
ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై
నేతలు పిలువంగనే యువత సరి స
మూహముగనదో సముద్రముగను
ఏకమయ్యి తెచ్చె, స్వేఛ్ఛె కాక, రసరం
గమయ దేశము మనకంద జేసె!

మాతామహి బయలుదేర మనుమడు ప్రీతిన్
చేతులనూపుచు ముద్దుగ
తాతా యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked