వేసవి సెలవుల్లో …
-అమరనాథ్ జగర్లపూడి
వేసవి సెలవల్లో ……. హాయి హాయిగా! జాలీ జాలీగా
వేసవి వస్తోందంటేనే విద్యార్థుల్లో ఆమ్మో అనే పరీక్షల ఉద్యేగం! వేసవి వేడి కంటే పరీక్షల వేడి విద్యార్థుల ఫై ఎక్కువ ప్రభావం చూపుతుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడెప్పుడు పరీక్షలు అవుతాయా వేసవి శెలవలెప్పుడు వస్తాయా! వేసవి శెలవల్లో ఏమేమి చేయాలా అనే ప్రణాళికలు విద్యార్థుల మెదళ్లలో తయారౌతాయి కూడా! సంవత్సరం పాటు సాగిన చదువుకు ముగింపుగా జరిగిన పరీక్షల తర్వాత వచ్చే శెలవులు నిజంగానే పిల్లల మనస్సులో సంతోషం నింపటమే కాదు వారికి మానసిక ఉత్సాహానికి నిజమైన ఆటవిడుపుల విడిది కూడా ఈ వేసవి శెలవులు.
పరీక్షల ఒత్తిడి నుండి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపటానికి ప్రతి విద్యార్ధికి ఒక చక్కని అవకాశం ఈ వేసవి శెలవులు! ఏదో ఎండ వేడిమికి ఇంట్లో కాలక్షేపానికి మాత్రమే కాదు ఈ శెలవులు. ఈ శెలవల్లో తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉంటాయి. వీటివలన కేవలం మానసిక ఉత్సాహం,ఉల్లాసం మాత్రమే కాదు మానసిక పరిణితి పెరిగే అవకాశాలెన్నో ఉంటాయి. ఆటపాటలు ,వినోద కాలక్షేపాలు,మిత్రులు మరియు బంధువులతో ప్రత్యక్ష కలయికలు, విహారయాత్రలు ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలుంటాయి. ఒత్తిడికి అవకాశం లేని ఈ కార్యక్రమలు నిజంగానే మనసును ఆనందంగా, హాయిగా ఉంచటమే కాదు, దీనివలన భవిష్యత్లో చదివే చదువుల పైన కూడా అనుకూలం ప్రభావం ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు.
మానసిక ఒత్తిడి లేని ఏ పనులైనా మెదడులో కొత్త మెరుపులను మెరిపిస్తాయి. నిజంగా విద్యార్థులకు కావాల్సింది కూడా ఇదే కదా! ఇక్కడ ముఖ్యంగా కుటుంబ పెద్దలు తమ పిల్లల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని వేసవి సెలవల్లో పిల్లలతో ఎలా గడపాలి?వారిలో కొత్త ఉత్సాహం ఎలా నింపాలనే ప్రణాళికలు తయారుచేయాలి. ఇవి పిల్లలకు ఇష్టంగా, ఆనందం కలిగించే విధంగా ఉండాలి కానీ కష్టంగా బరువు, బాధలతో కూడి వుండకూడదు. ఇటువంటి సందర్భాలలో ప్రధానంగా ఇంటి పెద్దలు తమ ఇష్టా ఇష్టాలను బలవంతంగా పిల్లలపై రుద్ద కూడదు. కొందరు తల్లి తండ్రులు తమ పిల్లల గూర్చి చాలా ఉన్నతంగా ఊహించుకుంటూ పరీక్షలు అవటం తోటే పిల్లలకు ఎవేవో కొత్త కొత్త కోర్సులంటూ ఇంట్లోనుండి కాలు బయట పెట్టనివ్వకుండా మానసిక ఒత్తిడిని పెంచేస్తారు. ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించే అంశం! భవిష్యత్లో ఇంటి పెద్దలు ఊహించిన విధంగా పిల్లలు ఎంతవరకు ఎదుగుతారో ఏమో గాని, అప్పుడే పరీక్షల ఉద్వేగాలనుండి బయటకు వచ్చిన విద్యార్థులకు మానసిక సమతూల్యతలు దెబ్బతినటం మాత్రం ఖాయం! నిజానికి ఈ సెలవల్లో పిల్లలకు కావాలసింది మానసిక విశ్రాంతి , ఉల్లాసం, ఉత్సాహం నింపే కార్యక్రమాలే సుమా! ఇంకొంతమంది తల్లి తండ్రులు తమ కిష్టమైన ఆటపాటలు, అభిరుచులు పిల్లలపై రుద్ది వాటిలో ప్రావీణ్యత పెంపొందించాలని ఉబలాట పడిపోతుంటారు ఇది కూడా పిల్లల ఎదుగుదలకు చేటు కలిగించేదే. అందుకే ఇంటి పెద్దలు, పిల్లలతో కూర్చుని వారి భావాలను గమనిస్తూ, గౌరవిస్తూ జాగ్రత్తగా అడుగులు వేయటం చాలా అవసరం.
వేగవంతమైన ఈనాటి ఈ సామాజిక పరిస్థితులలో పిల్లలనుండి పెద్దలవరకు అనుభవిస్తోందే స్ట్రెస్ మరియు స్ట్రైన్ ఈ రెండూ శారీరక, మానసిక సమతూల్యతలకు విఘాతంగా ఉన్నాయనేది మనకు తెలిసిన విషయమే! మరి వీటి నుండి నిజమైన ఉపశమనంగా ఇంటి పెద్దలకు కూడా ఎక్కువ సమయం పిల్లలతో గడిపే అవకాశం ఈ శెలవల్లోనే. అందుకనే పెద్దలు పిల్లల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని శెలవల్లో ఎటువంటి కార్యాచరణ అవసరమో ఆలోచించి రూపొందించాలి.
కార్యాచరణ ఎలా జరగాలి!
- పిల్లల మానసిక ఉత్సాహానికి, ఉల్లాసానికి, మానసిక పరిణితి పెరిగే విధంగా పెద్దలు స్పష్టమైన అవగాహనతో శెలవల్లో ఎటువంటి కార్యక్రమాలు అవసరమో ఆలోచించి రూపొందించాలి.
- పిల్లలు ఆశించే కోరికల్లో కష్టసాధ్యమైనవి ఉంటే హేతుబద్దంగా (Rational)వాటిలోని కష్టసుఖాలను వివరిస్తూ, వారి స్థాయికి తగ్గట్టుగా ప్రణాళిక తయారుచేయాలి.
- పిల్లలు తమకు తాముగా వేసవి సెలవుల కోసం తయారు చేసుకున్న ప్రోగ్రామ్స్ కూడా పరిశీలించి, ప్రాధాన్యతల బట్టి వాటిని అమలు పరిచే ప్రయత్నాలు చేయాలి. పిల్లలు తయారు చేసిందే కాదా అని చిన్న చూపు చూడరాదు.
- కుటుంబ పెద్దలు ఎక్కువ సమయం పిల్లలతో గడిపే అవకాశం ఎక్కువగా ఈ సెలవుల్లోనే ఉంటుంది. దీనివలన ఒకరినొకరు అర్ధం చేసుకొనే అవకాశాలు, ప్రేమాభిమానాలు పెరిగే అవకాశాలెక్కువ.
- పెద్దలు తమకు ఇష్టమైనవే పిల్లలకు కూడా ఇష్టంగా మారాలనే బలవంతపు ప్రయత్నాలు చేయరాదు. ఉదాహరణకు పిల్లవాడికి బ్యాట్మెంటన్ మీద మక్కువ ఉండవచ్చు కానీ మీకు వాలీబాల్ ఇష్టం కదా అని బలవంతంగా వారి మీద రుద్దితే రెంటికి చెడ్డ రేవడిగా మారతారు. అలాగే మీకు శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం కావచ్చు మా అమ్మాయిలో ఒక గొప్ప విద్వావంసురాలిని చూడాలనుకుంటే ఆ అమ్మాయికి డాన్స్ మీద ఇష్టం ఉంటే, దీనివలన కూడా సమస్యలు ఏర్పడవచ్చు ఇలాంటి ఉదాహరణలెన్నో ఉంటాయి. అందుకే ప్రణాళిక అనేది చక్కటి అవగాహనతో జరగాలి.
నేటి వేగవంతమైన వాతావరణంలో పిల్లలకు మరియు తల్లితండ్రులకు ఒకరినొకరు, ఒకరికొకరు అనేది చాలా చాలా అవసరమైనది. ముఖ్యంగా ఉద్యోగస్తులైన తల్లితండ్రులు ఈ సెలవల్లో ఎటువంటి కారణాలు చూపకుండా భేషరతుగా పిల్లల కోసం కేటాయిస్తే హాయి హాయిగా జాలీ జాలీ గా పెద్దలు కూడా పిల్లల్లా మారిపోవచ్చు నిజంగా పిల్లల్లో ఇది ఎంత మానసిక భరోసా ఇస్తుందో తెలుసా! మరి దానికోసం తయారవుదామా!
అమరనాథ్ జగర్లపూడి,
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్,
9849545257