కథా భారతి

లావయిన కథ

-భారతీనాథ్ చెన్నంశెట్టి

చక్కనమ్మ చిక్కినా అందమే, అని, నాలో నేను అనుకుందామనుకుని, పైకే అనేశాను.

అది విన్న, మా ఆవిడ ఖయ్యిమంటూ, నా మీద, అగ్గి మీద గుగ్గిలం పొగలా లేచింది.

నాకు, నా సతిని, ఆవిడ  అని అంటే, పెరుగు ఆవడ తిన్నంత సంతోషంగా ఉంటుంది. అదే, భార్య అంటే, భారము మీద పడినట్టై,  మనసుకు నచ్చదు.

అసలు విషయం వదిలి,  పక్క దోవ పట్టాను. రామాయణంలో పిడకల వేట అంటే ఇదేనేమో.

అసలు విషయానికి వచ్చేద్దాం, ఇక.
ఎవరా చక్కనమ్మ , ఏమిటా కథ అంటూ విరుచుకు పడింది, మా ఆవిడ.

వీధి చివర మూడో మేడ, ఆరో అంతస్తులోని, చుక్కమ్మ గారి గురించేనా, అంటున్నారు, అంది.

హవ్వ, ఆవిడ మా అమ్మమ్మ ఆఖరి చెల్లెలు, నూరుకు, ఆరు నెలలు దూరంలో ఉందావిడ, అన్నాను.

అయితే, తప్పని సరిగా, ఆరో ఇంట్లో మూడో అంతస్తులోని, జేష్టమ్మ గారి గురించే అయ్యుంటుంది, అంది మా ఆవిడ.

ఆవిడకు, వాళ్ళ అమెరికా మనవరాలు, క్రితం నెలలోనే, స్కైపులో, తొంభైవ పుట్టిన రోజు జరిపింది, అన్నాను.

అయినా, పరాయి ఆడవాళ్ళ వంక చూడడంగాని, వాళ్ళ గురించి మాట్లాడడం గాని, చేస్తానా.

అంతెందుకు, పక్కనున్న, ఆడ పిల్లల హాష్టలులో, 13 మంది ఆడపిల్లలున్నారని, ఎప్పుడయినా, అన్నానా. నన్ను అనవసరంగా, ఆడి పోసుకోకు, అన్నాను.

అసలు, పెళ్ళి చూపులప్పుడు కూడా, అందరూ బలవంతం చేస్తే గాని, నీ వంక తల తిప్పి చూడలేదని, అబ్బాయి చాలా బుధ్ధిమంతుడని, మీ వాళ్ళే మెచ్చుకున్నారు కదా, అన్నాను.

నేను పెళ్ళయిన కొత్తలోనే, చెప్పాను కదా, పెళ్ళి చూపులుకొచ్చి, నన్ను కాకుండా, మా పక్కింటమ్మాయిని దొంగ చూపులు చూశారని, అంది మా ఆవిడ.

అసలు విషయం పక్కదోవ పడితే, ప్రమాదం జరుగుతుందని గ్రహించి, అలా ఎందుకన్నానో, చెపుతాను, విను అన్నాను.

మా రాధా కృష్ణ , మా వాట్సప్ గ్రూపులోంచి బయటకు, వెళ్ళాక, కొంచెం ఒళ్ళు చేశారని, మా శాతకర్ణి అన్నారు, అన్నాను.

శాతకర్ణి గారు, అంటే, అప్పుడు మీ పాత విద్యర్ధుల సమావేశంలో, పాట పాడారు, ఆయనే కదా, అంది మా ఆవిడ.

ఆ, ఆయనే. అప్పుడునుంచి ఆలోచిస్తున్నా. చిక్కినమ్మ గురించి సామెత ఉంది గాని, లావెక్కినయ్య గురించి సామెత, ఎక్కడుందా, అని బుర్ర పగల కొట్టుకుంటున్నాను, అన్నాను.

లేనిది పగల కొట్టుకుని, ఏమి లాభం కాని, అసలు విషయానికి రండి అంది మా ఆవిడ.

కాలేజీ రోజుల్లో, మెస్ తిండి పడటంలేదని, మెయిన్ బ్లాక్సు వదలి, రత్న కుమార్ తో కలిసి, సొంత వంట పెట్టినపుడు, కూడా, మా రాధా కృష్ణ, ఇలా లావెక్క లేదు, ఇప్పుడెందుకు ఇలా జరిగిందో, అన్నాను.

లావెక్కిన కారణమేమో, అంతు చిక్కగ రాదు
లోగుట్టులవేమో విప్పి తెలుపు భామా
లోపటి మర్మము తెలియని పాపకు రీతిన్
అని, మా ఆవిడను వేడుకున్నాను.
నా నిద్ర చెడగొట్టకుoడా పడుకోoడి, అంది, మా ఆవిడ.

ఏది ఏమైనా, ఈ లావెక్కడం వెనుక కారణం కనిపెట్టాలని, కుoడలో నీళ్ళు తాగి, గట్టిగా తీర్మానించుకుని, నిద్రకుపక్రమించాను.

అలా నిద్రలోకి, జారుకుంటుండగా,టంగుమని మోత.
ఏదో సందేశం వచ్చిoది, చూడక పోతే మిత్రుడెవరో బాధ పడతారని, వెoటనే చూశాను.
స్నేహితుడొకాయన,

*శుభరాత్రి*
అంటూ వాట్సప్ లో సందేశం పంపారు.

కళ్ళు నులుముకుంటూ, సందేశాన్ని చదివాను.

*ఏ చింతలూ లేక పోతే*

*చింత మొద్దంత లావవ్వచ్చు*

*చింతలు లేకుండా నిదురించు*
*శుభరాత్రి*
అని ఉంది, ఆ సందేశంలో.

నిద్ర పోతున్న, నన్ను నిద్ర లేపిన శుభ రాత్రి సందేశముపై, ముoదు కోపం వచ్చినా, ఆలోచిoచిన తరువాత, నా మనసుకు తట్టింది ( మా ఆవిడ, నాకు బుర్రలేదంది, కాబట్టి, బుర్రకు తట్టింది, అనలేదు), రాధా కృష్ణ, లావెక్కడానికి కారణం.

లావొక్కింతయు లేదు, అని హరిని వేడకనే, సమయానికి, మిత్రుడు పంపిన సందేశం ద్వారా, రాధా కృష్ణ లావెక్కిన కారణం తెలిపిన, హరికి , నమస్సులు తెలిపి, కారణం విశ్లేషించాను.

రాధా కృష్ణ గ్రూపులో, ఉన్నప్పుడు, అన్నీ చింతలే.

ఉదయాన్నే, శుభోదయం చెప్పకపోతే, మిత్రులేమనుకుంటారో, అని, చింత.

శాతకర్ణి పాట పాడి, ఎన్నాళ్ళయిందో, అని ఇంకో చింత.

ఉదయం,తాను పెట్టిన చిత్రంపై, రవి కత్తెర పడుతుందని, మరో  చింత.

మధ్యలో, ఈ హరనాథ్ కథలు, పద్యాల గోలొకటి. పోనీ, అవి బాలేవందామా అంటే, ఓవిలన్ లా , ఓరుగంటి వారు, అవి బాగున్నాయని, హరనాథునికి మెచ్చుకోళ్ళొకటి.

అయినా, చంధస్సులో, తప్పులు, అప్పుడప్పుడూ, ఎత్తి చూపితే, హరనాథ్ ఏమనుకుంటాడో, అదో చింత.

ఇన్ని చింతల తరువాయి, నిద్రకుపక్రమించాక, గ్రూపులో, శుభరాత్రి సందేశం పెట్టానా? లేదా? అని, అదో చింత.

గ్రూపులో ఉంటే, అలా, సవాలక్ష చింతలు.

ఇప్పుడు, గ్రూపునించి, వెళ్ళాక, ఏ చింతా లేక, కించిత్తు సేదదీరి,  చింతలా అవెక్కడయ్యా, అని అనుకుంటూ, రాధా కృష్ణ,  లావెక్కారని, తీర్మానించుకున్నాను.

రాధా కృష్ణ గారి, సంగతి అలా ఉంచితే, మీరు మాత్రం, వాట్సప్ గ్రూపులోంచి, బయటకు రాకండి, లావెక్కి పోతారు, అంటూ, ఓ సలహా విసిరింది, మా ఆవిడ.

అదండీ, రాధా కృష్ణ , మా లావు కథ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked