కథా భారతి

ఠింఠాకరాళుడు

-ఆర్ శర్మ దంతుర్తి

స్వర్గంలో ఇంద్ర సభ జరుగుతోంది. చర్చించే విషయం భూమి మీద జీవితం అసహ్యకరమైనది. తుఛ్ఛమైన చీము, రక్తంతో కూడుకుని రోగాలతో ఎవరు ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితుల్లో అదే ఆనందం అనుకుంటూ బతకడం. తీరా దేహం చాలించాక వెళ్ళేది నరకానికో స్వర్గానికో తెలియదు. అలా బతుకుతూ కూడా సంతోషంగా ఉన్నామని మానవులు భావించుకోవడం, చావు తరుముకొస్తున్నా ఎల్లకాలం జీవిస్తామేమో అనుకుంటూ ఆస్తులు కూడబెట్టుకోవడమూను. వింత ఏమిటంటే, భూమ్మీద బతికినంతకాలం భగవంతుడూ, స్వర్గ నరకాలు ఉన్నాయని అనుకుంటూ ఓ రకం మనుష్యులు ఉంటే అసలు అవి లేనే లేవని మరో రకం వాదనలు వినిపించే జనం కోకొల్లలుగా ఉన్నారు.

సభ ఇలా జరుగుతూండగానే కళావతి అనే ఒక అప్సర భామ, ఇంద్రుడి అనుమతితో చెప్పడం సాగించింది, “మీరందరూ చెప్పినది బాగానే ఉంది కానీ ఇక్కడ స్వర్గంలో కన్నా భూమ్మీద జీవితమే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొదట భూమి మీద మంచి కార్యాలు చేయడం వల్లే కదా ఇలా దేవతలం అయ్యాం? భూమి మీద అయితే పాపం కానీ పుణ్యం కానీ చేయడానికైనా ఎంచుకునే అధికారం ఉంది. రకరకాల పాప పుణ్యాలు చేసి, మిగతా వారికి సహాయపడుతూ ఏ ఒక్కరోజూ ఒకేలాగ లేకుండా ఆనందిచవచ్చు….”

కోపంతో మొహం ఎర్రబడుతుంటే ఇంద్రుడన్నాడు, “కళావతీ, నువ్వేం మాట్లాడుతున్నావో స్పృహ ఉందా?”

“… నేను తప్పుగా ఏమన్నాను? ఓ సారి ఈ స్వర్గలోకంలో జీవితం చూడండి అన్ని రోజులూ ఒకే లాగ ఉంటాయి. మన పుణ్యం అవ్వగానే మళ్ళీ భూమ్మీదకే జేరాల్సి రావచ్చు. ఎప్పుడూ బాధ అనుభవించనివాడికి ఆనందం ఎలా అనుభవించాలో తెలియదు కదా? ఇక్కడ ప్రతీరోజూ ఆనందంగా ఉండడం వల్ల అది అలవాటైపోయి విసుగు ఎత్తవచ్చు; కానీ భూమిమీద అలా కాదే? అందుకే భూమి మీద జీవితం రోగాలతో రొష్టులతో కూడుకున్నాఅక్కడే మానవుడికి మరింత స్వేఛ్ఛ ఉంది తనకి కావాల్సినవి ఎంచుకోవడానికి. అదీగాక భూమి మీద పడ్డాకే ఆత్మజ్ఞానానికి దారి తెలియడం, దాని శోధనా సాధించగలిగేది…”

ప్రసంగానికి కోపం వచ్చిన ఇంద్రుడు వెంఠనే శపించాడు కళావతిని, “భూమ్మీద బతుకే అంత బావుంటుందన్నావు కనక మనిషిగా మానవ జన్మ ఎత్తు అయితే. అలా ఎత్తి అష్టకష్టాలు అనుభవించాక ఎప్పుడైతే బుద్ధి వస్తుందో అప్పుడు వెనక్కి వద్దువుగాని.”

“… అయ్యో, సభలో అందరూ మాట్లాడుతున్నట్టే నేను కూడా మనసులో మాట చెప్పాను కానీ భూమ్మీద బతకాలని కోరికగా ఉందనలేదే? శాపం ఎలాగా ఇచ్చేసారు కనక రోజులో సగ భాగం ఇక్కడ స్వర్గంలో, రాత్రి భూమి మీదా ఉండేలాగ ఏర్పాటు చేయగలరా? నేను భూమ్మీద ప్రత్యక్షంగా అనుభవించే కష్ట సుఖాలూ, విశేషాలు ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఉంటాను,” కళ్ళలో నీరు తిరుగుతుండగా అడిగింది కళావతి.

“సరే అలాగే కానీయ్“

*****

ఊరి చివర పాడుబడిన గుడి ప్రాంగణంలో జూదం జరుగుతోంది చాలాసేపటి నుండీ. కొంతమంది నెగ్గేవాళ్ళు ఆట చాలించి వెళ్ళిపోతున్నారు, కొత్తవాళ్ళు ఆటలో చేరుతున్నారు కానీ ఒకే ఒక మనిషి, ఎప్పటికైనా నెగ్గగలననే నమ్మకంతో కూర్చున్న చోటునుండి లేవకుండా ఆడుతూనే ఉన్నాడు.

కొత్తగా వచ్చిన ఎవరో కుర్రాడు ఆటలో కూర్చోబోతూంటే ఒక పెద్దాయన అడిగేడు, “అబ్బాయ్ ఇక్కడ జూదం ఆడ్డానికి రెండు, మూడు షరతులున్నాయి. వాటికి ఒప్పుకోకపోతే ఆడ్డం కుదరదు. నీకు ఇష్టమేనా?”

“ఏమిటండి ఆ షరతులు?”

“మొదటిది, నువ్వు ఓడిపోతే డబ్బు వెంఠనే ఉన్నది ఉన్నట్టూ చెల్లించాలి. రేపు ఇస్తా, మాపు ఇస్తా అనే అప్పులు కుదరవు. రెండోది, నీ దగ్గిర డబ్బులేకపోతే ‘నేను ఆటలోంచి తప్పుకుంటున్నా’ అని ఆటకి ముందే చెప్పాలి. అలా చెప్పకపోతే నువ్వు ఆటలో ఉన్నట్టే లెక్క, ఆట ఆడకపోయినా. మూడోది, ఓడిపోయినప్పుడు డబ్బులు చెల్లించకపోతే నీ శరీరాన్ని ఈ రంపంతో కోస్తారు ఇక్కడ గెల్చినవాళ్ళు,” అక్కడే రక్తం ఓడుతున్న పదునైన అంచులు గల రంపం చూపిస్తూ అన్నాడు పెద్దాయన.

రంపం చూసిన కుర్రాడికి వళ్ళు జలదరించింది కానీ, జేబులో డబ్బు ఉంది కనకా, నెగ్గగలననే నమ్మకం తోనూ చెప్పేడు, “సరే, మూడు షరతులకీ నేను వప్పుకుంటున్నా.”

దాదాపు రాత్రి రెండో ఝాము కావస్తూంటే ఆట కట్టిపెట్టి లేచారందరూ. ఆటలో ఒక్కడు తప్ప అందరూ గెల్చినట్టే. గెల్చినవాళ్లందరూ జాలి వల్ల కాబోలు తలో కాసూ ఓడిపోయినవాడి చేతిలో పెట్టి ఇళ్ళకి బయల్దేరేరు. మొత్తం అన్నీ ఓడిపోయిన పెద్దమనిషి తనకి అందరూ ఇచ్చిన డబ్బు ఎంత ఉందో లెక్కకూడా పెట్టుకోకుండా జేబులో పెట్టుకుని నవ్వుకుంటూ కులాసాగా ఊరికేసి నడుచుకుంటూ వెళ్ళిపోయేడు.

ఆరోజు ఆటలో కొత్తగా జేరిన కుర్రాడు ఇదంతా చూసి ముందు తనకి ఆటలో షరతులు చెప్పిన పెద్దాయనని అడిగేడు, “ఆయనెవరండీ, అంతా పోగొట్టుకున్నా ఏమీ దుఃఖం అదీ లేదు. మనం ఇచ్చిన తలో కాసూ జేబులో పెట్టుకుని అదే పోవడం పోయాడు?”

పెద్దాయన నవ్వి చెప్పాడు, “వాడా? వాడి పేరు ఠింఠాకరాళుడు. ఏ రోజుకీ ఒక్క కాసు దాచుకోడు. ఏదైనా ఉంటే ఆడడం, లేదా ఎక్కడ వచ్చిన డబ్బు అక్కడ ఆటలో పోగొట్టుకోవడం. వాడికి పిల్లా, జెల్లా, కుటుంబం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు మనం ఇచ్చిన డబ్బుతో పోయి కాస్త గోధుమ పిండి కొనుక్కుని వాటితో, దొరికిన నీరు కలిపి ముద్దలు చేసి ఆ ముద్దలని ఈ ఉజ్జయినీ నగరం ఊరి చివర శ్మశానంలో చితిమంటల్లో కాల్చుకుని రొట్టెలు చేసుకుంటాడు. అవి పట్టుకుపోయి మహాకాలుడి గుడిలో నేతి దీపాలలో ఉన్న నెయ్యి వాటికి పూసుకుని తిని అక్కడే తలకింద చేయి పెట్టుకుని పడుకుంటాడు. అదే వాడికి తెల్సిన పని. మనతో రోజూ ఆడి అన్నీ పోగొట్టుకుంటాడు కనకా, వాడికెవరూ లేరని జాలితోనూ రోజూ ఆట అయిపోయాక చివరిలో ఇలా ఒక కాసో, రెండు కాసులో ఇస్తూ ఉంటాం.”

సమాధానం విన్న కుర్రాడు నోరు వెళ్ళబెట్టాడు, చితిమీద రొట్టెలు కాల్చుకోవడం, మహాకాలుడి గుడిలో నేతిదీపాల మీద నేయి ఆ రొట్టెలమీద రాసుకోవడం అనేది వినగానే. కొంచెం వెన్ను వణుకుతుంటే అడిగాడు, “ఇటువంటివారికి భూత, పిశాచ, ప్రేత శక్తులు ఉంటాయేమో, మీకు భయంలేదా ఈయనతో ఆడటానికి?”

“అబ్బే, ఠింఠాకరాళుడు అటువంటివాడు కాదు. మహాకాలుడి భక్తుడు. ఎవరికీ అపకారం చేసే మనిషి కాదు.”

మనసు కుదుటపడిన కుర్ర జూదరి తన ఇంటికేసి సాగిపోయేడు పెద్దాయనని వదిలేసి.

*****

మహాకాలుడి గుడిలో పడుకున్న ఠింఠాకరాళుడికి వళ్ళు తెలియకుండా నిద్ర పట్టాక, ఏ ఝాము రాత్రో మెలుకువ వచ్చింది. అడుగుల చప్పుడు లేదు కానీ గుడిలో ఎవరో సంచరిస్తున్నారన్నట్టూ గోడమీద సప్తమాతృకల విగ్రహాలు అటూ ఇటూ కదులుతున్నాయి. రోజూ మానవ కళేబరాలు కాలే చితిమీద రొట్టెలు కాల్చుకుంటూ తినే ఠింఠాకరాళుడు ఏమీ భయం లేకుండా అలాగే కదలకుండా పడుకుని కుతూహలంగా చూడబోయేడు ఈ కదిలే విగ్రహాల సంగతి.
ఓ గంటా రెండు గంటల తర్వాత తెల్లవారుతూంటే ఆ కదలడం అగిపోయింది. వెన్నువాల్చి మెలుకువగా ఉండి చూసిన ఠింఠాకరాళుడికి దివ్యమైన ఆలోచన వచ్చింది తూర్పు ఉదయించగానే. ఆ రోజుకి ఊరి చివర శ్మశానంలో జరిగే జూదానికి వెళ్ళకుండా రోజంతా మహాకాలుడి గుడిలోనే గడిపి రాత్రికి ఏం చేయాలో ఆలోచించాడు. రోజూ తాను జూదం ఆడే చోట మహా గెలిస్తే ఓ వందో, రెండు వందలు గెలవొచ్చు కానీ అవి మర్నాటికి ఆటలో ఎలాగా పోతాయి. తనతో ఆడేవాళ్ళు తనలాంటి వాళ్ళే. వాళ్లతో ఆడితే తానెప్పటికీ ధనవంతుడు కాలేడు. రాత్రి మహాకాలుడి గుడిలో సంచరించే ఈ సప్తమాత్రుకలని ఎలాగైనా ఆటలో దింపగలిగాడా, తాను ఎంతైనా ధనం సంపాదిందిచవచ్చు. అదీగాక ఈ దేవతల దగ్గిర అంతులేని ధనం ఉంటుంది కనక తానెప్పుడూ మరో సారి ఈ శ్మశానం లో ఊళ్ళోవాళ్లతో జూదం ఆడక్కర్లేదు. తానుగాని సప్త మాతృకల చేతిలో ఓడితే వాళ్లకి చెల్లించే డబ్బు తన దగ్గిరలేదని తప్పించుకోవచ్చు. ‘అమ్మా మీరు దేవతలు, నేను మీకు డబ్బిచ్చే అంత వాడినా?’ అని బతిమాలితే నవ్వేసి వదిలేయరా? మరీ పాకం ముదిరి పీకలమీదకి వస్తే పోయి ఆ మహాకాలుడి కాళ్ళే పట్టుకోవచ్చు. అయినా తాను ఓడినప్పటిమాట కదా?

ఈ ఆలోచన రాగానే క్రితం రాత్రంతా నిద్రలేని ఠింఠాకరాళుడు అర్ధరాత్రి వరకూ గుడిలోనే పడుకున్నాడు. అర్ధరాత్రి మళ్ళీ సప్తమాత్రుకల విగ్రహాలు కదలడం మొదలవ్వగానే కరాళుడు లేచి పాచికలు చేత్తో తీసి చెప్పేడు అందరికీ వినబడేట్టుగా, “అమ్మలూ, నాతో పాచికలు ఆడండి, నెగ్గినవాళ్ళకి ఎప్పటికప్పుడు డబ్బు ఇచ్చేయాలి సుమా?”

కదిలే సప్త మాత్రుకల విగ్రహాల లోంచి ఏ సమాధానమూ రాకపోయేసరికి మౌనం అర్ధాంగీకారం అనుకుని పాచికలు విసిరాడు కరాళుడు. మాత్రుకల దగ్గిర్నుంచి సమాధానం లేకపోయేసరికి మరోసారీ మరోసారీ పాచికలు అలా విసురుతూనే ఉన్నాడు తూర్పు తెల్లవారేదాకా. మాత్రుకల విగ్రహాలు కదులుతున్నంతసేపూ జూదం ఆట సాగుతూనే ఉంది. కరాళుడు నెగ్గుతూనే ఉన్నాడు అప్పుడప్పుడూ ఓడినా. పొద్దెక్కిన తర్వాత చూసుకుంటే కరాళుడి లెక్క ప్రకారం సప్త మాత్రుకలు వాడికి దాదాపు వెయ్యి రూకలు బాకీ. రెండోరోజు ఆట మొదలుపెట్టబోతూంటే ఈ బాకీ సంగతి తేల్చాలి. ఆలోచన చాలించి నిద్రకి ఉపక్రమించాడు.

మర్నాడు రాత్రి ఆట మొదలుపెట్టబోతూ కరాళుడు మాత్రుకలతో చెప్పేడు, ”నిన్నటి రోజు ఆట ప్రకారం మీరు ఓడినది ఇది, ఆ డబ్బు ముందు ఇవ్వకపోతే ఆట ముందుకి జరగదు ఈవేళ.”

సప్త మాత్రుకలనుంచి ఏమీ సమాధానం రాలేదు కరాళుడికి మొదటిసారీ, రెండోసారీ ఆ తర్వాత అనేకానేక సార్లు అడిగినా సరే. చాలాసార్లు అడిగి విసిగిపోయిన కరాళుడు జూదంలో వాడే షరతుల ప్రకారం రంపం బయటకి తీసాడు కదిలే సప్త మాత్రుకల విగ్రహాలని ధ్వంసం చేయడం కోసం. రంపం విగ్రహాలమీద పడీపడకుండానే బంగారు కాసులు గోడ పగుళ్ళలోంచి జారిపడ్డాయి. లెక్కపెట్టి చూసుకుంటే సరిగ్గా తనకి రావాల్సిన డబ్బులు వచ్చినట్టే; నవ్వుకున్నాడు కరాళుడు. ఆ రోజునుండి కరాళుడు మొదట సప్త మాత్రుకలతో జూదం ఆడడానికి, వాళ్ళిచ్చే బంగారు కాసులు జేబులో పెట్టుకుని ఆ తర్వాత శ్మశానంలో ఆ కాసులు మిగతా వాళ్ళతో ఆడిన జూదంలో పోగుట్టుకోవడానికీ అలవాటుపడ్డాడు. డబ్బంతా పోయాక నెగ్గినవాళ్ళిచ్చే కాసులతో పిండి కొనుక్కుని రొట్టెలు చితిమీద కాల్చుకోవడం అవి పట్టుకుపోయి మహాకాలుడి గుళ్ళో నెయ్యి పూసుకుని తినడం యధావిధిగా జరుగుతూనే ఉంది.

కొన్ని రోజులు ఈ కధ నడిచాక సప్త మాత్రుకలకి మనసులో అలజడి ప్రారంభమైంది. ఈ కరాళుడి జూదానికి రోజూ ఊరికే బంగారు కాసులు ఇవ్వడం ఎలా? పోనీ ఇచ్చినా వీడు వాటిని జూదంలో మిగతావాళ్లకి పోగొట్టుకుంటున్నాడు కదా? ఇలా అయితే తాము జూదాన్ని ప్రోత్సాహించడం అవుతోంది. అలాగని వీడికి బంగారు కాసులు ఇవ్వొద్దు అనుకుంటే రంపంతో తమని కోయడానికి తయారౌతున్నాడు. తమ విగ్రహాలు ధ్వంసం అయితే ఇక్కడ ఉజ్జయినీ లో వెలిసిన మహాకాలుణ్ణి, అమ్మవారిని ఈ గుడిలో కొలుచుకోవడం అసంభవం. ఈ రంపంతో కోయడం అనే షరతు ఏమిటసలు? దారి తెలియని స్థితిలో గుడిలో ఉండే చాముండేశ్వరీ అమ్మవారి దగ్గిరకి వెళ్ళి మొరపెట్టుకునేసరికి ఆవిడ నవ్వుతూ చెప్పింది ఈ షరతుల సంగతి. “వీడి బారినుంచి తప్పించుకోవడానికి ఒకే దారి ఉంది. వాడు పాచికలు విసిరే సమయానికి ‘మేము ఆటలోంచి తప్పుకుంటున్నాం’ అని చెప్పేయడమే. అలా మొదటి షరతు ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు కరాళుడు మిమ్మల్ని ఏమీ చేయలేడు.”

మర్నాడు ఠింఠాకరాళుడు మరోసారి సప్తమాత్రుకలముందు పాచికలు వేయబోయే సరికి విగ్రహాలు మాట్లాడుతున్నాయా అన్నట్టూ మాట వినబడింది, “మేము అటలోంచి తప్పుకుంటున్నాం.”

నివ్వెరపోయిన కరాళుడికి కాళ్ళూ చేతులూ ఆడలేదు. ఏ రోజుకా రోజు ఏమీ కష్టపడకుండా బంగారు కాసులు సంపాదించి వాటితో ఇష్టం వచ్చినంతసేపు మరోచోట జూదం ఆడుకోవచ్చనుకున్న కరాళుడికి ఏమి చేయాలో తోచలేదు. కాసేపు కిందామీదా పడ్డాక కరాళుడికి తట్టిన మరో విషయం సప్త మాత్రుకలు మరీ అంత డబ్బున్నవాళ్ళేం కాదు. మొదట్లో కావాల్సినంత ధనం ఇచ్చినా వాళ్ల దగ్గిర డబ్బు అయిపోవచ్చేసరికి ఇలా ఆటలోంచి తప్పుకుంటున్నారేమో? ఆలోచనలు సాగి సాగి చివరకి ఏమి చేయాలో తెలియని ఘడియకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది కరాళుడికి.

ఆ ఆలోచనప్రకారం తిన్నగా గర్భగుడిలోకి పోయి త్రిలోకాధిపతి అయిన మహాకాలుడి ముందు పాచికలు వేసి ఆయననే జూదం ఆడ్డానికి అహ్వానించాడు ఠింఠాకరాళుడు.

ఠింఠాకరాళుడి జీవితం, తన గుడిలో పడుకోవడం, తనమీద భక్తీ, ఓ సారి సప్తమాత్రుకలతో పందెం వేసి డబ్బు గెల్చుకున్నాక రోజూ వాళ్లని ఆహ్వానించడం, వాళ్లకి అమ్మవారు ఏం చేయాలో చెప్పడం – ప్రతీరోజూ జరిగే ఈ తతంగం చూసిన మహాకాలుడు వెంఠనే నవ్వుతూ చెప్పేడు “నేను ఆటలోంచి తప్పుకుంటున్నా.”

హాతాశుడైన కరాళుడి మనసులోంచి అమితమైన వ్యధ తన్నుకొచ్చింది. ఇంతటి భక్తుడినైన నన్నే మహాకాలుడు వదిలేస్తే తాను బతికేదెలా? వెంఠనే సాష్టాంగపడి అన్నాడు కరాళుడు “స్వామీ, త్రిలోకాధిపతివి, ముంగిట్లో కామధేనువూ, కల్పవృక్షం ఉంచుకుని నాతో జూదం ఆడడానికి ఆటలోంచి తప్పుకునేంత లోభివైపోయావా? మరి నేను ఇంక బతికేదెలా?”

ఆషుతోషుడైన మహాకాలుడికి జాలి వేసింది కరాళుడి పరిస్థితికి. తన భక్తుడైన ఈ కరాళుడికి మంచి విలువైన తెలివితేటలు ఉన్నా జూదం, మోసం తప్ప మరో విషయం తెలియదు. తానే వీణ్ణి ఎలాగో ఒకలాగ దారిలో పెట్టాలి. కరాళుడితో చెప్పేడు, “ఒరే, నువ్వింక ఇక్కడ కానీ మరెక్కడా కాని జూదం ఆడనని ప్రమాణం చేసి ఇక్కడే గుడిలో ఉండిపో, నీకో అద్భుతమైన భార్యని చూసి సరైన దారిలో జీవించే మార్గం చూస్తాను, నీ అవసరాలన్నీ తీరుతాయి, ఇష్టమేనా?”

మహాకాలుడిలా తన అవసరాలన్నీ తీరుస్తానని మాట ఇవ్వగానే ఠింఠాకరాళుడు అక్కడికక్కడే ప్రమాణం చేసాక మళ్ళీ ఏనాడూ పాచికలు వేయలేడానికి పూనుకోలేదు ఉజ్జయినీ నగరంలో కాని మరెక్కడా కానీ.

*****

జూదం మానేసిన కరాళుడికి కొన్నాళ్ళు గడిచాక, అర్ధరాత్రి గుడిలో పడుకున్న ఠింఠాకరాళుడికి మహాకాలుడి పిలుపు విని మెలుకువ వచ్చింది, “ఒరే, ఉజ్జయినీలో ఫలానా సరస్సు దగ్గిరకి వెంఠనే వెళ్ళు. అక్కడికి కొంతమంది అమ్మాయిలు స్నానం చేయడానికి వస్తున్నారు. వాళ్ళని సరస్సులోకి దిగనిచ్చి, వాళ్ళ బట్టలన్ని ఎత్తుకు పోయి చెట్టుమీద కూర్చో. వాళ్ల స్నానం అయ్యాక బట్టలు ఇవ్వమంటే వాళ్ళలో ఒకావిడని నీకు భార్యగా ఇవ్వడానికి ఒప్పుకుంటే మాత్రమే ఇస్తానని చెప్పు. అలా నీకో భార్య లభించబోతోంది. ఆ తర్వాత ఇల్లూ కుటుంబం, కావాల్సిన డబ్బు అవన్నీ ఆవిడే చూసుకుంటుంది.”

మహాకాలుడి మాట పూర్తౌతుండగానే ఠింఠాకరాళుడు ఆలయంలోంచి బయటకి పరుగెత్తాడు.

అమ్మాయిలు స్నానంకోసం దిగడంతోటే వాళ్ల బట్టలతో అక్కడే ఉన్న చెట్టెక్కాడు కరాళుడు. మరో గంటకి నీటిలోంచి బయటకొచ్చిన వీళ్ళకి బట్టలకోసం కరాళుడి కాళ్ళు పట్టుకోవడం తప్ప మరో దారి లేకపోయేసరికి వాడు అందరిలోకీ అందమైన ఒకావిడకేసి చూపిస్తూ చెప్పేడు, “మీలో అందమైన ఆ అమ్మాయిని నాకు భార్యగా ఇస్తే మాత్రమే మీ బట్టలు అందుతాయి. లేదా మీ ఇష్టం. రాత్రి అంతా మహాకాలుడి సన్నిధిలో ఇలా మెలుకువగా ఉండడం నాకు అలవాటే.”

పెద్ద గొడవలేకుండా అమ్మాయిలందరూ ఒప్పుకోవడం కరాళుడికి వింతగా అనిపించి అడిగాడు, “అంత సులభంగా ఎలా ఒప్పుకున్నారు నేను అడిగిన దానికి? ఇది నన్ను ఇక్కడకి పంపించిన మహాకాలుడి ప్రభావమేనా?”

“మేము స్వర్గంలో నాట్యం చేసే అప్సరసలం. మాలో నువ్వు ఎంచుకున్నావిడ పేరు కళావతి. ఆవిడకి భూమి మీద మనిషి జన్మ ఎత్తమని ఇంద్రుడు ఈ మధ్యే శాపం ఇచ్చాడు. నువ్వు చెప్పినదాని ప్రకారం మహాకాలుడు నిన్నే ఆవిడకి భర్తగా నిర్ణయించినట్టుంది. అందువల్ల ఆవిడ నీ భార్య అవడం తగినది. అంతకన్నా ఇంకేం కావాలి?”

*****

కళావతితో పెళ్ళైపోయిన ఠింఠాకరాళుడికి ఇప్పుడు దేనికీ కొరతన్నది లేదు. అయితే తాను కరాళుణ్ణి పెళ్ళి చేసుకోవడానికి ముందు కళావతి పెట్టిన నిబంధన ఒకటి ఉంది. భూమిమీద పొద్దున్న సమయంలో ఆవిడ స్వర్గానికి వెళ్తుంది. రాత్రి అయ్యేసరికి వెనక్కి వచ్చేసి ఆ రోజు స్వర్గంలో జరిగిన విశేషాలు కరాళుడికి చెప్తూ ఉంటుంది. కరాళుడికి తెలియని/కళావతి చెప్పని మరో విషయం, ఆవిడ భూమి మీద అనుభవించిన, గమనించిన ప్రతీ విషయం అక్కడ స్వర్గంలో ఇంద్రుడికి చెప్తోంది.

కళావతి పెట్టిన ఈ నిబంధనకి అసలు ఏమీ అడ్డు చెప్పే పని లేకపోయింది కరాళుడికి. తనకి కావాల్సినవన్నీ కళావతి అమర్చిపెడుతుంది. ఇల్లూ వాకిలీ అన్నీ చూసుకునేది ఆవిడే. తనకి పనే లేదు ఊరిమీద తిరగడం తప్ప. ఆవిడ పొద్దున్నే స్వర్గానికి వెళ్ళగానే కరాళుడు ఊరిమీదపడి ఇష్టం వచ్చినచోట తిరుగుతాడు ఉజ్జయిని లో. సాయంత్రం ఇంటికొచ్చాక కళావతి చెప్పే స్వర్గంలో విశేషాలూ అవీ విన్నాక పడకమీద స్వర్గ సుఖం అనుభవిస్తాడు. అంతకన్నా ఏం కావాలి తనకి? మహాకాలుడి కృప వల్లే ఇవన్నీ తనకి అమరాయి. ఆయన తనకూడా ఉన్నంతవరకూ ఏమీ ఢోకా లేదు. ప్రతీరోజూ ఆయన్ని క్రమం తప్పకుండా స్మరించుకోవడం ఒకటే తాను చేయాల్సినది.

రోజులు ఇలా గడుస్తూంటే ఉజ్జయినిలో పగలల్లా వీధుల్లో తిరుగుతున్న కరాళుడికి మనుషులూ జంతువులతో పాటు అనేకానేక వింతలు కనబడుతున్నాయి. వాటిలో రోజూ విధిగా కనబడే ఒక మేకా, కుక్కలా ప్రవర్తించే ఎవరినీ కరవని సింహం, జంతువుల్లా ప్రవర్తించే మనుషులూ కనబడుతున్నారు. ఈ వింతలన్నింటినీ కరాళుడు కళావతికి చెప్తూనే ఉన్నాడు. కళావతి అటు స్వర్గంలోనూ, ఇటు భూమిమీదా జీవితం గడుపుతోంది. కరాళుడికి భార్య చెప్పే విశేషాలతో, ఆవిడతో గడిపే రాత్రులతో జీవితం ఎక్కడా వంక పెట్టడానికి లేదు. అటు కళావతీ బాగానే ఉన్నట్టుంది.

ఓ రోజు పొద్దున్నే స్వర్గానికి వెళ్లబోతూ కళావతి చెప్పింది, “ఈ రోజు రంభ ఒక ప్రత్యేకమైన నాట్యం చేయబోతోందిట, అందువల్ల అది పూర్తయ్యేదాకా నేను అక్కడనుంచి రావడానికి కుదరదు. కొంచెం ఆలశ్యం అవుతుంది వచ్చేసరికి, బెంగపెట్టుకోకు నా గురించి.”

కరాళుడు వెంఠనే భార్య చేయి పట్టేసుకుని వదలకుండా అన్నాడు, “ఎన్నాళ్లనుంచో నిన్ను అడుగుదామని అనుకుంటున్నాను, నాకు స్వర్గంలో జరిగే ఈ నాట్యం చూడాలని ఉంది. నన్ను కూడా ఏదో విధంగా తీసుకెళ్ళు.”

ఈ అసంభవమైన కోరిక విన్న కళావతి అదిరిపడి చెప్పింది, “నేను నిన్ను తీసుకెళ్తే చూసిన ఇంద్రుడికి కోపం వస్తే ఏమౌతుందో తెలుసా? మన ఇద్దర్నీ కూడా శపిస్తాడు. ఇప్పటికే నాకో శాపం ఉంది. మళ్ళీ మరొకటా?”

“నువ్వు ఏ విధంగానైనా నన్ను ఈ రోజు తీసుకెళ్ళవల్సిందే లేకపోతే నిన్ను వదిలేది లేదు,” కరాళుడు పట్టు వదలకుండా చెప్పాడు స్థిరంగా.

ఇద్దరూ అటూ ఇటూ వాదులాడుకున్నాక మొత్తానికి కళావతే మెట్టు కిందకి దిగి రావాల్సి వచ్చింది, తాను కరాళుడి చేతిలోంచి మాయమై వెళ్ళిపోగలదైనప్పటికీ. దీనికి రెండు కారణాలు – మొదటిది ఠింఠాకరాళుణ్ణి తనకి భర్తగా చూపించినది మహాకాలుడు, ఆయనకి కోపం తెప్పించడం మంచిది కాదు. రెండోది ఠింఠాకరాళుడి వల్లే తనకి ఇంద్రుడిచ్చిన శాపం పూర్తౌతుంది. అయితే ఠింఠాకరాళుడు అనుకున్నది వేరు – కళావతికి తనమీద ప్రేమ వల్లే మెట్టు దిగివచ్చింది. ఏదైతేనేం మొత్తానికి ఇద్దరికీ ఈ విషయంలో కుదిరిన సయోధ్య ప్రకారం కళావతి కరాళుణ్ణి పువ్వుగా మార్చి తలకొప్పులో ధరించి స్వర్గానికి వెళ్తుంది. అక్కడ కరాళుడు అన్నీ చూడగలడు కానీ నోరు విప్పలేడు, మనిషిగా మారలేడు. అంటే చూపు తప్ప మరోటి ఉండదు. అలా చూసినది మనసులో గుర్తుంటుంది. అది కుదరకపోతే కరాళుడికీ కళావతికీ సంబంధం చెల్లిపోయినట్టే.

కళావతి పెట్టిన నియమాలకి చచ్చినట్టూ ఒప్పుకున్నాడు ఠింఠాకరాళుడు. ఒప్పుకోక ఏం చేస్తాడు?

కళావతి స్వర్గం చేరాక ఇంద్రసభ అంతా తిరుగుతూంటే ఠింఠాకరాళుడు అన్నీ చూసాడు. తర్వాత ప్రత్యేకమైన రంభ నాట్యం ప్రారంభమైంది. అది ఎంతకాలం జరిగిందో కూడా తెలియనట్టూ సమయం గడిచిపోయింది. ఠింఠాకరాళుడికి మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది, కళావతి చేసిన పనికి; తనని స్వర్గానికి తీసుకురావడంలో ఆవిడ తీసుకున్న చొరవకీ, ధైర్యానికీను. కళావతి వెనక్కి వచ్చేస్తున్నప్పుడు ఇంకా స్వర్గంలో విశేషాలు కళ్ళార్పకుండా చూస్తున్న కరాళుడికి నాట్యం చేసే ఓ మేక కనిపించింది. అదిరిపడి మళ్ళీ చూసేసరికి తెల్సిన విషయం, ఆ మేకని తాను చాలాసార్లు ఉజ్జయినిలో వీధుల్లో చూసాడు, అయితే ఆ మేక స్వర్గానికి ఎలా వచ్చింది? తానైతే కళావతితో వచ్చాడు, కానీ వీధుల్లో తిరిగే మేక స్వర్గంలోకా? భూమ్మీదకి వెళ్ళగానే దీని సంగతి తేల్చాలి. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలిసేసరికి కరాళుడు ఉజ్జయినిలో తన ఇంట్లో మంచం మీద పడుకుని ఉన్నాడు, కళావతి వెచ్చటి కౌగిట్లో.

*****

మర్నాడు కళావతి స్వర్గానికి వెళ్లగానే, ఠింఠాకరాళుడు క్రితం రోజు తాను ఇంద్రసభలో చూసిన మేక – మునుపెప్పుడో ఉజ్జయినీ నగర సంచారంలో కనిపించినదాన్ని వెతకడానికి బయల్దేరాడు. ఆ మేకని చూడ్డానిక్కూడా అంత కష్టపడక్కర్లేకపోయింది. మూణ్ణాలుగు వీధులు తిరిగాక మేక కనబడేసరికి వెంఠనే దాన్ని పట్టుకుని కరాళుడు పలకరించేడు, “నేను నిన్నస్వర్గంలో చూసినది నిన్నే. అక్కడ నువ్వు చేసిన నాట్యం ఇక్కడ చేయగలవా?”

మేక కరాళుడు కేసి చూసింది కానీ ఏమీ శబ్దం చేయకుండా ఊరుకుంది. కరాళుడు మరోసారి మేకకేసి పరికించి చూసాడు. తాను చూసినదానిలో తప్పేం లేదు. అక్కడ స్వర్గంలో చూసిన మేకా ఇక్కడ ఉజ్జయినీ వీధులో మేకా నిశ్చయంగా ఒకటే. మరోసారీ మరోసారీ మేకని కొమ్ముల్తో సహా పట్టుకుని నాట్యం చేయమని నిర్భంధించాడు. అదే మౌనం, మేక మేకలాగే ఉంది గానీ నాట్యం లేదు, గీట్యం లేదు.

కోపం వచ్చిన కరాళుడు చివరికి అక్కడే ఒక్క దుడ్డుకర్ర తీసి ఏమీ సమాధానం ఇవ్వని మేక మొహం దుడ్డుకర్రతో బద్దలు కొట్టి రక్తం ఓడుతున్న ఆ జంతువుని అక్కడే వదిలేసి ఇంటికి చేరాడు. ఆ రోజు రాత్రి మాటల్లో తాను చేసిన పని చెప్పాడు కళావతితో – తాను స్వర్గంలో చూసిన మేక ఉజ్జయిని నగరం వీధుల్లో కనబడటం, దాన్ని, స్వర్గంలో చేసిన నాట్యం చేయమంటే అది చేయనప్పుడు దాని మొహానికి తాను దుడ్డుకర్రతో చేసిన బడితపూజా అన్నీ కలిపి.

కళావతి అదిరిపడి అంది, “నువ్వు చేసినపని ఎంత దారుణమైనదో తెలిసినట్టులేదు. ఆ మేక మరో చిల్లర దేవత. అది కూడా మిగతా నా లాంటి దేవతలతో పాటు భూమ్మీదకి వస్తూపోతూ ఉంటుంది. మనిద్దరికీ ఏదో అశుభం రాసిపెట్టి ఉంది కాబోలు లేకపోతే నువ్వా మేకని చావబాదడం దేనికీ? అది ఈ రోజు ఇంద్రుడికి జరిగినది చెప్పిందంటే మనకి మరో శాపం ఇస్తాడు. అయినా అసలు నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళడం నాదే తప్పు. మీ మగవాళ్ళకి బుద్ధీ జ్జానం ఉండవు. ఛీ, ఛీ.” చెప్పాల్సిన మాట చెప్పేసి అటు తిరిగి పడుకుంది కళావతి.

కోపం వచ్చిన కళావతిని బతిమాలే ఉద్దేశ్యంలో కళావతిని దగ్గిరకి లాక్కుంటూ చెప్పాడు ఠింఠాకరాళుడు, “అక్కడికక్కడ కోపం వచ్చి ఆ మేకని కొట్టడం తప్పే కానీ, మహాకాలుడు నన్ను చూసుకుంటానని చెప్పాక ఇంకా దేనికి విచారం? మరెప్పుడూ అలా చెయ్యనులే, క్షమించు,”.

“క్షమించు అని చులాగ్గా అనేస్తున్నావు కానీ రేపు ఏమౌతుందో తెలుసా? ఇంద్రుడికి ఎలాగో ఒకలాగ తెలుస్తుంది ఇదంతా. వెంఠనే నాకు రెండో శాపం ఇచ్చి తీరుతాడు. ఆ శాపం ఎటువంటిదో ఏమిటో?” దాదాపు ఏడుస్తూ అంది కళావతి.

“శాపం అంటూ ఇస్తే, అది ఇచ్చాక తప్పు ఒప్పుకుని కాళ్ళమీద పడితే అది పోవడానికి ఏదో ఒక దారి దొరకదా, అయినా మహాకాలుడున్నాడుగా, ఎందుకీ వ్యధ?”

“అవున్లే శాపం అనుభవించేది నువ్వు కాదు కదా, కబుర్లు చెప్పడం తేలికే,” ఎత్తిపొడిచింది కళావతి. దానితో కరాళుడి నోరు మూసుకోక తప్పలేదు.

*****

మర్నాడు కళావతి ఇంద్రలోకానికి వెళ్ళేసరికే ఇంద్రుడి దగ్గిర్నుంచి పిలుపు సిద్ధంగా ఉంది. కాళ్ళు వణుకుతుండగా వెళ్ళి నిలబడింది సభలో. అక్కడే ఉన్న మేకనీ, రక్తం ఓడుతున్న దాని మొహాన్నీ చూపించి గద్దిస్తున్నట్టూ అడిగేడు ఇంద్రుడు, “ఎవరు చేసిన పని ఇది?”

“ఏమైందండి? కాస్త వివరాలు చెప్తారా?”

“బుద్ధిలేనిదానా, ఏమైందని అడుగుతున్నావా? నువ్వు మొగుణ్ణి కొప్పులో పువ్వులాగా దాచి స్వర్గంలోకి తీసుకొస్తే నాకు తెలియదనుకున్నావా? ఈ మేక ఇక్కడ నాట్యం చేసినట్టూ భూమ్మీద చేయాలని నీ మొగుడు అడిగాడుట. అలా చేయనప్పుడు ఈ మేక దేవతాస్వరూపం అని తెలిసీ మొహం బద్దలుకొట్టాడు. భూమ్మీద జీవితం బాగుంటుందని నువ్వు చెప్పావు మొదట్లో. దాని ప్రకారం శాపం ఇచ్చి అక్కడే బతకమంటే ఇప్పుడు నువ్వు చేసిన నిర్వాకం ఇది. దేవతలమైన మనం ఏనాడూ దివ్య దృష్టి ఉపయోగించం అనవసరంగా కానీ ఈ దేవత వచ్చి ఇలా నీ మొగుడు మొహం బద్దలు కొట్టాడని చెప్పేసరికి జరిగినదంతా నేను దివ్యదృష్టితో చూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు?”

“మా ఆయన – అదీ చిత్త చాంచల్యం అణుచుకోలేని మానవుడు, చేసిన పనికి నేనెలా బాధ్యురాలినౌతాను?” అమాయకంగా చెప్తూ ఏదో నటించబోయింది కళావతి.

“బుద్ధి ఉండే అంటున్నావా ఆ మాట? నువ్వు అసలు ఆ మొగుణ్ణి ఇక్కడకి తీసుకురావడమే తప్పు. నీ భాధ్యత ఏమీ లేదంటున్నావా? ఈ పనికి నువ్వు నాగపురంలో రాజు నృశింహదేవుడు ప్రస్తుతం కట్టించే ఆలయం గోడమీద శిలాప్రతిమై పడి ఉండు!” మరోసారి శపించాడు ఇంద్రుడు.

అక్కడే సభలో ఉన్న కళావతి తల్లీ, కళావతీ శాపం పోయేలాగ దారి చూపించమని వణుకుతున్న శరీరాలతో కాళ్ళమీద పడి ఏడుస్తుంటే, చెప్పాడు ఇంద్రుడు, “ఆ ఆలయం మొత్తం పునాదులతో సహా నేలమట్టం అయిననాడు నీకు శాప విమోచనం. కానీ ఆ శాప విమోచనం అయ్యాక మొదటి శాపం ప్రకారం మళ్ళీ మానవ జీవితం సాగించాలి. అప్పటికి ఠింఠాకరాళుడు బతికి ఉంటాడా, పోతాడా, ఉంటే జరాభారంతో నీ మెడకి గుదిబండలా తయారౌతాడా అనేది నువ్వే చూసుకో. బుద్ధి తెచ్చుకుని ఇటువంటి పనులెప్పుడూ మరోసారి చేయకు.”

“ఎలాగా శాపం అనుభవించక తప్పదు కనక నేను ఓ సారి మా ఆయనకి కనిపించి ఈ శాపం సంగతి చెప్పి నాగపురం వెళ్ళేందుకు సమ్మతించండి. లేకపోతే నేను కనబడక ఆయన మతిపోయినవాడై చావుకి సిద్ధమైతే ఆ ఆత్మహత్యా పాపం నాకు చుట్టుకుంటుంది.”

“సరే వెళ్ళు.”

భూమ్మీదకి వచ్చిన కళావతి ఠింఠాకరాళుడికి తన వంటి మీద నగలన్నీ నిలువుదోపిడీ ఇచ్చి కరాళుడు చేసిన వెధవ పని మూలాన తనకి తగిలిన శాపం ఏకరువు పెట్టి నాగపురానికి సాగిపోయింది అక్కడ ఆలయంలో గోడమీద శిలాప్రతిమలా గడపడానికి. ఠింఠాకరాళుడికి మరో మాట మాట్లాడే అవకాశమే రాలేదు ఈ సందులో.

*****

కళావతి వెళ్ళిపోయాక బావురుమంటున్న ఇంట్లో కరాళుడికి ఏమి చేయడానికీ పాలుపోలేదు. ఎంతకీ తెగని ఏడుపు తప్ప మరోటేమీ మిగల్లేదు కరాళుడికి. ఏ గదిలోకి వెళ్ళినా కళావతి అక్కడున్నట్టూ అనిపించడం, ఆవిడ అడుగుల చప్పుడు వినిపించడం జరుగుతూనే ఉన్నాయి. కంచం ముందు తిండి లేదని కాదు కానీ ముద్ద దిగడం లేదు, ఒకప్పుడు కళావతితో పాటూ రోజూ సంతోషంగా ఇద్దరూ కల్సి భోజనం చేయడం గుర్తు వస్తూనే ఉంది. ఇంకపోతే పడకగదిలోకి వెళ్ళడానికే భయం. కళావతి లేని ఇల్లు శ్మశానంలాగా ఉంది. అసలు తనని స్వర్గానికి తీసుకెళ్ళమని కళావతిని అడిగినందుకూ, అక్కడ మేకని చూసినందుకూ, వెనక్కి వచ్చాక ఉజ్జయినీ వీధుల్లో ఆ మేకని తనముందు నాట్యం చేయమన్నందుకూ, దాన్ని తర్వాత కొట్టినందుకూ పశ్చాత్తాపం చెందుతూ అలా ఎడతెరిపిలేకుండా ఠింఠాకరాళుడి ఏడుపు దాదాపు వారం రోజులు సాగింది. అప్పటికి తననెప్పుడూ దగ్గిరుండి రక్షిస్తానని చెప్పిన మహాకాలుడు మనసులో మెదిలాడు.

మర్నాడు రాత్రి మహాకాలుడి గుడిలో ఆయన కాళ్లమీదపడ్డప్పుడు మహాకాలుడిచ్చిన సలహా – ఇంత జరిగాక అయినదానికి ఏడిస్తే ప్రయోజనం లేదు. ఏదో విధంగా కరాళుడు నాగపురం వెళ్ళి అక్కడి ఆలయం పునాదులతో కూలగొట్టే ఉపాయం ఆలోచించాలి. అయితే ఆ గుడిని కరాళుడు కానీ కూలగొట్టడానికి ప్రయత్నిస్తే రాజు నృశింహదేవుడు చంపి పాతర వేయిస్తాడు. ఆ ఆలయం కట్టి పది రోజులు కూడా కాలేదు. మరో దారి ఆలోచించాలి. ఇదంతా చెప్పాక మహాకాలుడు చివర్న అన్నాడు కరాళుడితో, “నీ ఆలోచనలూ, తెలివీ చూపించే సమయం ఆసన్నమైంది. నీ జీవితం సుఖంగా జరగడానికి నేను నీకు అన్నీ అమర్చి పెట్టాను మొదట్లో కానీ వీటినన్నింటినీ నువ్వు చేతులారా పోగొట్టుకున్నావు కనక ఇప్పుడు నీ చేతనైంది చేసి కళావతిని మళ్ళీ సంపాదించుకో.”

ఆ తర్వాత ఠింఠాకరాళుడు ఏడుపుతో సాధించేది ఏమీ లేదు కనక రెండు రోజులు దీర్ఘంగా ఆలోచించాడు ఏం చేయాలో. తాను ఉజ్జయినీ నగరంలో ఏడుస్తూ కూర్చుంటే కళావతి అలాగే శిలా ప్రతిమలా పడి ఉంటుంది. ఈ కొత్తగా కట్టిన ఆలయం కూల్చడం అనేది డబ్బుతో అయ్యే పని కాదు కనక మరొక దారి ఆలోచించాలి. ఆ గుడి చుట్టూ ఉన్న ప్రజలకి గుడి వల్ల అనర్ధం జరుగుతోంది అని చెప్పి వాళ్లచేతే గుడి పడగొట్టించడం ఓ పద్ధతి. కానీ రాజు నృశింహుడు ఆ ప్రజలని నమ్ముతాడా? అదీగాక ఆ ప్రజలే రాజుని గుడి కట్టించమని అడిగి ఉండొచ్చు. ఇప్పుడు తాను గుడి వల్ల అనర్ధం అంటే ముందు తనని తన్నడానికి బయల్దేరరూ? తల నెప్పెట్టేదాకా ఆలోచించిన కరాళుడికి ఓ ఊహ తట్టింది. దాన్ని అమల్లో పెట్టడానికి కళావతి ఇచ్చిన నగలూ, డబ్బూ దస్కం పట్టుకుని నాగపురం బయల్దేరాడు.

*****

నాగపురం చేరిన కరాళుడు తనకు కళావతి ఇచ్చిన డబ్బుని, నగలని ఐదు భాగాలు చేసి ఒక్కో దిక్కున ఒక్కొక్కచోటా నాలుగు భాగాలనీ, అయిదో భాగాన్ని కొత్తగా కట్టిన గుడి ప్రాంగణంలో ఎవరికీ తెలియని చోట పాతిపెట్టాడు. ఆ తర్వాత నాలుగురోజులకి ఆ గుడికి దగ్గిరలోనే నది పక్కన ఓ గుడిసె కట్టుకుని సాధువుగా అవతరించాడు – ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడీ సాధువు. కృష్ణాజినాంబరం కట్టుకుని ఏవో మంత్రాలు ఉఛ్ఛరించడం తప్ప ఎవరినీ పలకరించడు. రోజుకి మూడుసార్లు నదిలో స్నానం చేయడం, రోజులో చాలాకాలం మౌనవ్రతంలోనూ, ధ్యానంలోనూ గడపడమే. జనం సాధువు దర్శనం కోసం రావడం మొదలైంది. మొదట్లో ఇద్దరు ముగ్గురుగా వచ్చిన జనం తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. అయినా సాధువు ఎవరితోనూ మాట్లాడలేదు.

ఈ విషయం నెలా నెలన్నరలో మెల్లిగా రాజుగారికి జేరింది. ఆయన సాధువుకి పట్టుబట్టలూ, భోజనం, పల్లకీ పంపి తన సభకి ఆహ్వానించాడు. సాధువు తన గుడిసె తప్ప మరో చోటుకి ఎక్కడకీ వెళ్లడుట అందువల్ల రాజుకి ఆశాభంగమైంది. మరోసారీ మరోసారీ పిల్చినా రాకపోయేసరికి రాజు నృశింహదేవుడే బయల్దేరి సాధువుని చూడ్డానికి నది దగ్గిర ఉన్న గుడిసె కి వచ్చాడు. రాజు వచ్చాక మాట్లాడకపోతే బాగుండదన్నట్టూ రెండు మూడు మాటలు అన్నాక రాజు ఏవో ధర్మసందేహాలు అడిగాడు. ఆ తర్వాత సంభాషణ సాగినది సాధువు మితభాషిగా ఉండడానికీ కారణం వగైరా వగైరా.

రాజు అడిగిన ప్రశ్నలకి సాధువు ఏదో సమాధానం చెప్పబోతూంటే ఈ లోపులే దూరంగా ఒక నక్క ఊళవేయడం వినిపించింది. దాన్ని చాలా శ్రద్ధగా విన్న సాధువు “అహా, ఆహా” అంటూ బిగ్గరగా నవ్వాడు అందరికీ వినిపించేలాగా.

అప్పటికే బాగా మితభాషి అని పేరు తెచ్చుకున్న సాధువు ఇలా నవ్వేసరికి రాజుగారికి మరింత కుతూహలం వచ్చి అడిగాడు, “ఏమిటలా నవ్వుతున్నారు నక్క కూత విన్నాక?”

“నాకు పశుపక్ష్యాదులు మాట్లాడేవన్నీ అర్ధం అవుతాయి కనక నక్క అరుపు విని నవ్వొచ్చింది. ఆ నక్క చెప్పేదేమిటంటే ఈ నగరంలో తూర్పు దిక్కున ఫలానా చోట కొంత బంగారం పాతిపెట్టి ఉందిట. నాలాంటి సాధువుకి బంగారం తుఛ్ఛమైనది. కానీ నువ్వు రాజువి కనక ఆ ధనం నీకు ఉపయోగపడొచ్చు, వెళ్ళి ఆ బంగారం తవ్వి తెచ్చుకో,” సాధువు సమాధానం చెప్పాడు.

సాధువు చెప్పినచోట బంగారం దొరకడంతో ఆయనమీద బాగా నమ్మకం పెరిగిన రాజు ఇప్పుడు ప్రతీవారం రావడం మొదలుపెట్టాడు సాధువుని చూడ్డానికి. రెండోవారంలో ఓ పక్షి అరుపు విన్నట్టూ, మూడోవారంలో ఓ కుక్క అరుపు విన్నట్టూ, నాలుగోవారంలో కప్ప బెకబెకలాడడం విన్నట్టూ నటించి సాధువు నాలుగు దిక్కుల్లో పాతిపెట్టి ఉన్న కళావతి నగలూ డబ్బూ దస్కం నాగపురం రాజు నృసింహదేవుడికి దక్కేలాగా చేసాడు. అయిదో వారంలో రాజు సాధువుని చూడబోయేసరికి సాధువు రాజు కొత్తగా కట్టించిన గుడిలో కళావతి శిల్పంగా మారిన స్థంభం దగ్గిర ఉన్నాడు ఏదో నిశితంగా పరికిస్తున్నట్టూ.

సాధువుగా అవతారం ఎత్తిన ఠింఠాకరాళుణ్ణి చూడగానే శిలా ప్రతిమగా మారిన కళావతి గుర్తించింది కానీ తాను ఇంద్రుడి శాపంతో ఇంట్లోంచి వెళ్ళిపోవడం వల్ల కరాళుడికి కలిగిన వైరాగ్యం, సాధువుగా మారడం అన్నీ గ్రహించి కళ్లలో నీరు కార్చింది. రాజు సాధువుని చూడ్డానికి వచ్చేసరికి ఆయనకి కనిపించిన దృశ్యంలో సాధువు గుడి స్థంభం మీద శిలా ప్రతిమ కేసి నిశితంగా చూస్తూంటే శిలా ప్రతిమ కన్నీరు కారుస్తోంది. ఏనాడూ ఇటువంటి వింత చూడని రాజు కంగారు పడి అడిగాడు దీని సంగతి.

సాధువు చాలా దుఃఖంలో ఉన్నట్టూ చెప్పాడు, “ఈ విషయం ఇక్కడ బహిరంగంగా మాట్లాడరాదు. ఇప్పటివరకూ చాలాసార్లు నువ్వు నన్ను నీ భవనానికి ఆహ్వానించావు కానీ నేను రాలేదు. ఇప్పుడు అక్కడకే పోదాం అక్కడ మిగతా విషయాలు రహస్యంగా చెప్తాను నీకు.”

మరో మాట లేకుండా పల్లకీలో రాజభవనానికి చేరారు ఇద్దరూ.

రహస్యమందిరంలో జేరాక రాజుకి చెప్పాడు సాధువు, “ఇన్నాళ్ళూ నువ్వు నన్ను చూడ్డానికి వస్తున్నావు కనక నీ క్షేమం కోసం, నీ అభివృద్ధికి పశుపక్ష్యాదులు నాకు నిఘూఢంగా చూపించిన నిధులు ఇస్తూ వచ్చాను. నీ క్షేమం కోరి ఈ రోజు నువ్వు కొత్తగా కట్టించిన ఆలయంలో ఏముందా, వాస్తు అదీ సరిపోయిందా అని చూడబోయాను. కానీ అక్కడ శిలాప్రతిమ ఏడుస్తూ చెప్పినది వినేసరికి మతిపోయింది. ఆవిడ చెప్పినది మన ఇద్దరికీ తప్ప మరొకరికి తెలియకూడదు. అందుకే నిన్ను రహస్య మందిరానికి రమ్మన్నాను.”

కంగారు ఎక్కువైన నృసింహదేవుడు అడిగాడు, “ఏమీ దాచకుండా చెప్పండి, ఆ శిలాప్రతిమ కన్నీరు వల్ల నాకు గానీ, రాజ కుటుంబానికి కానీ, నా రాజ్యానికి కానీ ఏమైనా అనర్ధం రాబోతోందా?”

“అనర్ధం అంటూ చిన్నగా అంటున్నావా? ఆ గుడిలో ఫలానా చోట మరింత విలువైన బంగారం దాచిపెట్టబడి ఉంది. అయితే ఆ ఆలయానికి వాస్తు ఎవరు పెట్టారో కానీ ఓ వారం రోజుల్లో నీకు దారుణమైన చావు రాబోతోంది. తనకి ఏ రాజు అయితే గుడి కట్టించాడో ఆ రాజు వారం రోజుల్లో చచ్చిపోతాడని తెలిసి ఆ శిలాప్రతిమ కన్నీరు కారుస్తోంది.”

రాజుకి ఇంతకుముందు నాలుగు సార్లు నిధి నిక్షేపాల గురించి సాధువు చెప్పిన ప్రతీ విషయం అక్షరాలా జరిగింది. ఈ నమ్మకం వల్లా, మరణ భయంతో, కంగారుతోనూ రాజు సాధువు కాళ్ళమీద పడి అడిగాడు, “మరి దీనికి విరుగుడు లేదా? ఏదో విధంగా మీరే దీన్నితప్పించలేరా? మీకు పశుపక్ష్యాదుల భాష కూడా తెలుసు. వాస్తు కావాలిస్తే మారుద్దాం. ఏదో ఒకటి చేయండి దయచేసి.”

కళ్ళు మూసుకుని కాసేపు ధ్యానం చేసాక సాధువు చెప్పాడు, “తప్పుడు వాస్తు, చెడ్డ ప్రదేశంలో కట్టిన ఆ ఆలయమే నీ చావుని చూపిస్తోంది. దీనికి ఒకటే విరుగుడు. కానీ నేను చెప్పేది నీకు నచ్చకపోవచ్చు.”

“చావు తప్పుతుందంటే ఏం చేయడానికైనా సిద్ధమే. ఏమీ అనుమానపడకుండా చెప్పండి ఏం చేయాలో?”

“ఆ గుడిలో ఉన్న పూజావిగ్రహాన్ని బయటకి తీసి, ఆ గుడిని పునాదులతో సహా కూల్చేసి మరోచోట బాగా వాస్తు, మంచి ప్రదేశం కల్సి ఉన్నచోట మరో ఆలయం కట్టి మళ్ళీ ఆ విగ్రహాన్ని ప్రాణప్రతిష్టచేయడం తప్ప మరోమార్గం లేదు. ఆలయం తవ్వినప్పుడు దొరికే బంగారం కొత్త ఆలయం కట్టడానికి ఉపయోగించవచ్చు; ఆలయం కట్టడానికి సమయం తీసుకోవచ్చు కానీ వారంరోజుల లోపుల ఇప్పుడున్న ఆలయం పునాదులతో సహా కూల్చకపోతే నీ ప్రాణం పోవడం తధ్యం,” ఇంకేమీ చెప్పడానికి లేదన్నట్టూ సూచిస్తూ సాధువు లేచాడు వెళ్లడానికి.

*****

సాధువు వారం రోజులలో అన్నాడు కానీ సరిగ్గా మూడు రోజులకి నృశింహదేవుడు కొత్తగా కట్టిన ఆలయాన్ని పునాదులతో సహా తవ్వించి ధ్వంసం చేయించడం సాధువు తన గుడిసెలోంచి గమనించాడు. గుడి ధ్వంసం అయ్యాక కళావతి శాపం పోయి ఆవిడ ఎప్పుడైతే ఉజ్జయిని నగరం వెళ్ళే దారి పట్టుకుందని గమనించాడో అప్పుడే సాధువు తన వేషం విప్పేసి కళావతిని అనుసరించి ఉజ్జయిని చేరుకున్నాడు. ఆ రోజు రాత్రి కళావతిని తన కౌగిట్లో చేర్చి ఠింఠాకరాళుడు తాను ఆడిన నాటకం అంతా వివరించి చెప్పాడు – ఆవిడ తనకి ఇచ్చిన నగలని నగరంలో నాలుగు దిక్కులా ఎలా పాతిపెట్టినదీ, ఎలా రాజుకి నమ్మకం కలిగించి ఆలయం కూలగొట్టించినదీ అన్నీ కలిపి. ఇద్దరూ కలిసి మహాకాలుడికో నమస్కారం పెట్టుకుని నవ్వుకుంటూ సంతోషంగా రాత్రి గడిపాక మర్నాడు పొద్దున్నే కళావతి అలవాటు ప్రకారం ఇంద్రలోకానికి బయల్దేరింది.

స్వర్గంలో కళావతిని చూడగానే ఇంద్రుడికి కలిగిన ఆశ్చర్యం ఇంతా అంతా కాదు. సభ అయిపోయాక పిలిచి అడిగాడు, “నీకు అత్యంత దారుణమైన శాపం ఇచ్చాను చాలాకాలం గుడిలో స్థంభంమీద శిలా ప్రతిమగా ఉండమని. ఆ శాపం ఎలా పోయింది? శాపం ఇచ్చి ఆరునెలలు కూడా తిరిగినట్టులేదే?”

కళావతి మొత్తం కధ – ఠింఠాకరాళుడికి మహాకాలుడి మీద ఉన్న భక్తీ, ఆయనని నమ్ముకుని కరాళుడు నాగపురం రాజు మీద ఉపయోగించిన యుక్తులూ, రాజుని ఎలా మోసం చేసి, ఆయన కొత్తగా కట్టించిన ఆలయం ఆయన చేత్తోనే ఎలా పునాదులతో సహా కూలగొట్టించాడో అన్నీ – పూసగుచ్చినట్టు చెప్పేసింది.

కధ అంతా విన్న ఇంద్రుడు విరగబడి నవ్వాడు ఠింఠాకరాళుడు చేసిన పనికి. అక్కడే ఉన్న బృహస్పతి కేసి చూసేసరికి ఆయన అన్నాడు, “ఈ జూదర్లు ఉన్నారు చూసావా, వాళ్ళంతే. మోసం చేయడం లో అతి నేర్పరులు. వాళ్లని ఎవరూ ఏమీ చేయలేరు.”

“ఆయన నాతో పెళ్ళికి ముందే జూదం మానేసి ఇప్పుడు మహాకాలుడి మీదే ఆధారపడ్డారండి అన్నింటికీ,“ కళావతి అంది నవ్వుతూ.

మహాకాలుడి పేరు విన్నాక కొంచెం జంకిన ఇంద్రుడు చెప్పాడు, “ఎంతైనా మీ ఆయన యుక్తి బాగానే పారింది. ఇప్పట్నుండి మీ ఇద్దరికీ సంసారం బాగా సంతోషంగా ఉండేలా వరం ఇస్తున్నాను. దేనికీ లోటుండదు. ఆ జీవితం అయిపోగానే మళ్ళీ ఇంద్రలోకానికి వస్తావు. శుభం.”

సభలోంచి వెళ్లడానికి లేస్తూ కళావతి అంది ఇంద్రుడితో, “నేను మొదట్లో చెప్పాను కదా, భూమ్మీద ఉండే సంతోషం వేరు, అక్కడుండే సుఖాలకీ, మనకి ఇక్కడ ఉండే సుఖాలకీ వ్యత్యాసం ఉంది.”

“సరే ఆ సంగతి మరో సారి చూద్దాం,” కళావతి చెప్పినదానితో తాను ఒప్పుకున్నాడా లేదా అనే విషయం పూర్తిగా చెప్పకుండా ఇంద్రుడు మాట దాట వేసాడు.

(కధా సరిత్సాగరం నుంచి – Story of Ṭhiṇṭhákarála the bold gambler
http://www.gutenberg.org/files/40588/40588-h/40588-h.htm#v2ch121)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked