కథా భారతి

‘గురు దేవో భవ!’

-G.S.S. కళ్యాణి

ముందుగదిలోని వాలుకుర్చీలో కూర్చుని రేడియోలో పాటలు వింటున్న చంద్రం కళ్లజోడును సరి చేసుకుంటూ గోడగడియారం వంక చూశాడు. సమయం మధ్యాహ్నం మూడు గంటలు దాటి ఇరవై నిమిషాలు అయింది.

“రాముడింకా బడినుండీ రాలేదేంటో?”, అన్నాడు చంద్రం గేటువైపు చూస్తూ.

“వస్తాడులెండి! అయినా మీకు మీ మనవడంటే ఎంత ప్రేముంటే మాత్రం? రోజూ కన్నా ఒక్క పది నిమిషాలు ఆలస్యమైనందుకు అంత కంగారు పడతారెందుకూ? ఎంతలేదన్నా వాడు పదేళ్లవాడయ్యాడు. పైగా వాడిని బడినుండీ తీసుకొచ్చేందుకు మన కోడలు హిమజ కూడా వెళ్ళింది కదా?”, అంది అక్కడే కూర్చుని పుదీనాకు వలుచుకుంటున్న చంద్రం భార్య అలివేలు.

“నేనేం కంగారు పడట్లేదులే! ఊరికే అడిగా!”, అంటూ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు చంద్రం.

అంతలో గేటు తీసిన చప్పుడైంది. హిమజ అభిరామ్ తో ఇంట్లోకి వచ్చింది. సాధారణంగా బడి నుంచీ ఇంటికి రాగానే ‘తాతయ్యా’ అంటూ చంద్రాన్ని వాటేసుకునే అభిరామ్ ఆ రోజు ఎందుకో చంద్రం వంక కూడా చూడకుండా సరాసరి పడక గదిలోకి వెళ్ళిపోయాడు.

“ఏమ్మా హిమజా? ఏమైంది రాముడికీ? ఎవరైనా ఏమైనా అన్నారా వాడిని?”, హిమజను అడిగాడు చంద్రం.

“అవును మామయ్యగారూ! నిన్న వాడిని ఎంత బతిమలాడినా వాడు హోమ్ వర్క్ చెయ్యకుండా ఆడుకుంటూ కూర్చున్నాడు కదా? ఇవాళ వాళ్ళ టీచర్ క్లాస్ లో మిగతా పిల్లలందరిముందూ వాడిని హోమ్ వర్క్ చెయ్యలేదని కోప్పడిందట! వాడికి అవమానమైపోయింది!”, అంది హిమజ.

“పోన్లేమ్మా! బడి నుంచీ రాగానే రోజూ వాడు నా దగ్గరకు వస్తాడు కదా?! ఇవాళ నేనే వాడి దగ్గరకు వెడతాను!”, అంటూ పడక కుర్చీలోంచి కష్టం మీద లేచి తన చేతి కర్ర పట్టుకుని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ అభిరామ్ దగ్గరకు వెళ్లి వాడిని దగ్గరకు తీసుకున్నాడు చంద్రం.

” ఏరా రాముడూ! బాధ పడకురా! ఇకనుంచీ అటువంటి తప్పు చెయ్యకుండా ఉంటే సరి! నీ హోమ్ వర్క్ ఎప్పటికప్పుడు పూర్తి చేసేయ్!”, అన్నాడు చంద్రం.

“నేను రేపటినుండి అసలు బడికే వెళ్ళను! నాకు ఆ టీచర్ వద్దంటే వద్దు!”, అంటూ ఏడుపు మొదలు పెట్టాడు అభిరామ్.

“సరే! ఆ విషయం అక్కడికి వదిలి పెట్టు. అయినా ఇప్పుడేగా బడినుంచీ వచ్చావూ? ఆకలేస్తుందేమో! కొంచెం ఏదైనా తిను!”, అంటూ అభిరామ్ ని బుజ్జగించి డైనింగ్ హాల్ లోకి తీసుకొచ్చాడు చంద్రం.

అలివేలు వేడి వేడి జీడిపప్పు ఉప్మా ప్లేట్ లో పెట్టి అభిరామ్ ముందు ఉంచింది.

“నాకు తినబుద్ధి కావట్లేదు తాతయ్యా!”, అన్నాడు అభిరామ్ ఏడుపు ముఖంతో.

చంద్రం ఏదో చెప్పబోయేంతలో, “ఒరేయ్ రామూ! దిగులు పడకురా! నా బంగారుకొండవైన నిన్ను తిట్టి అవమానపరచడానికి ఆ టీచర్ కి ఎంత ధైర్యం?? ఆవిడ మీద రేపే మీ ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇచ్చేస్తాను! నువ్వేమీ ఆ బడి వదలక్కర్లేదు! రేపట్నించీ మీ టీచర్ బడికి రావాలో అక్కర్లేదో మీ ప్రిన్సిపాల్ నిర్ణయిస్తారు!! “, అంది హిమజ ఆవేశంగా.

తన తల్లి అన్న మాటలతో అభిరామ్ కొంత ఊరట చెంది ఉప్మా తిన్నాడు.

ఆ తర్వాత కాసేపు ఆటలు ఆడుకుని, రాత్రి భోజనం ముగించి ఎప్పట్లాగే హాల్లో పడక కుర్చీలో కూర్చుని ఉన్న చంద్రం పై పడుకుని, అతని గుండెలపై తల వాల్చి, “తాతయ్యా! ఇవాళ్టి కథ చెప్పు! నాకు ఒక కొత్త కథ కావాలి!”, అన్నాడు అభిరామ్.

” ఓ! తప్పకుండా! నేను ఇవాళ నీకొక ఒక సరికొత్త కథ చెప్తాను. విను!”, అంటూ చంద్రం కథ చెప్పడం మొదలుపెట్టాడు.

“అనగా అనగా బంటి అని ఒక బాబు ఉండేవాడు. వాడికి ప్రతిరోజూ ఆలస్యంగా నిద్ర లేవటం అలవాటు. అందువల్ల వాడు ప్రతిరోజూ బడికి ఆలస్యంగా వెడుతూ ఉండేవాడు. ఓసారి వాళ్ళ మాష్టారు బడికి ఆలస్యంగా ఎందుకొచ్చావని బంటీని కోప్పడి వాళ్ళ బడి చుట్టూ పరిగెడుతూ పది రౌండ్లు పూర్తి చెయ్యమని వాడికి శిక్ష వేశారు. బంటీ పరిగెడుతూ ఉంటే అతడి స్నేహితులంతా బంటీని చూసి నవ్వుతూ ఎక్కిరించడం మొదలుపెట్టారు. బంటీకి చాలా బాధ కలిగి ఆ మాష్టారిపై ఎక్కడాలేనంత కోపం వచ్చింది! ఆ రోజు ఇంటికి వెళ్లి వాళ్ళమ్మకు విషయం చెప్పి తాను బడికి ఇక ఎప్పటికీ వెళ్లనని ఏడుస్తూ అన్నాడు బంటీ. బంటీ వాళ్ళమ్మ ఆవేశంతో ఊగిపోతూ, ‘ఒరేయ్ బంటీ! నాకున్న ఒక్కగానొక్క గారాల పట్టివి! నీ చేత అంత పరిగెత్తిస్తారా మీ మాష్టారు?! ఇదిగో! నీకిప్పుడే చెప్తున్నా! కష్టాన్ని చూసి భయపడి పారిపోయే వాళ్ళు పిరికివాళ్ళు! మనం కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి! అంటే నువ్వు రేపటినుండి కచ్చితంగా బడికెళ్ళి తీరాలి! అయితే ఒక షరతు! నువ్వు ప్రతిరోజూ బడికి సమాయానికి వెళ్ళిపోవాలి! ఆలస్యం అస్సలు కాకూడదు. మీ మాష్టారుకి ఇంకెప్పుడూ నిన్ను శిక్షించే అవకాశం ఇవ్వకు! గుర్తుంచుకో! ఆయనకు అదే తగిన శాస్తి!!”, అంది. బంటీకి ఆ ఆలోచన చాలా బాగా నచ్చింది. అంతే! ఆ మరుసటి రోజునుండీ తనను ఒక్క మాట కూడా అనే అవకాశం తన మాష్టారుకి ఇవ్వలేదు బంటీ! పొద్దున్న లేవగానే ఎవరో తరుముతున్నట్టు బడి గంట మోగే లోపే బడికి చేరుకోవడం అలవాటు చేసుకున్నాడు బంటీ. ఓరోజు బంటీ వాళ్ళ లెక్కల మాష్టారు బంటీ ఏదో లెక్క తప్పు చేశాడని చెవి మెలేశారు. ఆపై బంటీ పట్టుదలతో లెక్కలపై శ్రద్ధ పెట్టి లెక్కల్లో నూటికి నూరు తెచ్చుకోవడం ప్రారంభించాడు. క్లాసు లో ఏదైనా తప్పు చేసినప్పుడు మాష్టారు తన వంక కోపంగా చూసినా సరే బంటీ తన ప్రవర్తనను ఎప్పటికప్పుడు మార్చేసుకుంటూ మాష్టారు ఎలా చెప్తే అలా వినడం అలవాటు చేసుకున్నాడు. ఆ ఏడు బడిలో జరిగిన పరుగుల పోటీలో బంటీకి ప్రథమ బహుమతి వచ్చింది. ఆలస్యంగా బడికి వెళ్లిన రోజు మాష్టారు వేసిన శిక్ష, ఆ పరుగుల పందెంలో బంటీకి ఉపయోగపడిందని అందరూ అంటూ ఉంటే బంటీకి ఆశ్చర్యం కలిగింది. అంతేకాదు! ఆ యేటి పరీక్షలలో బంటీ వాళ్ళ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచాడు! బంటీని అభినందిస్తూ బడివాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బంటీ వాళ్ళ అమ్మ కూడా వెళ్ళింది. ఆవిడను వేదికపైకి పిలిచినప్పుడు ఆవిడ బడిలో ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు చెప్పి బంటీని శిక్షించిన మాష్టారి వైపు తిరిగి ప్రత్యేకంగా నమస్కరించింది. ఆయనంటే కోపమున్న బంటీకి అమితాశ్చర్యం కలిగింది. ఇంటికెళ్ళంగానే వాళ్ళమ్మను ఆ నమస్కారానికి కారణమడిగాడు బంటీ. అప్పుడు వాళ్ళమ్మ, ‘చూడు బంటీ! నువ్వు ఈ రోజు ఇంత విజయాన్ని సాధించావంటే అందుకు కారణం ఆ మాష్టారే! ఆయన ఆ రోజు నిన్ను అలా అని ఉండకపోతే నువ్వీరోజు అందరిలా సాధారణ విద్యార్థిగా మిగిలిపోయి ఉండేవాడివి. నిజమైన గురువు ఎప్పుడైనా తన శిష్యుల ఉన్నతిని కోరుకుంటాడు. పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు, వారిని శిక్షించి అయినా సరైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత గురువుకుంది. ఆ శిక్ష కూడా పిల్లలు మేలు చేసేదై ఉంటుంది!అలాగని ఆ మాష్టారుకి పిల్లలపై ఎప్పటికీ కోపం ఉండిపోతుందని అనలేం. పిల్లల ప్రవర్తన మారి ఏదైనా ఘనత సాధించినప్పుడు తల్లిదండ్రులతో సమానంగా ఆనందించేవారిలో గురువు కూడా ఉంటారు! ఇవాళ నిన్ను వేదికపై మీ ప్రిన్సిపాల్ మెచ్చుకుంటునప్పుడు మీ మాష్టారి కళ్ళల్లో ఆనందాన్ని చూశాను! ఆయన నిష్కల్మషమైన చిరునవ్వు నీ జీవితాన్ని సంతోషమయం చేస్తుంది! ‘గురు దేవో భవ’ అన్న వాక్యానికి ఆయన సరిగ్గా సరిపోతారు! అందుకే ఆయనకు నమస్కరించా!’, అంది బంటీ తల్లి. తన తల్లి మాటలలో సత్యాన్ని గ్రహించాడు బంటీ. ఇక ఆ తరువాత బంటీ ఉత్తమ విద్యార్థిగా ఎదిగి, సమాజంలోని ఉన్నత వ్యక్తిత్వం గల వారిలో ఒకడిగా గుర్తింపుని పొందాడు!”, అన్నాడు చంద్రం.

కథంతా శ్రద్ధగా విన్న అభిరామ్, “తాతయ్యా! బంటీ చేసిన పని బాగుంది. నేను కూడా ఇక నుండీ మా మాష్టారు ఇచ్చిన హోమ్ వర్క్ ఎప్పటికప్పుడు చేసేసి, ఆవిడకు నన్ను కోప్పడే అవకాశమే ఇవ్వను! ఇక నేను పడుకుంటా. రేపు త్వరగా లేచి బడికెళ్లేలోపు నా హోమ్ వర్క్ పూర్తి చేసేస్తా!”, అంటూ పడక గదిలోకి వెళ్ళిపోయి నిద్ర పోయాడు అభిరామ్.

హిమజ మజ్జిగ గ్లాసు తీసుకుని వచ్చి చంద్రానికి ఇస్తూ, “మామయ్యగారూ! మీరు చెప్పిన కథలోని సారాంశం నేను కూడా అర్ధం చేసుకున్నాను ! తొందరపడి మాటలన్నందుకు నన్ను మన్నించండి!”, అంది హిమజ.

“అవునమ్మా! పిల్లలకు చదువు చెప్పే గురువులపై గౌరవం పెరగాలంటే ముందు ఆ పిల్లల తల్లిదండ్రులూ, పెద్దలూ, ఆ గురువులను గౌరవించి తీరాలి. పెద్దలను చూసే కదా పిల్లలు అన్ని విషయాలూ నేర్చుకుంటారూ? “, అన్నాడు చంద్రం మజ్జిగ తాగుతూ.

“నిజమే మామయ్యగారూ! మరి ఇంతకీ ఆ బంటీ నిజంగా ఉన్నాడా?” అని అడిగింది హిమజ.

“ఉన్నాడమ్మా! ఆ బంటీ క్రమశిక్షణకు మారుపేరుగా మారి, సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేసి తనకు చదువు నేర్పిన మాష్టారి పేరునూ, తన తల్లిదండ్రుల పేరునూ నిలబెట్టి వారి ఋణం కొంత తీర్చుకోగలిగాడు! ఆ బంటీనే ఈ రామచంద్ర రావు!”, అని కాస్త గర్వంగా అన్నాడు చంద్రం.

బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొంది, ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ గా తన ఉద్యోగ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూనే అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి పాటు పడి, దేశంలోని ప్రముఖుల జాబితాలో చోటు సంపాదించిన తన మామగారి వంక సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయింది హిమజ!

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked