పద్యం-హృద్యం

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
(న్యస్తాక్షరి) ‘శివరాత్రి’ అనే నాలుగు అక్షరములు నాలుగు పాదములలో మొదటి అక్షరముగా వచ్చునటుల మీకు నచ్చిన ఛందస్సులో శివుని స్తుతిస్తూ పద్యము వ్రాయవలెను.

ఇంతకు ముందు యిచ్చిన ప్రశ్న:
వాక్సీనులు వాడకున్న వైరస్ దొలగున్

ఈ ప్రశ్నకు పూరణలు మాకు అందిన క్రమములో యిలా వున్నాయి.

ఎం.వి.యస్.రంగనాథం, హైదరాబాద్
(1)కం.
దీక్షగ డెబ్బది శాతము
వాక్సిను వాడు జనులుండ, వగవగ నేలా!
ఆక్షేపణగా నితరులు
వాక్సీనులు వాడకున్న, వైరస్ దొలగున్.
(2)కం.
తక్షణ రోగ నిరోధక
రక్షణ శక్తికి, కరోన లక్ష్యముగ, యెదో
వాక్సిను కావలె, యెట్టులు
వాక్సీనులు వాడకున్న వైరస్ దొలగున్?
(3)కం.
వాక్సిను కోసము చూడరు,
రక్షణకై ప్రజలు స్వాస్థ్య లక్ష్యము లందున్,
శిక్షితులు, యేమగు నిపుడు
వాక్సీనులు వాడకున్న? వైరస్ దొలగున్.
తల్లాప్రగడ రామచంద్ర రావు, శాన్ హౌసే, కాలిఫొర్నియా
కం.
ఋక్సంహితపారాయణ
వాక్సుద్ధియడరి, మనోజవమ్మున యా,  వి
ష్వక్సేనుని దయ కలుగగ,
వాక్సీనులు వాడకున్న వైరస్ దొలగున్!
వారణాశి సూర్యకుమారి, మచిలీపట్నం
కం.
వాక్సిన్ వేయ కరోనా
టాక్సీ ఎక్కుచును చెప్పు టా -టా మనకున్
మాక్సిమ మెఱింగియు నెటుల
వాక్సినులు వాడకున్న వైరస్ తొలగున్?
మద్దాలి స్వాతి, రెడ్వుడ్ సిటీ, కాలిఫొర్నియా
కం.
ఏ క్షణ మెటులుండునొకో
వాక్సీనులు వాడకున్న? వైరస్ దొలగున్
లక్షణముగ సూచించిన
వాక్సీనులు వాడి జనులు స్వస్థత పొందన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked