-తమిరిశ జానకి
రచయిత్రి శ్రీమతి పెయ్యేటి శ్రీదేవిగారి గురించి రెండు మాటలు
కధా రచయిత్రి , కార్టూనిస్ట్ , గాయని, మంచి మనిషి శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి గారు ఫిబ్రవరి , 2021 వ తేదీన గుండెపోటుతో హఠాన్మరణానికి గురి కావటం వారి కుటుంబసభ్యులను మాత్రమే కాదు బంధువులను , మిత్రులను , సాహితీమిత్రులను అందరినీ విచారసాగరంలో ముంచివేసింది. ఆమె శ్రీవారు శ్రీ పెయ్యేటి రంగారావుగారు బ్యాంక్ లో ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యారు. వారి గురించి ప్రస్థావన ఎందుకంటే ఆయన కూడా రచయిత, ప్రముఖ రంగస్ధల నటులు, పాటల రచయిత, అంతర్జాలంలో అచ్చంగాతెలుగు గ్రూప్ కి , భగవద్గీత గ్రూప్ కి అడ్మిన్ గా ఉన్నారు.
శ్రీదేవి గారు రచించిన ఎన్నో సందేశాత్మకమైన కధలు, హాస్య కధలు, నాటికలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఎన్నో పురస్కారాలు, బహుమతులు పొందారు, సి.పి.బ్రౌన్ కధలపోటీలో కూడా బహుమతి పొందారు.
ఈ దంపతుల పెద్ద కుమార్తె విజయమాధవి గొల్లపూడి ఆస్ట్రేలియా లో ప్రభుత్వరంగసంస్థలో పనిచేస్తున్నారు. ప్రవృత్తిగా రచనా వ్యాసంగం , తెలుగు రేడియో కార్యక్రమాలు , తెలుగు వాణి రేడియో కన్వీనర్ గానూ సేవలు అందిస్తున్నారు.సిడ్నీ తెలుగు అసోసియేషన్ ద్వారా వాహిని అంతర్జాల మాసపత్రికకు సంపాదకురాలిగా వ్వవహరిస్తున్నారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.తానా వారు నిర్వహించిన ప్రపంచతెలుగు సాంస్కృతిక పోటీలలో రంగస్థలం duo skirs విభాగంలో మొదటి బహుమతి పొందారు. చిన్నకుమార్తె కాంతి కలిగొట్ల అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు.
కుటుంబంలో అందరూ కూడా ప్రవృత్తిగా సాహితీరంగాన్ని ఎంచుకున్న కుటుంబం శ్రీదేవిగారి కుటుంబం.
పెయ్యేటి శ్రీదేవి గారికి మనందరి తరఫునా నివాళులు అర్పిస్తున్నాను.