కవితా స్రవంతి

అమావాస్యలో పున్నమి

మొక్కపాటి పూర్ణిమ సుధ
విజయవాడ – రేడియో మిర్చి

రా..! కొన్ని క్షణాలని అరువు తెచ్చుకుందాం..! కాలంతో పాటు పరుగులు తీసే మన
అహాన్ని, ఆత్మాభిమానం అనే ముసుగులో కప్పెట్టి, దర్పపు పూత పూసిన పొడి మాటలతో
నెట్టుకొస్తున్నది చాలు సాధికారత – అస్థిత్వాల అన్వేషణలో మనల్ని మనం చంపుకున్న
మాటల తూటాల్ని మూట కట్టి స్మార్ట్ ఫోన్లలో సమాధి చేద్దాం… ప్రైవసీ
సెట్టింగుల్లోని ప్యాటర్న్ అన్లాక్ ని తెలుసుకోవాలనే అత్యుత్సాహాన్ని కాసేపు
పక్కనెట్టి మన మనసుల్ని అన్లాక్ చేసే ప్యాటర్న్ కనుక్కునేందుకు ఒక్కసారైనా
ప్రయత్నిద్దాం… నీలోని ఆక్రోశాన్ని, నాలోని ఆవేదనని వెళ్ళగక్కి, అహాల
అద్దాలు భళ్ళున బద్దలయేదాకా మౌనాలనే బాణాలతో ఇద్దరి అస్థిత్వాన్ని చెరిపి, మన
అనే సరికొత్త ప్రపంచంలోకి అడుగిడుదాం..! మహా అయితే, ఖర్చయ్యేది, కొన్ని
కొన్నీళ్ళు..! కొన్ని క్షమాపణలు…!! అదీ మంచిదే..! ఎన్నాళ్ళయిందో ఆ కళ్ళని
కడిగి… నీకోసం ఆ మాత్రం ఖర్చుచెయ్యలేనా ? కానీ ఒక్క నియమం..! ఇవి మాత్రం
ఈ.ఎమ్.ఐ రూపంలో ప్రతీ నెలా కట్టొద్దు… ఒక్కసారిగా ఋణమాఫీ చేసి… ఆ జన్మాంతం
ఒకరికొకరం ఋణపడిపోదాం… ఈ క్షణాల్లో ఇలాగే చిక్కుకుని ముడిపడిపోదాం..! ఆకళ్ళే
తప్ప… ఇంకేమీ ఎరుగని ఆ కళ్ళకి పశ్చాత్తాపమనే లేపనం పూసి చూడు తడారిన
ఎడారిలాంటి జీవితంలో కన్నీటి చెలమల్ని కాదు, పన్నీటి చెలిమిని వెతుక్కుందాం..!
అమవస నిశిలో వెన్నెల వెలుగుల్ని నింపుకోవడం పెద్ద కష్టమేమీ కాదు ఒక్కసారి నీ
చిరునవ్వు రువ్వి చూడు, చీకట్లన్నీ ఎటో పారిపోతాయ్… ఈ దూరాల భారాలని భరించడం
ఇక నావల్లకాదు… రా – మారాలని మారాం చేసే మనలోని మనసుల్ని మరోమారు పంచుకుని
మరపురాని మధురఙ్ఞాపకంగా మలచుకుందాం…! ఇకపై ఏనాడూ మౌనాల సంకెళ్ళతో నన్ను
బంధించకు…”మనసులో ఎమున్నా అడిగెయ్” .. ఒక్కసారి నాతో అడుగెయ్… మన ప్రపంచమే
మనకి కొత్తగా కనిపిస్తుంది… జీవితం పై కొత్త ఆశ చిగురిస్తుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on అమావాస్యలో పున్నమి

ప్రసాద్ భువనగిరి said : Guest 7 years ago

అమావాస్యలో పున్నమి, సుధా గారు మీ కవితలూ నాకు చలం కనిపించాడు. ఆత్మావలోకనం ఎడారిలాంటి జీవితంలో కన్నీటి చెలమల్ని కాదు, పన్నీటి చెలిమిని వెతుక్కుందాం.. ఇది చాలా బరువైన వాక్యం, I LIKE IT . BHUVANAGIRI 7382335910

  • GUNTUR, ANDHRA PRADESH, INDIA