తాగ నేల?
-తాటిపర్తి బాలకృష్ణా రెడ్డి
తాగనేల
తలతిరగనేల
ఆపై తూగనేల
తేనీగలందించు
తియ్యని తేనుండగ
తేయాకు తెచ్చిన
కమ్మని తేనీరుండగా
మురిగిన విప్పపూలను
మరిగించగొచ్చిన ఈ కంపుని
తాగనేల
తాగి తూగనేల
నురగ కక్కు బీరు
కంపు కమ్మగుండు
ఐసు ముక్కలపై అమృతం
ఊరగాయలలో పరమామృతం
కేకు ముక్కలతో మేకప్పు
ఫేసు బుక్కులో లైకులు
కిక్కు పై... కప్పు పై కెక్కుదాకా
పెగ్గు పై పెగ్గు కొట్టి
తాగనేల
తాగి తూగనేల
తనివితీరా పాత మిత్రులను
తలచుకొని తూలనాడుటకా
పాత ప్రేయసి పేర
విరహ గీతాలు ఆలపించుటకా
నిజాల నిగ్గు తేలుస్తూ
సత్య హరిచంద్ర పద్యాలు పాడుటకా
క్రొత్త క్రొత్త భాషలందు
కించిత్ సెన్సార్ లేకుండా
అనర్గళంగా వుపన్యసించుటకా
పురవీధులందు
పొర్లు దండంబులెట్టుటకా
పరువు మట్టిపాలు చేసి
మట్టినంటించుకొని
నట్టింట నిలబడి
అక్షింతల అనంతరం
మజ్జిగ తాగనేల
తాగి తూగనేల*