*ఎండ పద్యం*
~ తగుళ్ళ గోపాల్
ఈ ఎండలకు
వాగుల గొంతెండి
మనిషి ముందు నోరు జాపినయి.
మేఘాల రెక్కలు తెగి
గాలిలో ఈకల్లా తిరుగుతున్నయి.
భూతల్లి కాళ్ళు కాలి
అరికాళ్ళు పగుళ్ళొచ్చినయి.
కొండతల రెండు ముక్కలై
రక్తమంతా గాలిలో ఆవిరైతుంది.
పిట్టలు
పిట్టల్లాగే రాలిపోతున్నయి
పచ్చికట్టెల నడుములన్ని
పటపట ఇరిగిపడుతున్నవి.
చావే మేలని
పాములన్ని
తాగడానికి ఇంత విషాన్ని అడుగుతున్నవి
ఎండ తగ్గె మార్గం చెప్పమని
కుక్క ఒక్కటే ఒగిరిస్తుంది.
నిలబడటానికి నీడలేని
మేకలు, గొర్లు
మిట్ట మధ్యాహ్నం కాలుతున్న రాళ్ళైనయి.
ఆదివాసి తల్లి
తోలుసంచి పట్టుకొని
నగరం నడిమధ్యన స్థూపమైంది.
చెట్లమెడ కోసిన మనిషి మాత్రం
ఏమీ తెల్వనట్టు
కిలకిల నవ్వుకుంట
ఏసీలో కూర్చోని
‘డిస్కవరీ ఛానల్ చూస్తుండు’