కవిత్వం
- పారనంది శాంతకుమారి
రాసేవారు ఎక్కువ,చదివేవారు తక్కువ
ఇదీ నేటి కవితల పరిస్థితి.
రాశి ఎక్కువ,వాసి తక్కువ
ఇదే ఇప్పటి కవిత్వపు దుస్థితి.
పదం పక్కన పదం పేరిస్తే
దానినే కవిత్వమనుకోవటం పైత్యం.
పదం హృదయాని స్పందిస్తే
అది కవిత్వమౌతుందనేది సత్యం.
మదిలో అలజడి కలిగితే
కవితకు తొలినుడి చుట్టబడుతుంది.
భావావేశపు సుడిలో మునిగితే
కవితకు గుడి కట్టబడుతుంది.
నిశ్శబ్ధంతో నువ్వు చేసే యుద్ధంలో
నిర్వేదంతో నిన్నునువ్వు చూసుకొనే నిబద్ధంలో
కవిత్వం జాలువారుతుంది.
నిగూఢంలో నీతో నీవు చేసే సాహచర్యంలో
నిర్భేధ్యంగా నీపై నీవు జరిపే గూఢచర్యంలో
కవిత్వం నిన్ను చేరుతుంది.
***