వీక్షణం

వీక్షణం సాహితీ గవాక్షం-102 వ సమావేశం

-వరూధిని

వీక్షణం-102 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా ఫిబ్రవరి 14, 2021 న జరిగింది.

ఈ సమావేశంలో శ్రీ సుభాష్ పెద్దు (విద్యార్థి) గారి కథ “కోరికలు” కథా పఠనం జరిగింది.

విద్యార్థి గారు రాశి కంటే వాసి ముఖ్యమైనదనుకునే కథారచయిత. అతి తక్కువ కాలంలో చక్కని కథనాన్ని అలవరుచుకుని, విభిన్న వస్తువులతో ప్రయోగాత్మక రచనలు చేస్తున్నారు. స్త్రీ విజయం వీరి రచనల లక్ష్యం.

“కోరికలు” కథ కౌముది లో ప్రచురింపబడి అత్యంత ప్రజాదరణ పొందిన కథ.

అహోబిల క్షేత్ర దర్శనంలో రచయితకు ఎదురైన వ్యక్తులు, అనుభవాల ఆధారంగా రాసిన అద్భుతమైన కథ. ఈ కథా పఠనంలో స్త్రీ పాత్రల్ని డా. కె.గీత , పురుష పాత్రల్ని విద్యార్థి గారు కలిసికట్టుగా చదివి వినిపించడం విశేషం. కథని పాత్రలకనుగుణంగా యాసలో చదువుతున్నంతసేపూ సభాసదులు మంత్రముగ్ధులై విన్నారు.
కథలో ప్రధాన పాత్రధారిణి ముసలవ్వ. జైలు నించి విడుదలై తిన్నగా అహోబిల అహోబిల క్షేత్రానికి దర్శనార్ధమై వస్తుంది. ఆమెతో బాటూ వచ్చిన వారంతా దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలానికి నడిచి వెళ్లిన దారిలో ఎదురైన వరుస విశేషానుభవాలు ఈ కథావస్తువు. కొంతమంది శ్రామిక మహిళల్ని క్షేత్ర దర్శనానికి తన ఆటోలో తీసుకుని వచ్చి వీరితో బాటూ నడిచే పెద్దన్నతో బాటూ, అయ్యవారు, ఆండాళ్లు, కుర్రాళ్ళు మొదలైన పాత్రలతో రచయిత మనం కూడా వాళ్లతో బాటూ నడుస్తున్న అనుభూతిని కలగజేస్తారు. దారి పొడవునా ఉన్న చిన్న గుహాలయాలు, వాటి విశేషాలు కూలంకషంగా చారిత్రక కథనంగా చెప్తూ, పూజారులు, ప్రధానాలయంలో కాపలాదారులు, రాజకీయనాయకుల అనుచరులు, చెంచులు, చెంచితల్ని పరిచయం చేస్తూ, అన్యాపదేశంగా ముసలవ్వ కథని అక్కడక్కడా చెప్పించడం విశేషం. ఒక నాటకాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని చదువరులకు కలిగిస్తుంది ఈ కథ. దాదాపు 20 పేజీల కథ నిడివి ఉన్న ఈ కథలో రచయిత పాత్రల్ని ప్రవేశపెట్టడం, కథని ముందుకు నడిపించడంలో చాకచక్యం, శ్రద్ధ అబ్బురమనిపిస్తాయి.

ఈ సందర్భంగా తరువాత జరిగిన చర్చలో శ్రీమతి కొండపల్లి నీహారిణి, శ్రీమతి ప్రశాంతి రామ్, శ్రీమతి అపర్ణ గునుపూడి, శ్రీమతి రత్నామూర్తి, శ్రీమతి ఉదయలక్ష్మి , శ్రీ ప్రసాదరావు గోగినేని, శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ ప్రసాద్ నల్లమోతు, శ్రీ లెనిన్ మొ.న వారు పాల్గొన్నారు. ప్రసాద్ నల్లమోతు గారు 102 సమావేశాల్లో గొప్ప సమావేశంగా ఈ సమావేశాన్ని అభివర్ణించారు.

ఆ తర్వాత సుభాష్ గారు ఇటీవల స్వర్గస్తులైన శ్రీ రావినూతల సత్యన్నారాయణ గారి గురించి నివాళి ప్రసంగాన్ని చేశారు. సత్యన్నారాయణ గారు బెంగాల్ లో స్థిరపడిన తెలుగు ప్రముఖులు, సాహితీ సేవకులు. మిసిమి పత్రికలో సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన రచయితల గురించి వరుసగా నెలనెలా పరిచయ వ్యాసాలు రాశారు.

ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో శ్రీధర్ రెడ్డి గారు “కవితబండి” అనే కవితను , దాలిరాజుగారు “ఒంటరిజీవి” కవితని, డా. కె.గీత గారు “అద్దం” కవితను, నీహారిణి గారు “గోడలు”, భవానీ ముప్పల్ల గారు “నాలోనేను” కవితల్ని చదివి వినిపించారు.

ఆద్యంతం ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో స్థానిక ప్రముఖులు విశేషంగా పాల్గొని సభను జయప్రదం చేశారు.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked