వీక్షణం

వీక్షణం సాహితీ గవాక్షం -71

-సాయికృష్ణ మైలవరపు

వీక్షణం 71 వ సమావేశం కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటో నగరంలో జూలై 14వ తేదీన లక్ష్మీనారాయణ మందిరములో దిగ్విజయంగా జరిగింది.

ఈ నెల సమావేశ అంశం “సంస్కృతాంధ్ర అవధానం”.

అవధానులు శ్రీయుతులు పాలడుగు శ్రీచరణు గారు అసమాన ప్రతిభతో తెలుగులో ఎనిమిది అంశాలు, సంస్కృతం లో మూడు అంశాలతో పృచ్ఛకులు అడిగిన కష్టతరమైన ప్రశ్నలకు చక్కటి సమాధానాలనిస్తూ ఆద్యంతం ఆసక్తిదాయకంగా పూర్తి చేసేరు. బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకట శాస్త్రి గారు సంచాలకత్వం చేసిన ఈ సభకు సుమారు నూరు మంది వీక్షకులు వేంచేసి రసరమ్యంగా వీక్షించారు.
తెలుగు పురాణ పఠనము
శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారి తెలుగు పురాణ పఠనము అందరినీ ఉఱ్ఱూతలూగించినది. తెనాలి రామలింగ పాండురంగ మహాత్మ్యము, నంది తిమ్మన పారిజాతాపహరణము మున్నగు పురాణములనుండి మృదుమధురముగా అక్కిరాజువారు ఆలపించిన పద్యాలకు అవధాని వారు చక్కటి వ్యాఖ్యానమునొసగినారు.
నిషిద్ధాక్షరి
తెలుగులో నిషిద్ధాక్షరి అంశాన్ని శ్రీ తల్లాప్రగడ రావు గారు సమర్థవంతముగా, మంచి నిషేధములు పెడుతూ అవధాని గారి చేత అద్భుతమైన రామతత్త్వాన్ని పలికించినారు.

తానేరసంబు శ్రీమ
ద్భానుకు గ్లౌనుననతానెభావమునర్థి

త్రాణుడురారక్షగుతన్

నానాఘవినష్టనీవెనాస్తుల నిష్పా

సంస్కృత దత్తపది
శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమారు గారు సంస్కృతమున దత్తపది పృచ్ఛకత్వాన్ని చేపట్టి సారూప్యమ్, సామీప్యమ్, సాలోక్యమ్, సాయుజ్యమ్ అను పదములను ఇచ్చి ఫీఫా ఫుట్ బాలు క్రీడను వర్ణించమనగా అవధాని వారు అవలీలగా ఈవిధంగా పూరించినారు:

పూర్ణేందు బింబ సారూప్యమ్

పద సామీప్య చాతురీమ్ (వైఖరీమ్)

ప్రేక్షక రసాలోక్యమ్ వై

క్రీడా సాయుజ్యముచ్యతే ।।

తెలుగు దత్తపది
శ్రీ పంచాంగము అప్పాజీ వారు “అర్ధము, ఛందస్సు, లేని, పదము” అను నాల్గు పదములనుపయోగించి – మహర్షి సంబంధముగా పద్యము చెప్పవలెనని అతి చతురముగా అడిగిన దత్తపది అంశమును అవధాని వారు రసవత్తరముగా క్రింది విధముగా పూరించినారు:

అర్ధభాగంబు శక్తికి నమరుచుండ

తాను జనకుడై ఛందస్సు స్థాపనంబ

స్వరనియమములే నియతించె పరమ శివుడు

ముక్తి పదముకు బ్రహ్మర్షి మునినుతుండు

సంస్కృత సమస్య
శ్రీమతి మాజేటి సుమలత గారు సంస్కృతమున “త్వమేవ మూర్ఖశ్చ కవిస్త్వమేవ” అను జటిలమైన సమస్యనొసగగా అవధానివారు చతురతతో క్రింది విధముగా పరిష్కరించినారు:

కవిస్తు నామాపి జలస్థ కాకః

వికార కంఠస్తు విచార హీనః ।

విమర్శనమ్ కిమ్ వ్యపదేశ భావమ్

త్వమేవ మూర్ఖశ్చ కవిస్త్వమేవ ।।

సంస్కృత పురాణ పఠనము

అలాగే అవధాని గారు సంస్కృతమున పురాణాలనుండే కాక శ్రుతులనుండి కూడా బ్రహ్మశ్రీ మారేపల్లి వారు ప్రస్తుతించిన అంశములను చక్కగా వ్యాఖ్యానించినారు.

అప్రస్తుత ప్రసంగము
ఈ అవధానమునకు ప్రత్యేక ఆకర్షణగా శ్రీమతి కాశీవఝల శారద గార్ల అప్రస్తుత ప్రసంగము నిలచినది. ఎంతో అసందర్భముగా వీరు అడిగిన ప్రశ్నలకు అవధాని వారు సమయస్ఫూర్తితో సమాధానములనొసగినారు. మచ్చుకు కొన్ని:

పృచ్ఛకులు: సీతాపహరణము సమయములో సెల్ ఫోను సదుపాయం ఉంటే ఎట్లా ఉండేది?

అవధాని వారు: సిగ్నలు ఉండేది కాదు! రావణుడు లేకుండా చేయగల నియంత.

పృచ్ఛకులు: చేసిన పాపము చెబితే పోవును, మరి చేసిన పుణ్యము ఎట్లు పోవును?

అవధాని వారు: చేసిన పుణ్యము చేయగా పోవును!!

పృచ్ఛకులు: అర టీ + అర టీ =? (ఒకటి అని చెబుతారని ఆశిస్తూ ..)

అవధాని వారు: పర టీ! (అర టీ లుమనకు తాగ యోగ్యము కాదని, కనుక పరుల పాలని సూచిస్తూ ..)

ఆశువు
డా|| కె.గీతా మాధవి గారు ఎంతో చమత్కారంగా అమెరికా అధ్యక్షులవారి గూర్చి ఆశువులు అవధాని వారిచేత చెప్పించినారు.

డొనాల్డు ట్రంపు గారు వీక్షణానికి వస్తే …

ఉష్ట్రమును వాహనంబుగ రాష్ట్ర పతియె

వీక్షణాంగణంబునకును వేగ రాగ

పృష్ఠతాడనంబొందగ దృష్టి మారి

యాంధ్ర సంస్కృతంబుల్ గొప్పవనియె తాను

శ్వేత సౌధంలో వీక్షణం నిర్వహించడానికి వేదికను ఇస్తే …

చంద్రకాంతులీను ఇంద్ర సభనుబోలు

శ్వేతసౌధమందు కైతజెప్ప

భాషలందు భరతభాషలే గొప్పరా

యనుచు విశ్వమెల్ల వినుతి సేయు

వీక్షణంలో శతావధానం చేస్తానని మాటిస్తూ ….

కవన సీమ కవికుల భువనంబు

వీక్షణంబు గగన వీక్షణంబు

వేదిగాగ వలయు వివిధావధానముల

కమెరికాన శారదాకరంబు

ట్రంపు గారిచే వీక్షణం లో అవధానం చేయిస్తే …

రాష్ట్రపతికైన నిత్యంబు రచ్చరచ్చ

పృచ్ఛకుల్ వేలు లక్షలు పిచ్చిగొల్ప

దినదినంబును గండాన మనుచునుండు

వేరు యవధానమేలొకో వెఱ్ఱి వానికి

తెలుగు సమస్య

తెలుగున శ్రీ లంకిపల్లి బాబూజీ గారు అడిగిన సమస్య “మధుపానంబును సల్పగా గలుగు నాత్మానందపున్ ప్రాజ్ఞతల్” ను అవధాని వారు చక్కగా ఇట్లు పూరించినారు:

విధివశంబునబుట్టినట్టి బుధుడే విధ్యుక్త ధర్మంబునున్

మదిలోనెంచక రాక్షసుండగుచు సన్మార్గంబునున్వీడిదు

ర్మదుడై భ్రష్టతనొంది హీనగతులందన్ముక్తుడైనట్లుగా

మధుపానంబును సల్పగా గలుగు నాత్మానందపున్ ప్రాజ్ఞతల్

వ్యస్తాక్షరి
13 అక్షరముల వ్యస్తాక్షరిని అప్రస్తుతముగానొసగిన శ్రీ వెంపటి భాస్కరు గారికి, సరి చూచుకుంటున్న సభాసదులకు అవధాని వారు వ్యస్తమును న్యస్తము చేసి చెప్పి కరతాళ ధ్వనులు గైకొనినారు.

1 ప

2 లు

3 కు

4 ల

5 వి

6 శ్వ

7 సిం

8 పు

9 ము

10 వి

11 ప

12 న్ను

13 ల

వర్ణన

క్లిష్టమైన వర్ణన అంశాన్ని శ్రీ మైలవరపు సాయికృష్ణ గారు ఇవ్వగా దానికి అవధానుల వారు అడిగిన ఛందస్సు ఆటవెలదిలో చక్కటి పూరణము గావించినారు.

శాన్ ఫ్రాన్సిస్కో అఖాత ప్రాంతములో పెరుగుతున్న భారతీయ సంతతి ఔద్ధత్యము గురించి ..

ఇంటి గుట్టు మామ యెఱుగడే ధరలోన

తెల్లవాడె తాను తెల్లబోవ

దేశకాలమెఱిగి తిరుగకయున్నచో

నగులపాలు గాడె నరుడునకట

ధారణ

సాంప్రదాయబద్ధముగా అన్ని ఆవృతాలయిన పిమ్మట అవధాని వారు అంశములను ధారణ చేసినారు. కార్యక్రమానంతరము అవధాని వారికి, సంచాలకులకు, పృచ్ఛకులకు సన్మానకార్యక్రమము జరిగినది.

సహాయ సహకారములు, నిర్వహణ
శ్రీ దురిసెట్టి రావు గారు ధ్వని సహకారాన్ని అందించగా, శ్రీ కాండూరి రాజీవలోచను గారు చలన చిత్ర సహాయాన్ని అందించగా, శ్రీ వెంపటి భాస్కరు గారు, శ్రీ మైలవరపు సాయికృష్ణ గారు, ఘోరకవి ఈశ్వరు గారు, చండ్ర నగేశు దంపతులు, మద్ది అవినాశు దంపతులు, ఇతర మిత్రులతో కలసి ఈ అవధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, స్థానిక అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థ వారు ఉచితముగా ఆహూతులందిరికీ విందునందించినారు.

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked